అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిలట్రీ తరహా డ్రస్సులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వాషింగ్టన్ డి.సిలోని నావల్ డాక్ యార్డ్ లో యధేచ్ఛగా షూటింగుకు పాల్పడ్డారని పత్రికలు తెలిపాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు పౌరులు మరణించగా కాల్పులకు దిగినవారిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారని తెలుస్తోంది. కనీసం మరో ఇద్దరు షూటర్లు ఉన్నారనీ, వారికోసం వెతుకుతున్నామని పోలీసులు చెబుతున్నారు. వెతుకుతున్నవారిలో ఒకరు తెల్లజాతి వ్యక్తి కాగా మరొకరు నల్లజాతి వ్యక్తి అని వారు తెలిపారు.
కాల్పులకు దిగింది అమెరికన్లుగా కనిపిస్తున్నందున వారికి టెర్రరిస్టు ట్యాగ్ తగిలించకుండా అమెరికా ప్రభుత్వం, పత్రికలు తగిన జాగ్రత్త పాటించాయి. కాగా అమెరికన్లు ఆత్మరక్షణ నిమిత్తం తుపాకులు కలిగి ఉండే సెకండ్ అమెండ్ మెంట్ హక్కును రద్దు చేయడానికి మరొకసారి అధ్యక్షుడు ఒబామా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి.
సి.ఎన్.ఎన్ పత్రిక ప్రకారం 6 గురు చనిపోగా, ఎన్.బి.సి పత్రిక ప్రకారం 12 మంది చనిపోయారు. రష్యా టుడే ప్రకారం 7 గురు చనిపోగా 4గురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. ఒక అస్సాల్ట్ రైఫిల్ తో పాటు షాట్ గన్ మరియు హ్యాండ్ గన్ లను ధరించిన వ్యక్తి ఒకరు వాషింగ్టన్ నావీ యార్డు లోపల ఉన్న ఒక భవనంలో కాల్పులు జరిపాడని ఎన్.బి.సి తెలిపింది. నేవల్ సిస్టమ్స్ కమాండ్ సిస్టమ్స్ కు చెందిన ఈ భవనం అమెరికా నేవీ ఆధీనంలోని అత్యంత పెద్ద భవనం అని పత్రికలు తెలిపాయి. ఆయన కాక మరో ఇద్దరు షూటర్లు ఉన్నారని నేవీ చీఫ్ కేధి లేనియర్ తెలిపాడు. అయితే నిజానికి ఎంతమంది షూటర్లు ఉన్నదీ ఖచ్చితంగా తెలియలేదని, ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెబుతున్నారని పత్రికలు చెబుతున్నాయి.
అధ్యక్షుడు ఒబామా సంఘటనను యధావిధిగా ‘పరికిపందల చర్య’ గా అభివర్ణించాడు. ఈ విచ్చలవిడి దాడిలో దేశభక్తులను, మిలట్రీ, పౌర అధికారులను ఒకే విధంగా లక్ష్యంగా చేసుకున్నారనీ మానందరినీ రక్షించే పనిలో ఉన్న పురుషులను, స్త్రీలను చంపబూనుకున్నారని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా తుపాకి తీసి ఎటువంటి మాటలు, హెచ్చరికలు లేకుండా కాల్పులు ప్రారంభించాడనీ, దానితో జనం అంతా భవనం నుండి బైటపాడడానికి ఒకరినొకరు తొక్కుకుంటూ తోసుకుంటూ పరుగులు తీశారనీ, ప్రహరీ గోడ దూకేందుకు ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్ష్యులను ఉటంకిస్తూ పత్రికలు తెలిపాయి.
కాల్పుల ఘటనతో సమీపంలోని రీగన్ జాతీయ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసివేశారు. హంతకులను వెతకడానికి హెలికాప్టర్ ఎగరడానికి వీలుగా విమానాలేవీ ఎగరకుండా ఉండడానికి విమానాశ్రయం మూసివేశారని తెలుస్తోంది. అయితే కొన్ని గంటల తర్వాత విమానాశ్రయాన్ని తిరిగి తెరిచారు. తప్పించుకున్న ఇద్దరికోసం వాషింగ్టన్ పోలీసులు లుకౌట్ వారంట్ జారీ చేశారు. 50 యేళ్ళ నల్లజాతి వ్యక్తి రైఫిల్ ధరించి ఉండగా మరో తెల్లజాతి వ్యక్తి పిస్టల్ ధరించి ఉన్నాడని పోలీసులు ప్రకటించారు.
బోస్టన్ బాంబింగు సందర్భంగా రంగంలోకి దిగి నగరాన్ని మొత్తం జల్లెడ పట్టిన బృందాలనే వాషింగ్టన్ నేవీ యార్డ్ షూటింగు నిందితులను పట్టుకోవడానికి రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. అయితే ఈ బృందం బోస్టన్ లో వెతికి పట్టుకున్నదేమీ లేదు. బోస్టన్ నగర నివాసి ఒకరు తమ ఇంటి పెరడులో పార్క్ చేసి ఉన్న పడవలో నిందితుడొకరు దాక్కుని ఉన్న సంగతి పసిగట్టి పోలీసులకు చెప్పేవారకూ ఈ వీరులు ఎవరినీ పట్టుకోలేదు.
అమెరికా కాలమానం ప్రకారం ఉదయం గం 8:20 ని.లకు కాల్పులు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. కాల్పులు ప్రారంభం అయ్యాక సమీపంలో ఉన్న 8 స్కూళ్లను మూసేశారు. పెంటగాన్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజా ఘటన ద్వారా అమెరికాలో తుపాకులు కలిగి ఉండే హక్కు పైన మరొకసారి విస్తృత చర్చ జరగనుంది.