సిరియా: 2 రోజులు కాదు, ఉధృత దాడికే సెనేట్ కమిటీ ఆమోదం


Senate committee meet on Syria 2

శాంతి కపోతం ఇప్పుడు ఇనప రెక్కల్ని తొడిగిన డేగగా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతిని బారక్ ఒబామాకు ఇచ్చినందుకు నోబెల్ కమిటీ సిగ్గుపడుతున్నదో లేదో గానీ సర్ ఆల్ఫ్రెడ్ నోబెల్ మాత్రం ఖచ్చితంగా మరోసారి చనిపోయి ఉంటాడు. మొదట రెండు రోజుల పరిమిత దాడి అని చెప్పిన ఒబామా ఆ తర్వాత సెనేట్ కమిటీలో చర్చకు పెట్టకుముందే 60 రోజుల సైనిక జోక్యానికి అనుమతి కోరుతూ తీర్మానం తయారు చేశాడు. అవసరం అయితే ఇంకో 30 రోజుల పాటు దాడిని పొడిగించవచ్చని కూడా చేర్చాడు. ఇప్పుడేమో సిరియాలో బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏది అవసరం అయితే అది చేయడానికి వీలుగా తయారయిన బిల్లు సెనేట్ కమిటీలో ఆమోదం పొందింది.

మొదట ఒకటి చెప్పి ఆ తర్వాత క్రమేణా స్వరం పెంచుకుంటూ పోవడం పశ్చిమ రాజ్యాలు సర్వ సాధారణంగా అమలు చేసే వ్యూహం. మొదట బషర్ అస్సాద్ తమ సొంత ప్రజలపైనే రసాయన ఆయుధాలు ప్రయోగించాడన్నారు. సాక్ష్యాలు చూపమంటే అవి రహస్యం అన్నారు. బషర్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం ఏమీ తనకు లేదనీ, కాకపోతే తమ ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించినందుకు అతన్ని శిక్షించే బాధ్యత అమెరికాపై ఉన్నదనీ ఒబామా తనకు తానే బాధ్యతను దఖలుపరుచుకున్నాడు.

తీరా ఇప్పుడు సెనేట్ కమిటీ తీర్మానం ఏమి చెబుతోందంటే ‘సిరియాలో బలాబలాలను పూర్తిగా మారిపోవడానికి ఎంత అవసరమైతే అంతా చేయాలని.’ ప్రస్తుతం సిరియా అంతర్యుద్ధంలో పశ్చిమ రాజ్యాలు ప్రవేశపెట్టిన తిరుగుబాటుదారులపైన ప్రభుత్వానిదే పైచేయిగా ఉంది. ఈ పరిస్ధితి మారి సిరియా ప్రభుత్వం పైన తిరుగుబాటుదారులదే పైచేయి అయ్యేవరకూ ఆ దేశంపై దాడి చేయాలని సెనేట్ తీర్మానం స్పష్టం చేస్తోంది. మరో పక్క బషర్ ప్రభుత్వాన్ని కూల్చడంలో తమకేమీ ఆసక్తి లేదని విదేశీ మంత్రి జాన్ కెర్రీ బొంకుతూనే ఉన్నాడు.

మెక్ కెయిన్ సవరణ

బుధవారం సెనేట్ కమిటీలో జరిగిన ఓటింగులో ఒబామా తీర్మానం 10-7 తేడాతో నెగ్గిందని రష్యా టుడే తెలిపింది. ఒక సభ్యుడు ఓటు వేయలేదట. అంటే ఆ స్ధాయిలో కొద్దిగా ఆలోచించే వ్యక్తి ఒకరున్నారని ఆశించవచ్చో లేదో తెలియదు. మంగళవారం విదేశీ మంత్రి జాన్ కెర్రీ, రక్షణ మంత్రి చక్ హేగెల్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్టిన్ డింప్సే ల నుండి వివరాలు రాబట్టిన కమిటీ సంతృప్తి చెంది ఒబామా దాడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పరిమిత దాడి ద్వారా బషర్ అస్సాద్ భవిష్యత్తులో మరోసారి రసాయన దాడి చేయకుండా నివారిస్తుందని, అమెరికా సైనికులు సిరియా భూభాగంపై అడుగు పెట్టారని కాబట్టి ప్రతిపాదనను ఆమోదించాలని ఒబామా ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధిపతులు కాంగ్రెస్, సెనేట్ లకు కొద్ది రోజులుగా విన్నపాల మీద విన్నపాలు చేస్తున్నారు.

