పాత బస్తీలోని ఒక బాబాను రాష్ట్ర అత్యున్నత పోలీసు అధికారి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి రాసిన వార్తపై రేగిన రగడ తీవ్రరూపం దాల్చుతోంది. పాతబస్తీలో నివసించే ముస్లిం మత బాబా హబీబ్ ముస్తఫా ఇద్రాస్ బాబాను డిజిపి దినేష్ రెడ్డి సందర్శించడం గురించి ది హిందు పత్రిక వార్త ప్రచురించగా ఈ వార్తను దురుద్దేశంతో ప్రచురించారని డిజిపి ఆరోపిస్తున్నారు. ఇతర పత్రికలన్నీ ఈ వార్తకు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వకుండా లోపలి పేజీల్లో వేయగా ది హిందు మాత్రం పనిగట్టుకుని మొదటి పేజీలో బేనర్ వార్తగా ప్రచురించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఏ పేజీలో ఏ వార్తను ఎలా ప్రచురించాలో పోలీసు అధికారులు నిర్ణయించడం అంటే అధికారం అడ్డం పెట్టుకుని ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ను హరించడమేనని పత్రిక ఆరోపిస్తోంది. కోర్టులో తేల్చుకుందామని ఇరు పక్షాలు పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకున్నారు.
సెప్టెంబరు 12 తేదీన డిజిపి దినేష్ రెడ్డి పాత బస్తీలోని ఫతే దర్వాజా వద్ద ఆశ్రమం నిర్వహిస్తున్న బాబా ముస్తాఫాను సందర్శించారు. ఛార్మినార్ పోలీసు స్టేషన్ ను సందర్శించిన డిజిపి అక్కడి నుండి టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి లింబా రెడ్డితో కలిసి కట్టుదిట్టమైన భద్రత మధ్య బాబాను సందర్శించారని సెప్టెంబర్ 13 తేదీన పత్రిక తెలిపింది. డి.జి.పి అక్కడ 40 నిమిషాలు గడిపారని, ఆయన అక్కడ ఉన్నంతసేపు పోలీసులు ఫతే దర్వాజా వద్ద ట్రాఫిక్ నియంత్రించారని తెలిపింది. మీడియాను కూడా అక్కడికి అనుమతించలేదని తెలిపింది.
డిజిపి అక్రమ ఆస్తుల గురించి మరో ఐ.పి.ఎస్ అధికారి ఉమేష్ కుమార్ దాఖలు చేసిన ఫిర్యాదుపైన విచారణ చేయాల్సిందిగా సి.బి.ఐని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపధ్యంలో ఆయన బాబాను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుందని పత్రిక పేర్కొంది. సెప్టెంబర్ నెలాఖరుకు దినేష్ పదవీవిరమణ చేయాల్సి ఉందని, కానీ తన పదవీకాలం పిడిగించాల్సిందిగా ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ను కోరారని తెలుస్తోంది. డిజిపి గురువారం బాబాను సందర్శించడాన్ని పత్రిక ఎత్తిచూపింది. ఆశ్రమ సమాచారం ప్రకారం వ్యక్తిగత సమస్యలు ఉన్నవారు బాబాను గురువారం సందర్శిస్తారని పత్రిక తెలిపింది. పైగా డిజిపి కొన్ని ఫైళ్లతో బాబా వద్దకు వెళ్లారని తెలిపింది.
ఈ వార్తను డి.జి.పి సీరియస్ గా పరిగణించారు. ది హిందు పత్రిక రెసిడెంట్ ఎడిటర్ ఎస్ నగేష్ కుమార్ ఒక ఎజెండాతో ఈ వార్త ప్రచురించారని ఆయన ఆరోపిస్తున్నారు. తన అక్రమ ఆస్తుల పైన సి.బి.ఐ విచారణకు ఆదేశించారనడంలో వాస్తవం లేదని, ఫిర్యాదుదారుడు పేర్కొన్న 1500 ఎకరాల భూమిలో తనవి కేవలం ఏడున్నర ఎకరాలు మాత్రమేననీ ఆయన నిన్న (గురువారం, సెప్టెంబర్ 19) విలేఖరుల సమావేశంలో చెప్పారు. (ఈ మేరకు ఈ టీవి లో వార్త ప్రసారం అయింది. డి.జి.పి గారు అందులో మాట్లాడారు.) 2011లో డిజిపిగా తన నియామకాన్ని అడ్డుకోవడానికి వీలుగా కోర్టును ఆకర్షించడానికి మొత్తం 1500 ఎకరాలు తనవే అన్నట్లుగా తప్పుడు ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు.
