పశ్చిమ యుద్ధోన్మాదులకు లొంగేది లేదు -సిరియా


Bashar Al-Assad

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు యుద్ధ నగారాలు మోగిస్తుండగా సిరియా ప్రభుత్వం మాత్రం బెదిరేది లేదని స్పష్టం చేస్తోంది. కిరాయి తిరుగుబాటుదారులకు రసాయన ఆయుధాలు సరఫరా చేసి వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ ఇచ్చింది ఈ మూడు దేశాలేననీ సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ స్పష్టం చేశాడు. సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించడానికి శిక్షణ ఇచ్చిన దేశాలే తిరిగి తమపై ఆరోపణలు చేయడం పిచ్చివాడి ప్రేలాపనలను పోలి ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. సాక్ష్యాలు ఉంటే ఎందుకు బైటపెట్టరని రష్యా ప్రశ్నించింది.

కాగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు తలపెట్టిన మిలట్రీ దాడులకు పశ్చిమాసియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా 22 అరబ్ దేశాల కూటమి అరబ్ లీగ్ మిలట్రీ దాడులను గట్టిగా వ్యతిరేకించింది. ముస్లిం బ్రదర్ హుడ్ నేతృత్వంలోని ఈజిప్టు సిరియా తిరుగుబాటుకు మద్దతు ఇవ్వగా ఇప్పటి మిలట్రీ పాలకులు మాత్రం సిరియాపై దాడికి తమ మద్దతు లేదని స్పష్టం చేశారు. ఐరాస అనుమతి లేకుండా సిరియాపై దాడికి తెగబడడం సరైంది కాదని ఐరాస శాంతి ప్రతినిధి లఖ్దర్ బ్రహ్మీ కూడా సిరియా పై దాడి సమర్ధనీయం కాదని హెచ్చరించాడు. చివరికి నాటో ప్రతినిధిగా వ్యవహరించే ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ సైతం సిరియాలో ఐరాస నిపుణుల పరీక్షలు పూర్తయ్యేవరకూ ఆగాలని కోరాడు. అయితే ఐరాస పరిశీలకుల పరీక్షల ఫలితాలను పశ్చిమ దేశాలు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయడానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్నదని బషర్ ఆల్-అస్సాద్ అనుమానాలు వ్యక్తం చేశాడు.

తిరుగులేని సాక్ష్యాలట!

ఆగస్టు 21 తేదీన సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలోని ఆల్-ఘౌటా ప్రాంతంపైన సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలతో దాడి చేసిందనీ, ఈ దాడిలో 1300 మందికి పైగా ప్రజలు మరణించారని వార్తలు గుప్పుమనడంతో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లో హఠాత్తుగా యుద్ధ భాష మాట్లాడడం ప్రారంభించారు. దాడి పూర్వాపరాలేమిటో వెల్లడి అయ్యే లోపే దాడికి బాధ్యులు సిరియా ప్రభుత్వమేననీ, దానికి తిరుగులేని సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయనీ మూడు దేశాల ప్రభుత్వాధిపతులు ప్రకటించారు. అమాయక ప్రజలను చంపుతుంటే చూస్తూ ఊరుకునేది లేదనీ, తగిన ఫలితం అనుభవించాల్సిందేననీ, ఆ ఫలితం తామే రుచి చూపిస్తామని బారక్ ఒబామా, ఫ్రాంష ఒలాండే, జేమ్స్ కామెరాన్ లు ప్రకటించగా, ఆ మాటలను పశ్చిమ పత్రికలు విస్తృత ప్రచారంలో పెట్టాయి.

అంతర్జాతీయ వార్తలకు పశ్చిమ పత్రికలు తప్ప మరో దిక్కు లేకపోవడంతో భారత పత్రికలు, ప్రాంతీయ భాషల పత్రికలు ఛానెళ్లతో సహా ఆ వార్తలనే ప్రచారంలో పెట్టాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్, లిబియా దేశాలపై దురాక్రమణలకు తెగబడినప్పుడు పశ్చిమ దేశాలు చెప్పిన ఇలాంటి కబుర్లు అబద్ధాలని అంతా అయిపోయాక ఈ దేశాల అధిపతులే (జార్జి బుష్, టోనీ బ్లెయిర్, నికోలస్ సర్కోజీ) స్వయంగా చెప్పిన సంగతిని అప్పుడే మరిచిపోవడం బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు.

