అమెరికా ఒత్తిడికి లొంగి స్నోడెన్ కు అనుమతివ్వని క్యూబా


అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో ముందుంటానని చెప్పుకునే క్యూబా ఎడ్వర్డ్ స్నోడెన్ తమ దేశంలో అడుగు పెట్టడానికి నిరాకరించిన సంగతి వెల్లడి అయింది. రష్యన్ విమానం నుండి ఎడ్వర్డ్ స్నోడెన్ క్యూబాలో దిగడానికి అనుమతీస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా బెదిరింపులకు దిగడంతో క్యూబా భయపడిపోయింది. ఎడ్వర్డ్ స్నోడెన్ ను తీసుకొచ్చినట్లయితే రష్యా విమానాన్ని తమ దేశంలో దిగడానికి అనుమతి ఇవ్వబోమని వెంటనే అమెరికాకు సమాచారం పంపింది. ఫలితంగా హాంగ్ కాంగ్ నుండి మాస్కో మీదుగా వెనిజులా వెళ్లవలసిన ఎడ్వర్డ్ స్నోడెన్ మాస్కోలోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో రెండు నెలలపాటు గడపవలసి వచ్చింది. చివరికి రష్యా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి కొన్ని షరతులతో అంగీకరించడంతో అమెరికా సాగించిన అమానుష స్నోడెన్ వేట ఫలితం ఇవ్వలేదు.

రష్యాకు చెందిన వార్తా పత్రిక కామర్సాంట్ ఈ సంగతి వెల్లడి చేసింది. అమెరికా విదేశాంగ శాఖకు సన్నిహితంగా వ్యవహరించే వర్గాలు ఈ రహస్యాన్ని తమకు తెలిపారని కామర్సాంట్ తెలిపింది. మాస్కో నుండి బయలుదేరిన రష్యన్ ప్రయాణికుల విమానం ఏరోఫ్లాట్ లో స్నోడెన్ ఉన్నట్లయితే ఆ విమానం హవానాలో దిగడానికి అవకాశం ఉండకపోవచ్చని క్యూబా రష్యాకు సమాచారం ఇచ్చిందని దానితో స్నోడెన్ లేకుండానే విమానం హవానా బయలుదేరి వెళ్లిందని పత్రిక తెలిపింది. స్నోడెన్ ఉంటాడన్న ఊహాతో ఏరోఫ్లాట్ విమానంలో ప్రయాణానికి బుక్ చేసుకున్న అనేక మంది పత్రికా విలేఖరులు తీరా విమానంలో స్నోడెన్ లేకపోయేసరికి తెల్లబోయారని అప్పట్లో పత్రికలు తెలిపాయి.

స్నోడెన్ ను అప్పగించాలని చైనా, హాంగ్ కాంగ్ లపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెస్తోందనీ, ఆ దేశాలు అంగీకరించకముందే హాంగ్ కాంగ్ వదిలి వెళ్ళడం శ్రేయస్కరమని వికీలీక్స్ సంస్ధ లాయర్లు స్నోడెన్ ను హెచ్చరించారు. దానితో స్నోడెన్ మాస్కో మీదుగా దక్షిణ అమెరికా దేశాలయిన వెనిజులా లేదా ఈక్వడార్ వెళ్లడానికి జూన్ 23 తేదీన మాస్కో వెళ్ళే విమానం ఎక్కాడు. అయితే స్నోడెన్ మాస్కోలో దిగేలోపే అమెరికా ఆయన పాస్ పోర్టును రద్దు చేసింది. మాస్కో ద్వారా హవానా వెళ్లడానికి జూన్ 21 తేదీన స్నోడెన్ టికెట్ కొనుగోలు చేయగా అదే రోజు ఆయన పాస్ పోర్టు రద్దు చేసినట్లు అమెరికా హాంగ్ కాంగ్ కు తెలిపింది. ఫలితంగా క్యూబా మీదుగా దక్షిణ అమెరికా వెళ్లాలని భావించిన స్నోడెన్ ఆశ గల్లంతయింది.

అంతర్జాతీయ ప్రయాణాలకు తగిన పాస్ పోర్టు లేకపోవడంతో స్నోడెన్ టికెట్ కొనుగోలు చేయలేదని కొన్ని పత్రికలు తెలిపాయి. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం స్నోడెన్ మాస్కో విమానాశ్రయం నుండి వెళ్లడానికి ఎటువంటి అడ్డంకులు లేవని చెప్పడంతో స్నోడెన్ ను ప్రయాణించకుండా ఆపింది ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఈ అంశం పైన వివిధ కధనాలను పత్రికలు ప్రచారంలో పెట్టాయి. అసలు వాస్తవం కామర్సాంట్ పత్రిక ద్వారా ఇప్పుడు వెల్లడి అయింది. స్నోడెన్ తో కూడిన విమానాన్ని అనుమతించబోమని క్యూబా సమాచారం ఇవ్వనందునే స్నోడెన్ తనకు శాశ్వత రాజకీయ ఆశ్రయం ఇవ్వజూపిన దక్షిణ అమెరికా దేశాలకు వెళ్లలేకపోయారు.