ఈ నేపధ్యంలో డిజిపి పంపిన రిజాయిండర్ ను ది హిందు గురువారం (సెప్టెంబర్ 19) ప్రచురించింది. దురుద్దేశంతో తన బాబా సందర్శన వార్తను మొదటి పేజీలో వేశారని అందులో ఆయన ఆరోపించారు. “ది హిందు లాంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన పత్రికలో సాధారణంగా ముఖ్యమైన వార్తలకు కేటాయించే చోటును ప్రాధాన్యం లేని, అపఖ్యాతిపాలు చేస్తూ అర్ధసత్యాలతో కూడిన తప్పుడు వార్తకు కేటాయించారు. ప్రాంతీయ భాషా ఛానెల్ ప్రసారం చేసిన వార్తను దీనికి ఆధారంగా చేసుకున్నారు. ముద్రణకు ముందు డిజిపిని వాస్తవాలు ఏమిటో కనుక్కోకుండా, సరిచూసుకోకుండా ప్రచురించడం జర్నలిస్టు నీతికి విరుద్ధం. ఈ చర్య పోలీసుల, వారి నేత యొక్క గౌరవాన్ని భంగపరిచింది. ఇస్లాం లోని ఒక తెగకు చెందిన గౌరవనీయమైన వ్యక్తి గౌరవాన్ని భంగపరిచింది. మతపరంగా సున్నితమైన నగరమైన హైద్రాబాద్ లో మత ఉద్రిక్తతలను చాటింది. భారీ సంఖ్యలో ఉన్న దైవదూత (godman) అనుచరుల మత భావోద్వేగాలను దువ్వింది” అని డిజిపి తన రిజాయిండర్ లో ఆరోపించారు.
“ఉద్దేశ్యపూర్వకంగా, అపఖ్యాతిపాలు చేసే విధంగా పోలీసు బలగాల నేత పైన దూషణ రాతలు రాయడం ద్వారా రెసిడెంట్ ఎడిటర్ ఎస్.నాగేష్ కుమార్ తన వ్యక్తిగత ఎజెండాను అమలు చేస్తున్నారా అన్నదే ప్రశ్న. అలాంటి రాతలు పోలీసు బలగాల నైతికతను బలహీనపరుస్తాయి. వారి నైతిక స్ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రజల రక్షణ, భద్రతలను కాపాడే అవసరాన్ని అవి అగౌరవరపరిచాయి. ఆయన చర్యలు ప్రజా న్యాయానికి వ్యతిరేకమైనవి. పోలీసులు ప్రజలకు సేవచేస్తున్న ఒక ముఖ్యమైన సంస్ధ. వారిని తప్పుడు వెలుగులో చూపినట్లయితే వారి జవసత్వాలు బలహీనపడతాయి” అని డిజిపి తన రిజాయిండర్ లో ఆవేదన వ్యక్తం చేశారు. తన 36 యేళ్ళ సర్వీసులో తెలియకుండా రాసిన తప్పుడు వార్తలు ఉన్నాయని కానీ ఇప్పుడు మాత్రం స్ధిరంగా, ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ రాతల్లో కొన్ని పోలీసు సంఘం దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో చోటు చేసుకుంటాయని, పరువునష్టం దావాలో కూడా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అత్యంత నీతిమంతమైన, అందరిచేతా ప్రశంసలు పొందుతున్న డిజిపికే ఈ పరిస్ధితి ఎదురయితే ది హిందు చేతుల్లో ఇక సామాన్యుడి పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారాయన.
దీనికి ది హిందూ ఎడిటర్ సిద్ధార్ధ్ వరదరాజన్ వెనువెంటనే బదులిచ్చారు. “ఒక గాడ్ మెన్ ను ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సందర్శించిన వార్తను ప్రచురించడాన్ని మాత్రమే ప్రశ్నిస్తూ పత్రికా రిపోర్టు సత్యసంధతను సవాలు చేసే వాస్తవాలను మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆయన చేసిందల్లా “వైట్ లైస్”, “తప్పుడు”, “అర్ధ సత్యాలు” అంటూ నిర్దిష్టత లేని మాటలు రాయడమే….. ఒక స్టోరిని ఏ పేజీలో ప్రచురించాలో పోలీసు అధికారులు నిర్ణయించడం ప్రారంభిస్తే ఇక భారతదేశంలో అదే ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’కు అంతం కాగలదు… … … ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలతో నిర్దిష్టమైన తీవ్ర ఆరోపణలపై సి.బి.ఐ పరిశోధన ఎదుర్కొంటున్న పోలీసు బలగాల నేత మనముందు ఉన్నారు. ఆయన తన పదవీ విరమణను వాయిదా వేయాలని కోరుకుంటున్నారు. దాని వల్లనే ఆయన వార్తల్లో ఉన్నారు కూడా. అలాంటి వ్యక్తి దైవదూతను ప్రత్యేకంగా దర్శించుకుంటున్నారు. ప్రజా ప్రయోజనాల రీత్యా ఇది తగిన ప్రదర్శనకు నోచుకోవలసిన వార్తే అని మేము నమ్ముతున్నాము. ఇందులో ఉద్దేశ్యం, డిజిపి ఊహిస్తున్నట్లుగా పోలీసు బలగాలపై దూషణలు విసరడం కాదు; మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికయితే అంతకంటే కాదు” అని సిద్ధార్ధ వరదరాజన్ బదులిచ్చారు.
