(ఈ పోస్టుతో కొత్త వర్గం -కేటగిరీ- ‘ప్రశ్న-జవాబు’ ప్రారంభిస్తున్నాను. కొన్ని వారాల క్రితం చందుతులసి గారు ఇచ్చిన సలహాను ఈ విధంగా అమలు చేస్తున్నాను. మొట్టమొదటి ప్రశ్న మాత్రం తిరుపాలు గారిది. ఒక టపా కింద వ్యాఖ్యగా ఆయన అడిగిన ప్రశ్న ఇది. నేనిచ్చిన సమాధానాన్ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి ప్రచురిస్తున్నాను. ఈ కేటగిరీ కింద సమాధానం నేనే ఇవ్వాలన్న రూలు లేదు. సమాధానం తెలిసిన సందర్శకులు ఎవరైనా ఇవ్వవచ్చు. కానీ ప్రశ్న ఎక్కడ వేయాలి అన్న ప్రశ్నకు నా దగ్గర ఇంకా సమాధానం లేదు. ఈ విషయంలో ఆచరణాత్మక సూచనలు ఎవరైనా చేయగలిగితే వారికి ఆహ్వానం. -విశేఖర్)
ప్రశ్న:
లైసెజ్ పైర్ కు నూతన ఆర్ధిక విధానాలకు మౌలిక మైన తేడా ఏమిటీ? – (సామ్రాజ్యవాద యుగములో) అవి కేవలం రాజకీయ మార్పులేనా లేక మౌలిక ఆర్దిక విషయాల్లో కూడానా?
రెండో ప్రపంచయుద్ధ కాలంలో వచ్చిన “గ్రేట్ డిప్రెషన్”కూ, 2008లో వచ్చిన ప్రపంచ ఆర్దిక సంక్షోభానికి తేడా ఏమిటి?
సమాధానం:
లైసె ఫెయిర్ అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది దాదాపు లేకపోవడం. అంతా పెట్టుబడిదారీ కంపెనీల ఇష్టారాజ్యానికి వదిలివేయడం. కేవలం ఆస్తి హక్కులను (అది కూడా బడా ధనికుల ఆస్తి హక్కులు మాత్రమే అని చెప్పనవసరం లేదు) సంరక్షించడానికి తప్ప ప్రభుత్వం మిగిలినవన్నీ వదిలేయాలన్న అవగాన దానిలో ఇమిడి ఉంటుంది.
అయితే ఇది ఊహలకే పరిమితం. ఇటువంటి పరిస్ధితి ఆధునిక చరిత్రలో ఎక్కడా, ఏ దేశంలో లేదు. ఎందుకంటే అంతా కంపెనీలకి వదిలిపెడితే జనం దగ్గర్నుండి పన్నులు వసూలు చేసి కంపెనీలకు రిజర్వులుగా నిర్వహించే బాధ్యతను ఎవరు నిర్వహిస్తారు? సరిహద్దులు గీసుకుని పాలిస్తున్న సామ్రాజ్యవాదుల మధ్య రాజకీయ ఒప్పందాలు ఎవరు చేస్తారు?
జాతీయ ప్రభుత్వాలనేవి ఆయా జాతీయ (దేశీయ) ధనిక వర్గాల ఆర్ధిక ఆధిపత్యాన్ని పరిరక్షించే రాజకీయ విభాగాలు. అలాగే వివిధ జాతీయ (దేశీయ) గ్రూపుల మధ్య మార్కెట్ల పంపిణీని గ్యారంటీ చేసేందుకు సాధనాలు కూడా. ఉత్పత్తి పెరిగి ఈ సరిహద్దుల్లోపలి మార్కెట్లు సరిపోకపోవడం వల్ల అది వలసల కోసం దండయాత్రలకు, ఆ తర్వాత ఫైనాన్స్ పెట్టుబడి రూపంలోని సామ్రాజ్యవాదానికి దారి తీసింది. మళ్ళీ ఈ సామ్రాజ్యవాద గ్రూపుల మధ్య మార్కెట్ల పంపిణీలపై ఒప్పందాలు కుదర్చాలన్నా జాతీయ ప్రభుత్వాలు తప్పనిసరి అవసరం.
