ఇరాన్ చమురుతో రు.55 వేల కోట్లు ఆదా -మంత్రి


Iran oil tanker

అమెరికా ఒత్తిడితో ఇరాన్ చమురు దిగుమతులను భారీగా తగ్గించుకున్న ఇండియా తద్వారా చమురు బిల్లును భారీగా పెంచుకుంది. ఆ భారాన్ని ప్రజలపై మోపి నష్టాలంటూ జనం ముక్కు పిండి వసూలు చేసింది. ఈ నిజాన్ని చమురు మంత్రి మొయిలీ ద్వారా బైటికి వచ్చింది. రూపాయి విలువ పతనం వల్ల విదేశీ మారక ద్రవ్య (డాలర్) నిల్వలు భారీగా తరిగిపోతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటిని పొదుపు చేసుకోవడానికి చర్యలు చేపట్టింది. ఇరాన్ చమురు దిగుమతులకు డాలర్ల బదులు రూపాయిల్లో చెల్లించే వెసులుబాటును ఇరాన్, ఇండియాకు కల్పించింది. కాబట్టి ఇరాన్ నుండి దిగుమతులను ఎంతమేరకు పెంచుకుంటే ఇండియా విదేశీ ద్రవ్య నిల్వలు అంతగా పొదుపు చేయవచ్చని ప్రధానికి రాసిన లేఖలో మొయిలీ సూచించారు.

సెప్టెంబరు నెల నుండయినా ఇరాన్ నుండి చమురు దిగుమతులు పెంచుకున్నట్లయితే దాదాపు 8.5 బిలియన్ డాలర్ల (డాలర్ కి రు. 65 చొప్పున దాదాపు రు. 55,250 కోట్లకు సమానం) విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆదా అవుతాయని చమురు మంత్రి మొయిలీ, ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారని ది హిందు తెలిపింది. 2012-13 ఆర్ధిక సంవత్సరంలో ఇండియా చమురు దిగుమతుల కోసం 144.29 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోని మిగిలిన కాలంలో ఇరాన్ దిగుమతులను 11 మిలియన్ టన్నులకు పెంచినట్లయితే విదేశీ మారక ద్రవ్య నిల్వల ఖర్చు 8.47 బిలియన్ డాలర్ల మేర ఆదా అవుతుందని మొయిలీ తెలిపారు.

విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోతుండడంతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోతోంది. ఫలితంగా రూపాయి విలువ భారీగా పడిపోతుంది. ఈ నేపధ్యంలో ఆయిల్ దిగుమతుల బిల్లును తగ్గించుకోవాలనీ, కనీసం 25 బిలియన్ డాలర్లయినా చమురు దిగుమతుల్లో ఆదా చేయాలని ప్రధాని మన్మోహన్ చమురు శాఖను కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మొయిలీ నుండి ప్రధానికి లేఖ వెళ్లింది. ఆర్ధిక మంత్రి చిదంబరంకు కూడా ఇదే తరహాలో మొయిలీ లేఖ రాశారు.

“డాలర్ల నిల్వల ఆదా చేసుకోవడం కోసం కొన్ని నిర్దిష్ట చర్యలను నేను ఆలోచించాను. వాటి ద్వారా 19 నుండి 20 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుంది” అని మొయిలీ చిదంబరకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇరాన్ నుండి చమురు దిగుమతులను మళ్ళీ మొదలు పెట్టడం అందులో ముఖ్యమైన చర్య అని మొయిలీ తెలిపారు. అమెరికా, ఐరోపాల ఆంక్షల ఫలితంగా ఇరాన్ కు చెల్లింపులు చేసే అన్నీ మార్గాలూ మూసుకుపోయాయి. అమెరికా ఒత్తిడి మేరకు ఇరాన్ చమురు దిగుమతిని ఇండియా బాగా తగ్గించుకుంది. చెల్లింపుల మార్గాలు మూసివేయడంతో ఇరాన్ దిగుమతులు ఇంకా తగ్గిపోయాయి.

గత ఆర్ధిక సంవత్సరంలో ఇరాన్ నుండి 13.1 మిలియన్ టన్నుల చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. (2011-12లో ఇది 18.1 మిలియన్ టన్నులు) డాలర్ చెల్లింపుల మార్గాన్ని అమెరికా మూసివేయడంతో టర్కీ లోని హాల్క్ బ్యాంకు ద్వారా 55 శాతం చెల్లింపులను యూరోలలో చెల్లించడం జులై 2011 నుండి ఇండియా ప్రారంభించింది. మిగిలిన 45 శాతం చెల్లింపులను రూపాయిల్లో చెల్లించడానికి ఇరానియన్ ఆయిల్ కంపెనీలు అవకాశం ఇచ్చాయి. కోల్కతా లోని యూకో బ్యాంకులో ఖాతా ప్రారంభించిన ఇరాన్ చమురు కంపెనీలు తమకు చేయాల్సిన చెల్లింపులను అందులో జమ చేయాల్సిందిగా కోరాయి.

అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి యూరో మార్గం కూడా మూసుకుపోయింది. యూరోపియన్ యూనియన్ ఆంక్షల మేరకు టర్కీ మొఖం చాటేసింది. దానితో పూర్తి చెల్లింపులను రూపాయిల్లో చేసే అవకాశం ఇండియాకు కల్పించబడింది. అయినప్పటికీ అమెరికా ఒత్తిడికి లొంగిపోయి ఇరాన్ చమురు దిగుమతులను భారీగా తగ్గించుకుని ఇరాక్, సౌదీల దిగుమతులు పెంచుకుంది. తాజా నిర్ణయంతో ఇరాన్ దిగుమతులను పునఃప్రారంభించినట్లయితే అది భారత ఆర్ధిక వ్యవస్ధకు ఎంతో మేలు చేస్తుంది. రూపాయిల చెల్లింపుల వల్ల డాలర్ చెల్లింపులను భారత్ తగ్గించుకోవచ్చు. తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆదా అవుతాయి. అనగా కరెంటు ఖాతా లోటుపై భారం తగ్గుతుంది.