ఆయన ఇంకా ఇలా రాశారు. “ది హిందు, వాస్తవాలను తనను అడిగి ధ్రువపరుచుకోకుండా, సరిచూసుకోకుండా వార్త ప్రచురించిందని డిజిపి చెబుతున్నారు. ఇది అవాస్తవం. సెప్టెంబర్ 12 తేదీన మా విలేఖరులు రెండు సార్లు ఆయనకు ఫోన్ చేశారు. ‘సార్, పాత బస్తీలో ఒక బాబాను మీరు సందర్శించారని కొన్ని ఛానెళ్లు చెబుతున్నాయి. మీరేమంటారు?’ అని అడుగుతూ పాఠ్య సందేశం (text message) కూడా పంపారు. మా సందేశానికి బదులు రాలేదు. మా మొదటి ఫోన్ కాల్ కి సమాధానం అయితే వచ్చింది కానీ డిజిపి దానిని ‘ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను’ అంటూ మధ్యలోనే తుంచేశారు. రెండోసారి ఫోన్ చేస్తే ఆ కాల్ ని కట్ చేసేశారు” అని సిద్ధార్ధ వరదరాజన్ పేర్కొన్నారు. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేసే వ్యాపారంలో తమ పత్రిక లేదనీ, సెప్టెంబర్ 20తో 135 స్ంవత్సరాలు పూర్తి చేసుకున్న ది హిందు, స్వతంత్ర మరియు విశ్వసనీయమైన పత్రికా వృత్తికి వ్యతిరేకంగా వచ్చే బెదిరింపులకు లొంగబోదని సిద్ధార్ధ స్పష్టం చేశారు.
తన రిజాయిండర్ ని పత్రిక ప్రచురించినప్పటికీ తనకు ఇంకా సంతృప్తి కలగలేదని డిజిపి చెబుతున్నారు. “నేను బాబా దగ్గరికి ఫైళ్ళు తీసుకెళ్లానన్న వార్త విషయమై సమస్య ఇంకా అలాగే ఉంది. ఇలాంటి వార్తనే ప్రసారం చేసిన ఛానెల్ ఆపాలజీ చెప్పింది. కానీ పత్రిక మాత్రం తన వార్తకు కట్టుబడే ఉంది” అని చెప్పిన డిజిపి పత్రిక రెసిడెంట్ ఎడిటర్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సమర్ధించుకున్నారు. అసలు బాబా వద్దకి ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకు ఆయన తాను నగర కమిషనర్ గా ఉన్నప్పుడూ కూడా క్రమం తప్పకుండా వివిధ మత పెద్దల వద్దకు వెళ్లానని, కానీ డిజిపి అయ్యాక ఇద్రాస్ బాబా వద్దకి వెళ్లలేదని తెలిపారు. ఇటీవల ఒక ఇఫ్తార్ విందులో కలిసిన బాబా తనను కౌగలించుకుని తన ఆశ్రమానికి రమ్మని కోరారని, ఎప్పుడైనా టీ కోసం వస్తానని చెప్పానని డిజిపి తెలిపారు. తాను మత సామరస్యం గురించి చర్చించడానికి బాబా వద్దకు వెళ్లానని సెప్టెంబర్ 12 తేదీన డిజిపి చెప్పారని కానీ ఆయన తన వ్యక్తిగత కారణాలతో ఆశ్రమానికి వచ్చారని బాబా తనయుడు చెప్పారని ది హిందు తెలిపింది.
పత్రిక రెసిడెంట్ ఎడిటర్ పైన కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగం అయితే ఆయనపై మోపిన అభియోగాలు ఒకింత హాస్యాస్పదంగా ఉన్నాయి. సెక్షన్ 469 కింద నష్టపరిచే ఉద్దేశంతో ఒక పత్రాన్ని లేదా రికార్డును ఫోర్జరీ చేసిన నేరం మోపబడింది. దీనికి ది హిందూ వార్తకు సంబంధం ఏమిటో అర్ధం కాని విషయం. సెక్షన్ 505(1)(b) ప్రకారం అభియోగం మోపడం అంటే ప్రభుత్వం పైన గానీ, ప్రజల శాంతికి గానీ భంగం కలిగే నేరం చేసి ప్రజలను నేరం చేయడానికి ఉద్దేశ్యపూర్వకంగా పురిగొల్పినట్లుగా సాక్ష్యాలు చూపాలి. కానీ ది హిందు వార్త వలన అలాంటి నేరాలు జరిగిన దాఖలా లేదు. ఇంకా చెప్పాలంటే అధికార దుర్వినియోగానికి పాల్పడేవిధంగా పురిగొల్పిన నేరానికి ది హిందు పాల్పడిందేమో! ‘ఫైళ్ళు బాబా వద్దకు తీసుకెళ్లారని రాయడం వలన తన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిందని’ చెబుతున్నందున సంబంధిత సెక్షన్ల కింద అభియోగం మోపడం ధర్మబద్ధం కాగలదు.