అమెరికన్లను ఉద్దేశిస్తూ పుతిన్ రాసిన లేఖ -అనువాదం


Putin

(ఈ లేఖను సెప్టెంబర్ 11 తేదీన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది. సిరియా తిరుగుబాటుదారులు ఆగస్టు 21 తేదీన సౌదీ అరేబియా అందించిన రసాయన ఆయుధాలు ప్రయోగించి వందలాది మంది పౌరులను బలిగొన్న దుర్మార్గాన్ని సిరియా ప్రభుత్వంపై మోపి ఆ దేశంపై దాడికి అమెరికా సిద్ధపడుతున్న నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ లేఖ రాశాడు. లేఖ రాసేనాటికి సిరియా రసాయన ఆయుధాలను ఐరాస పర్యవేక్షణలోకి తేవడానికి రష్యా ప్రతిపాదించడం, సిరియా అందుకు అంగీకరించడం జరిగిపోయింది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా సిరియాపై దాడి చేసి తీరాతనంటూ చేసిన ప్రకటనల నుండి వెనక్కి ఎలా మళ్లాలా అని తల పట్టుకుని కూర్చున్న పరిస్ధుతుల్లో రష్యా చేసిన ప్రతిపాదన ఆయనకు పన్నీటి జల్లే అయింది. క్షణం ఆలస్యం చెయ్యకుండా రష్యా ప్రతిపాదనను ఆమోదించిన ఒబామా, పైకి మాత్రం దాడి చేసే ఆలోచన విరమించలేదనీ, రసాయన ఆయుధాలను అప్పగించడమో లేదా నాశనం చెయ్యడమో చేయకపోతే దాడి తప్పదని బింకం ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపధ్యంలో పుతిన్ లేఖలోని అంశాలు సిరియా సమస్యపై ఒక అవగాహన ఇస్తాయి. ఇది యధాతధ అనువాదం. విశేఖర్)

సిరియా కేంద్రంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, అమెరికా ప్రజలతోనూ, వారి రాజకీయ నాయకులతోనూ ఈ విధంగా నేరుగా మాట్లాడేందుకు నన్ను పురిగొల్పాయి. మన సమాజాల మధ్య తగినంతగా సంబంధాలు లేని నేటి సమయంలో ఇలా చేయడం మరింత అవసరం.

మన మధ్య సంబంధాలు వివిధ దశల గుండా ప్రయాణించాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మనం ఒకరికి వ్యతిరేకంగా మరొకరం మోహరించాం. కానీ మనం ఒక నాడు ఒకటిగా కూడా ఉండి ఉమ్మడిగా నాజీలను ఓడించాం. అలాంటి వినాశనాలు మళ్ళీ ఏర్పడకుండా నివారించడానికి అప్పుడు విశ్వవ్యాపితమైన అంతర్జాతీయ సంస్ధను -ఐక్యరాజ్యసమితి- ఏర్పాటు చేసుకున్నాం.

యుద్ధం, శాంతీలను ప్రభావితం చేసే నిర్ణయాలు కేవలం ఏకాభిప్రాయంతోనే తీసుకోవాలని ఐరాస వ్యవస్ధాపకులు అర్ధం చేసుకున్నారు. ఆ మేరకు అమెరికా అంగీకారంతో భద్రతా సమితి శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉండేలా ఐరాస ఛార్టర్ లో పొందుపరిచారు. అంతర్జాతీయ సంబంధాలలో దశాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చిన స్ధిరత్వం ఇందు లోని అద్వితీయమైన వివేకాన్ని రుజువు చేసింది.

నానాజాతి సమితి (League of Nations) ఎదుర్కొన్న దుస్ధితిని ఐరాస కూడా ఎదుర్కోవాలని ఎవరూ అనుకోరు. నిజమైన స్వేచ్ఛాపూరిత అమరిక (leverage) లేని కారణం చేత నానాజాతి సమితి కూలిపోయింది. శక్తివంతమైన దేశాలు ఐరాసను పక్కన బెట్టి భద్రతా సమితి అనుమతి లేకుండా మిలట్రీ చర్యకు పాల్పడితే అలాంటిదే మళ్ళీ పునరావృతం కావడం సాధ్యమవుతుంది.