ప్రభుత్వాలు అవసరం అయితే దాని నిర్వహణకు సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు మరికొంత సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు ఇంకా సిబ్బంది కావాలి. ఇది చివరికి నాలుగోతరగతి ఉద్యోగుల దగ్గర ఆగుతుంది. అంటే ఈ నాలుగు లేదా ఐదు మెట్ల సిబ్బంది మొత్తం ఆ ప్రభుత్వాలను ఆధిపత్యంలో ఉంచుకునే ధనికవర్గాలకు సేవలు చేయడానికే అన్నమాట! దీన్నే బ్యూరోక్రసీ అంటున్నారు.
బ్యూరోక్రసీ ఉండగానే సరిపోదు. జనాన్ని అదుపులో ఉంచడానికి బలగం కావాలి. అది సాయుధమై ఉండాలి. వాళ్ళే పోలీసులు, పారా మిలట్రీ, సైన్యం. ఆ తర్వాత రాజకీయ నిర్వహణ కోసం చట్ట సభలు ఉండాలి. ఆయా ధనిక గ్రూపుల మధ్య తగాదా తీర్చే వ్యవస్ధ (కోర్టులు) ఉండాలి. కోర్టులు అందరి కోసం అనుకుంటారు గానీ వాస్తవానికి వాటి అసలు ఉద్దేశ్యం ధనిక పెత్తందార్ల తగాదాలు తీర్చి పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందాలు కుదర్చడమే. అలాగని పచ్చిగా చెప్పలేరు గనక ప్రజాస్వామ్యం పేరుతో అందరి తగువులూ తీర్చుతున్నట్లు నటిస్తారు. కానీ సరిగ్గా గమనిస్తే సామాన్యులకు న్యాయం ఎప్పుడూ అందుబాటులో ఉండదని చూస్తూనే ఉన్నాం. అలాగే పోలీసుల వద్ద కూడా సామాన్యుడికి అరుదుగా ప్రవేశం దొరుకుతుంది.
ఇవన్నీ, అనగా బ్యూరోక్రసీ, చట్ట సభలు, కోర్టులు, రక్షణ బలగాలు అన్నీ కలిసినదే రాజ్యం. పరిమిత అర్ధంలో దీన్ని ప్రభుత్వం అంటున్నాం. డబ్బు పెట్టుకోగలిగినవాడికే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే రాజ్యం అనేది డబ్బున్నవాడి కోసమే పని చేస్తుంది. సామాన్యులను పాలిస్తుంది. రాజుల కాలంలో “రాజ్యం వీరుల భోజ్యం” అన్నారు. ఇప్పుడు కూడా అదే నిజం. కాకపోతే వీరులకు అర్ధం ఇప్పుడు కత్తి తిప్పేవాడని కాకుండా నోటు తిప్పేవాడని చెప్పుకోవాలి. నోటు తిప్పేవాళ్లెవరు? ఇంకెవరు, ధనిక వర్గాలు. వారికి రకరకాల పేర్లు: భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు… ఇలా!
కాబట్టి లైసె ఫెయిర్ అనేది ఎన్నడూ ఆచరణలో లేదు. సాధ్యం కాదు కూడా. పెట్టుబడిదారుల ప్రయోజనాల రీత్యా కూడా అది సాధ్యం కాదు. సాధ్యం అయితే పెట్టుబడి గ్రూపుల మధ్య తగాదాలు పరిష్కారం చేసే రాజ్యాంగ యంత్రం బలహీనంగా ఉండి వారిని కూల్చివేసే శ్రామికవర్గ విప్లవాల పని సులువవుతుంది.
నూతన ఆర్ధిక విధానాలకూ లైసె ఫెయిర్ కూ తేడా ఇప్పటికే గ్రహించి ఉండాలి. రష్యా, చైనాలలో సోషలిస్టు రాజ్యాలు ఏర్పడిన ఫలితంగా మూడో ప్రపంచ దేశాలు ప్రభుత్వరంగాన్ని అభివృద్ధి చేసుకుని, సాపేక్షికంగా (అంటే గతంతో పోలిస్తే) శక్తివంతమైన రాజ్యాలుగా అవతరించాయి. సోషలిస్టు రాజ్యాలు ఉన్నంతవరకు వీరు సాపేక్షిక స్వతంత్రత అనుభవించారు. ఈ రాజ్యాల స్వంత ఉనికిని గౌరవిస్తున్నట్లు నటిస్తూనే అక్కడి వనరులను కొల్లగొట్టడం కోసం అక్కడి ప్రభుత్వ రంగాలను కూల్చివేసి వాటి స్ధానంలో తమ కంపెనీలను ప్రవేశపెట్టడానికి నూతన ఆర్ధిక విధానాలు ఉద్దేశించారు. మూడో ప్రపంచ దేశాల ప్రజలను మభ్య పుచ్చడానికి ‘నూతన ఆర్ధిక విధానాలు’ అని చెప్పారు. వాస్తవంలో ప్రజలకు కొద్దోగొప్పో ఉపయోగంలోకి వచ్చిన రాజ్య నిర్మాణాలను తమ మార్కెట్ల అవసరాలను తీర్చే సాధనాలుగా ఈ విధానాలు మార్చివేస్తున్నాయి. ఇందులో మూడో ప్రపంచ దేశాలలోని ధనిక వర్గాలకు వాటాలు పంపిణీ చేయడం ద్వారా తమ సామంతరాజులుగా (దళారీలుగా) ఉంచడం గమనించవచ్చు.
