అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్


?????????????????????????

అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసోపేతమైన అడుగు వేసినట్లే కనిపిస్తోంది. అంతర్ధానం అవుతున్న అమెరికా ప్రాభవం స్ధానంలో రష్యాను ప్రవేశపెట్టడానికి లేదా రష్యాకు వీలయినంత చోటు దక్కించడానికి పుతిన్ ఏ అవకాశాన్ని వదులుకోదలచలేదని ఆయన మాటలు చెబుతున్నాయి. పెద్దగా పటాటోపం లేకుండా, వాగాడంబరం జోలికి పోకుండా నిశ్శబ్దంగానే అయినా స్ధిరంగా ఆయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు పశ్చిమ సామ్రాజ్యవాదులకు బహుశా చెమటలు పట్టిస్తుండవచ్చు. సిరియాపై అమెరికా ఏకపక్షంగా దాడి చేస్తే తాము తప్పనిసరిగా సిరియాకు సహాయం చేస్తామని జి20 సమావేశాల సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ఈ కోవలోనిదే.

రష్యా రాజధాని మాస్కోలో గురు, శుక్రవారాల్లో జి20 సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సిరియాకు యుద్ధరంగంలో సహాయం చేస్తామని మొదటిసారి ప్రకటించాడు. సిరియా దాడిని భారత ప్రధాని మన్మోహన్ దృఢంగా వ్యతిరేకిస్తూ జారీ చేసిన ప్రకటనను తాము పరిగణనలోకి తీసుకున్నామని పుతిన్ చెప్పడం విశేషం. ఒంటరిగానైనా సరే, సిరియాపై దాడి చేసి తీరతామని అమెరికా ప్రకటిస్తున్నా గానీ ఇన్నాళ్లూ పుతిన్ సంయమనం పాటిస్తూ వచ్చాడు. పత్రికలు ప్రశ్నించినప్పుడల్లా అమెరికా దాడి చేస్తే అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అనీ, అది దురాక్రమణ దాడి అవుతుందనీ చెప్పాడే తప్ప ‘అమెరికా దాడిని ప్రతిఘటించడానికి సిరియాకు సహాయం చేస్తాం’ అని మాత్రం చెప్పలేదు. పత్రికలు గుచ్చి ప్రశ్నించినా ‘ఇది దురదృష్టకరం, విచారకరం’ అని మాత్రం చెప్పి ఊరుకున్నారు.

కానీ జి20 సమావేశాల సందర్భంగా ఆయన స్వరం మారింది. మరిన్ని దేశాలు అమెరికా దాడిని వ్యతిరేకిస్తూ ముందుకు రావడం బహుశా రష్యాకు అదనపు మద్దతును స్ధైర్యాన్ని సమకూర్చి ఉండవచ్చు. అమెరికా దాడి చేసిన పక్షంలో సిరియాకు మద్దతు ఇవ్వడం రష్యా కొనసాగిస్తుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఆయన “మేము సిరియాకు సహాయం చేస్తామా? తప్పకుండా చేస్తాం. మేము ఇప్పటికే సహాయం చేస్తున్నాం. మేము ఆయుధాలు సరఫరా చేస్తున్నాం, ఇంకా ఆర్ధిక రంగంలోనూ సరఫరా చేస్తున్నాం. మానవతా రంగంలోనూ, పౌరులకు పునరావాస సహాయం అందజేయడంతో సహా, మా సహకారం విస్తరించాలని భావిస్తున్నాం. ఆ దేశంలో దీనమైన పరిస్ధితిలోకి జారిపోయే పౌరులకు మేము సాయం చేస్తాం” అని పుతిన్ స్పష్టం చేశాడు.

సిరియా దాడి విషయమై జి20 దేశాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశం అయిన మెజారిటీ ప్రపంచ నాయకులు ఏక పక్షదాడిని స్పష్టంగా వ్యతిరేకించారని పుతిన్ తెలిపాడు. “మిలట్రీ దాడికి ఎవరు అనుకూలంగా ఉన్నారో నేను చెప్పగలను. అమెరికా, టర్కీ, కెనడా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్ లు మద్దతు ఇస్తున్నాయి. బ్రిటిష్ ప్రధాని ఇస్తున్న మద్దతుకు ఆ దేశ పౌరుల అంగీకారం లేదు. దాడికి స్పష్టంగా వ్యతిరేకత ప్రకటించిన దేశాలు: రష్యా, చైనా, ఇండియా, ఇండోనేషియా, అర్జెంటీనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇటలీ దేశాలు” అని పుతిన్ చెప్పాడని ది హిందు తెలిపింది.

