సిరియాపై దుస్సాహసానికి అమెరికా ఏర్పాట్లు?


ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, లిబియాల వరుసలో సిరియాను చేర్చడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా రక్షణ కార్యదర్శి చక్ హెగెల్ (మన మంత్రితో సమానం) చెబుతున్న మాటలు నిజమే అయితే సిరియాపై దాడి చేయడానికి అమెరికా తన యుద్ధ నౌకలను సిద్ధం చేస్తోంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన నాలుగు యుద్ధ నౌకలు సిరియా జలాలకు సమీపంలోకి తరలిస్తున్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా రెండు రోజుల క్రితం చెప్పిన మాటలను బట్టి సిరియా సమస్యకు పరిష్కారం అందరూ అనుకుంటున్నట్లుగా అమెరికా చేతుల్లో మాత్రమే లేదు. అంతర్జాతీయ సమాజం అనుమతి లేకుండా అమెరికా చేసేదేమీ లేదని ఒబామా రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు.

సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో కిరాయి తిరుగుబాటు బలగాల ఆధీనంలో ఉన్న ఒక ప్రాంతం పైన సిరియా ప్రభుత్వ సైనికులు రసాయన ఆయుధాలతో దాడి చేశారని పశ్చిమ పత్రికలు కోడై కూస్తున్నాయి. కిరాయి తిరుగుబాటుకు ఆయుధ, ధన సహాయం అందిస్తున్న కతార్ రాజుకి చెందిన టి.వి ఛానెల్ ఆల్-జజీరా ఈ దాడి వార్తను మొదట ప్రసారం చేసింది. అనంతరం ఆ వార్తను అందిపుచ్చుకున్న పశ్చిమ కార్పొరేట్ పత్రికలు చిలవలు పలవలు చేసి ప్రచారం చేస్తుండగా పశ్చిమ దేశాల నాయకులేమో “సిరియాపై దాడి చేయాల్సిందే” అంటూ మరొకసారి ప్రకటనలు గుప్పించడం మొదలు పెట్టారు. రాసాయన ఆయుధాలతో గతంలో దాడి జరిగిందని ఆరోపణలు వచ్చిన మూడు చోట్ల పరిశోధన చేయడానికి ఐరాస బృందం సిరియాలో అడుగు పెట్టిన రోజునే ఈ దాడి వార్త వెలువడడం విశేషం.

సిరియాపై దాడికి దిగాలంటే ఆ దేశ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని ప్రపంచం నమ్మాలి. అలా నమ్మాలంటే ఏదో భారీ ఉపద్రవం సంభవించాలి. సరిగ్గా అలాంటి ఉపద్రవం సృష్టించే దుష్ట తలంపుతోనే కిరాయి బలగాలు భారీ ఎత్తున మారణహోమం సాగించి ఆ నెపాన్ని సిరియా ప్రభుత్వం పైకి నేడుతున్నాయనీ, వారికి వారి యజమానులైన పశ్చిమ దేశాధిపతులు సహకరిస్తున్నారని పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాక్ పై దాడి చేయడానికి ఆ దేశంలో ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలు’ ఉన్నాయంటూ బుష్ (అమెరికా), టోనీ బ్లెయిర్ (బ్రిటన్) ప్రభుత్వాలు అబద్ధాలు సృష్టించి దాడి చేసినట్లే సిరియాపై దాడి చేయడానికి రసాయన ఆయుధాల బూచిని సృష్టించారని బలమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒబామా ఉపయోగించిన భాష కూడా అందుకు అనుగుణంగా ఉండడం గమనార్హం.