ఆ విధంగా చూసినపుడు నూతన ఆర్ధిక విధానాలు ప్రధానంగా మూడో ప్రపంచ దేశాల్లోని ఆర్ధిక రాజ్య నిర్మాణాలను మౌలికంగా మార్చే ఆర్ధిక విధానాలు. ఈ విధానాలను అమలు చేసేవే రాజకీయ విధానాలు. దేశంలో దళారీ పెట్టుబడిదారులను, వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులను పోషించిన ప్రభుత్వరంగం కూలిపోవడం అంటే ఇక దేశంలో దళారీల ఆర్ధిక పునాదిలో ఉండే సాపేక్ష్యిక సార్వభౌమత్వం క్రమంగా సామ్రాజ్యవాదులకు బదిలీ అవుతోంది. అయితే ఈ క్రమం అంత తేలికా కాదు, అంత స్వల్ప కాలంలో ముగిసేదీ కాదు. ఈ లోపు ప్రజలు చైతన్యవంతులవుతారు. దళారీ పాలకులు కూడా తమ ఉనికికోసం సామ్రాజ్యవాదులతో స్వల్పంగా ఘర్షణలు పడుతున్నారు. ఆ ఘర్షణ వాటా పెంచుకోవడానికే తప్ప స్వతంత్ర ఉనికి కోసం మాత్రం కాదు.
ఫుడ్ సెక్యూరిటీ ద్వారా సబ్సిడీ రేట్లకు ఆహార పదార్ధాలు సరఫరా చేయడం అంటే ప్రజల నుండి ఆహారం కోసం వచ్చే డిమాండును ప్రభుత్వమే సబ్సిడీ ధరలకు తీర్చడం. ఆ మేరకు ఆహార డిమాండు కంపెనీల ఆహార సరుకులకు పడిపోతుంది. ఆ విధంగా ఉత్పత్తి తగ్గించుకుని తద్వారా లాభాలు తగ్గించుకోవాల్సిన పరిస్ధితి బహుళజాతి వ్యవసాయ కంపెనీలకు, రెడీమెడ్ ఆహార కంపెనీలకు వస్తుంది. ఇది ఒకవైపేమో సామ్రాజ్యవాద దేశాల్లో జి.డి.పి ని తగ్గిస్తుంది. మరోవైపేమో బహుళజాతి కంపెనీల పెట్టుబడి రియలైజేషన్ తగ్గిపోతుంది. అంటే వారి పెట్టుబడి, లాభాలు సృష్టించే పెట్టుబడిగా రియలైజ్ కావడం తగ్గుతుంది. అనగా అటు పెట్టుబడి మార్కెట్ తో పాటు సరుకుల మార్కెట్ ని కూడా తగ్గించడమే. ఇదే పరిస్ధితి స్వదేశీ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. స్వదేశీ కంపెనీలేవీ పూర్తిగా స్వదేశీ కాదు. వాటిలో చాలాభాగం విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. అవి ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి ఫుడ్ బిల్లు అంటే వారందరికీ అంత విముఖత!
