భారత పార్లమెంటు విస్తృతంగా చర్చించి ఆమోదించిన ‘న్యూక్లియర్ లయబిలిటీ’ చట్టానికి విరుద్ధంగా అమెరికా అణు కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి ప్రధాని మన్మోహన్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒబామా ప్రభుత్వం నుండి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న మన్మోహన్, అమెరికా కంపెనీలు సరఫరా చేయనున్న అణు పరికరాలు నాసిరకం అయినప్పటికీ, వాటివల్ల ప్రమాదం జరిగినప్పటికీ నష్టపరిహారం చెల్లించే అవసరం లేకుండా రాయితీ ఇచ్చేవైపుగా అడుగులు వేస్తున్నట్లు ‘ది హిందు’ పత్రిక తెలిపింది. ఇందుకోసం భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి అమెరికాకు అనుకూలంగా ఇచ్చిన సలహాను ప్రధాని అడ్డం పెట్టుకోనున్నారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గ పోర్టుఫోలియాలతో పాటు కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ నియామకంలో కూడా అమెరికా మాట చెల్లుబాటు అవుతున్న విషయం ఈ అంశం ద్వారా స్పష్టం అవుతోంది.
నాసిరకం అణు పరికరాల వలన గానీ, అణు పరికరాల సాంకేతిక వైఫల్యం వలన గానీ విదేశీ సరఫరా అణు కర్మాగారాలలో ప్రమాదం సంభావిస్తే గనుక అలాంటి ప్రమాదాలకు అణు పరికరాల సరఫరాదారు కూడా బాధ్యత వహించాలనీ, తగిన నష్ట పరిహారం చెల్లించాలని భారత పార్లమెంటు ఆమోదించిన ‘అణు పరిహార చట్టం (Civil Nuclear Liability Act)’ స్పష్టం చేస్తోంది. ఈ చట్టం ఆమోదం పొందింది లగాయితు చట్టం నిబంధనల నుండి తమ కంపెనీలకు మినహాయింపు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం లాబీయింగు నడుపుతోంది. ఈ లాబీయింగుకు అర్ధం దేశం యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అమెరికాలో ఇండియా చేసే లాబీయింగు బతిమాలుకున్నట్లుగా ఉంటుంది. అదే ఇండియాలో అమెరికా లాంటి దేశాలు చేసే లాబీయింగు బెదిరింపులు, బ్లాక్ మెయిలింగు, ఒత్తిడి తదితర పద్ధతుల్లో ఉంటుంది.
అమెరికా లాబీయింగు నేపధ్యంలో భారత అణు విభాగం (Department of Atomic Energy -DAE), న్యూక్లియర్ లయబిలిటీ చట్టం విషయంలో తగిన సలహా ఇవ్వాలని భారత అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతిని సెప్టెంబరు 4 తేదీన కోరింది. సలహా కోరిందే తడవుగా చట్టం విధించిన నిబంధనలను అమలు చేసే విచక్షణ ఆపరేటర్ (సాంకేతికంగా, అణు పరికరాలను సరఫరా చేసే కంపెనీని ‘సప్లయర్’ అనీ, అణు పరిశ్రమను నిర్వహించే వారిని ‘ఆపరేటర్’ అనీ అంటారు. ప్రస్తుత కేసులో అమెరికా కంపెనీలు -జి.ఇ, వెస్టింగ్ హౌస్- ‘సప్లయర్లు’ కాగా, భారత ప్రభుత్వం ‘ఆపరేటర్’) కు ఉన్నదని, సివిల్ లయబిలిటీ చట్టం లోని సెక్షన్ 17 ప్రకారం అవసరం అనుకుంటే నిబంధనలను సడలించే అధికారం ‘ఆపరేటర్’ కి ఉన్నదని అటార్నీ జనరల్ వాహనవతి అణు విభాగానికి సూచన ఇచ్చేశారు.
అటార్నీ జనరల్ ఇచ్చే సలహా కేవలం సలహా కాదు. దానికి చట్టబద్ధ రక్షణ ఉంటుంది. పార్లమెంటు ఒక ఉద్దేశ్యంతో చట్టం చేస్తే అటార్నీ జనరల్ కి తన తెలివితేటలను ఉపయోగించి తన ఇష్టులకు, లేదా ప్రభుత్వంలోని వ్యక్తుల అవసరాలకు తగిన విధంగా అర్ధాన్ని ఆపాదించే అవకాశం ఉన్నది. ఫలితంగా, వాహనవతి సలహా ద్వారా భారత దేశంలో అణు కర్మాగారాలను నిర్వహించే (ఆపరేట్ చేసే) భారత ప్రభుత్వ సంస్ధ అయిన ‘న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -ఎన్.పి.సి.ఐ.ఎల్’, పార్లమెంటు విధించిన షరతులను తన ఇష్టానుసారం రద్దు చేసుకునే హక్కును పొందినట్లయింది.
