రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని


Ram Jethmalani

భారత దేశ న్యాయ వ్యవస్ధ ఎంత గబ్బు పట్టిందో రాం జెఠ్మలానీ రుజువు చేశాడు. దేశంలోనే అతి భారీ క్రిమినల్ లాయర్ గా పేరు మోసిన ఈ పెద్ద మనిషి తన రేపిస్టు క్లయింటు కోసం ఒక నిస్సహాయ పేద బాలికకు బహుశా వైద్య శాస్త్రానికి కూడా తెలియని జబ్బు అంటగట్టాడు. ఈ పేరు మోసిన క్రిమినల్ లాయర్ క్రిమినల్ డాక్టర్ గా కూడా అవతరించి అమ్మాయిల్ని ఒంటరిగా ఉండే ముసలి ముదురు పీనుగలవైపుకి ఆకర్షించే సరికొత్త ‘ముదిరిపోయిన జబ్బు’ని కనిపెట్టాడు. ఈ జబ్బు సోకితే 16 యేళ్ళ బాలికలు డెబ్భైయేళ్ల ముసలివాళ్ళని ఒంటరిగా ఉండడం కనిపెట్టి మరీ ఆవహిస్తారట. ఓపలేని విరహ తాపంతో వేధిస్తారట! పాపం బాలిక తాపాన్ని చల్లార్చడానికేనేమో దైవ దూత గారు అత్యాచారానికి తెగబడక తప్పలేదని జేఠ్మలాని చెప్పడలిచారా?

ఇండియా టుడే పత్రిక ప్రకారం పేరు మోసిన సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్ జోధ్ పూర్ కోర్టులో ఏ పెద్ద మనిషీ తలపెట్టలేని దురాగతానికి పాల్పడ్డాడు. అసరం బాపు భక్తుడి కూతురుగా ఆయన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటూ అత్యాచారం ఆరోపణ చేసిన బాలిక ఒక మానసిక వ్యాధితో బాధపడుతోందనీ, ఈ వ్యాధి వల్ల ఆమెకు పురుషులను ఒంటరిగా కలుసుకోవాలన్న కోరిక తీవ్రంగా కలుగుతోందనీ జేఠ్మలాని వాదించాడు. కింది కోర్టులో బెయిలు నిరాకరించబడిన అసరం బాపుకి బెయిల్ ఇప్పించడానికి జోధ్ పూర్ లోని రాజస్ధాన్ హై కోర్టుకి వచ్చిన జేఠ్మలాని ఈ విచిత్రమైన, అమానుషమైన, హృదయ విహీనమైన, మతి చలించిన వాదనకు తెగించాడు. బాలిక వయసును కూడా తగ్గించి చెబుతున్నారని అసరం ఆశ్రమ స్కూల్ రికార్డులకు బదులు ఆమె జన్మించిన మునిసిపాలిటీ రికార్డులను బట్టి ఆమె వయసు నిర్ణయించాలని జేఠ్మలాని వాదించాడు.

ఇంతకీ రాం జేఠ్మలాని ఆ జబ్బు పేరేమిటో చెప్పలేదు. దాన్ని పోలీసులు పరిశోధించి కనిపెట్టాలిట! కానయితే జబ్బులు కనిపెట్టాల్సింది డాక్టర్లు లేదా వైద్య పరిశోధకులు కదా? ఈ క్రిమినల్ లాయర్ ఆ పని పోలీసులకు అప్పజెప్పారేపిటి చెప్మా!? డాక్టర్లకయితే ఏళ్లతరబడిన పరిశోధనలూ, ఎలుకలూ, చింపాంజీలపై ప్రయోగాలూ కావాలి. అదే పోలీసులయితే లాఠీలతో మక్కెలిరగదన్ని, వీలయితే గుండు సూదులు గుచ్చి లేదా వాటర్ బోర్డింగులు చేసేసి ఆ జబ్బేదో బాలిక చేతే చెప్పిస్తారని నమ్మకం కాబోలు! పోలీసుల పైన క్రిమినల్ లాయర్లకు ఆ మాత్రం నమ్మకం ఉండాలేమో!

