నాయకుడు: అది పార్లమెంటే!
సామాన్యుడు: కాదది రూపాయే!
ఒక పక్క రూపాయి విలువ పతనం అవుతుండగా ఆర్ధిక వ్యవస్ధ తీరుతెన్నులను చర్చించి సవరించవలసిన చట్ట సభల సభ్యులు మాత్రం సంకుచిత రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రకరకాల సర్కస్ ఫీట్లు సాగిస్తున్నారు. ‘ఆహార భద్రతా బిల్లు,’ ‘ఇన్సూరెన్స్ ఎఫ్.డి.ఐ బిల్లు,’ తదితర ప్రజా వ్యతిరేక బిల్లులకు ఆమోదం పొందడానికి పాలక పక్షం చిత్రవిచిత్రమైన ఎత్తుగడలు వేస్తుండగా, పాలక పక్షం పరువు తీసి వీలైనన్ని ఓట్ల మార్కులు తమ ఖాతాలో జమ చేయించుకోడానికి ప్రతిపక్ష పార్టీలు తలా ఒక దిక్కుకు సభా కాలాన్ని లాక్కెళ్తున్నాయి. వెరసి రూపాయి విలువతో పాటు పార్లమెంటు పరువు కూడా అధో పాతాళానికి దొర్లిపోతోందని కార్టూనిస్టు సూచిస్తున్నారు.
నిజానికి పార్లమెంటు పరువు ప్రతిష్టలు కొత్తగా పోయిందేమీ లేదని వ్యాఖ్యానించేవారికీ కొదవలేదు. పరస్పర తగువులాటలతో, సంకుచిత ప్రయోజనాలతో కూడిన నినాదాలతో, నిరంతర రచ్చలతో పార్లమెంటు ‘ఏనాడో ప్రతిష్ట హీనమైనది. కాగా ఈ నాడు పరువు, ప్రతిష్ట అంటూ వగచనేల? అనవసరపు రాద్ధాంతములేల?’ అని వారి నిర్ధారణ! నిజమే కదా!
రాజకీయ నాయకుడిది ఒక బాధయితే సామాన్యుడిది మరొక బాధ అని కూడా కార్టూన్ సూచిస్టున్నట్లు కనిపిస్తోంది. నాయకులకు పార్లమెంటు పరువు, ప్రతిష్టల బెంగ పట్టుకుంటే, సామాన్యుడికి మాత్రం రూపాయి పతనం దరిమిలా పెరగనున్న పెను భారం గురించిన బెంగ. అందుకే దొర్లిపడుతున్నది ఏమిటన్న విషయంలో వారి మధ్య వైరుధ్యం!