అంతర్జాతీయ సమాజం అనుమతి లేకుండా అమెరికా ఒక్కటే సిరియా సమస్యను పరిష్కరించగలదని భావించడం సరికాదని బారక్ ఒబామా సి.ఎన్.ఎన్ వార్తా సంస్ధతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. “ఐరాస ఆదేశాలు గానీ, (రసాయన ఆయుధాలు ప్రయోగించినట్లు) స్పష్టమైన సాక్ష్యం గానీ లేకుండా అమెరికా ఒక దేశంపై దాడికి వెళ్తే అప్పుడు తప్పనిసరిగా అలాంటి దాడికి అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకుంటాయా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అలాంటిది (సాకు) పని చేయడానికి తగిన పరిస్ధితులు మనకు ఉన్నాయా?” అని ఒబామా సి.ఎన్.ఎన్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. బారక్ ఒబామా ప్రశ్నిస్తున్నది అంతర్జాతీయ సమాజాన్ని కాదు. సిరియాపై దాడికి తెగబడాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్న అమెరికా చట్ట సభల సభ్యులను ఉద్దేశిస్తూ ఆయన తన ప్రశ్న సంధించాడు. అంటే తాము చూపించే సాకు పని చేసే పరిస్ధితి ఉంటే దాడి చేయడానికి ఒబామాకు అభ్యంతరం ఏమీ లేదని అర్ధం. ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లపై చేసిన దురాక్రమణ దాడులకు గానీ లిబియా పై సాగించిన మానవతా దాడికి గానీ అమెరికా చూపించిన సాకులు నమ్మే పరిస్ధితి అప్పట్లో ఉన్నదని కానీ ఆ సాకులు ఒఠ్ఠి అబద్ధాలేనని ప్రపంచానికి రుజువైన నేపధ్యంలో ఇపుడింక అమెరికా చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్ధితి లేదనీ బారక్ ఒబామా తన అమెరికన్ విమర్శకులకు సమాధానం ఇస్తున్నారు.

2009లో ఒబామా పై పోటీ చేసి ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ జాన్ మెక్ కెయిన్, డెమోక్రటిక్ పార్టీ కి చెందిన హౌస్ సభ్యుడు మరియు హౌస్ ఫారెన్ ఎఫెయిర్స్ కమిటీ సభ్యుడు కూడా అయిన ఇలియట్ ఏంజెల్ తదితరులు సిరియాపై దాడికి తెగబడాలని అదేపనిగా వాదిస్తున్నారు. “దీనిని (దాడి చేయకుండా మిన్నకుండడం) ఇలాగే కొనసాగిస్తే ప్రపంచ వ్యాపితంగా ఉన్న ఇతర క్రూరమైన నియంతలు రసాయన ఆయుధాలు ప్రయోగించాలనుకుంటే వారికి ఇక ఖాళీ చెక్కు రాసి ఇచ్చినట్లే” అని జాన్ మెక్ కెయిన్ వ్యాఖ్యానించారు. “మిత్రులతో కలిసి అస్సాద్ హంతక సామూహిక మారణాయుధాలకు స్పందించకపోతే ప్రపంచ వ్యాపితంగా మనపై పగబట్టిన దేశాలు, చెడ్డ వ్యక్తులు ఇక తమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగానే భావిస్తారు” అని ఇలియట్ ఏంజెల్ శుక్రవారం వ్యాఖ్యానించింది. అమెరికాలో ఉప్పు, నిప్పు అని చెప్పుకునే ఇరు పార్టీల నేతలు ఒకే భాష మాట్లాడడం ఇక్కడ గమనించవలసిన అంశం.

జాన్ మెక్ కెయిన్ యుద్ధ పిపాసిగా లబ్ద ప్రతిష్టుడు. ఆయన నోటి వెంట యుద్ధం, దాడి, బాంబులు, మారణకాండ… ఇవి తప్ప మరో భాష రాదు. ప్రపంచ దేశాల మార్కెట్లను బల ప్రయోగం ద్వారా లొంగదీసుకోవాలని భావించే అమెరికా తదితర పశ్చిమ దేశాల బహుళజాతి కంపెనీలకు ఆయన అత్యంత ప్రియమైన నాయకుడు. పైన ఉదహరించిన ఆయన హెచ్చరికలు నిజానికి ఆయన చాలా మృదువుగా చెప్పిన మాటలు మాత్రమే. హాలీవుడ్ సినిమాల్లో విలన్లు వ్యక్తం చేసే పచ్చి విద్వేషం, ఆధిపత్య దురహంకారం తదితర లక్షణాలకు ఆయన చక్కగా సరిపోయే వ్యక్తి. సిరియాపై దాడి చేయకపోతే ఇక అమెరికాను ఎవరూ పట్టించుకోరనీ రెండున్నరేళ్లుగా అధునాతన ఆయుధాలు ఇస్తూ బిలియన్లు తగలేస్తున్నా సిరియా కిరాయి బలగాలు పైచేయి సాధించకపోగా వరుస అపజయాలు ఎదుర్కోవడం మెక్ కెయిన్, ఇలియట్ లాంటి వారికి మహా అసహనంగా ఉంటోంది. అందుకే వెనకా ముందూ చూడకుండా దాడి చేసి సిరియాను లొంగదీసుకోవాలని వారు ప్రబోధిస్తున్నారు. లేనట్లయితే అమెరికా సామ్రాజ్యవాద ఆర్ధిక, రాజకీయ, వ్యూహాత్మక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని వారు హెచ్చరిస్తున్నారు.

