నేను కాదు మోడి ప్రభుత్వం జైల్లో ఉండాలి -డి.ఐ.జి వంజార


గుజరాత్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ప్రసిద్ధి చెందిన మాజీ డి.ఐ.జి వంజార తన ఐ.పి.ఎస్ పదవికి రాజీనామా చేశాడు. హోమ్ శాఖ కార్యదర్శికి రాసిన రాజీనామా లేఖలో ఆయన మోడి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడి నమ్మిన బంటు అమిత్ షాను ఉతికి ఆరేశాడు. వరుసగా అనేక బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడినందుకు గాను మరో 36 మంది పోలీసు అధికారులతో పాటు ఏడేళ్లుగా విచారణ ఖైదీగా జైలులో ఉన్న వంజార తాను చేసింది బూటకపు ఎన్ కౌంటర్లు కాదని చెప్పుకొచ్చాడు.

అమిత్ షా గుప్పిట్లో ఉన్న నరేంద్ర మోడి తమకు (పోలీసు అధికారులకు) పడిన బాకీ చెల్లించడంలో అలసత్వం చూపుతున్నాడని ఆరోపించాడు. ఢిల్లీ ప్రయాణంలో ఉన్న మోడి, అమిత్ షాను వదిలించుకోకపోతే నేరుగా సమాధులకే చేరాల్సి ఉంటుందని హెచ్చరించాడు. గుజరాత్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా రూపొందించిన విధానంలో భాగంగానే తాను, తన అధికారులు ఎన్ కౌంటర్లు చేశామని, జైలులో ఉండాల్సి వస్తే గుజరాత్ ప్రభుత్వం ఉండాలి తప్ప తాము కాదని తేల్చి చెప్పాడు.

డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డి.జి.వంజార నాలుగు బూటకపు ఎన్ కౌంటర్ కేసుల్లో నిందితుడు. మోడిని హత్య చేయడానికి పధకం పన్నారంటూ వంజార నేతృత్వంలోని పోలీసు అధికారులు వరుస ఎన్ కౌంటర్లకు పాల్పడ్డారు. గోధ్రా రైలు దహనం అనంతరం గుజరాత్ లో ఏర్పడిన ముస్లిం వ్యతిరేక ఉన్మాదంలో తేలియాడుతూ మోడి మూడుసార్లు వరుసగా ఎన్నికల్లో నెగ్గితే, అదే ఉన్మాదం వంజార లాంటి పోలీసు అధికారులకు వరుస ప్రమోషన్లు తెచ్చి పెట్టింది.

మోడి ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా రూపొందించిన ‘టెర్రరిస్టు వ్యతిరేక’ విధానం కింద తమ విధుల్లో భాగంగానే తాము ఎన్ కౌంటర్లకు పాల్పడ్డామని డి.జి.వంజార చేస్తున్న వాదన కాకతాళీయం ఏమీ కాదు. మోడి ప్రభుత్వం తమ సహచర రాజకీయ నాయకులను కాపాడుకుంటూ వారి ఆదేశాలను అమలు చేసిన పోలీసు అధికారులను మాత్రం బలిపశువులను చేసిందని వంజార చేసిన ఆరోపణకు బి.జె.పి గానీ, నరేంద్ర మోడి గానీ, తిట్టిపోతకు గురయిన అమిత్ షా గానీ ఇంకా స్పందించినట్లు లేదు.

నాలుగు ఎన్ కౌంటర్ కేసుల్లో ప్రధాన నిందితుడయిన డి.జి.వంజార ఏప్రిల్ 2007లో షొరాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులో మొదట అరెస్టయ్యాడు. అప్పటి నుండి ఆయన ముంబై జైల్లో ఉన్నాడు. అనంతరం జులై 2010లో తులసీరాం ప్రజాపతి ఎన్ కౌంటర్ కేసులోనూ ఆయనపై నేరారోపణ నమోదు చేశారు. ఇష్రాత్ జహాన్ ఎన్ కౌంటర్, సిద్దికి జమాల్ హత్య కేసుల్లో కూడా ఆయన ప్రధాన నిందితుడుగా కోర్టు గుర్తించింది. ఈ ఎన్ కౌంటర్లు బూటకం అని గుజరాత్ హై కోర్టు మొదట గుర్తించగా అనంతరం సుప్రీం కోర్టు కేసులను సి.బి.ఐ కి అప్పగించింది. సి.బి.ఐ విచారణను సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తోంది.

