రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం


చిదంబరం గారు ఆ మధ్య వేలు కిందికి మడిచి చిటికెన వేలు పైకి లేపితే ఇక (రజనీ)బాబాగారే!

చిదంబరం గారు ఆ మధ్య వేలు కిందికి మడిచి చిటికెన వేలు పైకి లేపితే ఇక (రజనీ)బాబాగారే!

ఒక పక్క రూపాయి, పతనంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంటే, మరొక పక్క ఆర్ధిక మంత్రి చిదంబరం చిద్విలాసం కూడా కొనసాగుతోంది. దేశీయంగా ఆర్.బి.ఐ, ప్రభుత్వం తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ, కానీ విదేశాల్లో పరిస్ధితుల వలన రూపాయి పతనం అవుతోందని నిన్నటి వరకూ మంత్రి చెబుతూ వచ్చారు. మంగళవారం సరికొత్త స్ధాయికి రూపాయి పతనం అయిన తర్వాత ఆయన కూడా సరికొత్త పల్లవి అందుకున్నారు. విదేశాల పరిస్ధితులే కాకుండా దేశంలోని పరిస్ధితులు కూడా పతనానికి కారణం అని ఆయన ఇప్పుడు చెబుతున్నారు.

మరీ చిత్రంగా (2008 నాటి) ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడడానికి 2009-11 మధ్య కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రస్తుతం రూపాయి పతనానికి కారణంగా చిదంబరం చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన కాలం ముగిసి అప్పుడే రెండు సంవత్సరాలు గడిచిపోయింది. ఐనా ఆ ప్రభావం ఇప్పటి వరకూ నిద్రపోయి ఇప్పుడు హఠాత్తుగా మేల్కొని ప్రభావం చూపాయి అన్నట్లుగా చిదంబరం గారి వివరణ ఉన్నది. ఆర్ధిక మంత్రి చెప్పిన దేశీయ చర్యలు ఇన్నాళ్లూ ప్రభావం పడేయకుండా ఏం చేస్తున్నట్లు? ఇంతకీ ఆయన చెప్పిన ఆ చర్యలు ఏమిటి? అమెరికా, ఐరోపాలలో అప్పుడే ప్రభావం కోల్పోయిన ఆర్ధిక ఉద్దీపనా చర్యలు, ఇండియాలో రెండేళ్ల తర్వాత ప్రభావం చూపడం ఏమిటి? చిదంబరం మాటల్లో సమాధానాలేమీ లేవు.

మంగళవారం (ఆగస్టు 27) నాడు ఒక దశలో రూపాయి విలువ డాలర్ ఒక్కింటికి రు. 66.06 పై. లకు పడిపోయింది. తర్వాత కొద్దిగా కోలుకుని 65.65 పైసలకు చేరింది. రూపాయితో పాటు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అయ్యాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత మొదటిసారిగా 18,000 మార్కు కంటే కిందికి పడిపోయాయని పత్రికలు తెలిపాయి. రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రకారం బి.ఎస్.ఇ సెన్సెక్స్ 590 పాయింట్లు కోల్పోయి 17,968 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 3.18 శాతం పతనంతో సమానం. కాగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ సూచీ 189 పాయింట్లు పైన నష్టపోయి 5476.5 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది 3.45 శాతం పతనంతో సమానం.

ది హిందూ పత్రిక ప్రకారం నెలాఖరులో చమురు శుద్ధి పరిశ్రమ నుండి, తమ ఖాతాదారుల అవసరాల కోసం బ్యాంకుల నుండీ పెరిగిన డాలర్ డిమాండు రూపాయి విలువ పైన ఒత్తిడి పెంచింది. సోమవారం లోక్ సభలో ఆహార భద్రతా బిల్లు ఆమోదం పొందడం కూడా రూపాయి విలువ పైన ఒత్తిడి పెంచిందని స్టాక్ మార్కెట్ డీలర్లు తెలిపారు. అంటే ప్రజలకు ఆహార భద్రత లభిస్తే అది మార్కెట్ల (అనగా కంపెనీల) ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తుందన్నమాట!

ఆహార భద్రతా బిల్లు వలన ప్రభుత్వం పైన 1.35 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రభుత్వమే చెబుతోంది. ఇదంతా జనానికి ఊరకనే ఇస్తున్నట్లు మార్కెట్ల/కంపెనీల అభిప్రాయం. ఉచితంగా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడం వలన సబ్సిడీ బిల్లు పెరిగి తద్వారా బడ్జెట్ లోటు పెరిగి తద్వారా తమకు అందవలసిన నిధులు అందకుండా పోతాయని కంపెనీల మరియు స్వదేశీ, విదేశీ మదుపుదారుల భయం. ఆ భయంతో స్టాక్ మార్కెట్ల నుండి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో స్టాక్ సూచీలు పతనం అవుతున్నాయి. జనానికి ఇవ్వకుండా బడ్జెట్ సోమ్మంతా కంపెనీలకు బ్యాంకు అప్పుల రూపంలో, పన్ను రాయితీల రూపంలో, ఉద్దీపనల రూపంలో కంపెనీలకు దోచిపెడితే అప్పుడు కంపెనీల కళ్ళూ, ఒళ్లూ చల్లబడతాయి. నిశ్చింతగా స్టాక్ మార్కెట్లలో పందేల మీద పందేలు కాస్తూ కోట్లకు కోట్లు పిండుకుంటాయి. కంపెనీలకు/మదుపుదారులకు/స్పెక్యులేటర్లకు కావలసింది అదే. జనం మాడాలి. దోపిడీలు చల్లగా కొనసాగాలి.