[తిరుగుబాటు బలగాలకు అనుకూలంగా వ్యవహరించే షామ్ న్యూస్ నెట్ వర్క్ ఈ కింది (హేండౌట్) ఫోటోలను అందజేసిందని రష్యా టుడే తెలిపింది. మృతుల సంఖ్య ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారని కొన్ని డజన్ల నుండి 1300 మధ్యలో ఈ సంఖ్యలు ఉన్నాయని ఆర్.టి తెలిపింది.]

అయితే అమెరికాను పట్టించుకోకపోవడం అనేది సిరియాతో మొదలు కాదనీ, 2008 నాటి ద్రవ్య-ఆర్ధిక సంక్షోభంతో కుదేలయిన ఆర్ధిక వ్యవస్ధ, ఇరాక్, ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధాల్లో పైకి చెప్పుకోలేని పరాజయాలు, ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం సంభవించి ఐదేళ్లు గడిచినా కనుచూపుమేరలో రికవరీ అనేది కానరాకపోవడం… తదితర కారణాలతో అమెరికా ప్రాభవం ఇప్పటికే పతన దిశలో పయనిస్తోందనీ జాన్ మెక్ మెయిన్ లాంటి యుద్ధ పిపాసులు “గ్రహించలేని/గ్రహిస్తున్న” విషయం. “గ్రహించలేని” అని ఎందుకంటే అమెరికాకు మునుపటి శక్తి లేదని వారు గ్రహించడం లేదు కనుక. “గ్రహిస్తున్న” అని ఎందుకంటే అలా గ్రహించబట్టే మరింత పిచ్చిపట్టి ఆరిపోయే దీపంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు కనుక. ఏ విధంగా చూసినా అమెరికా పతన స్ధితినే వారు తమ మాటల్లో ప్రతిబింబిస్తున్నారు.

