కేబినెట్ నిర్ణయం దేశానికి, ప్రధాని సంతకం అమెరికాకి


ozone cause

భారత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయాన్ని పక్కకు నెట్టి విదేశాలకు మేలు చేసే నిర్ణయాలను అంతర్జాతీయ వేదికలపై ఒప్పుకుని వచ్చే దేశాధినేతలు ఎక్కడయినా ఉంటారా? మనం ఆ అదృష్టం చేసుకున్నాం. గ్లోబల్ వార్మింగ్ కు దారి తీస్తున్న వాయువుల విడుదలను అరికట్టే విషయంలో ‘అంతర్జాతీయ ధరిత్రి వేదిక’లపై అమెరికా, ఐరోపాల పెత్తనాన్ని ఎదుర్కొంటున్నట్లు కనిపించే ప్రధాని మన్మోహన్ తీరా ఆచరణలోకి వచ్చేసరికి అమెరికా ఒత్తిడికి లొంగి దేశ ప్రయోజనాలను గంగలో కలిపే ఒప్పందంపైన సంతకం చేసిన దారుణానికి ఒడిగట్టారు.

ఇటీవల రష్యన్ నగరం సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన జి20 సమావేశాల్లో మన ప్రధాని ఈ ఘనకార్యం చేసి వచ్చారు. దీని ఫలితంగా కేబినెట్ జాగ్రత్తగా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం గాలికి పోగా అమెరికన్ బహుళజాతి కంపెనీలు భారీ మొత్తంలో లాభాలు పిండుకోనున్నాయని ది హిందు తెలిపింది.

జి20 సమావేశాల్లో ప్రధాని అంగీకరించినట్లుగా భారత దేశం ‘మాంట్రియల్ ప్రోటోకాల్’ పైన సంతకం చేయాలనీ తద్వారా అమెరికా బహుళజాతి కంపెనీలకు భారత దేశంలో విస్తృత మార్కెట్ కల్పించాలని ‘వాతావరణ మార్పు’ అంశం గురించిన అమెరికా ప్రత్యేక రాయబారి టాడ్ స్టర్న్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాడు. భారత అధికారులతో టాడ్ జరిపిన సమావేశం తాలూకు మినిట్స్ తమ వద్ద ఉన్నాయని ది హిందూ పత్రిక తెలిపింది.

మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందం ప్రకారం ఓజోన్ పొర క్షీణించడానికి కారణం అయిన గ్రీన్ హౌస్ (కర్బన) వాయువుల విడుదలను క్రమంగా తగ్గించడానికి దేశాలు ప్రయత్నించాలి. అయితే ఇప్పటివరకూ భూగోళాన్ని చుట్టుముట్టిన గ్రీన్ హౌస్ వాయువుల విడుదలకు ప్రధాన కారణం పశ్చిమ దేశాల పారిశ్రామిక కార్యకలాపాలే. మూడో ప్రపంచ దేశాలు కాస్త పెట్టుబడులు సమకూర్చుకుని బొగ్గు, సహజవాయువు తదితర ఇంధనాలను వినియోగించుకునే దశకు వచ్చేసరికి ‘భూగోళం వేడెక్కుతోంది కాబట్టి రిఫ్రిజిరెంట్ వాయువులను విడుదల చేసే టెక్నాలజీ వాడకాన్ని నిలిపేయాల’ని పశ్చిమ దేశాలు మూడో ప్రపంచ దేశాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.

ఈ ఒత్తిడికి లొంగినట్లయితే ఇండియా లాంటి దేశాలు ఇప్పటివరకు తమకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వదులుకుని పశ్చిమ దేశాలు ప్రవేశపెట్టిన నూతన టెక్నాలజీ సరుకులను కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ అవి అత్యంత ఖరీదైనవి. ఒక్కో చోట 20 రెట్లు కూడా డబ్బు పెట్టాల్సిన పరిస్ధితి. అలాంటి వినాశకర ఒప్పందాలను ఇండియా, చైనా, మలేషియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ లాంటి దేశాలు గట్టిగా తిరస్కరిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ అరికట్టే నిమిత్తం జరుగుతున్న అంతర్జాతీయ చర్చల్లో పశ్చిమ దేశాలకు (ముఖ్యంగా అమెరికాకు) బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా-ఇండియా-చైనా దేశాల కూటమికి తీవ్ర వైరుధ్యాలు నడుస్తున్నాయి. ఈ వైరుధ్యాల వల్లనే గ్లోబల్ వార్మింగ్ చర్చలు ముందుకు సాగని పరిస్ధితి కొనసాగుతోంది.