విదేశీ కంపెనీలు సరఫరా చేసిన అణు రియాక్టర్లలో ప్రమాదం జరిగినట్లయితే, ఆ ప్రమాదానికి కారణం విదేశీ సరఫరా పరికరాలే కారణం తేలినట్లయితే, అలాంటి కేసుల్లో విదేశీ కంపెనీలు తప్పించుకుపోవడానికి వీలు లేకుండా లయబిలిటీ చట్టంలో సెక్షన్ 17(b) కింద రక్షణలను పార్లమెంటు ఏర్పాటు చేసింది. లేదా అలా ఏర్పాటు చేశామని పాలక, ప్రతిపక్షాలు దేశానికి చెప్పాయి. ఈ నిబంధనను/రక్షణలను సవరించాలని లేదా పూర్తిగా తొలగించాలని అమెరికా అణు కంపెనీలు జనరల్ ఎలక్ట్రిక్ (జి.ఇ), వెస్టింగ్ హౌస్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాయి. అమెరికా చట్ట సభలపై ఒత్తిడి తెచ్చి అక్కడి ప్రభుత్వం ద్వారా కూడా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ ఒత్తిడిని తిరస్కరిస్తున్నట్లుగానే ఇప్పటివరకూ భారత ప్రభుత్వ పెద్దలు చెబుతూ వచ్చారు. పార్లమెంటు తీవ్రంగా చర్చించి ఆమోదించినందున అమెరికా కంపెనీలకు రాయితీ ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటిస్తూ వచ్చారు.
అయితే అటార్నీ జనరల్ అభిప్రాయంతో అమెరికా కంపెనీల కోరికను, ఒత్తిడిని ఆమోదించడానికి భారత ప్రభుత్వానికి మార్గం సుగమం అయినట్లే. ప్రధాని మన్మోహన్ త్వరలో, అనగా సెప్టెంబరు 27 తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను కలవనున్నారు. ఈ సమావేశంలో అమెరికా కంపెనీల డిమాండుకు ప్రధాని ఆమోదం తెలపవచ్చని ది హిందూ తెలిపింది.
కూడంకుళం సాకు
కూడంకుళం అణు కర్మాగారం కోసం ఇండియా-రష్యాల మధ్య జరిగిన ఒప్పందం రెండు దశాబ్దాల నాటిది. అణు ప్రమాద నష్టపరిహార చట్టానికి ముందే ఈ ఒప్పందం జరిగింది కనుక కూడంకుళం-1 రియాక్టర్ కు వర్తించదని వాహనవతి గత సంవత్సరం అక్టోబర్ లో ప్రభుత్వానికి స్పష్టత ఇచ్చారు. కూడంకుళం అణు కర్మాగారానికి కూడా అణు పరిహార చట్టం నిబంధనలను వర్తింపజేయాలని వామపక్షాలు, ప్రజలు డిమాండ్ చేసిన నేపధ్యంలో వాహనవతి ద్వారా ప్రభుత్వం రష్యాకు రాయితీ ఇచ్చేసింది. కనీసం కూడంకుళం-2 రియాక్టర్ కైనా అణు పరిహార నిబంధన వర్తింపజేయడానికి కూడా రష్యా ఒప్పుకోలేదు.
రెండో దశ ఒప్పందం ఇటీవల జరిగింది కనుక వర్తింపజేయాలని వామపక్షాలు, ఉద్యమకారులు, ప్రజలు డిమాండ్ చేస్తుండగా, ఒకటో దానికి కొనసాగింపుగానే రెండోది నిర్మిస్తున్నాం కనుక వర్తించదని రష్యా వాదించింది. రష్యా వాదనకు భారత ప్రభుత్వం కూడా మద్దతు చెబుతోంది. అదేమని అడిగిన ఉద్యమకారులపై దేశద్రోహం కేసులు మోపి వేధిస్తోంది. చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘించినవారు ప్రభుత్వం పెత్తనం చేస్తుంటే, చట్టాన్ని అమలు చేయాలని కోరినవారు దేశద్రోహులుగా ముద్రపడి అమానుషమైన కేసులు ఎదుర్కోవడం భారత చట్ట వ్యవస్ధలు తన ప్రజలకు ఇస్తున్న అపూర్వమైన కానుక!
