(రూపాయి పతనానికి కారణంగా ఆహార భద్రతా బిల్లును కొంతమంది మార్కెట్ పరిశీలకులు చెప్పడాన్ని తప్పు పడుతూ ది హిందూ పత్రిక గురువారం, ఆగస్టు 29, 2013 తేదీన ప్రచురించిన సంపాదకీయానికి ఇది యధాతధ అనువాదం. పత్రిక వెలువరించిన అత్యద్భుతమైన సంపాదకీయాల్లో ఇది ఒకటి అనడంలో నాకు ఎట్టి సందేహం లేదు. రూపాయి పతనంకు సంబంధించి మరికొన్ని అంశాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. -విశేఖర్)
గత కొన్ని నెలల్లో ఇండియా, ఇండోనేషియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, టర్కీ దేశాల కరెన్సీలు డాలర్ తో పోలిస్తే నాటకీయంగా పతనం అయ్యాయి. ఈ దేశాల స్ధానిక బలహీనతలు ఏమయినప్పటికీ మునుపెన్నడూ ఎరుగని రీతిలో సాగిన పతనం -13 శాతం నుండి 21 శాతం వరకూ ఈ పతనం నమోదయింది- ప్రధానంగా ప్రపంచ స్ధాయి కారణాల వల్లనే జరిగింది. పశ్చిమాసియాలో గత 48 గంటల్లో చేలెరేగిన ఉద్రిక్తతలు అప్పటికే కనీ వినీ ఎరుగని రీతిలో మారిన పరిస్ధితులు మరింత కఠినం అయ్యాయి. ఒబామా ప్రభుత్వం సిరియాపై బాంబులు కురిపించడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపధ్యంలో, బుధవారం, ఇతర వర్ధమాన దేశాల (Emerging Countries) కరెన్సీలకు మల్లేనే రూపాయి భారీ స్ధాయిలో పతనం అయింది.
మంగళవారం రూపాయి, సెన్సెక్స్ లు చవి చూసిన భారీ పతనానికి ఆహార భద్రతా చట్టం వల్ల పెరిగిపోయే కోశాగార లోటును కారణంగా అనేకమంది భారతీయ విశ్లేషకులు ఎత్తిచూపారు. వారు ప్రపంచ పరిస్ధితుల నేపధ్యాన్ని విస్మరించడం వల్ల అలాంటి విశ్లేషణ చేశారు. వాస్తవం ఏమిటంటే, రూపాయి విలువ పతనంలో ఆహార భద్రతా చట్టానికి ఏ ప్రమేయమూ లేదు. ద్రవ్య మార్కెట్లలో అమ్మకాల (బేర్) ఆపరేటర్లు ఉత్సవ వాతావరణంలో ఉన్నందున బడా పాత్రధారులకు నిరాశావాదంపై సవారి చేయడానికి ఇప్పుడు ఒక కారణం కోసం చూస్తున్నారు.
ఆహార భద్రతా చట్టం ఇప్పటికి సంవత్సర కాలంగా చర్చల్లో నానుతోంది. దానికి అయ్యే ఖర్చు కూడా 2013-14 బడ్జెట్ లో పరిగణించబడింది. నిజానికి, ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో (ఈ చట్టం అవసరాలకు) కేటాయింపులు ప్రకటించినప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇలాంటి ప్రతిస్పందన ఏదీ వ్యక్తం కాలేదు. ఆహార భద్రతా బిల్లు వలన అదనంగా అయ్యే ఖర్చు మహా అయితే సంవత్సరానికి 0.3 శాతం కంటే మించదు. పైగా, 2013-14 సంవత్సరంలో బడ్జెట్ లోటు లక్ష్యం అయిన 4.5 శాతానికి ప్రభుత్వం ఎట్టి పరిస్ధితుల్లోనూ కట్టుబడి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కూడాను.