“వివిధ బూటకపు ఎన్ కౌంటర్లకు నేను, నా అధికారులు బాధ్యులుగా గుజరాత్ సి.ఐ.డి/కేంద్ర ప్రభుత్వ సి.బి.ఐ గుర్తించి మమ్మల్ని అరెస్టు చేశారు. అదే నిజం అయితే, షొరాబుద్దీన్, తులసీరాం, సాదిక్ జమాల్, ఇష్రాత్ జహాన్ ఎన్ కౌంటర్ కేసులను విచారిస్తున్న సి.బి.ఐ అధికారులు ఈ విధాన రూపకర్తలను కూడా అరెస్టు చెయ్యాలి. ఎందుకంటే మేము ఫీల్డ్ ఆఫీసర్లం మాత్రమే. ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యపూర్వక విధానాన్ని మాత్రమే మేము అమలు చేశాము. మా చర్యలన్నింటినీ గుజరాత్ ప్రభుత్వమే అత్యంత సమీపం నుండి ప్రోత్సహించింది, మార్గదర్శకత్వం వహించింది, పర్యవేక్షించింది. ఈ దృష్ట్యా, ఈ ప్రభుత్వం ఉండాల్సింది గాంధీ నగర్ కాదనీ, నవీ ముంబై లోని తలోజా సెంట్రల్ జైలులోనో లేదా అహ్మదాబాద్ లోని సబర్మతి సెంట్రల్ జైలు లోనో అది ఉండాలనీ నేను దృఢంగా అభిప్రాయపడుతున్నాను.”

ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇంత కంటే సిగ్గుపోయే వ్యాఖ్యలు ఉండబోవు. ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్నే జైలు లో ఉండాల్సిన ప్రభుత్వంగా, ఆ ప్రభుత్వంలోనే సుదీర్ఘ కాలం సేవలు అందించిన అత్యున్నత పోలీసు అధికారి అభివర్ణించడం బహుశా సో కాల్డ్ స్వతంత్ర భారత చరిత్రలోనే ప్రధమం కావచ్చు. గుజరాత్ ని అభివృద్ధి చేయడం ముగిసింది, ఇక తదుపరి లక్ష్యం దేశమే అంటూ ఢిల్లీ పీఠానికి ప్రయాణం కట్టిన నరేంద్ర మోడీకి సైతం ఇంతకంటే మించిన గొప్ప సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? నరేంద్ర మోడీకి కుడి భుజంగా పని చేసిన అమిత్ షా పైన వంజార చేసిన దాడి మామూలుది కాదు.

మోడి బాసిజంలో గుజరాత్ హో మంత్రిగా అధికారం చెలాయించడమే కాక ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సారధిగా కూడా మోడి చేత అమిత్ షా నియమితుడు కావడం గమనార్హం. ఢిల్లీ పీఠం దక్కాలంటే అత్యధిక పార్లమెంటు స్ధానాలున్న ఉత్తర ప్రదేశ్ ను మొదట చేజిక్కించుకోవాలన్న సూత్రం ఎరిగినదే. ఈ సూత్రం నేపధ్యంలో తన ఢిల్లీ ప్రయాణం కోసం అమిత్ షా పైన మోడి ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి అమిత్ షా ముట్టడిలో ఉన్నందుకు మోడి పట్ల వంజార జాలి ప్రకటించాడు. షొరాబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో డి.జి.వంజారకు అమిత్ షా సహ నిందితుడు కూడాను. ఆ కేసులో అరెస్టయిన అమిత్ షా కొద్ది నెలల క్రితం బెయిలుపై విడుదల అయ్యాడు.

తాను “ఇంత సుదీర్ఘ కాలం పాటు దయాపూర్వక మౌనం వహించానంటే కారణం” అది కేవలం నరేంద్ర మోడి పట్ల తనకు ఉన్న “గొప్ప నమ్మకం, అత్యున్నత గౌరవం” వల్లనే అని వంజార తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. మోడిని తాను “దేవుడితో సమానంగా” ఆరాధించేవాడిననీ, అయితే “అమిత్ షా యొక్క అపాయకర గుప్పిట్లో ఉన్న ఈ దేవుడు అవసరం వచ్చినపుడు ఆదుకోలేదు. ఆయన (మోడి) కళ్ళు, చెవుల్ని ఆక్రమించుకున్న అమిత్ షా ఆయన్ని తప్పుదారి పట్టించడంలోనూ, మేకలను కుక్కలుగానూ, కుక్కల్ని మేకలుగానూ నమ్మించడంలోనూ గత 12 యేళ్లుగా విజయవంతం అవుతున్నాడు.” అని అమిత్ షా పైన తీవ్ర స్ధాయిలో దాడి చేశాడు డి.జి.వంజార.

“రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన అపవిత్ర పట్టు ఎంత పూర్తి స్ధాయిలో ఉన్నదంటే గుజరాత్ ప్రభుత్వాన్ని ఆయన దాదాపు తన ప్రాక్సీ ద్వారా నడుపుతున్నట్లే. తత్ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ఈ ప్రభుత్వం యొక్క నేరపూర్వక నిర్లక్షం ఒక వైపూ, జైలు పాలయిన 32 మంది పోలీసు అధికారుల పట్ల అమిత్ భాయ్ షా పాల్పడుతున్న కృత్యాలు, అకృత్యాలు మరొకవైపూ ఎంత వికారంగా ఉన్నాయంటే అవి ఈ ప్రభుత్వాన్ని త్వరలోనైనా, ఆ తర్వాతైనా సమాధులవైపుకి తీసుకెళ్ళడం ఖాయం” అని డి.జి.వంజార తేల్చేశాడు.

