గత మే నెలలో మూడు దేశాల ఆస్ట్రోనాట్ సిబ్బంది సాగించిన 36వ అంతర్జాతీయ విశ్వ ప్రయాణం 166 రోజుల పాటు సాగింది. అమెరికా, రష్యా, ఇటలీలకు చెందిన సిబ్బంది విజయవంతంగా ముగించిన ఈ ప్రయాణానికి ఇంకా జపాన్, కజకిస్ధాన్ లాంటి దేశాలు కూడా సహకరించడం విశేషం.
ఇండియాలో కుంకుమ బొట్లతో రాకెట్ ప్రయోగం ప్రారంభం అయితే అమెరికాలో క్రైస్తవ ప్రార్ధనలతో ప్రారంభం అవుతుందని ఈ ఫోటోలు తెలియజేస్తున్నాయి. అభివృద్ధి, మూఢత్వం పెనవేసుకుపోయిన విచిత్రం ఇది.
166 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణానికి వివిధ లక్ష్యాలను ఉద్దేశించారు. భూమి చుట్టూ తిరుగుతూ మైక్రో గ్రావిటీ పైన ప్రయోగాలు చేయడం వాటిల్లో ఒకటి. మానవుడి కంటి దృష్టి పైన భార రహిత స్ధితి కలగజేసే ప్రభావం ఏమిటో పరిశీలించడం, బృందాలుగా పని చేసేందుకు ఉద్దేశించిన మైక్రో శాటిలైట్ల పనితనాన్ని పరిశీలించడం, సరికొత్తగా రూపొందించిన ద్రవ ఇంధనాల ఆవిరి మరియు ఒత్తిడి లక్షణాలను పరిశీలించడం కూడా ఈ ప్రయాణపు లక్ష్యాల్లో కొన్ని.
మూడు దేశాల నుండి వెళ్ళిన 6గురు ఆస్ట్రోనాట్ సిబ్బంది తమ ప్రయాణం సందర్భంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో తమ జీవితం పైనా, భూమి చుట్టూ తిరుగుతూ తమకు భూగ్రహం కనిపించిన తీరుపైనా వందలాది ఫోటోలు తీశారు. సెప్టెంబరు 11 తేదీన కజకిస్ధాన్ లో కాప్సూల్ ల్యాండ్ అవడం ద్వారా ముగిసిన వీరి పరిశోధన యాత్ర ఫలితాలు తెలుసుకోవడం కోసం అనేక దేశాలలోని శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు.
వివిధ దేశాలు సహకరించుకుంటే తప్ప శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, పురోగతి సాధ్యం కాని పరిస్ధితుల్లో కూడా మనిషి స్వార్ధ, దురాశ, పేరాశలను అధిగమించలేని దుర్గతిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకవైపు రష్యా సహకారంతో స్పేస్ ప్రయాణం సాగిస్తూనే మరోవైపు భూమిపైన అదే రష్యాతో సిరియా విషయంలో యుద్ధానికి సిద్ధమైపోయింది అమెరికా. రష్యా చాతుర్యంతో చివరి నిమిషంలో తప్పిపోయిన సిరియా దురాక్రమణ దాడి జరిగినట్లయితే మొత్తం మధ్య ప్రాచ్యం ప్రాంతాన్నే కాక ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి ఉండేదని భౌగోళిక రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
“క్రూర మృగమ్ముల కోరలు తీసేను
ఘోరారణ్యములాక్రమించెను
హిమాలయముపై జెండా పాతెను
ఆకాశంలో షికారు చేసెను
అయినా… మనిషి మారలేదు.”
ఈ పాట రాసి బహుశా నలభై యేళ్లకు పైనే అయింది. పాటలో ఉదహరించినదాని కంటే ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను మనిషి పూర్తి చేశాడు. భూగ్రహంపైన వందల వేల కిమీ దూరంలో ఉండి కూడా పక్క పక్కనే నిలబడి ఉన్నట్లుగా మాట్లాడుకోగల సాంకేతికతను సొంతం చేసుకున్నాడు. అలాస్కా కంప్యూటర్ ను అమలాపురం కంప్యూటర్ తో అనుసంధానం చేసుకున్నాడు. “ఐనా…. మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!” అట్టడుగు రాతిపొరల్లో దాగిన ఫ్రాకింగ్ గ్యాస్ ను కూడా వెలికి తీస్తూ భూగ్రహం భవిష్యత్తును ఫణంగా పెడుతున్నాడు. గ్లోబల్ వార్మింగ్ కు దోహదపడుతూ మానవ లోకం మనుగుడకే ముప్పు తెస్తున్నాడు. మనిషికీ మనిషికీ మధ్య ఉన్న సంబంధం యొక్క మూలాలు మారితే తప్ప ఈ పరిస్ధితిలో మార్పు రాబోదు.
ఈ ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక అందజేసింది.
ఒక సభలో శాస్త్ర విజ్ఞానం మీద ఉప న్యాసం ఇస్తూ కొడవటిగంటి రోహినీ ప్రసాద్ గారు ఇలా అన్నారు ” శాటీలైట్లను రోదసి లోకి పంపిన వెంటనే శాస్త్ర వేత్తలు నేరుగా రాష్ట్రం లోని ప్రసిద్ద దేవాలయానికి వెళ్లీ మొక్కుబడులు చెల్లించుకొని మీడియాకు పోజులిచ్చి ‘ మానవప్రయత్నానికి దేవుడు సహకరించాడ ‘ ని మరీ చెపితే మరి సామాన్య ప్రజలు సంగతి ఏమిటి? సైన్సు నేర్చుకున్నవాల్లని శాస్త్ర వేత్తలంటున్నాం. వీళ్లు ఆ విజ్ఞానాన్ని ప్రజలకు తెలియపరచడం అటుంచి వాల్లని విజ్ఞానానికి దైవాత్వాన్ని అంటగట్టి ప్రోత్సాహిస్తే ఏమనాలి? వాల్లకు ఈ వ్యవస్త నిలకడగా ఉండాలి. అది ప్రజలు మూడులుగా ఉన్నంతవరకే అలా జరుగుతుంది కనుక ప్రజలకంటే ముందు ఈశాస్త్ర వేత్తలు మార్గదర్శులుగా వుండటానికి దైవత్వాని ప్రోత్సహిస్తారు. శాస్త్రాలు వేరు సమాజ జీవితం వేరు అని శాస్త్రవిజ్ఞానాని జీవితాలకు అన్వయించు కోరు మన శాస్త్రవేత్తలు.