సిరియా ప్రభుత్వం ప్రయోగించిందని చెబుతున్న రసాయన ఆయుధాలు నిజానికి సిరియా తిరుగుబాటు బలగాలు ప్రయోగించినవేనని రష్యా ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. దాడి జరిగింది అని చెబుతున్నట్లుగా చూపిన వీడియోలు గానీ, ఫోటోలు గానీ వాస్తవానికి ఆ దాడి జరిగిందన్నా సమయానికి ముందే ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారని రష్యా విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సిరియా ప్రభుత్వ బలగాలపై నెపాన్ని నెట్టి ఐరాస పరిశీలకుల దృష్టిని ఆకర్శించేందుకు ఈ కుట్ర జరిగిందని రష్యా తెలిపింది. ఆగస్టు 21 తేదీన దాడి జరిగినట్లుగా తిరుగుబాటు బలగాలు ఆరోపించాయని కానీ దాడికి సంబంధించిన వీడియోలు మాత్రమే ఆగస్టు 20 తేదీనే అంతర్జాలంలో పోస్ట్ చేశారని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాషెవిక్ తెలిపారని రష్యా టుడే తెలియజేసింది. (వీడియోలను కింద చూడవచ్చు.) సిరియా సమయానికి, యూ ట్యూబ్ సర్వర్లు ఉన్న అమెరికా సమయానికి ఉన్న తేడా 7 గంటలనీ, వీడియో పోస్ట్ చేసిన సమయానికి, దాడి జరిగిందని చెప్పిన సమయానికి అంతకంటే ఎక్కువ సమయమే తేడా చూపుతోందని నిపుణులు కనిపెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు సిరియా ప్రభుత్వం నిజంగా కిరాయి బలగాలపై లేదా వారు చెబుతున్నట్లు సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించిందా లేదా అన్నది సమస్య కాదు. ఎందుకంటే పశ్చిమ దేశాలు ఎప్పుడు ఏ సాకు దొరుకుతుందా, సిరియాపై ఎప్పుడు దాడి చేద్దామా అని కాచుకుని కూచున్న ప్రస్తుత పరిస్ధితుల్లో సిరియా ప్రభుత్వం రసాయన ఆయుధాలను ముఖ్యంగా తమ ప్రజలపై ప్రయోగించే పిచ్చి పనికి పూనుకోవడం అసంభవం. అమెరికా ఆరోపించిన ఏ దేశమూ సామూహిక విధ్వంసక మారణాయుధాలు వాస్తవంలో ప్రయోగించలేదని చరిత్ర చెబుతున్న నిజం. ఇంకా చెప్పాలంటే అలాంటి దురాగతాలకు పాల్పడిన చరిత్ర ఉన్నది అమెరికాకు మాత్రమే. రెండో ప్రపంచ యుద్ధం దాదాపు ముగిసిన దశలో కమ్యూనిస్టు రష్యాకు పరోక్ష హెచ్చరిక చేయడానికి జపాన్ పై అణు బాంబులు ప్రయోగించింది అమెరికాయే. కమ్యూనిస్టు చైనా చేతుల్లోకి వెళ్తుందన్న భయంతో వియత్నాంను దురాక్రమించి ఆ దేశ సామాన్య ప్రజలపై నాపామ్ రసాయన ఆయుధాలు ప్రయోగించి వేలాది మందిని చంపిన చరిత్ర అమెరికాదే. ఆఫ్ఘన్, ఇరాక్ లలో సైతం అణు వ్యర్ధాలను ప్రయోగించి వేలాది మంది ఉసురు తీసుకున్నదీ, దశాబ్దాల ఆంక్షలతో పాలాడబ్బాలు సైతం అందనీయకుండా లక్షలాది ఇరాక్ పసికందులను బలి తీసుకున్నదీ అమెరికాయే. కాబట్టి సిరియా రసాయనాయుధాలు కాదు అసలు సమస్య. సిరియాపై అమెరికా చేయనున్న దురాక్రమణ దాడే సిరియాతో పాటు ప్రపంచం కూడా ఎదుర్కోనున్న అసలు సమస్య.

సిరియాపై దాడి జరిగితే అది అంతటితో సమసిపోయే యుద్ధం కాదు. సిరియాను కాపాడుకోడానికి ఇరాన్, రష్యాలు అనివార్యంగా రంగంలోకి దిగుతాయి. సిరియా యుద్ధానికి అమెరికాలో అలుపెరుగని లాబీయింగ్ చేస్తున్న ఇజ్రాయెల్ కూడా రంగంలోకి దిగుతుంది. ఇజ్రాయెల్ ప్రవేశిస్తే అనివార్యంగా ఇతర అరబ్ దేశాల ప్రజలు, కొండొకచో ప్రభుత్వాలు కూడా ఏదో ఒక రూపంలో యుద్ధరంగంలో కాలుమోపుతాయి. ఫలితంగా చమురు ధరలు కొండెక్కడం, దాని వెనుకే సమస్త సరుకుల ధరలు అందుబాటులో కేకుండా పోవడం తధ్యం. ఆ విధంగా ప్రపంచం మొత్తం సిరియా దాడి భారాన్ని మోయవలసి వస్తుంది. ఈ యుద్ధం వలన అమెరికా, ఐరోపా దేశాల కంపెనీలు మాత్రం లాభం పొందుతాయి. ఆయుధ బేహారులు, చమురు కంపెనీలు పెరిగిన ధరల ద్వారాను, పెరిగిన డిమాండు ద్వారానూ లాభాలు పిండుకుంటాయి.

