మెరుపులాంటి ఉధృతితో వానలు కురిస్తే, అందునా కొండల వెంబడి బండలను కిందికి తోసుకుంటూ పోయే ప్రవాహాల్ని సృష్టించే వానలు కురిస్తే ఆ ఉత్పాతం ఎలాంటిదో ఉత్తరాఖండ్ వరదలు మనకి రుచి చూపించాయి. సరిగ్గా అదే నైసర్గిక స్వరూపం కలిగి ఉన్న కొలరాడో రాష్ట్రంలో వారం రోజుల పాటు కురిసిన వానలు కనీవినీ ఎరుగని మహోత్పాతాన్ని సృష్టించాయి. ఎప్పటిలానే కొలరాడో వరదలకు కూడా గ్లోబల్ వార్మింగే కారణం అని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు.
కొలరాడో వరదల్లో ఇప్పటివరకూ 6గురు చనిపోయారని అధికారిక అంచనా. 1200 మంది వరకూ ఆచూకీ తెలియలేదని రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు ప్రకటించాయి. అయితే వానలు తెరిపినిచ్చి కమ్యూనికేషన్ సంబంధాలు పెరిగే కొద్దీ ఆచూకీ తెలియనివారి సంఖ్య తగ్గుతుందనీ, అలాగే చనిపోయినవారి సంఖ్య కూడా పెరగవచ్చనీ చెబుతున్నారు.
దాదాపు 12,000 చదరపు కి.మీ పరిధిలోని భూభాగంలో సెప్టెంబర్ 12 మొదలుకొని వారం రోజుల పాటు కురిసిన 15 అంగుళాల వర్షపాతం ఫలితంగా ఉద్భవించిన వరదలు అనేక ఇళ్లను నేలమట్టం చేసేశాయి. కొన్ని వందల కి.మీ మేర రోడ్లను కోసేశాయి. పొలాలూ, ఊరూ అన్నింటినీ ఏకం చేశాయి. బహిరంగ ప్రదేశాలు విస్తారమైన ఈత కొలనులుగా మారిపోయాయి. కొండల నుంచి దొర్లిపడుతూ వచ్చిన బండల ధాటికి అప్పటికప్పుడు సరికొత్త నదులు పుట్టుకొచ్చి మన్నూ, మిన్నూ ఏకం చేస్తూ పట్నాలూ, గ్రామాలను ముంచెత్తాయి.
మెక్సికో దేశంపై వ్యాపించి ఉన్న తేమను కొలరాడోపై ఏర్పడిన అల్పపీడనం మహా బలంతో లాగేసుకుందనీ, ఈ తేమతో కూడిన వాతావరణం కొలరాడో కొండలపైన పైపైకి వెళ్ళి చల్లబడి మహా ఉధృతితో వానల్ని కురిపించిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిక్కనైన తేమతో నిండిన ఆకాశం కొలరాడో కొండల మధ్య చిక్కుకుని ఎటూపోయే దారిలేక కొలరాడో పైనే తేమనంతా వదిలించుకుందనీ ఫలితమే ఈ మహా వర్షమని వారు తెలిపారు. ఉత్తరాఖండ్ లోనూ సరిగ్గా ఇదే పరిస్ధితి ఏర్పడిందని గుర్తుకు తెచ్చుకోవచ్చు.
కేవలం ఒక వెయ్యి సంవత్సరాలకు ఒక సారి మాత్రమే ఇలాంటి వర్షాలను ఊహించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వర్షానికి ఒక వారం కిందట కొలరాడోలో ఇలాంటి వర్షం కురవనుందని ఎవరైనా చెబితే బిగ్గరగా నవ్వేవారనీ, కానీ గ్లోబల్ వార్మింగ్ అలాంటి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని వారు చెబుతున్నారు. నిన్న మొన్నటివరకూ అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతాలు ఎడతెగని వేడితో అల్లాడిపోవడం దీనికి ఒక కారణం. గ్లోబల్ వార్మింగ్ వలన కొలరాడో పైన ఉన్న ఆకాశం మరింత తేమను పొదివిపట్టుకునే శక్తిని పొందిందనీ దానితో అల్పపీడనం శక్తి పెరిగి పొరుగున ఉన్న మెక్సికో పైన ఉన్న తేమను కూడా ఆకర్షించిందని వాతావరణ శాస్త్రవేత్తలు వివరించారు.
1976లో ఈ ప్రాంతంలో 4 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షం తర్వాత ఈ స్ధాయిలో కురవడం ఇదే మొదటిసారని కొలరాడో వాతావరణ విభాగం వారు చెబుతున్నారు. అప్పట్లో వర్షం తీవ్ర ఉధృతితో కురిసినా త్వరగా ముగిసిపోయిందనీ కానీ ఈసారి రోజుల తరబడి ఏకధాటిగా కురవడం కనీవినీ ఎరుగని ఉత్పాతమేనని వారు తెలిపారు.
ఈ ఫోటోలు జరిగిన ఉత్పాతాన్ని కొద్దిగా మాత్రమే వివరిస్తాయి. బోస్టన్ గ్లోబ్, ఎన్.బి.సి న్యూస్ వార్తా సంస్ధలు ఈ ఫోటోలను అందించాయి.