ఆ విధంగా క్యూబా తన అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకత లోని బూటకత్వాన్ని వెల్లడి చేసుకుంది. అమెరికాతో వ్యాపార సంబంధాలు పెంచుకోడానికి ఇటీవలి కాలంలో తహతహలాడుతున్న క్యూబా అమెరికా బెదిరింపులను ప్రతిఘటించకపోగా లొంగిపోయింది. తద్వారా తన చరిత్రకు తానే మలినం అంటించుకుంది. నిజానికి క్యూబాకు అమెరికాతో వ్యాపారం లేకపోతే గడవని పరిస్ధితి ఏమీ లేదు. ఎనర్జీ అవసరాలు తీర్చడానికి ఇరాన్, రష్యాలు ఎలాగూ ఉన్నాయి. మరో పక్క అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న దక్షిణ అమెరికా దేశాలు అమెరికాతో ఘర్షణ పడుతూనే వ్యాపార సంబంధాలు నిర్వహిస్తున్నాయి. తమ ప్రయోజనాల పరిధిలోనే అవి అమెరికాతో వ్యాపారం చేస్తున్నాయి. ఐనప్పటికీ స్నోడెన్ ను దూరం పెట్టడానికే క్యూబా ఆసక్తి చూపడం ఆ దేశ పాలకుల ప్రాధామ్యాలు ఏమిటో వెల్లడి చేస్తోంది.

అమెరికా రహస్య గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ, సి.ఐ.ఏ లలో పని చేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రపంచ దేశాలన్నింటి పైనా, ప్రపంచ ప్రజలందరిపైనా గూఢచర్యం నిర్వహిస్తున్న సంగతిని లోకానికి వెల్లడి చేశాడు. ప్రపంచ అంతర్జాల సేవల సంస్ధలు ముఖ్యమైనవన్నీ అమెరికాకు చెందినవే కావడంతో అమెరికా ప్రభుత్వానికి ఇది సాధ్యమయింది. స్నోడెన్ వెల్లడి చేసిన సమాధారం ప్రపంచ దేశాలను ఏ మాత్రం కదిలించకపోగా ఆయా దేశాలు కూడా తమ సొంత ప్రజల వ్యక్తిగత మొబైల్, కంప్యూటర్ సంభాషణలు, డాక్యుమెంట్ల పైన గూఢచర్యం చేస్తున్న సంగతి క్రమ క్రమంగా వెల్లడి అవుతోంది. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు అమెరికన్ ఎన్.ఎస్.ఏ, సి.ఐ.ఏ లతో స్వయంగా కుమ్మక్కయ్యాయని కూడా స్నోడెన్ వెల్లడి చేసిన పత్రాల ద్వారా తెలిసింది. అయితే ఈ కుమ్మక్కుకు మించి అమెరికా గూఢచర్యం సాగుతున్నట్లు గ్రహించిన ఐరోపా దేశాలు తమ సొంత అంతర్జాల కంపెనీలను ప్రపంచ స్ధాయికి అభివృద్ధి చేసుకోవడానికి నడుం బిగించాయి. తద్వారా అమెరికా కంపెనీలపై ఆధారపడడం తగ్గించాలని అవి నిర్ణయించుకున్నాయి.

రష్యాలో ఆశ్రయం పొందినప్పటికీ స్నోడెన్ కొన్ని షరతులకు లోబడి ఉండవలసిన అగత్యం ఏర్పడింది. రష్యాలో ఉండదలుచుకుంటే అమెరికాకు వ్యతిరేకంగా తాను సంపాదించిన రహస్యాలను వెల్లడి చేయడం మానుకోవాలని స్నోడెన్ కు పుతిన్ షరతు విచించారు. ఈ షరతుకు మొదట స్నోడెన్ అంగీకరించలేదు. రాజకీయ ఆశ్రయం కోసం రష్యాకు పెట్టుకున్న దరఖాస్తును రద్దు కూడా చేసుకున్నాడు. అయితే మాస్కో విమానాశ్రయం నుండి బైటపడే మార్గం లేకపోవడంతో అనివార్యంగా పుతిన్ షరతుకు అంగీకరించి రెండోసారి రష్యాకు దరఖాస్తు చేసుకున్నాడు. (సదరు దరఖాస్తును ఫొటోల్లో చూడవచ్చు). ఈ దరఖాస్తును రష్యా ఆమోదించడం విమానాశ్రయం నుండి రష్యా భూభాగం మీదికి స్నోడెన్ అడుగు పెట్టడం జరిగిపోయింది. స్నోడెన్ ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నదీ రహస్యంగా ఉంచబడింది.