అనేక దేశాలు, పోప్ తో సహా అనేకమంది ప్రధాన రాజకీయ మరియు మత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, సిరియాపై అమెరికా దాడి చేసినట్లయితే మరింతమంది అమాయకులు చనిపోవడానికీ, ఘర్షణ మరింత పెచ్చరిల్లడానికీ మాత్రమే దారి తీస్తుంది. దాడివల్ల ఘర్షణ సిరియా సరిహద్దులను దాటి విస్తరిస్తుంది. హింస మరింత పెరిగిపోయి మరో విడత ఉగ్రవాదం కట్లు తెంచుకుంటుంది. ఇరానియన్ అణు సమస్య మరియు ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యలు పరిష్కరించడానికి జరుగుతున్న బహుళపక్ష ప్రయత్నాలు పక్కకు వెళ్ళి మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలు మరింతగా అస్ధిరీకరణ చెందుతాయి.

సిరియాలోని యుద్ధం ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్నది కాదు. బహుళమతాలకు నిలయమైన దేశంలో ప్రభుత్వము, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణ అది. సిరియాలో ప్రజాస్వామ్య చాంపియన్లు ఎవరన్నా ఉంటే వారు చాలా కొద్దిమందే. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నవారిలో ఆల్-ఖైదా ఫైటర్లు, అనేక రకాల తీవ్రవాదులకు మాత్రం కొదవలేదు. ప్రతిపక్షాలతో కలిసి పోరాడుతున్న ఆల్ నుస్రా ఫ్రంట్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, లేవంత్ తదితర సంస్ధలను అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ టెర్రరిస్టు సంస్ధలుగా నిర్ధారించింది. ప్రతిపక్షాలకు అందిన విదేశీ ఆయుధాల వలన అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారిని ఈ అంతర్గత ఘర్షణ ప్రపంచంలోనే అత్యంత రక్తసిక్తమైనది.

అరబ్ దేశాల నుండి వచ్చి అక్కడ పోరాడుతున్న కిరాయి బలగాలు, పశ్చిమ దేశాల నుండి చివరికి రష్యా నుండి కూడా వచ్చిన వందలాది మిలిటెంట్లు మాకు తీవ్ర ఆందోళన కారకులు. సిరియాలో పొందిన అనుభవంతో వారు మన దేశాలకు మళ్ళీ తిరిగి రాకుండా ఉంటారా? లిబియాలో యుద్ధం చేసిన తర్వాత తీవ్రవాదులు మాలి వెళ్లడం తెలియని సంగతా? ఇది మనందరినీ భయపెట్టే విషయం.

సిరియన్లు తమ భవిష్యత్తు కోసం ఒక సమగ్రమైన రాజీ పధకాన్ని అభివృద్ధి చేసుకునేలా శాంతియుత చర్చలు జరపాలని రష్యా మొదటి నుండీ చెబుతూ వచ్చింది. మనం సిరియా ప్రభుత్వాన్నేమీ రక్షించడం లేదు, కేవలం అంతర్జాతీయ చట్టాలను మాత్రమే కాపాడుకుంటున్నాం. ఐరాస భద్రతా సమితిని మనం వినియోగించుకోవాలి. అత్యంత సంక్లిష్టమైన, దొమ్మీలతో నిండి ఉన్న నేటి ప్రపంచంలో చట్టబద్ధ పాలనను సంరక్షించుకోవడమే, అంతర్జాతీయ సంబంధాలు మరింత అధ్వాన్న స్ధితిలోకి జారిపోకుండా ఉండడానికి మిగిలిన కొద్ది మార్గాల్లో ఒకటి. చట్టం చట్టమే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని మనం అనుసరించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్జాతీయ చట్టాల ప్రకారం బల ప్రయోగం అనేది ఆత్మరక్షణ కోసం మాత్రమే జరగాలి, లేదా భద్రతా సమితి నిర్ణయంతో జరగాలి. ఐరాస ఛార్టర్ కింద మిగిలినది ఏదైనా అంగీకార యోగ్యం కాదు. అది దురాక్రమణ అవుతుంది.

సిరియాలో విష వాయువులు వినియోగించారనడానికి ఎవరికీ అనుమానాలు లేవు. కానీ వాటిని వినియోగించింది సిరియా సైన్యం కాదనీ, తమ శక్తివంతమైన విదేశీ మద్దతుదారుల జోక్యాన్ని రెచ్చగొట్టడానికి ప్రతిపక్ష బలగాలే ఆ పని చేశాయనీ నమ్మడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ విదేశీ శక్తులు మతతత్వ శక్తుల పక్షం వహిస్తున్నాయి మరి! మిలిటెంట్లు మరోసారి (రసాయన) దాడి చేయడానికి -ఈసారి ఇజ్రాయెల్ పైన- వస్తున్న వార్తలను విస్మరించడానికి వీలు లేదు.