ఉదాహరణకి రాయిటర్స్ వార్తా సంస్ధ చెప్పిన ఒక సంగతి చూద్దాం. ఆర్ధిక మంత్రి చిదంబరం ‘మరేం భయం లేదు’ అని భరోసా ఇస్తున్నా, కరెన్సీ మార్కెట్లలో రూపాయికి మద్దతుగా ఆర్.బి.ఐ జోక్యం చేసుకుంటున్నా పరిస్ధితి ఎందుకు దిగజారుతోంది అన్న ప్రశ్నకు సమాధానంగా రాయిటర్స్ సంస్ధ ముంబై లోని ‘సెంట్రమ్ వెల్త్ మేనేజ్ మెంట్’ అనే బ్రోకర్ సంస్ధ ఎం.డి చొక్కలింగం ఏమన్నాడో చెప్పింది. “ఆర్ధిక మంత్రి ఎంపిక (by choice) ద్వారా ఆ హామీలు ఇవ్వడం లేదు. కేవలం తప్పని పరిస్ధితుల్లో (by compulsion) మాత్రమే ఆ హామీలు ఇస్తున్నారు. కోశాగార లోటు, నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి, అస్ధిర కరెన్సీ ఈ మూడూ మమ్మల్ని తీవ్రంగా బాదేస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వం ఆహార భద్రత బిల్లును ఆమోదించింది. దీనివల్ల రేటింగ్ ఏజన్సీలలో భయాలను చొప్పించినట్లయింది” అని మిస్టర్ చొక్కలింగం వాపోయారు. అంటే చిదంబరం చెప్పేవన్నీ ఉత్తుత్తి కబుర్లేననీ, నమ్మదగినవి కావని మిస్టర్ చొక్కలింగం నిశ్చితాభిప్రాయం.

పాలక పార్టీ మరోసారి ఎన్నికల్లో గెలవడానికి కీలకంగా ఎంచుకున్న 1.35 లక్షల కోట్ల ఆహార భద్రతా పధకం ద్వారా 67 శాతం జనానికి సబ్సిడీ రేట్లకు గోధుమ, బియ్యం ఇవ్వడానికి నిశ్చయించుకున్నారని చెబుతూ, రాయిటర్స్ సంస్ధ మరో సంస్ధ చెప్పిన విషయం కూడా తెలియజేసింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అనే మరో బ్రోకర్ సంస్ధ (రాయిటర్స్ లాంటి పత్రికల దృష్టిలో వీళ్ళే ఆర్ధిక పండితులు, దేశ ఆర్ధిక పధ గమన నిర్దేశకులు… ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడాను) ప్రకారం “ఉచిత భోజనం అనేది ఉండదు. ఈ సబ్సిడీ బిల్లు కోసం బడ్జెట్ లో 60,600 కోట్ల రూపాయలు కేటాయిస్తే అది వాస్తవానికి 82,700 కోట్ల రూపాయలకు చేరుతుంది. ఆహార సేకరణ, రవాణా, లబ్దిదారుల గుర్తింపు తదితర అంశాల్లో భారీ సవాళ్ళు ఎదురవుతాయి” అని కోటక్ తెలిపింది.

కేవలం ఎన్నికల ప్రయోజనాలకోసమే ఆహార భద్రతా పధకం అని రాయిటర్స్ నిర్ధారించింది. అది నిజమే అయినా ఆ పధకం ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అవసరాన్ని గుర్తించిందన్నది కూడా మరొక నిజం. ప్రపంచ ప్రజలందరికీ ఆహార భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐరాస తీర్మానం చేస్తే దాన్ని గొప్పగా ప్రచారం చేసేదీ ఈ రాయిటర్స్ లాంటి వార్తా సంస్ధలే. ఆ తీర్మానాన్ని కనీసం ఎన్నికల ప్రయోజనాల కోసం అయినా అమలు చేయాలని ప్రభుత్వాలు పూనుకుంటే దానిపైన విషం కక్కేదీ కూడా మళ్ళీ ఈ వార్తా సంస్ధలే.

ఈ బడుద్ధాయిలు చెప్పని విషయం ఏమిటంటే ప్రైవేటు కంపెనీలకు కేవలం పన్ను రాయితీల ద్వారా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ అక్షరాలా 6 లక్షల కోట్లకు పై మాటే. ఇంత పెద్ద మొత్తంలో రాయితీ పొంది దేశానికి ఇచ్చేదీ ఏమీ ఉండదు మళ్ళీ! రైతులు, కార్మికులు, కూలీలు, ఉద్యోగులు ఎండనకా, వాననకా రేయింబవళ్లు కష్టపడి ఉత్పత్తులు తీస్తే వాటిని అటూ ఇటూ రవాణా చేసో, బ్రోకర్లుగా మారు బేరాలకు అమ్ముకునో, స్పెక్యులేషన్ లో పందేలు కాసో వారి కష్టార్జితాన్నంతా స్వాయత్తం చేసుకుని విదేశాలకు తరలించడమే వీరు చేసే అత్యున్నత సేవ. అంతోసిదానికి తామేదో విరగదీసేస్తున్నట్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ సి.ఎన్.బి.సి లాంటి ఛానెళ్ల ముందు తెగ బిల్డప్పులు ఇస్తుంటారు. అసలు పోలాల్లో, ఫ్యాక్టరీల్లో రోడ్ల మీదా వీళ్ళే చెమట్లు కార్చుతున్నట్లు ఫోజులు పెడుతుంటారు.