జాన్ మెక్ కెయిన్

జాన్ మెక్ కెయిన్

అయితే యుద్ధ పిపాసిగా ప్రసిద్ధుడైన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జాన్ మెక్ కెయిన్ ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి మొదట నిరాకరించాడు. ఆయన నిరాకరణకు కారణం యుద్ధం అంటే ఇష్టం లేకపోవడం కాదు. ఆయన అభ్యంతరం అల్లా ‘పరిమిత దాడి’ అని చెప్పడం పైనే. చెప్పడం పరిమిత దాడి అని చెప్పినా రెండు నెలల దాడికి ఒబామా తీర్మానం అనుమతి కోరింది. అవసరం అయితే మరో నెల దాడిని పొడిగించాలని కోరింది.

ఈ 90 రోజుల దాడి కూడా మెక్ కెయిన్ కి రుచించలేదు. ఆయన ఉద్దేశ్యంలో అమెరికా చేయాల్సింది పరిమితదాడి కాదు. పూర్తిగా చెయ్యాలి. బషర్ కూల్చివేత అనే లక్ష్యం నెరవేరేదాకా చెయ్యాలి. కానీ బషర్ కూల్చివేత మా లక్ష్యం కాదు రసాయన దాడి చేయకుండా కట్టడి చేయడమే తమ ఆసక్తి అని ప్రభుత్వం జాల పాడుతోంది కదా! కాబట్టి మెక్ కెయిన్ డిమాండు + ప్రభుత్వ జోలపాట రెండూ నెరవేరేలా తీర్మానాన్ని రూపొందించారు. ‘యుద్ధరంగంలో బలాబలాలను రివర్స్ చేయడానికి, అనగా అస్సాద్ పురోగతిని నివారించి ఆల్-ఖైదా తిరుగుబాటుదారుల పురోగతి సాధించేవరకూ ఏ చర్య అవసరం అయితే ఆ చర్య చేపట్టాలని’ ప్రభుత్వం కోరుతున్నట్లుగా తీర్మానంలో మార్పులు చేశారు. దీనికి మెక్ కెయిన్ నిండు హృదయంతో మద్దతు ప్రకటించడం, సెనేట్ కమిటీ ఆమోదించడం జరిగిపోయింది.

కాబట్టి అమెరికా చేయబోయేది పరిమిత దాడి కాదు. పూర్తి స్ధాయి దాడి. మధ్య ప్రాచ్యంలో మరో స్వతంత్ర రాజ్యాన్ని, అది కూడా అరబ్ దేశాల్లోని ముస్లిం మతోన్మాద రాచరికాలకు ఎదురొడ్డి, మతదురహంకార శక్తులకు స్ధానం లేకుండా చేసిన ఒక సెక్యులర్ రాజ్యాన్ని అమెరికా సర్వనాశనం చేయబోతోంది. ఈ క్రమంలో పత్రికల్లో అనేక అబద్ధాలు వరదలా పారబోతున్నాయి. ఆ అబద్ధాలను భారత పత్రికలు కూడా నెత్తికి ఎత్తుకోవడం మామూలుగా జరిగిపోతుంది.

యుద్ధం బహిరంగం, సాక్ష్యం రహస్యం?

బషర్ ని శిక్షించాలని బహిరంగంగా ప్రపంచానికి ఒకపక్క చెబుతూ మరోపక్క దానికి అవసరమైన సాక్ష్యాలు రహస్యం ఎలా అవుతాయి? అసలు రహస్యం ఏమిటంటే సాక్ష్యాలేవీ అమెరికా వద్ద అసలు లేకపోవడమే. పైగా ఉన్న సాక్ష్యం అల్లా ఆ రసాయన ఆయుధాల్ని సౌదీ అరేబియా ద్వారా సరఫరా చేసింది అమెరికానే అని నిరూపిస్తుంది. తిరుగుబాటు దారులకు రసాయన ఆయుధాలను జాగ్రత్తగా నిర్వహించడంలో (‘ప్రయోగించడంలో’ అని చదువుకోవాలి) శిక్షణ ఇచ్చింది సి.ఐ.ఎ కాంట్రాక్టర్లే అని అమెరికా పత్రికలే గత సంవత్సరం తెలిపాయి. సిరియా ప్రభుత్వాన్ని కూల్చివేశాక అక్కడి రసాయన ఆయుధాల్ని తిరుగుబాటుదారులే కాపాడాలి కాబట్టి వారికి శిక్షణ ఇవ్వాల్సి వచ్చిందని కూడా సదరు పత్రికలు నిస్సిగ్గుగా సమర్ధించుకున్నాయి. కాబట్టి రసాయన దాడి ప్రయోగంలో మొట్టమొదటి బాధ్యత అమెరికాదే! 