ఫుడ్ బిల్లు వాస్తవంలో ఏమవుతుందంటే ఒక కోణంలో దేశంలో అవినీతిని ఇంకా పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే అవినీతి అనేది కేవలం బడా కంపెనీల వరకే కాకుండా కింది దాకా పంపిణీ అవుతుంది. బ్లాక్ మార్కెటీర్లు సొమ్ము చేసుకుంటారు. మరో కొణంలో చూస్తే ప్రతి సబ్సిడీని డబ్బు రూపంలో ఇచ్చే పధకానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. దానిని ఆహార భద్రతకు కూడా వ్యాపింపజేస్తారు. అంటే ఆహార దినుసుల బదులు డబ్బు జమ చేస్తారు. ఆ డబ్బు ఆహారం కొనడానికి బదులు కొంత తాగుడుకి బదిలీ అయితే మరికొంత ఫైనాన్స్ పెట్టుబడిదారులకు వరంగా మారుతుంది. చిట్ ఫండ్స్ అనీ, ఇంకా ఇతర ద్రవ్య కంపెనీలు ఈ డబ్బు సేకరించి షేర్ మార్కెట్లకు తరలిస్తాయి. అది కాస్తా అంతిమంగా గ్లోబల్ ఫైనాన్స్ షార్క్ లకు చేరుతుంది. ఇదంతా మన కళ్లముందు జరిగేది కాదు. మనకి కనిపించేది ఐస్ బర్గ్ లాంటిదే.
ఇలా చెబుతున్నందున ఆహార భద్రత చట్టం అవసరం లేదన్న అర్ధం తీసుకోకూడదు. చట్టం అనేది ఉండడం వలన జనానికి ఒక హక్కు వస్తుంది. చట్టాన్ని అమలు చేయాలంటూ ఆందోళన చేసేందుకు ఒక సాధనం అందుతుంది. అనేక అవినీతి కూపాలను దాటుకుని కొంతయినా ప్రజలకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది.
2008 నాటి ఆర్ధిక సంక్షోభం తర్వాత ప్రపంచం ఎదుర్కొన్న ఆర్ధిక పతనాన్ని ‘గ్రేట్ రిసెషన్’ అంటున్నారు.
నిజానికి రిసెషన్ కీ, డిప్రెషన్ కీ ఉన్న తేడా పరిమాణంకు సంబంధించినది మాత్రమే. పత్రికలు చెప్పేదాని ప్రకారం ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధ అయినా వరుసగా రెండు త్రైమాసికాలు కుచించుకుపోతే, అనగా మైనస్ వృద్ధి నమోదు చేస్తే దానిని రిసెషన్ అంటారు.
కాని చాలామంది ఆర్ధిక వేత్తలు ఈ నిర్వచనాన్ని అంగీకరించరు. ఆర్ధిక వ్యవస్ధ పతనం ప్రారంభం నుండి అది మళ్ళీ తిరిగి లేవడం మొదలైన కాలం వరకూ మధ్య ఉన్న కాలాన్ని రిసెషన్ పీరియడ్ గా వారు నిర్ధారిస్తారు. ఈ పతనం కొద్ది కాలమే (6 నుండి 12 నెలల వరకు) ఉంటే దానిని రిసెషన్ గా చెబుతారు. అంటే స్వల్పకాలిక పతనాన్ని రిసెషన్ అనవచ్చు.
ఆర్ధిక పతనం సుదీర్ఘకాలం కొనసాగి జి.డి.పి 10 శాతం మించి పడిపోతే గనుక దానిని డిప్రెషన్ గా పిలుస్తారు. రిసెషన్ లోనూ, డిప్రెషన్ లోనూ జరిగేది ఒకటే. జి.డి.పి తగ్గిపోవడం, వేతనాలు తగ్గడం, నిరుద్యోగం పెరగడం, డిమాండ్ తగ్గిపోవడం, సామాజిక సంక్షోభం బద్దలవడం. రిసెషన్ లో ఇది స్వల్పకాలం ఉంటే డిప్రెషన్ లో దీర్ఘకాలం ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రిసెషన్ నాలుగు సంవత్సరాలు పైనే కొనసాగింది. కొద్ది సంవత్సరాలు వృద్ధి చెంది మళ్లీ రెండేళ్ల పాటు పతనం సంభవించింది. ఈ రెండు కాలాలను కలిపి ‘గ్రేట్ డిప్రెషన్’ గా పిలుస్తారు.