2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం భారత దేశం పైన ఎటువంటి ప్రభావమూ చూపలేదని, మన ఫండమెంటల్స్ దృఢంగా ఉండడమే దానికి కారణం అనీ ప్రధాని మన్మోహన్ దగ్గర్నుండి ఇతర కేంద్ర మంత్రుల వరకు మనకు అనేకసార్లు ఊదరగొట్టారు. మంగళవారం ఆర్ధిక మంత్రి చెప్పిన సంగతి సరిగ్గా దానికి విరుద్ధంగా ఉండడం విశేషం.

“కేవలం విదేశీ కారణాలు మాత్రమే లేవు. స్వదేశీ కారణాలు కూడా ఉన్నాయి. స్వదేశీ కారణాలు సైతం ఉన్నాయని మేము గుర్తించాము. స్వదేశీ కారణాల్లో ఒకటి ఏమిటంటే మన కోశాగార లోటు పరిమితిని దాటడానికి మనం అనుమతించాము. కరెంటు ఖాతా లోటు కూడా పెరిగిపోవడానికి మనం అనుమతించాము. 2009 నుండి 2011 వరకూ ఉన్న కాలంలో మనం తీసుకున్న నిర్దిష్ట చర్యలు ఈ పరిస్ధితికి దారితీశాయి.”

ఎట్టా?! నిన్న మొన్నటి వరకూ ఆర్.బి.ఐ పరపతి విధానాల్లో గానీ, బడ్జెట్ ప్రసంగాల్లో గానీ, అడపా దడపా స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నప్పుడు గానీ మన ఆర్ధిక మంత్రులు, ఆర్.బి.ఐ గవర్నర్లు చెప్పింది ఇది కాదే. వీళ్ళు ఎప్పుడూ చెప్పిన మాటలు ఏమిటంటే “ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని మన దేశ ఆర్ధిక వ్యవస్ధ తట్టుకుని నిలబడింది. మన ఎకనమిక్ ఫండమెంటల్స్ (కరెంటు ఖాతా లోటు, బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం మొ.వి) దృఢంగా ఉన్నాయి. అన్నీ అదుపులోనే ఉన్నాయి. కాబట్టి ఎవ్వరికీ చీకూ చింతా అవసరం లేదు” అని. 2008లో 6.7 శాతం మాత్రమే వృద్ధి చెందినా, ఆ తర్వాత 2011 వరకు జి.డి.పి వృద్ధి 8 నుండి 9.5 శాతం మధ్యలో నమోదు కావడం వల్ల ఈ మాటలు నిజమే కాబోలని అనేకమంది నమ్మారు. నిజానికి ఇప్పుడూ నమ్ముతున్నారు. కానీ ఆర్ధిక మంత్రివర్యులు చెబుతున్న మాటలు ఈ నమ్మకాన్ని పటాపంచలు చేస్తున్నాయి.

“అది మనకి వృద్ధిని తెచ్చింది. మన ఆర్ధిక వ్యవస్ధను స్ధిరీకరించింది. 2008 నాటి అమెరికా ఆర్ధిక సంక్షోభం యొక్క తీవ్ర పరిణామాల ప్రభావంలో పడి కొట్టుకుపోకుండా కాపాడింది. కానీ కోశాగార లోటు విషయంలోనూ, కరెంటు ఖాతా లోటు విషయంలోనూ మనం మూల్యం చెల్లించాము.” అని చిదంబరం తేల్చేశారు. మరి నిన్నటివరకూ దృఢంగా ఉన్నాయని ఆర్ధిక మంత్రి, ప్రధాని, ఆర్.బి.ఐ లు చెప్పిన ఫండమెంటల్స్ ఇంకేమిటి? ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయి కాబట్టి అమెరికా సంక్షోభం ప్రభావాన్ని తట్టుకున్నామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నేడు గొంతు మార్చి అవే ఫండమెంటల్స్ విషయంలో మూల్యం చెల్లించామని చెప్పడంలో పరమార్ధం ఏమిటి? ఈ రెండింటిలో ఏది నిజం? ఫండమెంటల్స్ బలంగా ఉండడం నిజమా లేక ఫండమెంటల్స్ విషయంలో మూల్యం చెల్లించడం నిజమా?