డి.జి.వంజార మోడిని సైతం వదల్లేదు. “గౌరవనీయులయిన గుజరాత్ ముఖ్యమంత్రి తాను ఋణపడి ఉన్నాననీ, భారత మాతకు తాను చెల్లించాల్సిన రుణం ఉన్నదనీ ఈ మధ్య తరచుగా చెబుతున్నారు. అది నిజమే. నిజానికి ప్రతి పౌరుడు నిర్వర్తించవలసిన పవిత్ర కర్తవ్యం అది. కానీ ఆయనకు ఒక విషయం గుర్తు చేయడం అసందర్భం కాబోదు. ఢిల్లీ వైపుగా కవాతు చేసే తొందరలో ఉన్న ఆయన జైలుపాలయిన పోలీసు అధికారులకు చెల్లించాల్సిన ఋణం సంగతి మాత్రం మర్చిపోరాదు” అంటూ ప్రధాని అయిన తర్వాత మోడి ఏమి చేయాలో మాజీ పోలీసు అధికారి ముందే హెచ్చరించాడు. లేకపోతే ఏమవుతుందో బహుశా మోడి-వంజార ల మధ్య దాగిన రహస్యం కావచ్చు!

నరేంద్ర మోడి ప్రధాని అయితే ఎవరు జైలు లోపల ఉంటారో, ఎవరు జైలు బయట ఉంటారో డి.జి.వంజార పరోక్షంగా చెబుతున్నట్లు భావించాలా?

4 thoughts on “నేను కాదు మోడి ప్రభుత్వం జైల్లో ఉండాలి -డి.ఐ.జి వంజార

  1. విశేఖర్ గారూ,
    వంజర 2007 లోనే అరెస్ట్ ఐనా, 2012 వరకు అతను అహ్మదాబాద్ జైల్లోనే ఉండేవాడు. ఆ జైల్లో ఉన్నన్నాల్లూ వారానికి మూడు రోజులు హ్యాపీగా ఇంట్లోనే గడిపేవాడని , మోడీకి తలవంచని మరో అధికారి శ్రీకుమార్ చెప్పారు. 2012 లో ఈ కేసుని, దానితో పాటు ఇతన్నీ ముంబై కి తరలించారు. అప్పటినుండే మన వాడికి నిజమైన జైలు జీవితం ప్రారంభమైంది. ఒక్క సంవత్సరం తిరిగే సరికల్లా ఇలా బరస్ట్ అయ్యాడు. పోను పోను మోడీ కి ఇంకా ఎలా మూడిందో చూడాలి..
    మరో ముఖ్య విషయం ఏంటంటే, ఉన్నత విద్యావంతులు అనుకునే వారు చాలా మంది నకిలీ ఎంకౌంటర్లను సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. టెర్రరిస్టులని చంపినందుకు వారిని అభినందించక ఈ ఎంక్వైరీలు ఎందుకు అని నంగ నాచి మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు జైల్లో ఉన్న సాధ్వి ప్రగ్నాసింగ్, అసిమానందలను కూడా, విచారనలేం లేకుండా ఇలాగే ఎంకౌంటర్ చేస్తే, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా అంటే వీరి నోర్లు మూతలు పడ్తాయి.

  2. ఇదేదొ దొంగల మధ్య వాటాల పంపకంలో తేడా వచ్చి బయట పడ్డట్టు ఉంది. ఒక్క గుజరాత్ లోనే కాదు. A.P, తో సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఎంకౌంటర్లు ఉనాయి.కోర్ట్లు అన్నిటి మీదా విచారణ జరపాలి. మోడీ కి మాత్రం అత్యధిక ప్రచారం లభిస్తోంది. ఇది చివరికి మొడి కి హిందు అనుకూల వాది గా మరింత పేరు తెచ్చి అతనికే మంచి చేస్తుంది. కాంగ్రెస్స్ వాదులు మాత్రం సిక్కు ఊచకొతల గురుంచి ఇంత ప్రచారం బయటకి రానీయరు. .

  3. చీకటి గారు వంజార జైలు భోగం విషయంలో మీరు చెప్పింది నిజం కావచ్చు. ఈ వార్తను కవర్ చేసిన పత్రికలు ఈ విషయం టచ్ చేయలేదు. ది హిందూ మాత్రం ఆయన అప్పట్నుండి ముంబై జైల్లో ఉంటున్నట్లు రాసింది. బహుశా వారూ పొరపడి ఉండొచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s