నిజం ఏమిటంటే, బడా సంస్ధాగత మదుపుదారులు సంక్షేమ ఖర్చులకు వ్యతిరేకంగా స్వాభావిక పక్షపాతం కలిగి ఉన్నారు. సంక్షేమ పధకం అంటేనే పెట్టుబడికి వ్యతిరేకం అన్న మానసిక భావనకు మార్కెట్ పాత్రధారులు (market players) లోనయినట్లు కనిపిస్తోంది. ఇది తప్పుడు అంచనా. ఎందుకంటే దృఢమైన సంక్షేమ వ్యవస్ధ నిర్మాణం పెట్టుబడిదారీ విస్తరణలో సమగ్ర పాత్ర పోషించిందని పశ్చిమ దేశాల్లోని మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధల చరిత్ర స్పష్టంగా చెబుతోంది.
సమాజంలోని వివిధ సెక్షన్ల ప్రజలకు ప్రభుత్వం సమకూర్చే మద్దతును మార్కెట్ పాత్రధారులు చూసే విధానంలో కూడా పెద్ద వంచనా శిల్పం (హిపోక్రసీ) దాగి ఉంది. రైతులకు రుణాలు మాఫీ చేయడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు; కానీ బడా వ్యాపారులకు భారీ మొత్తంలో రుణాలను పునర్మూల్యాంకనం (restructuring) చేసినా, రుణాల చెల్లింపులను వాయిదా వేసినా… వాటిని నిస్సంకోచంగా ఆహ్వానిస్తారు. విదేశీ అప్పుల ఊబిని సృష్టించడానికి ఏ సంస్కరణలైతే కారణంగా నిలిచాయో వాటినే మరింత దూకుడుగా అమలు చేయడానికి వీలుగా వాస్తవ పరిస్ధితి కంటే మించిన దారుణ పరిస్ధితులను చిత్రించే ధోరణి కూడా నయా-ఉదారవాద ఆర్ధిక విధానాల రూపకర్తలలో వ్యాపించి ఉన్నది.
ఆహార భద్రతా బిల్లుకు పార్లమెంటులో లభించిన భారీ మద్దతు, మార్కెట్ పాత్రధారుల్లోనూ, వ్యాపారుల్లోనూ లోపించడం వైరుధ్యాల తీవ్రతను తెలియజేస్తోంది. రాజకీయ వర్గానికి, మార్కెట్ పాత్రధారులకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చవలసిన అవసరం ఉన్నది. జీన్ డ్రెజ్, అమార్త్య సేన్ లు అంగీకారయోగ్యమైన రీతిలోనే వాదించినట్లుగా మానవాభివృద్ధి సూచికలు మెరుగుపడకుండానే పెట్టుబడిదారీ వృద్ధి సాకారం అయిన చరిత్ర ఎక్కడా లేదు. ఈ వాస్తవాన్ని మార్కెట్ అంతర్లీనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
(నోట్: రాజకీయ వర్గానికి, మార్కెట్ పాత్రధారులకు అంతరం ఉందనీ, దాన్ని పూడ్చాలనీ సంపాదకీయం భావించడంలో స్వాభావిక లోపం ఉంది. ప్రస్తుత వ్యవస్ధలో ఈ అంతరాన్ని పూడ్చగల అవకాశం ఉందన్న అంచనాని ఈ భావన ఇస్తోంది. కంపెనీల అధిపతులు, వారి సహచరులే లోక్ సభ, రాజ్య సభల్లో ప్రవేశిస్తున్న నేటి పరిస్ధితుల్లో ఇలాంటి అంతరం ఒకటి ఉందని భావించలేము. ప్రజాప్రాతినిధ్య వ్యవస్ధ రాజకీయ నాయకులపై ఓట్ల రూపంలో ప్రజామోదం పొందాల్సిన అగత్యాన్ని రుద్దుతుంది. ఈ అగత్యమే వారి మధ్య అంతరం ఉందన్న భ్రమను కలుగజేస్తుంది. వాస్తవంలో రాజకీయ నాయకులు మార్కెట్ పాత్రధారులకు ప్రతినిధులే. సంపాదకీయమే మరోచోట చెప్పినట్లుగా నయా-ఉదార విధానాల రూపకర్తలు రాజకీయ నాయకులే అయినప్పుడు వారికి మార్కెట్ కు అంతరం ఎలా ఉంటుంది? ఈ అంశం వద్ద చదువరులు జాగ్రత్తవహించాలి. -విశేఖర్)