చిదంబరం గారు చెప్పిన “అది” ఏమిటో ఒక్కసారి చెప్పుకోవాలి. ‘అది’ అంటే ‘ఆర్ధిక ఉద్దీపన’ అని అర్ధం. అమెరికా, ఐరోపా, జపాన్ తదితర దేశాలు చెప్పినట్లుగా తాము కంపెనీలకు ఎంత ఆర్ధిక ఉద్దీపన ఇస్తున్నదీ భారత ప్రభుత్వం బహిరంగంగా ఇంతవరకూ చెప్పలేదు. ప్రజాధనం ఎంత మేరకు కంపెనీలకు పందేరం పెట్టిందీ చెప్పే దమ్ము మన పాలకులకు లేదు. అమెరికా అనేక విడతలుగా (ఒకసారి 900 బిలియన్ డాలర్లు, ఒకసారి 700 బిలియన్లు, ఆ తర్వాత 600 బిలియన్లు, ఇప్పుడు నెలకు 85 బిలియన్ డాలర్లు) ఉద్దీపనలు ఇచ్చింది; కానీ బైటికి చెప్పింది. అలాగే చైనా కూడా 600 బిలియన్ డాలర్లు ఒకసారి మరోసారి 500 బిలియన్లు ఉద్దీపనలు ఇచ్చినట్లు చెప్పింది. అలాగే జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ తాము ఎంతెంత ఉద్దీపనలు ఇచ్చింది చెప్పాయి. ప్రజలకు చెప్పకుండా ఉద్దీపనలు ఇచ్చింది భారత ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు కూడా అది అని అంటున్నారే గానీ ఏది, ఎంత, ఎవరికి ఇచ్చారో చెప్పడం లేదు. రూపాయి అదే పనిగా పతనం అవుతూ, ఎగుమతులు పడిపోయి దిగుమతులు పెరుగుతూ తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి కరెంటు ఖాతా లోటు పెరిగిపోతూ ఉన్నప్పుడు మాత్రమే ‘మనం ఉద్దీపనలు ఇచ్చాం, అందుకే ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడి వృద్ధి నమోదు చేశాం’ అని పాక్షికంగా నిజం చెబుతున్నారు.

ఇలా ఆర్ధిక ఉద్దీపనలు ఇచ్చింది కంపెనీలకే తప్ప ప్రజలకు కాదు. పన్నుల రాయితీలు ఇచ్చింది కంపెనీలకే తప్ప ఉద్యోగులకో, చిన్న, మధ్య తరహా వ్యాపారులకో కాదు. కాబట్టి ఆర్ధిక మంత్రి చెబుతున్నట్లు ఆర్ధిక ఉద్దీపనలే ఇప్పటి ప్రమాదకర ఆర్ధిక పరిస్ధితికి (1991 నాటి పరిస్ధితితో ఇప్పటి పరిస్ధితిని కొందరు పోల్చుతున్నారు) కారణం అయితే ఆ ఉద్దీపనలు తీసుకున్న బడా బడా ప్రైవేటు ధనిక వ్యాపారులు, పెట్టుబడిదారులే ఈ పరిస్ధితికి కారణం అని ఆర్ధిక మంత్రి అంగీకరిస్తున్నట్లే.

ఆర్ధిక మంత్రి రూపాయి స్ధిరీకరణ (stabilize) గురించి మాట్లాడుతున్నారే తప్ప అది ఎక్కడ స్ధిరంగా ఉంటే సరైన విలువలో ఉన్నట్లో చెప్పడం లేదు. రూపాయి పతనం గురించి బెంగ అవసరం లేదనీ, అది స్ధిరంగా లేకపోవడమే బెంగ కలిగించే విషయం అనీ, రెండు, మూడు రోజుల క్రితం చిదంబరం వ్యాఖ్యానించారు. అదే వరుసలో రూపాయి విలువ చాలా తక్కువగా ఉన్నదనీ, మార్కెట్లు తమ ధోరణిని సవరించుకుని దానిని సరైన విలువకు చేర్చాలని ఆయన కోరుతున్నారు. కానీ సరైన విలువ ఏమిటో మాత్రం ఆయన చెప్పడంలేదు. అంటే నిర్ణయాధికారం అంతా మార్కెట్లకే ఆయన వదిలి వేస్తున్నారు. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల ఫలితం ఇది. ప్రభుత్వం ఉంటుందీ, ఆర్.బి.ఐ, సెబి లాంటి నియంత్రణ వ్యవస్ధలు ఉంటాయి గానీ వారి చేతుల్లో ఏమీ ఉండదు. చిత్తానుసారంగా స్పెక్యులేషన్ కార్యకలాపాలకు దిగి ప్రైవేటు బహుళజాతి కంపెనీలు సంక్షోభ పరిస్ధితులు తెస్తే అప్పుడు మాత్రం ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. ఆర్ధిక ఉద్దీపనలు, పన్నుల రాయితీలు, టాక్స్ హాలిడేలు ప్రకటించి మళ్ళీ యధాతధ స్ధితిని తేవడానికి. కానీ ఇలా యధాతధ స్ధితిని తేవడానికి పట్టే భారం అంతా అప్పుల రూపంలో, ద్రవ్యోల్బణం రూపంలో, పెరిగే పన్నుల రూపంలో భరించేది ప్రజలే.

ఆర్ధిక మంత్రి ప్రకారం రూపాయి విలువ ఆగస్టు 2012 నుండి మే 2013 వరకు స్ధిరంగానే ఉన్నది. సమస్యంతా మే 22 నే ప్రారంభం అయిందని ఆయన చెబుతున్నారు. “వర్ధమాన దేశాలన్నింటి కరెన్సీలు ఒత్తిడిలో ఉన్నాయి. ఇప్పటికిప్పుడు చూస్తే రూపాయి విలువ అతిగా తగ్గిందని మా అభిప్రాయం” అని ఆయన చెప్పారు. కానీ రాయిటర్స్ ప్రకారం ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పటివరకూ రూపాయి 16 శాతం పైగా పడిపోయింది. ట్రేడింగ్ ఎకనమిక్స్ వెబ్ సైట్ అందించిన ఈ కింది గ్రాఫ్ చూస్తే చిదంబరం మాటల్లోని బోలుతనం అర్ధం అవుతుంది.