పైగా ఇరాన్ తో ఏర్పాటు వలన భారత్ ఎగుమతులు కూడా పెరిగే అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఇరాన్ కి వివిధ సరుకులు ఎగుమతి చేసే ఎగుమతిదారులకు కోల్ కతా బ్యాంకు నుండే చెల్లింపులు చేసేలా ఇరాన్ ఏర్పాట్లు చేసింది. ఇది ఒక విధంగా బార్టర్ పద్ధతి అని చెప్పవచ్చు. అనగా ఒక సరుకుకు బదులుగా మరొక సరుకు మార్చుకోవడం. ఇరాన్ కి కావలసిన సరుకులు ఇండియా సరఫరా చేస్తే ఇండియాకు కావలసిన చంరును ఇరాన్ సరఫరా చేస్తుంది. మధ్యలో రూపాయి పాత్ర కూడా నామమాత్రం అవుతుంది. ఇంతకంటే మించిన చౌకబేరం అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా అరుదుగా దొరుకుంది.

ఈ పని ఫిబ్రవరిలోనే చేసినట్లయితే రూపాయి విలువ ఇంత భారీగా తగ్గకపోను!

6 thoughts on “ఇరాన్ చమురుతో రు.55 వేల కోట్లు ఆదా -మంత్రి

 1. ప్రతి దేశం ఇలా సొంత కరన్సీ లొ చెల్లిస్తే డాలర్ అవసరం ఎముంటుంది?, డాలర్ డిమాండ్ తగ్గి డాలర్ విలువ పడిపోతుంది. అమెరికా సామ్రాజ్యం ప్రపంచ దేశాలను( మరియు వాణిజ్యాన్ని) కట్టడి చెసే ఒక సాధనం డాలర్. అలాంటిది అమెరికా తన చాప కిందకు నీరు రానిస్తుందా?దేశాలకు అలాంటి స్వేచ్చ ఇస్తే ఇక తన పెత్తనం ఎముంటుంది? ఒక దేశం పై ఆంక్షలు విధించి ఎలా లొంగదీసుకుంటుంది? చెల్లింపులకు డాలర్ తో పని లేకుండాపొతే సరళీకరణ విధనాల్ని, ఐ.ఎం.ఎఫ్ అప్పులను ఎలా సమర్ధించుకుంటారు?

  దాసోహం అంటూ అమెరికా(సామ్రజ్యవాద) ప్రయొజనాల్ని నెత్తిన పెట్టుకుంటున్న మన పాలకులకు భారత దేశ ప్రజల అవసరాలు ఎలా కనబడతాయి?పెద్దన్న కు కొపం తెప్పించె పనికి మన వాళ్లు పూనుకుంటారా? ఇరాన్ ఆయిల్ పైప్ లైన్ ఎప్పుడో వచ్చుండేది కాదా?
  చంద్రునిలో నిటి ఉనికిని తెలిపేఅంతటి పరిఙ్ఞానం కలిగిన దేశం సాధించింది కేవలం ‘ప్రపంచపు ఆయుధాల అతిపెద్ద దిగుమతిదారు ‘ బిరుదు మాత్రమే !! పాలకులు కేవలం తెర మీది బొమ్మలు. ఆట ఆడించేది సామ్రజ్యవాదులు.

  విశేఖర్ గారు సామ్రజ్యవాదం లొ డాలర్ పాత్ర పై ఒక విశ్లేషణ ఇస్తే బాగుంటుంది. కనీసం లింక్ ఐనా ఇవ్వగలరు. పై వ్యాఖ్య లో తప్పు ఉంటే తెలియజెయగలరు

 2. ” చంద్రునిలో నిటి ఉనికిని తెలిపేఅంతటి పరిఙ్ఞానం కలిగిన దేశం సాధించింది కేవలం ‘ప్రపంచపు ఆయుధాల అతిపెద్ద దిగుమతిదారు ‘ బిరుదు మాత్రమే !! పాలకులు కేవలం తెర మీది బొమ్మలు. ఆట ఆడించేది సామ్రజ్యవాదులు.”

  బ్రహ్మీ గారు. గ్రేట్ కామెంట్స్

 3. కాంగ్రెస్ అయినా BJP అయినా ఇవి పెట్టుబడిదారులకు, ప్రైవేట్ వ్యాపారుల కోసం పని చేసే పార్టీలే. కాంగ్రెస్ గతంలో ప్రజల కోసం పని చేస్తున్నట్టు కనీసం నటించేది. ఇప్పుడు జబర్దస్త్ గా పెట్టుబడి దారులకు, ముఖ్యం గా అమెరిక పెట్టుబడి దారులకు ఊడిగం చేసేదిగానే కనిపిస్తున్ది. అణు ఒప్పందం తరువాత అమెరికాకు జూనియర్ భాగస్వామి అయ్యిన్ది. అందుకే ఇరాన్ గ్యాస్ వదులుకున్నది. ఆవాసం లేకున్నా బొగ్గును దిగుమతి చెసుకుంటూ న్నది. విలస వస్తువులను అక్కడినుండి అవసరం లేకున్నా తెచ్చుకున్తున్నది. అమెరిక దెబ్బకు మన వ్యవసాయ రంగం ను నాశనం చెసిన్ది. వీళ్ళు ఆర్థిక శాస్త్ర వేత్తలు కాదు. అనార్తిక శాస్త్ర వేత్తలు. ప్రజల పోరాటాలే వీరిని తరిమి కొట్టగలవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s