“నాకొక కల ఉంది” (I have a dream) అంటూ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చేసిన చరిత్రాత్మక పౌర హక్కుల ప్రసంగానికి ఆగస్టు 28, 2013తో 50 యేళ్ళు నిండాయి. అమెరికా ప్రజల పౌర హక్కుల కోసం, ముఖ్యంగా నల్లజాతి ప్రజలపై అమానుష రీతిలో కొనసాగుతున్న తీవ్ర వివక్షకు వ్యతిరేకంగా ‘నల్లజాతి ఉత్తుంగ తరంగమై ఉద్యమించిన’ మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతి ప్రజలతో పాటు, తెల్లజాతి ప్రజలను కూడా సమాన స్ధాయిలో ఉత్తేజపరిచాడు.
ప్రత్యేకంగా ఆగస్టు 28, 1963 తేదీన వాషింగ్టన్ లోని లింకన్ మెమోరియల్ హాలు మెట్లపై నిలబడి ఆయన ఇచ్చిన ప్రసంగాన్ని రెండున్నర లక్షల మంది ప్రత్యక్షంగా విని ఉర్రూతలూగిపోయారు. టి.విలో ప్రత్యక్ష ప్రసారం అయిన ఈ ప్రసంగం అమెరికా వ్యాపితంగా కోట్లాదిమందిని సైతం అదే స్ధాయిలో ఉర్రూతలూగించింది అంటే అతిశయోక్తి కాదు. “ఉద్యోగాల కోసం, స్వేచ్ఛ కోసం వాషింగ్టన్ కు కవాతు చేయండి” అన్న పిలుపు అందుకొన్న జనం లక్షలుగా వాషింగ్టన్ మాన్యుమెంట్ గ్రౌండ్స్ లో గుమి కూడారు. అనంతరం లింకన్ మెమోరియల్ హాలుకు బయలుదేరి వెళ్ళిన ఊరేగింపు మార్టిన్ లూధర్ కింగ్ చరిత్రాత్మక ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగంతో ముగిసింది. ఆ ప్రసంగం వీడియో ఇది.
మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ పిలుపు అందుకుని సమాన స్ధాయి కోసం, గౌరవం కోసం, వివక్ష నిర్మూలన కోసం పాఠశాల విద్యార్ధులు సైతం వందలు, వేలుగా వీధులకెక్కి ప్రదర్శనలు నిర్వహించారు. ఆ రోజుల్లో నల్లవారు వీధులకెక్కి ఊరేగింపు నిర్వహించడం అంటేనే ఒక గొప్ప వీరోచిత కార్యం నిర్వహించినట్లే. ఊరేగింపుల్లో పాల్గొన్నందుకు నల్లజాతి పాఠశాలల విద్యార్ధులను సైతం అరెస్టు చేసి జైళ్ళలో కుక్కిన రోజులవి. మామూలు నిరసన తెలియజేసే హక్కులను ఉక్కుపాదాలతో అమెరికా పాలకులు అణచివేసిన రోజులవి.
పౌరహక్కుల ఉద్యమం నేపధ్యంలో, నల్లజాతి ఉద్యమాల పట్ల కక్ష పెంచుకుని వారు నివసించే కాలనీలకు కాలనీలనే తగలబెట్టిన దుర్మార్గాలు యధేచ్ఛగా కొనసాగాయి. నల్లజాతి ఉద్యమకారుల పట్ల పోలీసులు ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని కాల్పులు సాగించడమే కాక కుక్కలను సైతం ఉసిగొల్పి జాతి వివక్షను నిర్లజ్జగా ప్రదరించేవారు. పోలీసుల దాష్టీకం ఒకవైపు యధేచ్ఛగా కొనసాగితే మరోవైపు తెల్లజాతి జాతి దురహంకారులు బాంబు దాడులతో నల్లవారిని భయభ్రాంతులకు గురి చేశారు.
చివరికి తెల్లజాతి దురహంకారుల చేతుల్లోనే మార్టిన్ లూధర్ కింగ్ హతుడయ్యాడు. ఏప్రిల్ 4, 1968 తేదీన తెన్నేసే నగరంలో ఒక హోటల్ లో బస చేసి ఉండగా ఆయనను కాల్చి చంపారు. అహింసాత్మక ఉద్యమాలపై నమ్మకం పెట్టుకున్న మార్టిన్ లూధర్ కింగ్ హింసాత్మకంగా 39 యేళ్ళ వయసులోనే హత్య చేసిన అమెరికన్ సమాజం తన వికృత రూపాన్ని బట్టబయలు చేసుకుంది. ఆయనను హత్య చేసిన నేరంతో ఒకరిని అరెస్టు చేసి 90 యేళ్ల శిక్షతో జైల్లో పెట్టారు. కాని ఆ తర్వాత అతను కేవలం బలిపశువేనని కుట్ర చేసింది వేరేవారని 1990ల్లో ఆరోపణలు వచ్చాయి. పునర్విచారణ జరిగింది. పేరు తెలియని ప్రభుత్వ ఏజన్సీలు కుట్ర చేసి ఆయన్ని చంపించాయని 1999లో జ్యూరీ నిర్ధారించింది. అయితే సదరు జ్యూరీ అమెరికా ప్రభుత్వాన్ని మాత్రం తప్పు పట్టలేదు.
నల్లజాతి ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన మార్టిన్ లూధర్ కింగ్ చరిత్రాత్మక ప్రసంగం రోజే యాభై యేళ్ళ తర్వాత అదే నల్లజాతి వ్యక్తి అమెరికన్ అధ్యక్ష పీఠంపై కూర్చొని సిరియా ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించడానికి ఉద్యుక్తడవుతూ యుద్ధభేరి మోగిస్తుండడం చరిత్ర చిత్రంపై వెలిసిన వికృత మరకగా భవిష్యత్తు తరం గుర్తుంచుకుంటుంది.
అమెరికా నల్లజాతి ఉత్తుంగ తరంగానికి 50 యేళ్ళు నిండిన సందర్భంగా ఆ తరంగాన్ని స్మరించుకోవడం ప్రపంచ వ్యాపితంగా పౌరహక్కులకు నోచుకోకుండా అణచివేతలకు, దోపిడీలకు గురవుతున్న జాతులు, ప్రజల కర్తవ్యం. బోస్టన్ గ్లోబ్ అందించిన ఫోటోలలో ఆనాటి నల్లవారి పరిస్ధితులను చూడవచ్చు.
(అదనపు అంశాలు చేర్చడానికి ఈ ఆర్టికల్ ను ఒకసారి ఎడిట్ చేయడం జరిగింది. -విశేఖర్)
మార్టిన్ లూధర్ కింగ్ చరిత్రాత్మక ప్రసంగం రోజే యాభై యేళ్ళ తర్వాత అదే నల్లజాతి వ్యక్తి అమెరికన్ అధ్యక్ష పీఠంపై కూర్చొని సిరియా ప్రజల ధన, మాన, ప్రాణాలను హరించడానికి ఉద్యుక్తడవుతూ యుద్ధభేరి మోగిస్తుండడం చరిత్ర చిత్రంపై వెలిసిన వికృత మరకగా భవిష్యత్తు తరం గుర్తుంచుకుంటుంది.
great comment