Indian Rupee

ఈ గ్రాఫ్ ప్రకారం రూపాయి విలువ ఈ సంవత్సరం మే-ఆగస్టు కాలంలో మాత్రమే పడిపోలేదు. ఇప్పటిలాగా భారీ స్ధాయిలో అది గతంలో అది కూడా జులై 2011 తర్వాతే, రెండుసార్లు పతనం అయిందని పై గ్రాఫ్ చూస్తే తెలుస్తుంది. (పచ్చ రంగులో ఉన్నవి పతనాన్ని ఎర్ర రంగులో ఉన్నవి విలువ పెరుగుదలనూ సూచిస్తాయి. ఒక్కో రంగు పట్టీ ఒక్కో నెలలో వచ్చిన మార్పు సూచిస్తుంది.) 2011లో ఆగస్టు-డిసెంబరు మధ్యలో డాలర్ కి దాదాపు 44 నుండి 54 రూపాయల వరకూ పడిపోతే, 2012లో మార్చి-జూన్ మధ్య 48.5 రూ.ల నుంది 56.5 రూ.ల వరకూ రూపాయి పడిపోవడం గమనించవచ్చు. చిదంబరం గారు చెప్పిన ఈ సంవత్సరం మే-ఆగస్టు నెలల మధ్య రు. 52 నుండి రు. 65.65 (అనగా రు. 13.65 పై లు) కు రూపాయి విలువ పడిపోవడానికి భారత ప్రభుత్వం 2009-11 మధ్య ఇచ్చిన ఆర్ధిక ఉద్దీపనలు కారణం అయితే మరి 2011లో రు. 10/- 2012లో రు. 8/- పడిపోవడానికి ఎవరు కారణం? ఆర్ధిక ఉద్దీపనలు ఇంకా ఎంతకాలం రూపాయి పైన ప్రభావం చూపుతాయి? (ఈ గ్రాఫు కోసం ఈ పేజి చూడగలరు)

భవిష్యత్తులో రూపాయి ప్రయాణం ఎటువైపో చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారని ది హిందు తెలిపింది. అంటే రూపాయి విలువ మునుపటి విలువకు చేరుతుందని చెప్పడం కూడా ఆయనకు ఇష్టం లేదనుకోవాలా? లేక మునుపటి విలువకు చేరుతుందన్న నమ్మకం ఆయన లేదా? “ఆర్ధిక వ్యవస్ధ మౌలికాంశాల (అదేనండీ బాబూ, ఫండమెంటల్స్!) విషయంలో మనం ఓపిక వహించాలి. దృఢంగా ఉండాలి. స్పష్టతతో ఉండాలి…” అని కూడా చిదంబరం సెలవిచ్చారు. (దిగితే కదా లోతు తెలిసేది! ఆ భారం ఎదుర్కొంటున్న సామాన్యుడిగా వీళ్ళు బతికితే కదా ఓపిక విలువ వీరికి తెలిసేది?)

బడ్జెట్ లోటు తగ్గించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదనీ కానీ కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం లపైన ప్రభుత్వ విధానాలేమిటో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉన్నదని చిదంబరం చెబుతున్నారు. కమ్యూనికేట్ చేయడంలో వైఫల్యం అంటే బహుశా తాము చెప్పే మాటలు నిజనికేననీ, ఉత్తుత్తివి కావనీ చెప్పడంలో వైఫల్యం కావచ్చు. పైన మిస్టర్ చొక్కలింగం గారు వెలిబుచ్చిన అనుమానాలు నిజమే అని చిదంబరం గారు చేప్పేశారన్నమాట! హతవిధీ!

12 thoughts on “రూపాయి విలాపం, చిదంబరం చిద్విలాసం

 1. మీ నుంచి మరో సవివరమైన అద్భుత విశ్లేషణ తో కూడిన పొస్ట్. ఆర్ధిక విషయాలపై మీ అవగాహన అసామాన్యం.

 2. విశెఖర్ గారూ మీ వివరణ మీ శైలీ చాలా భాగుంది ఇది పొగడ్థ మాత్రం కాదు .మీ టపాలు ప్రతి ఒక్కటీ ఫాలొ అవుతున్నాను కాకపొతె కామెంట్ రాయటానికి తీరిక లేకుండా వుంది.

 3. రామమోహన్ గారూ, మీ భావన నాకు అర్ధం అయింది. మీ వ్యాఖ్యల లోపం నాకు తెలుస్తూనే ఉంటుంది. మార్క్సిస్టు మౌలికాంశాలపైకి చర్చ వెళ్లాలంటే మీ వ్యాఖ్యలు అవసరం. అది గుర్తించాలని నా కోరిక.

 4. శేఖర్‌ గారు,
  నాదో డౌట్‌. ఏమిటంటే, లైసెజ్‌ పైర్‌ కు నూతన ఆర్ధిక విధానాలకు మౌలిక మైన తేడా ఏమిటీ? – (సామ్రాజ్యవాద యుగములో) అవి కేవలం రాజకీయ మార్పులేనా లేక మౌలిక ఆర్దిక విషయాల్లో కూడానా? రెండో ప్రపంచయుద్ధ కాలంలో వచ్చిన “గ్రేట్‌ డిప్రెషన్‌”కూ, 2008లో వచ్చిన ప్రపంచ ఆర్దిక సంక్షోభానికి తేడా ఏమిటి?