అమెరికా ఏకపక్ష దాడికి వ్యతిరేకంగా భారత ప్రధాని మన్మోహన్ నుండి అనూహ్యరీతిలో దృఢంగా ఎదురయిన మద్దతును తాము గుర్తించామని పుతిన్ ప్రత్యేకంగా తెలిపాడు. అమెరికా ఒత్తిడికి తల ఒగ్గడంలో ముందు వరసలో ఉండే ప్రధాని మన్మోహన్ జి20 సమావేశాలకు బయలుదేరుతూ ఐరాస పరిధికి ఆవల సిరియాపై దాడి చేయడం వలన ఫలితం ఉండదని, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ప్రకటించాడు. సిరియా విషయంలో ఏ చర్య తీసుకున్నా అది ఐరాస పరిధిలోనే జరగాలని జి20 సమావేశాల్లో సైతం ప్రధాని ప్రకటించాడు. ఈ ప్రకటన ‘అనూహ్యం’గా పుతిన్ అభివర్ణించిన తీరు, భారత్ పట్ల ఇతర దేశాల అవగాహన ఎలాంటిదో పట్టి ఇస్తోంది.

చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ కూడా జి20 సమావేశాల్లో సిరియాపై మిలట్రీ దాడిని వ్యతిరేకించాడు. “సిరియా సంక్షోభం నుండి కేవలం రాజకీయ పరిష్కారం ద్వారానే బైటపడగలం. మిలట్రీ దాడి సమస్య మూలాలను పరిష్కరించడం దుస్సాధ్యం’ అని ఆయాన ప్రకటించాడు. “చర్య తీసుకోవడానికి ముందు నిర్దిష్ట దేశాలు మరోసారి ఆలోచిస్తాయని మేము భావిస్తున్నాం” అని ఆయన తెలిపాడు. వాస్తవానికి సిరియా సమస్య జి20 సమావేశాల అధికారిక ఎజెండాలో లేనప్పటికి జి20 నాయకులు గురువారం సాయంత్రం అంతా ఆ అంశంపైనే చర్చలు జరిపారు. డిన్నర్ వద్ద మొదలయిన సిరియా చర్చలు రాత్రి బాగా పొద్దు పోయేవరకూ కొనసాగాయని పుతిన్ తెలిపాడు.

జి20 సమావేశాల సందర్భంగా అమెరికా, రష్యాలు ద్వైపాక్షిక చర్చలు జరపాలని మొదట అనుకున్నారు. కానీ సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ ల మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా రాజకీయ ఆశ్రయం ఇచ్చిన నేపధ్యంలో ఈ సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బారక్ ఒబామా ప్రకటించాడు. అయినప్పటికీ ఒబామా, పుతిన్ లు 20 నిమిషాల సేపు ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో ఇరువురు పరస్పర అంగీకారానికి రావడంలో విఫలం అయ్యారని పత్రిక తెలిపింది.

“నేను చెప్పింది ఆయన అంగీకరించడు. ఆయన చెప్పినదానితో నేను ఏకీభవించను. కానీ మేమిద్దరం ఒకరు చెప్పింది మరొకరం విన్నాము” అని తమ ద్వైపాక్షిక చర్చల గురించి పుతిన్ తెలిపాడు. “ఇరు దేశాల విదేశీ మంత్రులు నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ, ఈ బాధాకరమైన విషయాన్ని చర్చించాలని అనుకున్నాం” అని పుతిన్ తెలిపాడు.

సిరియాలో జరిగిన రసాయన దాడి సిరియా ప్రభుత్వం చేసింది కాదని పుతిన్ మరోసారి నొక్కి చెప్పాడు. పశ్చిమ దేశాల మద్దతు సంపాదించే ఉద్దేశ్యంతో ఈ దాడిని తిరుగుబాటు బలగాలు కావాలని చేశారని ఆయన స్పష్టం చేశాడు. ప్రపంచ దేశాలాను ‘రెచ్చగొట్టడానికి” వారు ఈ దురాగతానికి పాల్పడ్డారని ఆయన తెలిపాడు. విదేశీ ఏ జోక్యం ఏదైనా సరే ఐరాస ద్వారానే జరగాలనీ లేనట్లయితే అది దురాక్రమణ దాడి అవుతుందని మరోసారి హెచ్చరించాడు.