ఇప్పటి పరిస్ధితిని గ్రేట్ రిసెషన్ ఎందుకంటున్నారంటే జి.డి.పి పడిపోవడం అనేది ప్రధాన దేశాల్లో 0.5 శాతం నుండి 4 శాతం వరకే ఉంది. ఇది కూడా మధ్య మధ్యలో వృద్ధి నమోదు చేస్తూ మళ్ళీ కుచించుకుపోవడం జరుగుతోంది. అంటే సుదీర్ఘకాలం పాటు స్వల్ప స్ధాయిలో పతనం అవుతున్నందున ‘గ్రేట్ రిసెషన్’ గా పిలుస్తున్నారు. ఈ ‘గ్రేట్ రిసెషన్’ ఇంకా కొనసాగుతోంది. అందువల్లనే అమెరికా వృద్ధి శాతం అత్యంత తక్కువగా ఉండగా, ఋణ సంక్షోభంలో యూరో జోన్ దేశాలు కూరుకుని ఉన్నాయి. ప్రభుత్వాల అండతో కంపెనీలు తమ సంక్షోభాన్ని ప్రజల మీదికి బదలాయించి, కోతలు + రద్దుల ద్వారా ప్రజల ఆదాయాలను స్వాధీనం చేసుకుని తమ లాభాలుగా ప్రకటిస్తున్నాయి.
సమైక్యాంధ్ర ఉద్యమం చల్లారాలంటే కేంద్రప్రభుత్వం ఏమిచేయాలి?
జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తల సమాహారమైన http://teluguvartalu.com కి నేను వీరాభిమానిని అయిపోయాను అనే చెప్పాలి.
ఆంగ్లభాషలో అంత పట్టు లేకపోవటం చేత చాలా విషయ పరిజ్ఞానాన్ని పొందలేక పోతున్నాననే వెలితిని నా నుంచి దూరం చేసింది మీ ఈ న్యూస్ పోర్టల్.
నిజానికి మొన్న ఈ మధ్య స్నోడెన్ ఇష్యూ కాని,
జపాన్ అణుకర్మాగారం లో నెలకొన్న విషమ పరిస్థితులను గురించి కాని
సమగ్రమైన స్పష్టమైన వివరణాత్మక విశ్లేషణ వలన
విషయం ఉన్నది ఉన్నట్లుగా అర్థం అవుతున్నది.
నిన్నటికి నిన్న రూపాయి పతనానికి
లోకల్ మీడియా అంతా కూడా ఆహార భద్రత వల్ల రూపాయి క్షీనిచిందనే అసత్య ప్రచారం జరుపుతుంటే ”ది హిందూ” వారి ఆర్టికల్ ను యథాతధం గా తెలుగు భాషలోనికి తర్జుమా చేసి,
సిరియా పై అమెరికా యుద్ధ సన్నాహాలే మేజర్ గా ఇండియా మార్కెట్ నే కాక ఇతర మార్కెట్ లను కూడా ప్రభావితం చేసాయనే భావాన్ని బలపరుస్తూ నేడు మన ప్రధాని కూడా వ్యక్త పరచటం మనం గమనించ వచ్చు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ….
కేటగిరీ- ‘ప్రశ్న-జవాబు’ కి ”ఈ – మెయిల్” ద్వారా ప్రశ్నలు అడిగే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని,
అంతేకాక మరికొన్ని సూచనలను/ సలహాలను మీకు గోప్యంగా తెలియ పరచటానికి ఈ-మెయిల్ ద్వారా అయితే అందరికి అమోదయోగ్యమౌతుందని
నా అభిప్రాయాన్ని తెలుపుతూ
విశేఖర్ గారికి అభినందన పూర్వక కృతజ్ఞతలతో …
ఎందుకో? ఏమో? గారు, మీ సూచన బాగుంది. ఇంకా ఏమన్నా సూచనలు వస్తాయేమో చూస్తాను. రాకపోతే మీ సూచన పాటిస్తాను.
There are laissez-faire capitalists in Telugu blogosphere too. A blogger who claims himself fan of Jagan said that every thing except police stations and courts must be privatised.
విశేఖర్ గారూ. పాఠకుల కోసం మీరు పడుతున్న శ్రమ చాలా అభినందనీయం. మీ ఈ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.
hai sir, i am civil service aspirant. i would be write exams in telugu medium. frankly speaking this website is very useful to me. national issues and international issues are given in this portal is very laudable. indirectly it gives me thought building process. i am very happy to say that some of hindu articles are given same translation, which is very useful to overcome difficulty of english.
regards
Hemarao
Mr Enduko Emo, no media said that coal scam can lead to devaluation of rupee but they show more interest in criticising food security bill etc.