ఈ నేపధ్యంలో మాంట్రియల్ ప్రోటోకాల్ అమలు చేయడానికి భారత దేశం ఇప్పుడే తొందర పడాల్సిన అవసరం లేదని కేంద్ర కేబినెట్ నిర్ణయం చేసింది. పర్యావరణ సంబంధిత అంతర్జాతీయ ఒప్పందాలకు కేంద్ర విదేశాంగ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు నోడల్ ఏజన్సీలు. అంటే ఈ శాఖలకు తెలియకుండా ప్రధాని కూడా అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలపై నిర్ణయాలు తీసుకోకూడదు. మరీ ముఖ్యంగా రిఫ్రిజినేషన్ వాయువుల విడుదలను నియంత్రించే ఒప్పందాల జోలికి వెళ్లకూడదని 2012లో కేబినేట్ నిర్ణయం తీసుకున్నాక ప్రధాన మంత్రి అయినా దానికి కట్టుబడి ఉండాలి.

కేంద్ర ప్రభుత్వానికి గుండెకాయ అయిన కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నాక ప్రధాని ఏమి చేయాలి? దేశ ప్రయోజనాలనే ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. జి20 సమావేశాలకు వెళ్ళిన ప్రధాని మన్మోహన్ ఒక పక్క సిరియాపై అమెరికా దాడి చేయడానికి వీలు లేదని బీరాలు పలుకుతూ మరో పక్క చడీచప్పుడు లేకుండా జి20 కమ్యూనిక్ లో భారత ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలకు అంగీకరిస్తూ సంతకం చేసేశారు. ఈ సంతకాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఓ.కే చేసేసింది. అది కూడా అంతర్జాతీయ పర్యావరణ (గ్రీన్ హౌస్, రిఫృజినేషన్ వాయువుల విడుదల మొ.వి) ఒప్పందాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజన్సీలయిన విదేశీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలకు చెప్పకుండా!

ఫలితంగా అమెరికా, ఇండియాపై ఒత్తిడి పెంచింది. రిఫ్రిజినేషన్ వాయువుల (ఫ్లోరో కార్బన్స్, క్లోరో ఫ్లోరో కార్బన్స్) విడుదలకు దోహదం చేసే టెక్నాలజీని ఇండియా నీళ్ళు వదులుకోవాలనీ, సదరు వాయువులను విడుదల చేయని ప్రత్యామ్నాయ అభివృద్ధి చెందిన టెక్నాలజీతో రూపొందిన సరుకులనే వినియోగించాలనీ అమెరికా ప్రత్యేక రాయబారి టాడ్ ఇండియాపై ఒత్తిడి తెస్తున్నాడు. జి20 కమ్యూనిక్ ను ఇండియా అంగీకరిస్తునట్లుగా సంతకం చేశారనీ, రిఫ్రిజినేషన్ వాయువుల విడుదలను నిరుత్సాహపరిచడానికి, ఆపేయడానికి ఈ కమ్యూనిక్ ద్వారా అంగీకరించాయని, దానిని అమలు చేయడం వెంటనే ప్రారంభించాలని టాడ్ ఒత్తిడి చేసినట్లుగా సదరు సమావేశం మినిట్స్ సంపాదించిన ది హిందూ తెలిపింది.