అంటే ఎలాగైనా దాడి/యుద్ధం చేయడం పశ్చిమ దేశాల పాలక వర్గాలకు అవసరం. ఎలాగైనా యుద్ధం రాకుండా నిరోధించడం సిరియా ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలకు కూడా, చివరికి అమెరికా ప్రజలకు కూడా అవసరం. అందుకే యుద్ధం కోసం అమెరికా, ఐరోపాలు పన్నుతున్న మాయోపాయాల వలలో ప్రజలు పడరాదు. పశ్చిమ వార్తా సంస్ధలు ఇచ్చిన వార్తలను అందిపుచ్చుకుని భారత పత్రికలు, ప్రాంతీయ పత్రికలు కూడా అమెరికా చెప్పే అబద్ధాలను ప్రచారంలో పెట్టడం నేటి దౌర్భాగ్యం. తద్వారా అమెరికా యుద్ధ ప్రయత్నాలకు తగిన సమ్మతిని భారత పత్రికలు తయారు చేస్తున్నాయి. They are manufacturing consent for war on Syria. పశ్చిమ పత్రికలు ఏనాడో కార్పొరీకరణ అయిపోయాయి. బహుళజాతి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలే వాటి ప్రయోజనాలు. కానీ భారత పత్రికలు, ముఖ్యంగా ప్రాంతీయ భాషల పత్రికలకు కొద్దో గొప్పో ప్రజానుకూల స్వభావం మిగిలే ఉంది. ఆ స్వభావాన్ని తట్టిలేపి అబద్ధం ఏమిటో నిజం ఏమిటో తర్కించుకుని ప్రజలకు అందజేయాల్సిన గురుతర బాధ్యత పత్రికల సంపాదకులపైనా, యాజమాన్యాలపైనా ఉన్నది. ఆ బాధ్యతను వారు స్వీకరిస్తారని ఆశించడం చాలా చిన్న ఆశ మాత్రమే.

6 thoughts on “సిరియాపై దుస్సాహసానికి అమెరికా ఏర్పాట్లు?

  1. మన తెలుగు పత్రికలలో ఈ విషయం(వేలమందిచనిపొయినట్లు)కు ప్రముఖ్యమిచినట్లుప్రస్తావించారు.అంతేగానీ,దానికి ఎవరుకారణమో ఖచ్చితంగా ఎక్కడాప్రస్తావించలేదు!

  2. కుక్కను ముందు ‘ పిచ్చికుక్క’ అని పేరు పెట్టక పోతే దాన్ని చంపడానికి తనమనసే అంగీక రించదు ( ముందు నైతికంగా మనసును మభ్య పెట్టాలి) ఒక్క అబద్దం ఆడి ఒకసారి ప్రపంచాన్ని మభ్య పెట్టొచ్చు. అదే అబద్దం మళ్లీ మళ్లీ ఆడుతుంటే- అది ప్రపంచం కోసం కాదు తన కోసమే! నైతిక సమర్దన లేకపోతే ఇన్ని దుర్మార్గాలకు అవకాశంవుండదు. ఇది వ్యక్తులగే గాదు, వ్యవస్థలకు, దేశాలకు వర్తిస్తుంది. నైతికత ఎప్పుడూ ఓడిపోదు. చరిత్ర ఇదేనిరూపిస్తుంది. హిట్లర్‌ లాంటి నియంతలు ఎప్పుడూ తెలిసీ ఓడిపొతుంటారు!

    ‘జాన్ మెక్ మెయిన్ లాంటి యుద్ధ పిపాసులు “గ్రహించలేని/గ్రహిస్తున్న” విషయం. “గ్రహించలేని” అని ఎందుకంటే అమెరికాకు మునుపటి శక్తి లేదని వారు గ్రహించడం లేదు కనుక. “గ్రహిస్తున్న” అని ఎందుకంటే అలా గ్రహించబట్టే మరింత పిచ్చిపట్టి ఆరిపోయే దీపంలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు కనుక. ఏ విధంగా చూసినా అమెరికా పతన స్ధితినే వారు తమ మాటల్లో ప్రతిబింబిస్తున్నారు.’ చాలా సరిగ్గా విశ్లేషించారు .

  3. తమకు వచ్చిన సమాచారం మేరకు మన పత్రికలు అలా రాసుంటాయి. ఎందుకంటే సాక్షిలోనూ ప్రభుత్వమే పౌరులపై దాడి చేసినట్లుగా వార్త వచ్చింది..

  4. sir today even hindhu write a news that syrian govt used the chemical weapons and all most all the news papers are writing against the syrian govt. i cant able to understand what benefit they get by supporting western idealism

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s