‘ఒంటరిగానైనా సిరియాపై దాడి చేసి తీరతామని’ బారక్ ఒబామా కూడా జి20 సమావేశాల సందర్భంగా మళ్ళీ ప్రకటించాడు. తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ మరిన్ని దేశాలు తమకు మద్దతు ఇస్తున్నాయని చెప్పుకున్నాడు. అయితే ఫ్రాన్సు తప్ప దాడిలో ఇంకే దేశమైనా పాల్గొంటున్నదా అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. “అంతర్జాతీయ సూత్రాలు పాటించాలనడంలో అనేక దాసాలు మాకు మద్దతు ఇస్తున్నాయన్నది స్పష్టమే” అని ఆయన చెప్పుకున్నాడు. ఐరాస పరిధిలోనే జరగాలని అనేక దేశాలు కోరుతున్న సంగతి విస్మరించి వారి ప్రకటనల్లోని కొద్ది భాగాన్ని తమకు అనుకూలమైన అర్ధాన్ని చెప్పుకుని ఒబామా సంతృప్తి పడుతున్నాడు. ఇతరులు కూడా అదే నమ్మాలని ఆయన ఆశిస్తున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాలు ఏమన్నా పాఠాలు నేర్పితే గనక అది “అమెరికా మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం” అనే.

2 thoughts on “అమెరికా దాడి చేస్తే సిరియాకు సాయం చేస్తాం -పుతిన్

  1. ఈ అమరికా ఎన్ని సమస్యల్లో ఉన్నా తన సమ్రాజ్యవాద అహంకారాన్ని వదలట్లేదు. ఆ యురోప్ దేశాలన్నీ వ్యతిరేకిస్తే దారి లో పడుతుందేమో. మన దేసం స్వాతంత్ర్యాన్ని కొల్పోయిందేమో అన్నట్లు ఉంది.

  2. అమెరికా జీవ రసాయన ఆ యుదాలను 1940 నుండి వాడుతుంది .అమెరికా ,కెనడా,బ్రితన్ సమ్యుక్తంగా కరేబియన్ సముద్రంలొబాక్టీరియా స్ప్రే చేశాయి లక్షలాది జలచరాశులు మరనించాయి. కొరియా మీదా వెదజల్లింది దీనివల్ల లక్షలాది మంది ప్లెగు ,ఆంత్రాక్స్ , మెదడు వాపు వ్యాది వగైరా రొగాలు ప్రభలి జనం మనించారు.1967-69 లొ ఏజెంట్ ఆరెంజ్ ను 23,607 ఎకరాల కొరియా పంట పొలాలమీద స్ప్రె చేసింది. 1960 లొ వియాత్నాం అల్క్షలాది పంటపొలాలమీద నాశనం చేసే రసాయనాలు వెదజల్లింది 20 లక్షలు ప్రజలు రొగాల పాలయ్యారు సుమారు 5 లక్షలమంది జన్యులొపాలతొ జన్మించారు.
    అమెరికన్ సైనికాధికారులు జీవ రసాయన వాడకంలొ అనేక విదేశీ నిపుణులకు శిక్షిణనిచ్చారు. ఈజిప్ట్ ,ఇజ్రాయల్ ఇరాక్, జొర్డాన్, లెబనాన్, సౌదీఅరేబియా, యుగొస్లొవియా దక్షణవియాత్నాం,మొదలైన 36 దేశాలకు చెందిన 550 మంది అలబామాలొని ఆర్మీ స్కుల్ లొ శిక్షణ పొందారు. ఈజిప్ట్ సైనికులు 1967లొ యొవెన్లొ ప్రయొగించారు సుమారు 150 మంది మరణించారు. తన సొంత దేశంలొ కుడా ప్రయొగించి చుశారు ప్లొరిడాలొ 1955లొ కొరింతదగ్గు ఎలా సౄష్టించాలొ బాక్టీరియాతొ ప్రయొగించి చూశారు సుమారు 1000 పైగా పౌరులు దగ్గుతొ బాదపడ్డారు. ఇలాంటి ఉదాహరణలు వేలకు వేలు ఇవ్వవచ్చు. అమెరికా విదేశాంగ శాఖలొ పనిచేసిన విలియం బ్లం అమెరికా అనేక దేశాలలొ తనమాట వినే తొత్తులను ఎలాలొంగతీసి నియమించిందొ తన స్వప్రయొజనాలకు వాడుకుంటుందొ చెప్పాడు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s