కూడంకుళం కర్మాగారానికి ఇచ్చిన రాయితీనే అమెరికా కంపెనీలకు కూడా వర్తింపజేయవచ్చా అన్న సంగతిపై స్పష్టత ఇవ్వాలని భారత ప్రభుత్వం తరపున అణు విభాగం కోరిందే తడవుగా అటార్నీ జనరల్ చట్టంలో ఎన్ని కంతలు (లూప్ హోల్స్) ఉన్నాయో పరోక్షంగా వెలుగులోకి తెచ్చారు. చట్టం ఉద్దేశ్యం భారత ప్రజలకు రక్షణ కల్పించడం కాగా, ఆ చట్టాన్నుండి ఎలా తప్పించుకోవచ్చో చెప్పడం లాయర్ మేధావుల (అదేనండీ, అటార్నీ జనరల్!) కర్తవ్యం అన్నమాట!
“సెక్షన్ 17(a) ప్రకారం (సప్లయర్, ఆపరేటర్ ల మధ్య కుదిరిన) కాంట్రాక్టులో నష్టపరిహారం కోరే హక్కును రాతపూర్వకంగా పొందుపరిచినట్లయితే ఆపరేటర్ కు ఆ హక్కు లభిస్తుంది. అసలు కాంట్రాక్టులోనే అలాంటి హక్కును పొందుపరాచకుండా ఉండడానికి ఆపరేటర్ నిర్ణయించుకున్నట్లయితే ఆ హక్కు కూడా ఆపరేటర్ కి ఉన్నది” అని కూడంకుళం-2 విషయంలో జరిగిన చర్చ సందర్భంగా వాహనవతి స్పష్టం చేశారు. దీనిపై మరింత వివరణ ఇవ్వాలని అణు విభాగం కోరింది. ‘సెక్షన్ 17 ప్రకారం కాంట్రాక్టులో నష్టపరిహారం కోరే క్లాజు పొందుపరిచే హక్కుతో పాటు తక్కువ నష్టపరిహారం కోరే క్లాజును గానీ, అసలు నష్టపరిహారం కోరకుండా ఏ క్లాజూ పొందుపరచని హక్కు గానీ ఆపరేటర్ కు ఉన్నదో లేదో స్పష్టం చేయాలని’ అణు విభాగం కోరింది.
దీనికి వాహనవతి “తానొకటి తలచిన దైవమూ అదే తలచెను’ తరహాలో ప్రభుత్వానికి ఏది కావాలో అదే చెప్పారు. విదేశీ మంత్రిత్వ శాఖకు ఇచ్చిన అంతర్గత నోట్ లో ఈ మేరకు ‘ఆపరేటర్’ కు పూర్తి హక్కులు దఖలు పరుస్తూ స్పష్టత ఇచ్చారని పత్రిక తెలిపింది. ‘సప్లయర్ కి వ్యతిరేకంగా నష్టపరిహారం కోరే హక్కును చట్టం ఇచ్చింది గానీ, అదేమీ తప్పనిసరి కాదు. ఆపరేటర్ అవసరం అనుకుంటే ఆ హక్కును వదులుకోవచ్చు కూడా’ అని వాహనవతి స్పష్టత ఇచ్చారు.
ఈ మాత్రం దానికి ఇక చట్టం ఎందుకు? పార్లమెంటులో జరిగిందంతా ఒక బృహన్నాటకమని స్పష్టం కావడం లేదా? ఏళ్లతరబడి చర్చించి తయారు చేసిన చట్టాలను ఒక్క సలహా పోటుతో రద్దు చేసేపనైతే అసలా చట్టాలు చేయడం ఎందుకని? తామేదో ఊడబోడుస్తున్నట్లు చట్టసభల్లో వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, హావభావ భావోద్వేగాల ప్రదర్శన… ఇవన్నీ నాటకం అని స్పష్టం కావడం లేదా?
mana desam endhuku paraayi desala DAYA meedha konsaaguthuntundhi? ye vishayam theesukunna, mana naayakulu Noru kadaladu endhuku?? mukyam ka USA ki vethirekamga?