స్నోడెన్ పత్రాలు స్నోడెన్ ద్వారా వెల్లడి కానప్పటికీ బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ పత్రిక విలేఖరి గ్లెన్ గ్రీన్ వాల్డ్ ద్వారా అవి వెల్లడి అవుతూనే ఉన్నాయి. దానితో గ్లెన్ గ్రీన్ వాల్డ్ ను అదుపు చేయడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్నోడెన్ పత్రాల ఆధారంగా సినిమా తీయడానికి అమెరికా సినిమా నిర్మాత లారో పోయిత్రాస్ ప్రయత్నిస్తున్నాడు. గ్రీన్ వాల్డ్, లారో ల మధ్య అనుసంధానకుడుగా ఉన్న గ్రీన్ వాల్డ్ సహచరుడు, బ్రెజిల్ పౌరుడు డేవిడ్ మిరాందను కొన్ని రోజుల క్రితం లండన్ హీత్రో విమానాశ్రయ అధికారులు నిర్బంధించి 9 గంటల పాటు ఇంటరాగేషన్ చేశారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని ఆయనపైన టెర్రరిజం కేసు మోపారు. ఈ సంఘటనపైన బ్రెజిల్ తీవ్ర నిరసన తెలియజేసింది. బ్రెజిల్ నిరసనను బ్రిటన్ పట్టించుకోలేదు. పైగా తమ చర్యను సమర్ధించుకుంది.

అమెరికాకు నమ్మిన బంటుగా వ్యవహరించే లండన్ ప్రభుత్వం అంతటితో ఆగలేదు. స్నోడెన్ పత్రాల ఆధారంగా ఇప్పటికే 200కు పైగా కధనాలు ప్రచురించిన ‘ది గార్డియన్’ పత్రికను కూడా వేధించింది. స్నోడెన్ అందజేసిన పత్రాలను తమకు అందజేయాలనీ లేదా అవి ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను నాశనం అన్నా చేయాలనీ గత జులై లోనే పత్రిక ఎడిటర్ పైన తీవ్ర ఒత్తిడి తెచ్చింది. చివరికి బ్రిటన్ గూఢచార సంస్ధ జి.సి.హెచ్.క్యూ గూఢచారుల సమక్షంలో తమ హార్డ్ డిస్క్ ను గార్డియన్ ఎడిటర్ నాశనం చేయవలసి వచ్చింది. జి.సి.హెచ్.క్యూ కు పత్రాలు అప్పగించడం కంటే నాశనం చేయడమే మంచిదని తాను భావించానని పత్రిక ఎడిటర్, మిరాందా ఉదంతం జరిగిన తర్వాత, బి.బి.సి/రష్యా టుడే కు తెలిపాడు. బ్రిటన్ ప్రభుత్వం తన విమానాశ్రయాల్లో ఏ చట్టాలూ పని చేయని చోటులను సృష్టించిందని, ఆ అవకాశం ద్వారానే విమానాశ్రయంలో మిరాందా ను నిర్బంధించి లాయర్ కు కూడా అనుమతి ఇవ్వకుండా ఎవ్వరితో సంప్రదించకుండా చట్టానికి దొరకకుండా వ్యవహరించగలిగిందని గార్డియన్ ఎడిటర్ అలాన్ రాస్ బ్రిడ్జర్ తెలిపాడు. బహుశా మాస్కో విమానాశ్రయంలో ఎటువంటి భయం లేకుండా వారాల తరబడి రక్షణ పొందగలిగిన స్నోడెన్ ఉదంతం నుండి దానికి సరిగ్గా విరుద్ధమైన పాఠాన్ని/అవకాశాన్ని బ్రిటన్ ప్రభుత్వం నేర్చుకుని ఉండవచ్చు.

స్నోడెన్ ను తీసుకెళ్తున్నారన్న అనుమానంతో రష్యా నుండి ప్రయాణిస్తున్న బొలీవియా అధ్యక్షుడి విమానానికి కూడా ఐరోపా దేశాలు (ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్) తెగించాయంటే తమకు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్నోడెన్ లాంటి తమ సొంత పౌరులకే కాక, ఇతర దేశాల అధ్యక్షులకు కూడా ఎటువంటి హక్కులూ తాము ఇవ్వబోమని అమెరికా, ఐరోపా దేశాలు రుజువు చేసుకున్నాయి. ఆఫ్రికా ప్రజలను బంధించి తెచ్చి బానిసలుగా చేసుకుని వారి శ్రమ ఫలితాన్ని ఇతర దేశాలను వలసలుగా మార్చుకునేందుకు పెట్టుబడిగా మార్చుకున్న అనాగరిక జాతులే నేడు నాగరిక జాతులుగా, మానవ హక్కులకు చాంపియన్లుగా ఫోజులు పెట్టడం, దానికి ఇతర దేశాలు ఆమోదించడం మానవాళికి దౌరభాగ్యం కాక మరేమవుతుంది. దాని ఫలితమే అనేక మంది స్నోడెన్ లు, ఇవా మొరేల్స్ లు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న అమానుష అణచివేత!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s