  ఆర్ధిక ఉద్దీపనల కొరకు కార్పోరేట్‌ వర్గాలు కృత్రిమ పెట్టుబడుల డిమాండ్‌ సృష్టిస్తున్నట్లు ఎందుకు అనుకోకూడదు? ఒక విధంగా చెప్పాలంటే పుడ్‌ సెక్యూరిటి బిల్లు కేవలం ప్రజలకోసం మాత్రమే కాక, ఓట్ల కోసమే కాక, కార్పొరేట్‌ వర్గాల సెక్యూరిటీ కొరకూ కూడానని నా ఉద్దేశం. కాదంటారా?

 5. తిరుపాలు గారు

  మీరు అడిగింది రెండు వాక్యాలే అయినా రెండు వాక్యాల్లో సమాధానం కుదరదేమో!

  లైసె ఫెయిర్ అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది దాదాపు లేకపోవడం. అంతా పెట్టుబడిదారీ కంపెనీల ఇష్టారాజ్యానికి వదిలివేయడం. కేవలం ఆస్తి హక్కులను (అది కూడా బడా ధనికుల ఆస్తి హక్కులు మాత్రమే అని చెప్పనవసరం లేదు) సంరక్షించడానికి తప్ప ప్రభుత్వం మిగిలినవన్నీ వదిలేయాలని దానిలో ఉంటుంది.

  అయితే ఇది ఊహలకే పరిమితం. ఇటువంటి పరిస్ధితి ఆధునిక చరిత్రలో ఎక్కడా, ఏ దేశంలో లేదు. ఎందుకంటే అంతా కంపెనీలకి వదిలిపెడితే జనం దగ్గర్నుండి పన్నులు వసూలు చేసి కంపెనీలకు రిజర్వులుగా నిర్వహించే బాధ్యతను ఎవరు నిర్వహిస్తారు? సరిహద్దులు గీసుకుని పాలిస్తున్న సామ్రాజ్యవాదుల మధ్య రాజకీయ ఒప్పందాలు ఎవరు చేస్తారు?

  జాతీయ ప్రభుత్వాలనేవి ఆయా జాతీయ (దేశీయ) ధనిక వర్గాల ఆర్ధిక ఆధిపత్యాన్ని పరిరక్షించే రాజకీయ విభాగాలు. అలాగే వివిధ జాతీయ (దేశీయ) గ్రూపుల మధ్య మార్కెట్ల పంపిణీని గ్యారంటీ చేసేందుకు సాధనాలు కూడా అవి. ఉత్పత్తి పెరిగి ఈ సరిహద్దుల్లోపలి మార్కెట్లు సరిపోకపోవడం వల్ల అది వలసల కోసం దండయాత్రలకు, ఆ తర్వాత ఫైనాన్స్ పెట్టుబడి రూపంలోని సామ్రాజ్యవాదానికి దారి తీసింది. మళ్ళీ ఈ సామ్రాజ్యవాద గ్రూపుల మధ్య మార్కెట్ల పంపిణీలపై ఒప్పందాలు కుదర్చాలన్నా ప్రభుత్వాలు తప్పనిసరి.

  ప్రభుత్వాలు అవసరం అయితే దాని నిర్వహణకు సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు మరికొంత సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు ఇంకా సిబ్బంది కావాలి. ఇది చివరికి నాలుగోతరగతి ఉద్యోగుల దగ్గర ఆగుతుంది. అంటే ఈ నాలుగు లేదా ఐదు మెట్ల సిబ్బంది మొత్తం ఆ ప్రభుత్వాలను ఆధిపత్యంలో ఉంచుకునే ధనికవర్గాలకు సేవలు చేయడానికే అన్నమాట! ఇదే రాజ్యం.

  ఈ రాజ్యంలో రాజకీయ నిర్వహణ చేసే చట్ట సభలు, ఆయా ధనిక గ్రూపుల మధ్య తగాదా తీర్చే కోర్టులు (కోర్టులు అందరికీ అనుకుంటారు గానీ వాస్తవానికి వాటి అసలు ఉద్దేశ్యం ధనిక పెత్తందార్ల తగాదాలు తీర్చి పరస్పర ఆమోగ్యయోగ్యమైన ఒప్పందాలు కుదర్చడమే. అలాగని పచ్చిగా చెప్పలేరు గనక ప్రజాస్వామ్యం పేరుతో అందరి తగువులూ తీర్చుతున్నట్లు నటిస్తారు. కానీ సరిగ్గా గమనిస్తే సామాన్యులకు న్యాయం ఎప్పుడూ అందుబాటులో ఉండదని చూస్తూనే ఉన్నాం), వీళ్లందరినీ కాపడడానికి పోలీసులు, పారా మిలట్రీ, మిలట్రీ లు కూడా భాగమేనని మీకు తెలిసిన విషయమే.