విదేశాలలోని అంతర్గత ఘర్షణల్లో మిలట్రీ పరంగా జోక్యం చేసుకోవడం అమెరికాకు మామూలు విషయంగా మారడం కలవరం కలిగించే విషయం. అది అమెరికాకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేదేనా? నాకు అనుమానమే. ప్రపంచ వ్యాపితంగా ఉన్న మిలియన్ల మంది ప్రజలు అమెరికాను ‘ప్రజాస్వామ్యం’ నమూనాగా కంటే అత్యంత క్రూరమైన శక్తిపై ఆధారపడిన దేశంగానే చూస్తున్నారు. “నువ్వు మాతో లేకపోతే మాకు వ్యతిరేకంగా ఉన్నట్లే” అన్న నినాదం కింద కూటములు చేరదీస్తున్న శక్తిగానే చూస్తున్నారు.

కానీ బలప్రయోగం అనేది ప్రభావం లేనిదనీ, అసంగతమనీ రుజువయిన సత్యం. ఆఫ్హానిస్తాన్ ఇంకా రసికారుతోంది. అంతర్జాతీయ బలగాలు అక్కడినుండి ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ ఏమవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి. లిబియా అనేక తెగలు, వంశాల మధ్య చీలిపోయి ఉంది. ఇరాక్ లో అంతర్గత యుద్ధం కొనసాగుతూనే ఉంది; ప్రతి రోజూ అక్కడ డజన్ల కొద్దీ జనం చచ్చిపోతున్నారు. అమెరికాలో అనేకమంది ఇప్పుడు సిరియాకూ, లిబియాకూ మధ్య పోలిక తెస్తున్నారు. ఇటీవల చేసిన తప్పులనే మళ్ళీ ఎందుకు చేస్తున్నారని వారు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

లక్ష్యం పైనే ఎంతగా కేంద్రీకరించయినా దాడులు చేయొచ్చు గాక! ఆయుధాలు ఎంత అధునాతనమైనవైనా కావచ్చుగాక! కానీ ఏ అమాయక పౌరులనైతే రక్షించడానికని చెబుతున్నారో వారే, వృద్ధులు, పిల్లలతో సహా,  మరణించక తప్పదు.

ప్రపంచం స్పందిస్తూ అడుగుతోంది: అంతర్జాతీయ చట్టాలపై నీకు నమ్మకం లేనట్లయితే నీ భద్రత కోసం ఇతర మార్గాలను ఎంచుకోక తప్పదు అని. ఫలితంగా దేశాలు అంతకంతకూ ఎక్కువగా సామూహిక విధ్వంసక మారణాయుధాలు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది కేవలం తార్కికమైన పరిణామమే: నీ వద్ద బాంబు ఉంటే, ఇక నిన్నెవ్వరూ తాకబోరు. (అణ్వస్త్ర) వ్యాప్తి నిరోధకం గురించి మాట్లాడుకోవడంతో మాత్రమే మనం సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే వాస్తవంలో ఆ సూత్రం తుడిచిపెట్టుకుపోతోంది.

బలప్రయోగపు భాషను ఉపయోగించడం మనం ఇక మానుకోవాలి. నాగరికమైన రాయబార మరియు రాజకీయ ఒప్పందాల మార్గం వైపుకి రావాలి.

మిలట్రీ చర్యను తప్పించే ఒక కొత్త సదవకాశం గత కొద్ది రోజుల్లో రంగం మీదికి వచ్చింది. అమెరికా, రష్యా, ఇంకా అంతర్జాతీయ సమాజానికి చెందిన సభ్యులందరూ, రసాయన ఆయుధాలను అంతర్జాతీయ పర్యవేక్షణలోకి అనుమతించి అనంతరం వాటిని నాశనం చేసేందుకు సిరియా అంగీకరించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధ్యక్షుడు ఒబామా జారీ చేసిన ప్రకటన బట్టి చూస్తే మిలట్రీ చర్యకు ప్రత్యామ్నాయంగా అమెరికా దీన్ని చూస్తోంది.