రసాయన ఆయుధాలు ప్రయోగించింది సిరియా ప్రభుత్వమే అనడానికి తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీయే ‘సాక్ష్యాలు ఐరాస పరిశీలకులకు దొరకకుండా ఉండడానికి వీలుగా వారిని సంఘటన స్ధలానికి త్వరగా తీసుకెళ్లకుండా సిరియా అధ్యక్షుడు ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేశాడని ఆరోపించాడు. తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని ప్రకటించే వ్యక్తి ఇంకా సిరియాలో ఐరాస పరిశీలకులకు దొరకబోయే సాక్ష్యాల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నట్లు? తమ వద్ద ఉన్న సాక్ష్యాలనే ఐరాస పరిశీలకులకు ఇచ్చి తిరుగులేకుండా నిజం నిరూపించవచ్చు కదా? ఈ విధంగా తమ వద్ద తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాల అధ్యక్షులు, ప్రధాని, విదేశీ మంత్రులు చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలేనని వారే స్వయంగా చాటుకున్నారు.

ఓటమి ఎదురు చూస్తోంది, రండి!

పశ్చిమ దేశాల అధిపతులు, వారి పత్రికలు చేస్తున్న దాడికి సిరియా అధ్యక్షుడు ధీటైన ప్రతి దాడి ఎక్కుపెట్టాడు. అమెరికా కోసం సిరియాలో ఓటమి ఎదురు చూస్తోందని, వియత్నాం మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం ఎదుర్కొన్న ఓటమే ఇప్పుడు సిరియాలోనూ సిద్ధంగా ఉన్నదని హెచ్చరించాడు. “వియత్నాం మొదలు ఇప్పటిదాకా అమెరికా సాగించిన యుద్ధాలకు మల్లేనే ఇక్కడా ఓటమి మాత్రమే ఎదురు చూస్తోంది. పశ్చిమ దేశాల ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నట్టివి” అని బషర్ అస్సాద్ రష్యా పత్రిక ఇజ్వెస్తీయాకు ఇంటర్వ్యూ ఇస్తూ స్పష్టం చేశాడు.

“రసాయన దాడి జరిగిన ప్రాంతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్నదని వారు (పశ్చిమ దేశాలు) చెబుతున్నాయి. వారిపైన సిరియా ఆర్మీ రసాయన దాడి చేసిందని చెబుతున్నారు. కానీ నిజం ఏమిటంటే ఆ ప్రాంతం సిరియా సైనికులు పొజిషన్లు తీసుకున్న ప్రాంతానికి ఆనుకునే ఉంది. అలాంటిది ఏ దేశం అయినా రసాయన ఆయుధాలు గానీ, లేదా ఇతర సామూహిక విధ్వంసక మారణాయుధాలు గానీ తన సొంత బలగాలు ఉన్న ప్రాంతం పైకే ఎలా ప్రయోగిస్తుంది? ఇది పిచ్చి ప్రేలాపన! ఈ ఆరోపణలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవి. టెర్రరిస్టులపై సిరియా బలగాలు విజయాలు సాగిస్తున్న నేపధ్యంలోనే ఇలాంటి ఆరోపణలు ప్రచారం చేస్తున్నారు” అని బషర్ అన్నాడు.

తిరుగుబాటుదారులు ‘ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్’ (తామే దాడి చేసి ఆ నెపాన్ని ప్రత్యర్ధిపైకి నెట్టడం) చేపట్టారని సిరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ తప్పును ప్రభుత్వ బలగాలపైకి నెట్టే దురుద్దేశంతోనే, పశ్చిమ దేశాలు సరఫరా చేసిన రసాయన ఆయుధాలను తామే ప్రయోగించి విస్తృతమైన పి.ఆర్ ప్రచారానికి లంకించుకున్నారనీ సిరియా తెలిపింది.

