ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇటీవల రోజుల్లో జరిగిన విమాన ప్రదర్శనల ఫొటోలివి.
పక్షిని చూసి అలాగే ఎగరడానికి మొదట్లో తంటాలు పడిన మనిషి చివరికి ఆ పక్షిని దాటిపోయి ఆకాశం మొత్తం ఆక్రమించేశాడు. మనిషి శక్తి, యుక్తులకు సజీవ సాక్ష్యాలుగా నిలిచేవాటిలో విమానాలు బహుశా ముఖ్య స్ధానంలో ఉంటాయేమో. అయితే కానిబాల్స్ తరహాలో స్వజాతి భక్షణ కోసం మనిషి తెగించడంతో ప్రయాణ విమానాలకు తోడుగా యుద్ధ విమానాలు వచ్చి చేరాయి.
యుద్ధాలు వస్తే తప్ప పని దొరకని యుద్ధ విమాన సిబ్బందికి విమాన ప్రదర్శనల సందర్భంగా చేతినిండా పని దొరుకుతుంది. విమానాల కంపెనీలకు ఖజానాలను నింపడానికి ఉద్దేశించే ఈ విమాన ప్రదర్శనల సందర్భంగా పైలట్లు దారి తప్పో లేదా పొరబాటు వల్లనో విమానాలు కూలిపోయి చనిపోవడం జరుగుతుంది. అడపా దడపా ప్రదర్శనలను తిలకించడానికి వచ్చినవారు కూడా గాయపడడమో, చనిపోవడమో కూడా జరుగుతుంది.
యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లను తయారు చేసే కంపెనీలకు తమ సరుకుల పనితనం చూపెట్టే అవకాశం మామూలుగా దొరకదు. కార్లు, బైకుల్లాగా వారి సరుకుల్ని బిజినెస్ షో లలో ప్రదర్శించి అమ్ముకోవడానికి కుదరదు కదా! అలాంటి అవకాశం ఇవ్వడానికి ఏర్పాటు చేయబడేవే ‘విమాన ప్రదర్శనలు’ లేదా ‘ఎయిర్ షో’లు.
ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలయిన అమెరికా, చైనా ల దగ్గర్నుండి అతి చిన్న సాదా సీదా దేశాలయిన రుమేనియా, లాత్వియా, పోలాండ్ ల వరకూ వివిధ దేశాల విమాన ప్రదర్శనల ఫోటోలను సేకరించి బోస్టన్ పత్రిక ప్రచురించింది. వాటిలో కొన్ని మాత్రమే ఇవి.