“Elephant in the room” అనేది ఆంగ్లంలో ఒక సామెత. ‘చర్చించడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టం లేని సమస్య, కానీ విస్మరించలేని సమస్య’ ను సూచించడానికి ఈ ‘గదిలో ఏనుగు’ సామెతను వాడతారు. భారత అణు పరిహార చట్టం విదేశీ కంపెనీలకు ఈ సామెతను గుర్తుకు తెస్తోంది(ట)!
గదిలో ఏనుగు ఉన్నపుడు, భారీ ఆకారంతో ఉంటుంది గనక ఆ గదిలో ఉన్నవారికి ఒక సమస్యగా ఉంటుంది. కానీ దాన్ని వదిలించుకోడానికి వారికి మార్గం లేని పరిస్ధితి వారికి ఉంటుంది. అందువలన అది లేనట్లు భావించుకోడానికి, నటించడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కానీ అది చేసే శబ్దం, అటూ ఇటూ తిరగడం వలన అది లేనట్లు నటించడానికి కూడా వీలులేకుండా ఉంటుంది.
భారత పార్లమెంటు ఆమోదించిన “పౌర అణు పరిహార చట్టం” విదేశీ (అమెరికా, ఫ్రాన్స్, రష్యా) అణు కంపెనీలకు ‘గదిలో ఏనుగు’లా మారిందని కార్టూనిస్టు సూచిస్తున్నారు.
“పౌర అణు పరిహార చట్టం” ప్రకారం, భారత అణు విద్యుత్ కర్మాగారాల్లో ప్రమాదం సంభావిస్తే, దానికి విదేశీ అణు పరికరాల సరఫరాదారు కంపెనీలు పాడైపోయిన, లోపాలున్న, కాలం గడిచిన పరికరాలను సరఫరా చేయడమే కారణం అని రుజువైతే, అలాంటప్పుడు సరఫరా కంపెనీలు కూడా నష్టపరిహారం భరించాలని నిర్దేశిస్తుంది. అది కూడా కేవలం 1500 కోట్ల రూపాయల వరకు మాత్రమే నష్టాన్ని పరిమితం చేశారు. పైగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన 5 సం.ల లోపల ప్రమాదం జరిగితేనే ఈ నిబంధన వర్తిస్తుంది.
జపాన్ లో జరిగిన ఫుకుషిమా ప్రమాదం వలన ఆ దేశ ప్రజలు, కార్మికులు చనిపోవడమే కాక ఆర్ధిక వ్యవస్ధకు, పర్యావరణానికి తీవ్రం నష్టం వాటిల్లింది. ఇప్పుడా కర్మాగారంలో లీకవుతున్న రేడియేషన్ ని అదుపు చేయలేక కంపెనీ దాదాపు చేతులెత్తేస్తోంది. ఫుకుషిమా పరిసరాలను శుభ్రం చేయడానికి కనీసం 30 సంవత్సరాలు పడుతుందని తేల్చారు. ఇంకా 250 బిలియన్ డాలర్లు లేదా దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తేల్చారు. అంటే ఫుకుషిమా శుభ్రం చేయడానికి పట్టే ఖర్చులో అణు పరిహార చట్టంలో ఒప్పుకున్న మొత్తం కేవలం 0.1 శాతం మాత్రమే ఉంది.
ఇది కూడా విదేశీ కంపెనీలు ఒప్పుకోవడం లేదు. ఆ చట్టం తమకు వర్తింపజేయవద్దని అమెరికా డిమాండ్ చేస్తోంది. రష్యా అయితే కూడంకుళం మొదటిదశకు ఈ చట్టం వర్తించకుండా తప్పించుకుంది. అక్కడ ఆందోళన చేస్తున్న వేలాది మంది ప్రజల పైన దేశ ద్రోహం కింద అక్రమ కేసులు పెట్టడానికైనా మన్మోహన్ ప్రభుత్వం సిద్ధపడింది గానీ, తానే ఆమోదించిన చట్టం అమలు చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు. అమెరికా, రష్యాల డిమాండ్ కి అనుగుణంగా నానారకాల సాకులు చూపి పరిహారం చెల్లించకుండా తప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.
తమ అణు రియాక్టర్ల డిజైన్లు లోపాలు లేవని, అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించేవనీ అమెరికా, రష్యా, ఫ్రాన్స్ మూడు దేశాలు చెబుతాయి. మరి అలాంటప్పుడు అణు పరిహార చట్టాన్ని వర్తింపజేయవద్దని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి. అంటే వారి డిజైన్ భద్రత పైన వారికే నమ్మకం లేదన్నమాట! ప్రమాదం జరిగితేనే నష్టపరిహారం చెల్లించాలి తప్ప జరక్కపోయినా చెల్లించాలని చట్టంలో లేదు కదా?
1979లో అమెరికాలోని ‘త్రీ మైల్ ఐలాండ్’ లోనూ, 1986లో పాత సోవియట్ రష్యాలోని చెర్నోబిల్ లోనూ, 2011లో ఫుకుషిమాలోనూ భారీ అణు ప్రమాదాలు సంభవించడంతో ప్రపంచ అణు పరిశ్రమ దివాళా అంచులో ఉంది. అమ్మకాలు లేక ఆర్ధిక సంక్షోభంలో ఉన్నాయి. దానితో పాటు అమెరికా, ఐరోపాల లోని ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ఎలాగూ ఉంది. ఈ నేపధ్యంలో తమ అణు పరికరాలను మూడో ప్రపంచ దేశాలకు అంటగట్టడానికి అణు పరికరాల కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వాటికి ఇండియా లాంటి దేశాల ప్రభుత్వాలు లొంగిపోయి దేశ ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతున్నాయి.
కనుక “పౌర అణు పరిహార చట్టం” విదేశీ కంపెనీలకు “గదిలో ఏనుగు” అయితే భారత ప్రజలకు విదేశీ కంపెనీలు “దేశంలోనే ఏనుగు” లాంటివి.
అణురియాక్టర్లను ఎందుకు వ్యతిరేకించాలో చాలాస్పస్టంగా వివరించారు.వీటికి సమాదానాలు ప్రభుత్వం ముందుగా చెప్పాలి!లేకపోతే సామ్రాజ్యవాదుల కబ్జాగా,వారికి సహకరించే స్వలాభపరులుగా(రాజకీయ పక్షాలు) భారతదేశం మిగిలిపోవడం ఖాయం!