  కాబట్టి లైసె ఫెయిర్ అనేది ఎన్నడూ ఆచరణలో లేదు. సాధ్యం కాదు కూడా. పెట్టుబడిదారుల ప్రయోజనాల రీత్యా కూడా అది సాధ్యం కాదు. సాధ్యం అయితే పెట్టుబడి గ్రూపుల మధ్య తగాదాలు పరిష్కారం చేసే రాజ్యాంగ యంత్రం బలహీనంగా ఉండి వారిని కూల్చివేసే శ్రామికవర్గ విప్లవాల పని సులువవుతుంది.

  నూనన ఆర్ధిక విధానాలకూ లైసె ఫెయిర్ కూ తేడా ఇప్పటికే గ్రహించి ఉండాలి. రష్యా, చైనాలలో సోషలిస్టు రాజ్యాలు ఏర్పడిన ఫలితంగా మూడో ప్రపంచ దేశాలు సాపేక్షికంగా (అంటే గతంతో పోలిస్తే) శక్తివంతమైన రాజ్యాలుగా అవతరించాయి. ఈ రాజ్యాల స్వంత ఉనికిని గౌరవిస్తున్నట్లు నటిస్తూనే అక్కడి వనరులను కొల్లగొట్టడం కోసం అక్కడి ప్రభుత్వ రంగాలను కూల్చివేసి వాటి స్ధానంలో తమ కంపెనీలను ప్రవేశపెట్టడానికి నూతన ఆర్ధిక విధానాలు ఉద్దేశించారు. మూడో ప్రపంచ దేశాల ప్రజలను మభ్య పుచ్చడానికి ‘నూతన ఆర్ధిక విధానాలు’ అని చెప్పారు. వాస్తవంలో ప్రజలకు కొద్దోగొప్పో ఉపయోగంలోకి వచ్చిన రాజ్య నిర్మాణాలను తమ మార్కెట్ల అవసరాలను తీర్చే సాధనాలుగా ఈ విధానాలు మార్చివేస్తున్నాయి. ఇందులో మూడో ప్రపంచ దేశాలలోని ధనిక వర్గాలకు వాటాలు పంపిణీ చేయడం ద్వారా తమ సామంతరాజులుగా (దళారీలుగా) ఉంచడం కనిపిస్తుంది.

  ఆ విధంగా చూసినపుడు నూతన ఆర్ధిక విధానాలు ప్రధానంగా మూడో ప్రపంచ దేశాల్లోని ఆర్ధిక రాజ్య నిర్మాణాలను మౌలికంగా మార్చే ఆర్ధిక విధానాలు. ఈ విధానాలను అమలు చేసేవే రాజకీయ విధానాలు. దేశంలో దళారీ పెట్టుబడిదారులను, వారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులను పోషించిన ప్రభుత్వరంగం కూలిపోవడం అంటే ఇక దేశంలో దళారీల ఆర్ధిక పునాదిలో ఉండే సాపేక్ష్యిక సార్వభౌమత్వం క్రమంగా సామ్రాజ్యవాదులకు బదిలీ అవుతోంది. అయితే ఈ క్రమం అంత తేలికా కాదు, అంత స్వల్ప కాలంలో ముగిసేదీ కాదు. ఈ లోపు ప్రజలు చైతన్యవంతులవుతారు. దళారీ పాలకులు కూడా తమ ఉనికికోసం సామ్రాజ్యవాదులతో స్వల్పంగా ఘర్షణలు పడుతున్నారు. ఆ ఘర్షణ వాటా పెంచుకోవడానికే తప్ప స్వతంత్ర ఉనికి కోసం మాత్రం కాదు.

  మీ రెండో ప్రశ్న నాకు సరిగ్గా అర్ధం కాలేదు. ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ద్వారా పెట్టుబడుల డిమాండ్ ఎలా పుడుతుంది? కార్పొరేట్లకు సెక్యూరిటీ ఎలా వస్తుందని మీ ఉద్దేశ్యం?

  ఫుడ్ సెక్యూరిటీ ద్వారా సబ్సిడీ రేట్లకు ఆహార పదార్ధాలు సరఫరా చేయడం. అంటే ప్రజల నుండి ఆహారం కోసం వచ్చే డిమాండును ప్రభుత్వమే సబ్సిడీ ధరలకు తీర్చడం. ఆ మేరకు ఆహార డిమాండు కంపెనీల ఆహార సరుకులకు పడిపోతుంది. ఆ విధంగా ఉత్పత్తి తగ్గించుకుని తద్వారా లాభాలు తగ్గించుకోవాల్సిన పరిస్ధితి బహుళజాతి వ్యవసాయ కంపెనీలకు, రెడీమెడ్ ఆహార కంపెనీలకు వస్తుంది. ఇది ఒకవైపేమో సామ్రాజ్యవాద దేశాల్లో జి.డి.పి ని తగ్గిస్తుంది. మరోవైపేమో బహుళజాతి కంపెనీల పెట్టుబడి రియలైజేషన్ తగ్గిపోతుంది. అంటే వారి పెట్టుబడి, లాభాలు సృష్టించే పెట్టుబడిగా రియలైజ్ కావడం తగ్గుతుంది. అనగా అటు పెట్టుబడి మార్కెట్ తో పాటు సరుకుల మార్కెట్ ని కూడా తగ్గించడమే. ఇదే పరిస్ధితి స్వదేశీ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. స్వదేశీ కంపెనీలేవీ పూర్తిగా స్వదేశీ కాదు. వాటిలో చాలాభాగం విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. అవి ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి ఫుడ్ బిల్లు అంటే వారందరికీ అంత విముఖత!