తమ ప్రజల్ని నమ్మించడం కోసం, యుద్ధోన్మాదాన్ని వారికి నూరిపోయడం కోసం పచ్చి అబద్ధాల్ని ఎన్నిసార్లయినా వల్లించే సిగ్గుమాలినతనం పశ్చిమ పాలకుల సొంతం.  మరీ విచిత్రంగా ఆ జనం సైకాలజీ ఏమిటో గానీ, సార్వభౌమ రాజ్యాల్ని కబళించడానికి ఉరుకుతున్న తమ పాలకుల్ని నిరోధించడం మాని ప్రోత్సహించేవారికి కొదవ లేకపోవడం! ఇరాక్ లో సద్దాం హుస్సేన్ వద్ద సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని చెప్పింది అబద్ధమని ఆ తర్వాత జార్జి బుష్ స్వయంగా అంగీకరించాడు. అప్పటి విదేశీ మంత్రి కొలిన్ పావెల్ ఐరాస వేదిక పైన ప్రపంచ దేశాల ప్రతినిధుల సాక్షిగా చెప్పిన పచ్చి అబద్ధం పునాదిగా పశ్చిమ దేశాలన్నీ కట్టగట్టుకుని వెళ్ళి ఇరాక్ పై దాడి చేశాయి. అయిదారేళ్లు యుద్ధం చేసి ఒక్క సామూహిక విధ్వంసక మారణాయుధాన్ని కూడా   వాళ్ళు చూపలేకపోయారు. దాడికి ముందు ఐరాస నియమించిన పరిశీలకులు ఇరాక్ అంతా జల్లెడ పట్టి మరీ ‘విధ్వంసక ఆయుధాలు లేవు’ అని తేల్చినా ‘కాదు, కాదు, ఇవిగో సాక్ష్యాలు’ అంటూ అమెరికా సొంతగా బూటకపు సాక్ష్యాలు సృష్టించి ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికన్లను నమ్మించింది.

సరే, అయిపోయింది. ఇరాక్ పైన దాడి ఆ దేశాన్ని చేసి సర్వనాశనం చేశారు. ఇరాక్ ప్రజలు తమ మానాన తాము సాధారణంగా, గౌరవంగా బతకడానికి వీలు లేకుండా ఉండడానికి వీలైనంత విధ్వంసం అంతా సాగించారు. తర్వాత ‘నిజం కాదు. మేము చెప్పింది అబద్ధమే’ అని అధ్యక్షుడే చెప్పుకున్నాడు. ఆఫ్ఘనిస్ధాన్ నీ అలాగే నాశనం చేస్తున్నారు. లిబియాని కూడా అవే అబద్ధాలతో నాశనం చేశారు. అధ్యక్షుడు గడ్డాఫీ తన ప్రజల్ని పెద్ద ఎత్తున ‘చంపబోతున్నాడని’ ఒక్కుమ్మడిగా ప్రచారానికి లంకించుకుని మరీ సర్వ విధ్వంసం కావించారు. గడాఫీ చనిపోయాక తేలిన లెక్కల్లో అసలు లిబియా జనం చనిపోయింది అమెరికా నేతృత్వంలోని నాటో యుద్ధ విమానాల దాడిలోనే తప్ప మరేవిధంగానూ కాదని తేలిపోయింది. ఇన్ని జరిగినా అమెరికన్లు పాఠాలు నేర్చుకోరా? తమ పాలకులు, కంపెనీలు, వారి పత్రికలు చెప్పే అబద్ధాల్ని ఎన్నిసార్లు నమ్ముతారు?

రష్యా హ్యాపీ?