జేఠ్మలాని అత్యాచార నేరాల గురించి తెలియనివాడేమీ కాదు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షాపూరిత ధోరణులకు స్పందించలేని వ్యక్తేమీ కాదు. ఆయన ఎంత మహిళా పక్షపాతి అంటే సీత తరపున వకాల్తా పుచ్చుకుని ఏకంగా రాముడిపైనే ద్వేషం పెంచుకునేంతగా! గత సంవత్సరం స్త్రీ పురుష సంబంధాలపై రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఆయన “రాముడు చెడ్డ భర్త. అతనంటే నాకసలు ఇష్టం లేదు. ఎవరో జాలరి ఏదో అన్నాడని, పాపం ఆ మహా సాధ్విని వనవాసానికి పంపేశాడు. ఆ లక్ష్మణుడయితే ఇంకా వరస్ట్. సీతని పెట్టుకెళ్ళినపుడు తన కాపలాలోనే ఆమెని పట్టుకెళ్లారు గనక లక్ష్మణుడే వెతకాలని రాముడు కోరాడు. సీత తన వదిన అనీ, అందువల్ల ఆమె ముఖమే తానెన్నడూ చూడలేదని, కనుక తానామెను గుర్తుపట్టలేనని చెప్పి లక్ష్మణుడు తప్పించుకున్నాడు” అని వ్యాఖ్యానించిన పెద్దమనిషి!

పురాణాలతోనే ఆగలేదాయన. గత డిసెంబర్ 16 తేదీన దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ సామూహిక హత్యాచారం కేసులోనూ రాం జేఠ్మలాని తన అమూల్యమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు. ఢిల్లీ కేసు విచారించడానికి వెంటనే సత్వర న్యాయ స్ధానం (ఫాస్ట్ ట్రాక్ కోర్టు) ఏర్పాటు చేసి రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష వేసేయ్యాలని డిమాండ్ చేసిన ఘనుడు జేఠ్మలాని. ఢిల్లీ అత్యాచారానికి వ్యతిరేకంగా పెల్లుబుకిని నిరసన ప్రదర్శనలపైన ఢిల్లీ పోలీసులు విరుచుకుపడడం పట్ల కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. జనంపైన వాటర్ కెనాన్లు, భాష్ప వాయువులు, లాఠీలు ప్రయోగించినందుకు పోలీసుల్ని తీవ్రంగా ఎండగట్టాడు. ఢిల్లీ కమిషనర్ ని దాదాపు డిస్మిస్ చేయాలన్నట్లుగా మాట్లాడాడు.

Asaram Bapuఅలాంటి పెద్ద మనిషి డబ్బులో మునిగితేలుతున్న క్లయింటు దొరికేసరికి తాను చెప్పిన నీతుల మూటను తీసి ఎంచక్కా గట్టున పెట్టేశాడు. అసరం బాపు చిత్త చాంచల్యానికి బాధితురాలైన బాలికకు మానసిక వ్యాధిని అంటగడుతూ ఆమె గుణగణాలపైనే దాడి ఎక్కుపెట్టాడు. పేరు మోసిన క్రిమినల్ లాయర్ కి ఒక నిస్సహాయ బాలిక మానసిక వేదన, పేదరికం, గుణగణాల హత్యలే ఏకైక డిఫెన్స్ గా దొరకడం బట్టి ఆయన పేరు ఎంత గబ్బును మోస్తోందో అర్ధం అవుతోంది.

ఇంతకీ ముక్కుపచ్చలారని బాలికల్ని చర్మం ముడుతలు పడిన ముసలి పురుషులవైపుకి లాక్కెళ్లే ఆ మానసిక వ్యాధి ఏమై ఉంటుంది? ఆ జబ్బే ఉన్నట్లయితే భారత దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న రేపిస్టు జాతికి దివ్యమైన డిఫెన్స్ వైద్యాన్ని జేఠ్మలాని కనిపెట్టినట్లే. పాపము శమించు గాక!