  ఫుడ్ బిల్లు వాస్తవంలో ఏమవుతుందంటే ఒక కోణంలో దేశంలో అవినీతిని ఇంకా పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే అవినీతి అనేది కేవలం బడా కంపెనీల వరకే కాకుండా కింది దాకా పంపిణీ అవుతుంది. బ్లాక్ మార్కెటీర్లు సొమ్ము చేసుకుంటారు. మరో కొణంలో చూస్తే ప్రతి సబ్సిడీని డబ్బు రూపంలో ఇచ్చే పధకానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. దానిని ఆహార భద్రతకు కూడా వ్యాపింపజేస్తారు. అంటే ఆహార దినుసుల బదులు డబ్బు జమ చేస్తారు. ఆ డబ్బు ఆహారం కొనడానికి బదులు కొంత తాగుడుకి బదిలీ అయితే మరికొంత ఫైనాన్స్ పెట్టుబడిదారులకు వరంగా మారుతుంది. చిట్ ఫండ్స్ అనీ, ఇంకా ఇతర ద్రవ్య కంపెనీలు ఈ డబ్బు సేకరించి షేర్ మార్కెట్లకు తరలిస్తాయి. అది కాస్తా అంతిమంగా గ్లోబల్ ఫైనాన్స్ షార్క్ లకు చేరుతుంది. ఇదంతా మన కళ్లముందు జరిగేది కాదు. మనకి కనిపించేది ఐస్ బర్గ్ లాంటిదే.

 6. తిరుపాలు గారు

  “రెండో ప్రపంచయుద్ధ కాలంలో వచ్చిన “గ్రేట్‌ డిప్రెషన్‌”కూ, 2008లో వచ్చిన ప్రపంచ ఆర్దిక సంక్షోభానికి తేడా ఏమిటి?” మీ ప్రశ్నలోని ఈ భాగానికి సమాధానం ఇవ్వని సంగతి గుర్తించాను.

  2008 నాటి ఆర్ధిక సంక్షోభం తర్వాత ప్రపంచం ఎదుర్కొన్న ఆర్ధిక పతనాన్ని ‘గ్రేట్ రిసెషన్’ అంటున్నారు.

  నిజానికి రిసెషన్ కీ, డిప్రెషన్ కీ ఉన్న తేడా పరిమాణంకు సంబంధించినది మాత్రమే. పత్రికలు చెప్పేదాని ప్రకారం ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధ అయినా వరుసగా రెండు త్రైమాసికాలు కుచించుకుపోతే, అనగా మైనస్ వృద్ధి నమోదు చేస్తే దానిని రిసెషన్ అంటారు.

  కాని చాలామంది ఆర్ధిక వేత్తలు ఈ నిర్వచనాన్ని అంగీకరించరు. ఆర్ధిక వ్యవస్ధ పతనం ప్రారంభం నుండి అది మళ్ళీ తిరిగి లేవడం మొదలైన కాలం వరకూ మధ్య ఉన్న కాలాన్ని రిసెషన్ పీరియడ్ గా వారు నిర్ధారిస్తారు. ఈ పతనం కొద్ది కాలమే (6 నుండి 12 నెలల వరకు) ఉంటే దానిని రిసెషన్ గా చెబుతారు. అంటే స్వల్పకాలిక పతనాన్ని రిసెషన్ అనవచ్చు.

  ఆర్ధిక పతనం సుదీర్ఘకాలం కొనసాగి జి.డి.పి 10 శాతం మించి పడిపోతే గనుక దానిని డిప్రెషన్ గా పిలుస్తారు. రిసెషన్ లోనూ, డిప్రెషన్ లోనూ జరిగేది ఒకటే. జి.డి.పి తగ్గిపోవడం, వేతనాలు తగ్గడం, నిరుద్యోగం పెరగడం, డిమాండ్ తగ్గిపోవడం. రిసెషన్ లో ఇది స్వల్పకాలం ఉంటే డిప్రెషన్ లో దీర్ఘకాలం ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రిసెషన్ నాలుగు సంవత్సరాలు పైనే కొనసాగింది. కొద్ది సంవత్సరాలు వృద్ధి చెంది మళ్లీ రెండేళ్ల పాటు పతనం సంభవించింది. ఈ రెండు కాలాలను కలిపి ‘గ్రేట్ డిప్రెషన్’ గా పిలుస్తారు.

  ఇప్పటి పరిస్ధితిని గ్రేట్ రిసెషన్ ఎందుకంటున్నారంటే జి.డి.పి పడిపోవడం అనేది ప్రధాన దేశాల్లో 0.5 శాతం నుండి 4 శాతం వరకే ఉంది. ఇది కూడా మధ్య మధ్యలో వృద్ధి నమోదు చేస్తూ మళ్ళీ కుచించుకుపోవడం జరుగుతోంది. అంటే సుదీర్ఘకాలం పాటు స్వల్ప స్ధాయిలో పతనం అవుతున్నందున ‘గ్రేట్ రిసెషన్’ గా పిలుస్తున్నారు.

 7. శేఖర్‌ గారు,

  మీరిచ్చిన సుదీర్గ వివివరణకు ధన్య వాధాలు. నాకిప్పుడు ‘డిప్రెషన్‌’ కు ‘రిసెషన్‌’ కు తేడా తెలిసింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s