సిరియాపై దాడిని గట్టిగా వ్యతిరేకిస్తున్న దేశం ఏదన్నా ఉందంటే అది మొదట రష్యానే. అమెరికా ఏకపక్షంగా దాడి చేస్తే అది అంతర్జాతీయ చట్టాలకు బద్ధ విరుద్ధం అని రష్యా మొదటి నుండి చెబుతోంది. ఆ తర్వాత స్ధానం చైనాది. ఇరాన్ ని లొంగదీయడానికే సిరియాపై దాడిని రచిస్తున్నారు గనక ఇరాన్ వ్యతిరేకతను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత ప్రధాని మాత్రం అత్యంత బలహీన స్వరంతో ‘దాడి ఎవరికీ మంచిది కాదు’ అని చెబుతున్నారు తప్పితే గట్టిగా వ్యతిరేకించే ధైర్యం లేదు. త్వరలో జరగనున్న జి20 సమావేశాల్లోనైనా ఇండియా లాంటి దేశాలు గట్టి ప్రతిఘటన ఇస్తాయన్న ఆశలు కనిపించడం లేదు.

ఇదంతా ఒక ఎత్తయితే రష్యాకు సంతోష కారకం కూడా ఒకటుంది. సిరియాపై దాడి సిరియా వరకే పరిమితం కాబోదు. అది పూర్తిస్ధాయి ప్రాంతీయ యుద్ధంగా మారడానికి ఎంతోకాలం పట్టదు. రష్యా తానుగా యుద్ధంలో అడుగుపెట్టనని చెబుతోంది. కానీ సిరియా ప్రభుత్వానికి అవసరమైన ఆయుధాలను రష్యా సరఫరా చేయడం ఖాయం. ఆ విధంగా రష్యా ఆయుధాల అమ్మకం పెరుగుతుంది. దానితో పాటు సిరియా యుద్ధంలో అమెరికా కూరుకుపోవడమూ ఖాయమే. పరిమిత దాడి అని నిజంగానే అనుకున్నా అది ముందుకు సాగే కొద్దీ సానుకూల ఫలితం వచ్చేవరకూ ఆపలేని పరిస్ధితిని అమెరికా ఎదుర్కొంటుంది. అంటే ‘పులి మీద స్వారీ’ అన్నమాట! దిగితే పులి నోట కరుచుకుంటుంది. పోనీ స్వారీ కొనసాగిద్దామా అంటే దిగకుండా ఎన్నాళ్లని చేయగలం? అటు యుద్ధం కొనసాగించేకొద్దీ ఆర్ధిక పతనాన్ని చవిచూస్తూ, అలాగని యుద్ధం కొనసాగకుండా ఆపలేని తప్పనిసరి పరువు సమస్యను ఎదుర్కొంటూ అమెరికా ఆఫ్ఘన్ యుద్ధం లాగే సిరియా దురాక్రమణ దాడిలో కూరుకుపోతుంది. ఇది రష్యా, చైనాలకు నిస్సందేహంగా సంతోషం!

బలయ్యేది మాత్రం ప్రధానంగా సిరియా ప్రజలు. ఆ తర్వాత ప్రపంచ ప్రజలు పెరిగిన చమురు ధరల రూపంలో, అందువల్ల పెరిగే సమస్త సరుకుల ధరల రూపంలో మరింత భారం మోయబోతున్నారు. అందుకే సిరియా దాడి ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలపైనా జరగనున్న దాడి!

2 thoughts on “సిరియా: 2 రోజులు కాదు, ఉధృత దాడికే సెనేట్ కమిటీ ఆమోదం

 1. @మరీ విచిత్రంగా ఆ జనం సైకాలజీ ఏమిటో గానీ, సార్వభౌమ రాజ్యాల్ని కబళించడానికి ఉరుకుతున్న తమ పాలకుల్ని నిరోధించడం మాని ప్రోత్సహించేవారికి కొదవ లేకపోవడం!@
  అవతలవాడు చస్తే గాని తాము బ్రతక లేమనే మాస్‌ సైకాలజి!
  “అల్లగే జరగాలేమో”! అను కొనే మనుషుల బుద్దిహీనత

  బలవంతమైన సర్పం చలిచీమలతో చేరి చావదే సుమతీ!
  అని సుమతి శతక కారుడు చెప్పుకున్నాడు. మరి ఆయనకు చలిచీమలు గెలవాలని వాంచేమో!
  ఈ చలిఛిమల్ని ఒకటి చేసేదెవరు? చేరినా చేరనిచ్చేదెవరు?
  మనం కూడా సుమతీ శ్తక కారుడిలాగా ఆశావాదాన్ని గెలిపిద్దామా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s