జి20 కమ్యూనిక్ పై ప్రధాని సంతకం చేయడం అంటే నిజానికి గ్లోబల్ వార్మింగ్ కు సంబంధించి అంతర్జాతీయ వేదికలపై ఇండియా-సౌత్ ఆఫ్రికా-బ్రెజిల్-చైనాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ నివేదికకు బద్ధ విరుద్ధంగా పోవడమే. పశ్చిమ దేశాలను గ్లోబల్ వార్మింగ్ కు బాధ్యులను చేసే ‘క్యోటో ప్రోటోకాల్’ ను ఆమోదించడానికి అమెరికా ససేమిరా ఒప్పుకోలేదు. ఎంతో ఖర్చు పెట్టి నిర్వహించిన అంతర్జాతీయ సభలను వృధా పోవడానికైనా ఒప్పుకుంది గానీ క్యోటో ప్రోటోకాల్ ను మాత్రం ఒప్పుకునేది లేదు పొమ్మంది. ఐరోపా దేశాలు ఒప్పుకున్నా అమెరికా ఒప్పుకోలేదు. ఈ ప్రోటోకాల్ ప్రకారం గ్లోబల్ వార్మింగ్ ను నిరోధించే ఖర్చు బాధ్యత ప్రధానంగా అమెరికా, ఐరోపాలు తీసుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ కు ఇప్పటివరకూ ప్రధాన కారణం ఆ దేశాలే కనుక అదే న్యాయం. కానీ ప్రపంచానికి ఏది న్యాయమో అమెరికాకు అది అన్యాయం!

ఇంత చేసిన అమెరికా తన పధకాన్ని దొడ్డి దారిన అమలు చేయడానికి పూనుకుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇండియా చమురు ఖర్చు తడిసి మోపెడయింది. దిగుమతుల ఖర్చు పెరిగి, డాలర్ల నిల్వలు నిండుకుని, రూపాయి విలువ కూడా తీవ్రంగా పడిపోతున్న పరిస్ధితిని దేశం చూస్తూనే ఉంది. సిరియా యుద్ధం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా గత రెండు మూడు రోజులుగా తన స్వరాన్ని తగ్గించింది. సిరియా వద్ద ఉన్న రసాయన ఆయుధాలను అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలోకి తేవడానికి సిరియా ప్రభుత్వం అంగీకరించింది కనుక యుద్ధం బదులు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ఒబామా ప్రకటించాడు. దానితో మళ్ళీ రూపాయి విలువ కొద్దిగా కోలుకుంటోంది.

సిరియా దాడి భారత ప్రయోజనాలకు తీవ్ర విరుద్ధమైనది. మధ్యప్రాచ్యంలో నివశిస్తున్న 60 లక్షల భారతీయులు పంపే విదేశీ ద్రవ్యం ఇండియాకు చాలా అవసరం. అలాగే ఇరాన్ చమురు కూడా అవసరమే. ఇలాంటి విపత్కర పరిస్ధితిలో ఉన్న భారత్ ని ఇరుకున పెట్టి మాంట్రియల్ ప్రోటోకాల్ నిబంధనలను జి20 కమ్యూనిక్ లో చేర్చి ప్రధాని చేత బలవంతపు సంతకం చేయించారని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అనగా ‘నువ్వు మాంట్రియల్ ప్రోటోకాల్ అమలు మొదలు పెడితే నేను సిరియా యుద్ధ నగార మోతను తగ్గిస్తా (పూర్తిగా ఆపేస్తా అని కాదు)’ అని అమెరికా బేరం పెట్టి ఉండొచ్చని వారి అంచనా. ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ ప్రధాని ఆమోదం మాత్రం ఖచ్చితంగా భారత ప్రజలకు వ్యతిరేకం. అసలది ఆయన సారధ్యంలోని కేబినెట్ నిర్ణయానికే వ్యతిరేకం. ఇక దేశానికి వ్యతిరేకం ఎందుకు కాకుండా పోతుంది?