సిరియా విషయంలో రష్యాతో చర్చలు చేయడం కొనసాగించడంలో అధ్యక్షుడికి ఉన్న ఆసక్తిని నేను స్వాగతిస్తున్నాను. ఉత్తర ఐర్లాండ్ లోని లఫ్ ఎర్నే లో గత జూన్ లో జరిగిన జి8 దేశాల సమావేశంలో అంగీకరించినట్లుగా ఈ నమ్మకాన్ని బతికించి ఉంచడానికి మనం ఉమ్మడిగా కృషి చేయాలి. తద్వారా ఈ చర్చను పరస్పర చర్చలవైపుకి తీసుకెళ్లాలి.

సిరియాకు వ్యతిరేకంగా బలప్రయోగం తప్పించినట్లయితే, అంతర్జాతీయ సంబంధాలలో వాతావరణాన్ని మెరుగుపరిచి పరస్పర నమ్మకాన్ని శక్తివంతం చేసుకోవచ్చు. అది మన ఉమ్మడి విజయం అవుతుంది. ఇతర కీలక అంశాలలో సహకారానికి తలుపులు తెరుస్తుంది.

అధ్యక్షుడు ఒబామాతో నా పని, వ్యక్తిగత సంబంధం, వృద్ధి చెందుతున్న నమ్మకంతో కూడుకుని ఉన్నాయి. నేను దీనిని బహుధా అభినందిస్తున్నాను. మంగళవారం ఆయన దేశాన్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేశాను. “అమెరికా విధానమే అమెరికాను వైవిధ్యంగా నిలుపుతుంది. అదే మనల్ని ప్రత్యేకులుగా నిలుపుతుంది” అంటూ అమెరికా ప్రత్యేకత గురించి ఆయన చేసిన వాదనతో నేను ఏకీభవించడం లేదు. దాని వెనుక ఉద్దేశ్యం ఏమయినప్పటికీ తమను తాము ప్రత్యేకులుగా చూసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించడం అత్యంత ప్రమాదకరం. ఇక్కడ పెద్ద దేశాలు ఉన్నాయి, చిన్న దేశాలు ఉన్నాయి. ధనిక, పేద దేశాలున్నాయి. సుదీర్ఘ ప్రజాస్వామిక సంప్రాదాయాలు కలిగిన దేశాలు, ఇప్పటికీ ప్రజాస్వామ్య మార్గాన్ని వెతుక్కుంటున్న దేసాలూ ఉన్నాయి. వారి విధానాలు కూడా విభేదిస్తాయి. మనమందరమూ విభిన్నత కలిగినవారమే. కానీ దేవుడి ఆశీర్వాదం కోరే విషయానికి వచ్చేటప్పటికి మనందరినీ దేవుడు సమానంగానే సృష్టించాడన్న సంగతిని మాత్రం మరువద్దు.

-వ్లాదిమిర్ వి. పుతిన్, రష్యా అధ్యక్షుడు

4 thoughts on “అమెరికన్లను ఉద్దేశిస్తూ పుతిన్ రాసిన లేఖ -అనువాదం

  1. ఒకదేశ అంతర్గతశార్వభౌమాదికారన్ని ప్రశ్నించడానికి ఈయనకున్న అధికారమేమిటి?ముందు తన విషయం(2వ సారి ఎన్నికకు సంబందించిన రభస)చూసుకొంటే మంచిది!

  2. మీ ప్రశ్న ఎవరికి? పుతిన్ ఏ దేశ అంతర్గత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నారు? అలా చేస్తున్న అమెరికాను బహిరంగంగా నిలదీస్తున్న పుతిన్ ని అభినందించాల్సింది పోయి వేరే అర్ధం తీస్తున్నారేమి?

  3. ఒక దేశ సార్వభౌమాదికారాన్ని పుతిన్‌ ప్రశ్నించడం లేదు. ప్రపంచ దేశాల సార్వభౌమాదికారంలో అమెరికా దురహంకార జోక్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఈ ప్రశ్న అమెరికాకు వ్యతిరంగా వేయ్యాలి.ఈ పోష్టు సరిగా చదివినట్లు లేదు. మరో సారి చదవండి. లేక నా నా రాజ్య సమితి అంటె ఏమిటో ఐక్య రాజ్య సమితి అంటే ఏమిటొ సరిగా తెలుసుకోండి.

  4. ఇది రష్యాని ఉద్దేశించిమాత్రమే కాదు!అన్ని దేశాలకు వర్తిస్తుంది!స్వయానా ఏ దేశమూ ఇతరుల జోక్యం కోరనంతవరకూ కల్పించుకోవలసిన అవసరంలేదు!ఇందులో ఏవైనా సవరణలు చేయల్సివుంటే ప్రతిపాదించండి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s