ఢిల్లీ అత్యాచారం కేసులో నిందితుల తరపున వాదించడానికి సిద్ధపడినందుకు ఆ లాయర్లపైన ఢిల్లీ బార్ అసోసియేషన్ వారు దాడి చేసినంతపని చేశారు. నిందితుల తరపున ఎవరూ వాదించడానికి వీల్లేదని అసోసియేషన్ మొదట ఒక అనధికారిక శాసనం జారీ చేసింది. ఒకరిద్దరు ముందుకు వచ్చేసరికి వారిని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించింది. వారిని సామాజికంగా బహిష్కరించారని కూడా కొన్ని పత్రికలు తెలిపాయి. అలాంటి ఢిల్లీ బార్ అసోసియేషన్ ‘పేరు మోసిన’ క్రిమినల్ లాయర్ జేఠ్మలాని విషయంలో ఎందుకో మౌనం వహించింది.

జేఠ్మలానిపై ఫిర్యాదు

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తన ఖరీదైన క్లయింటును సమర్ధించే బృహత్కార్యంలో బాధితురాలిపై అవాకులు చవాకులు పేలినందుకు గాను ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక ఐ.పి.ఎస్ అధికారి జేఠ్మలాని పై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఐ.పి.ఎస్ అధికారి పేరు అమితాబ్ ఠాకూర్ అని తెలుస్తోంది. జేఠ్మలాని వాదన ‘బాలికను అవమానపరిచేది’గా ఉందని ‘ఆమెను న్యూనతపరిచేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని’ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జేఠ్మలాని కలిగి ఉన్న సామాజిక స్ధాయిని బట్టి, ఆయన మాటలకు సమాజంలో ఉండే విలువను బట్టి చూస్తే మొత్తం మహిళా లోకం యొక్క గౌరవానికే ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకని ఠాకూర్ పేర్కొన్నారు.

జేఠ్మలాని ఒక లాయర్ గా తన క్లయింటు తరపున ఎంత గట్టిగానైనా, ఎంత శక్తితోనైనా వాదించుకునే హక్కు ఉన్నదనీ కానీ ఆ పేరుతో ఒక నిస్సహాయ పెద బాలికపై ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేసే హక్కు గానీ, ఆరోపణలు చేసే హక్కు గానీ లేవని ఠాకూర్ తన ఫిర్యాదులో వాదించారని ది హిందు తెలిపింది. “అత్యంత శక్తివంతమైన, పలుకుబడి కలిగిన వ్యక్తిపైన బాలిక ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చిందని ఆమె తెగువను మెచ్చవలసిందిపోయి అభాండాలు వేయడం తగదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏ నీటి సూత్రం గానీ, ఏ నైతిక నియమావళి గానీ, సామాజిక నియమం గానీ జెఠ్మలానీ లాంటి వ్యక్తులకు ఈ విధంగా ఆధారం లేని ఆరోపణలు చేసే హక్కును కట్టబెట్టలేదని  ఐ.పి.ఎస్ అధికారి స్పష్టం చేశారు. వెంటనే విచారణ నిర్వహించి దానికి అనుగుణంగా చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ మమతా శర్మను ఐ.పి.ఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ కోరారు.

విమర్శల వెల్లువ

అత్యాచార బాధిత బాలికపై నిందలు మోపిన జేఠ్మలాని పైన విమర్శల వెల్లువ సాగుతోంది. అనేకమంది వ్యక్తులు, సంస్ధలు జేఠ్మలాని వాదనను ‘మతిచలించిన వ్యాఖ్యలు’ గా విమర్శిస్తున్నారు. ప్రముఖ పౌరహక్కుల సంస్ధ పి.యు.సి.ఎల్, జేఠ్మలాని వాదన చట్టాన్ని అతిక్రమించిందని తెలిపింది. చట్టం ప్రకారం అత్యాచార బాధితురాలి లైంగిక చరిత్రను సమర్ధనగా తెచ్చుకోవడం నిషేధం అని సంస్ధ తెలిపింది.