రిఫ్రిజిరేషన్ టెక్నాలజీకి ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఇప్పుడు అమెరికాకి చెందిన బహుళజాతి కంపెనీల వద్దనే ఉంది. ఈ టెక్నాలజీ పేటెంట్ హక్కులు ఆ కంపెనీలవే. ప్రధాని సంతకం మేరకు అమెరికా-ఇండియాల మధ్య ఈ వాణిజ్య చర్చలు పూర్తయితే ఇక అమెరికా కంపెనీలకు పండగే పండగ! అందుకే టాడ్ ఎంతగా ఒత్తిడి చేశాడంటే ఇది ఒబామా ప్రభుత్వంలో అత్యున్నత స్ధాయిలో పరిశీలిస్తున్న వ్యవహారం అని భారత అధికారులకు స్పష్టం చేశాడు. మన్మోహన్ త్వరలో అమెరికా సందర్శించనున్నందున ఆ లోపు నిర్ణయం జరిగిపోవాలని ఆయన చెప్పినట్లు పత్రిక తెలిపింది. ఏ నిర్ణయమూ తీసుకోనట్లయితే అధ్యక్ష్యుడు ఒబామాయే నేరుగా ప్రధాని మన్మోహన్ తో మాట్లాడాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒబామాకు ఇది రాజకీయ ప్రాధామ్యం ఉన్న నిర్ణయం అనీ, అమెరికా ప్రభుత్వానికే కాక ఒబామాకు వ్యక్తిగతంగా కూడా ఇది ప్రాధామ్యం ఉన్న వ్యవహారం అనీ ఆయన హెచ్చరించినట్లు పత్రిక తెలిపింది. అంటే ఒబామా రాజకీయ ప్రాధామ్యానికి భారత ఆర్ధిక వ్యవస్ధ కట్టుబడి ఉండాలన్నమాట!

రిఫ్రిజిరేషన్ వాయువుల క్రమానుగత నిర్మూలన (phase out) కూ, ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి అంగీకరిస్తే అది భారత రక్షణ వ్యవస్ధకు కూడా తీవ్ర ప్రమాదం అని విదేశీ, పర్యావరణ శాఖలు గతంలో హెచ్చరించాయి. అంటే భారత రక్షణ రంగంలోని ప్రధాన ఆయుధాలు రిఫృజిరేషన్ వాయువులను విడుదల చేసే టెక్నాలజీ పైనే ఆధారపడి ఉన్నాయని అర్ధం. సబ్ మెరైన్లు, యుద్ధ విమానాలు మొదలైన యుద్ధ పరికరాలు రిఫృజీరెంట్ వాయువులపైనే ఆధారపడి ఉన్నాయి మరి! అదీ కాక జి20 కమ్యూనిక్ కు ఆమోదం ఇవ్వడం అంటే ఐరాస వేదికపై ఇండియాలాంటి దేశాల ఒత్తిడితో రూపొందిన ‘యు.ఎన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ ఒప్పందాన్ని బలహీనపరచడమే.

భారత ప్రధాని మన్మోహన్ ఇంతకీ ఏ దేశానికి ప్రధాన మంత్రి?

2 thoughts on “కేబినెట్ నిర్ణయం దేశానికి, ప్రధాని సంతకం అమెరికాకి

  1. పైన పోస్ట్ చేసిన వీడియో మొత్తం తిలకించలేని వారు ఈ చిన్న వీడియోస్ చూడచ్చు


    ఈ విషయాలని చెప్పిన రాజీవ్ దిక్షిత్ గారు 1000 కి పైగా MNC పై లీగల్ గా పోరాడుతున్నారు , అతన్ని2010 november న కొన్ని దుష్ట శక్తులు చంపేసాయి. రాజీవ్ దిక్షిత్ గారు scientist , iit lo m.tech, france lo communications lo phd పొందారు , apj abdul kalam తో co scientist గా పని చేసారు. బంగారు బావిష్యట్టుని వదిలేసి, పెళ్లి కుడా చేసుకోకుండా దేశం కోసం స్వభిమన్ ట్రస్ట్ ను స్తాపించారు , దేశం నలు మూలలా తిరిగి భారతీయ సంస్కృతీ సబ్యత / జాతీయ సమైక్యత / mnc మరియు దాన్ని తండ్రి అయిన america విష సర్పాల గురించి/ ఆయుర్వేదం మొదలైన వాటి గురించి ప్రసంగించి యంతో మందిని motivate చేసిన గొప్ప నాయకుడు. 12 వ తరగతి వరకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం లోనే విద్యనబ్యాసించిన రాజీవ్ మహా మేదావి, ఫండమెంటల్ ఫోర్సు మీద ఆతను చేసిన రీసెర్చ్ ని కొనడానికి ప్రయత్నించిన జర్మనీ , వారితో చేతులు కలపాల్సిన్డిగా ఆదేశించిన సిగ్గులేని భారత ప్రబుత్వాన్ని కాతరు చెయ్యకుండా దేశ సేవకే పరిమితమైనా త్యాగాసిలి. రాజీవ్ ఇక మనకి లేరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s