రష్యా, సిరియా ప్రభుత్వ వాదనకు పూర్తి మద్దతు ఇచ్చింది. రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ పశ్చిమ దేశాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి అలుపనేది ఎరగకుండా ఆయన శ్రమిస్తున్నాడు. పశ్చిమ దేశాలు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు లేవని ఆయన ఎత్తి చూపాడు. “వాషింగ్టన్, లండన్, ప్యారిస్ లలోని అధికారులు డమాస్కస్ లో జరిగిన రసాయన దాడికి సిరియా ప్రభుత్వమే బాధ్యురాలనేందుకు తమ వద్ద తప్పు పట్టలేని సాక్ష్యాలు ఉన్నాయని చెబుతారు. కానీ ఆ సాక్ష్యాన్ని ఇంతవరకూ వారు ఎవరికీ చూపలేదు. ఐనా ‘ఎర్ర గీత’ దాటారని అదే పనిగా చెబుతారు” అని సెర్గీ లావరోవ్ పశ్చిమ దేశాల ప్రచారాన్ని తీవ్రంగా ఎండగట్టాడు.

సిరియాపై పశ్చిమ దేశాల అధర్మ, దురాక్రమణ దాడిని తిరస్కరించడంలో రష్యాకు చేదోడు వాదోడుగా ఉన్న చైనా కూడా మరొకసారి పశ్చిమ దేశాల ప్రచారాన్ని, దాడి ప్రయత్నాలను తిరస్కరించింది. అంతర్జాతీయ స్ధాయి రాయబారులు త్వరపడి ఒక నిర్ణయానికి వచ్చేయడం తగదని చైనా హెచ్చరించింది. జెనీవా జరగడానికి ప్రతిపాదించిన శాంతి చర్చల ద్వారా రాజకీయ పరిష్కారం కనుగొనడమే సిరియా సమస్యకు ఉత్తమ పరిష్కారం అని చైనా పునరుద్ఘాటించింది. బషర్ ఆల్-అస్సాద్ కి వ్యతిరేకంగా పశ్చిమ దేశాలు ఐరాస భద్రతా సమితిలో ప్రతిపాదించిన తీర్మానాలను ఇప్పటివరకూ రెండు సార్లు చైనా, రష్యాలు వీటో చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు.

టర్కీ, కతార్, సౌదీ, ఇజ్రాయెల్

రష్యా పత్రిక ఇజ్వెస్తియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరియా అధ్యక్షుడు బషర్ పలు విషయాలు తెలిపాడు. “సిరియా ఘర్షణలు ప్రారంభం అయినప్పటి నుండి మొదటి రెండు సంవత్సరాల పాటు కతార్ నిధులు సమకూర్చగా టర్కీ రవాణా, శిక్షణ సదుపాయాలు కల్పించింది. టర్కీ, టెర్రరిస్టులకు తన భూభాగంలో శిక్షణ ఇచ్చి సరిహద్దుల గుండా సిరియాలో ప్రవేశపెట్టింది. కానీ ఇటీవల నిధులు సమకూర్చే కతార్ స్ధానాన్ని సౌదీ అరేబియా ఆక్రమించింది” అని అస్సాద్ తెలిపాడు.

సిరియాలో రక్తపాతం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు పొరుగునే ఉన్న ఇజ్రాయెల్ అన్ని రకాల సహకారం అందిస్తున్నదని అస్సాద్ తెలిపాడు. టెర్రరిస్టులను సరిహద్దులకు తరుముతు వెళ్ళినప్పుడల్లా సిరియా సైనికులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఆయన తెలిపాడు. “ఈ టెర్రరిస్టులకు సహకారం ఇస్తున్నట్లుగా ఇజ్రాయెల్ బహిరంగంగానే అంగీకరించింది. వారికి తమ ఆసుపత్రులలో వైద్య సదుపాయం అందజేస్తోంది.” అని తెలిపాడాయన.

సిరియాపై వైమానిక క్షిపణి దాడులు చేయడానికి ఐరాస భద్రతా సమితిలో ఆమోదం పొందడానికి తీర్మానాన్ని బ్రిటన్ తయారు చేస్తోందని ఆ దేశ ప్రధాని కామెరాన్ తెలిపాడు. ఐరాస అనుమతి లేకపోయినా సిరియాపై దాడి చేస్తామని బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ నిన్నటివరకు ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఈ ప్రకటనతో ప్రధాని కామెరూన్ విభేదించాడు. ఏ చర్య తీసుకున్నా ఐరాస అనుమతితోనే జరుగుతుందని ఆయన తెలిపాడు. అయితే రష్యా, చైనాలు మిలట్రీ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఐరాస వేదికపై మిలట్రీ దాడికి ఆమోదం వచ్చే సమస్య లేదు. పశ్చిమ దేశాలు ఏ కుట్రలు పన్నుతున్నాయో తెలియవలసి ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s