“అత్యాచార కేసుల్లో మహిళల గుణ గణాలను ఆరా తీస్తూ అభాండాలు మోపడం, ఈ నిర్దిష్ట కేసులో ఒక మైనర్ బాలికపైన ఆరోపణలు చేయడం బట్టి జేఠ్మలాని లాంటి స్ధాయి కలిగిన లాయర్లు కూడా కోర్టును ప్రభావితం చేయడానికి ఏ స్ధాయికి దిగజారుతారో అర్ధం అవుతోంది” అని పి.యు.సి.ఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.

జేఠ్మలానిని బార్ కౌన్సిల్ నుండి బహిష్కరించాల్సిందిగా తాము కోరతామని వివిధ మహిళా సంస్ధలు హెచ్చరించాయి.

ట్విట్టర్ లో అనేకమంది జేఠ్మలాని వాదనను దునుమాడారు. 13 అత్యాచార కేసులను ఎదుర్కొంటున్న స్వామి ప్రేమానంద తరపున కూడా జేఠ్మలాని వాదిస్తున్న సంగతిని గుర్తుకు తెస్తూ ఒక ట్విట్టర్ వ్యాఖ్యాత ఇలా పేర్కొన్నారు. “అత్యాచార నిందితుల పట్ల ఆకర్షితులయ్యే మానసిక వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. ఈ వయసులో నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సిగ్గు వేయడం లేదా?”

మరో వ్యక్తి: “అసరం కేసులో బాధిత బాలికపైన అవమానకర వ్యాఖ్యలు చేసింది రామ్ జేఠ్మలాని అని ఇప్పుడే తెలిసింది. చాలా విచారకరం. రామ నామం సత్యం కాదా!”

క్రికెట్ వ్యాఖ్యాత హర్ష బోగ్లే: “డియర్ ఓ డియర్,  ప్రముఖ లాయర్లు కూడా ఫార్మ్ కోల్పోతారని రామ్ జేఠ్మలాని రుజువు చేశారు.”

జర్నలిస్టు ప్రీతిశ్ నంది: “సమర్ధనీయం కానీ దాన్ని కూడా సమర్ధించే కళలో రామ్ జేఠ్మలాని ఆరి తేరారు.”

నటి ఖుష్బూ: “నిర్భయ కేసులో అత్యాచార నేరస్ధుల తరపున వాదించిన లాయర్లకీ రామ్ జేఠ్మలానీకి తేడా ఏమిటి? అసహ్యం వేస్తోంది.”

సిగ్గులేదా?

విచిత్రం ఏమిటంటే రామ్ జేఠ్మలాని వాదనపై ప్రశ్నించిన విలేఖరిని ‘సిగ్గు లేదా?’ అని రామ్ జేఠ్మలానియే ప్రశ్నించడం. పలుకుబడి కలిగిన వ్యక్తి చేసిన ఘోరాన్ని ప్రశ్నించిన బాలికకు మానసిక వ్యాధిని అంటగట్టిన జేఠ్మలాని నుండి కోర్టులో ఆయన చేసిన వాదనపై వివరాలు రాబట్టడానికి ప్రయత్నించిన హెడ్ లైన్స్ టుడే విలేఖరిని రాం జేఠ్మలాని తూలనాడారు. “కోర్టులు చేసిన వాదనల గురించి లాయర్ ని ఎప్పుడూ ప్రశ్నించొద్దు” అని ఆయన హుకుం జారీ చేశారని తెలుస్తోంది. వదలకుండా గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న విలేఖరిని “మీకు సిగ్గు వేయడం లేదా?” అని ప్రశించాడా పెద్దమనిషి!

సిగ్గు విడిచిన బాపతుతో పెట్టుకోవడం ఆ విలేఖరి చేసిన తప్పేమో!

3 thoughts on “రేపిస్టు అ(వ)సరం కోసం బాలికకు జబ్బు అంటగట్టిన జేఠ్మలాని

  1. dabbu,power,sex ee mudu evvarinaina attract chestayee,stimulate chestayee.aite age perige koddi manam peruguthunna samajam nudi manam nerchukuntunna dani prakaram old age lo chala manasikanga mature kavali.villu enti ela vunnaru.mana samajam pi evaridaina prabhavam unda? leka mana samajanni samskarinchukovala? samajamllo raboye marpulaku evi suchikala?aslu asharam ganni prajalu pujinchadam entadi?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s