సొంత కరెన్సీల్లో ఇండియా-ఇరాక్ వ్యాపారం


Maliki in India

ఇండియా, ఇరాక్ దేశాలు తమ సొంత కరెన్సీల్లో ద్వైపాక్షిక వ్యాపారం సాగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ చెబుతున్నారు. ఇరాక్ ప్రధాని నౌరి కమిల్ ఆల్-మాలికి ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న నేపధ్యంలో ఆనంద్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. అంతర్జాతీయ కరెన్సీకి బదులుగా సొంత కరెన్సీలలో వ్యాపారం చేసినట్లయితే ఆ మేరకు విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునే భారం ఇరు దేశాలకు తగ్గుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోతూ, కరెంటు ఖాతా లోటు పెరుగుతున్నందున రూపాయి విలువ భారీగా పతనం అవుతున్న ప్రస్తుత పరిస్ధితుల్లో దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఇది, ఎంత చిన్నదే అయినా, శుభవార్త!

ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకులు పరస్పర అవగాహన కుదుర్చుకోవడం ద్వారా ఎగుమతిదారులకు త్వరితగతిన చెల్లింపులు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారని మంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. భారత కంపెనీలకు అనువుగా తమ టెండర్ ప్రక్రియలను మార్చడానికి కూడా ఇరాక్ ప్రధాని తగిన చర్యలు తీసుకుంటానని మాట ఇచ్చినట్లు ది హిందు తెలిపింది. రూపాయి పతనం, పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, షేర్ మార్కెట్ల బేజారు మొ.న ప్రతికూల పరిణామాలతో సమాధానం చెప్పుకోలేక ఖాళీ మాటలతో సరిపుచ్చుతున్న ప్రభుత్వ నేతలకు ఇరాక్ ప్రధాని పర్యటన కాసింత ఆక్సిజన్ అందించినట్లు కనిపిస్తోంది.

భారత పారిశ్రామికవేత్తల సంఘాలయిన ఫిక్కి, సి.ఐ.ఐ, ఆసోచాం లు సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన ఇరాక్ ప్రధాని ఈ మేరకు తాను కూడా హామీ ఇచ్చారని పత్రికలు తెలిపాయి. ఇరు దేశాల సామర్ధ్యాలను, నైపుణ్యాలను వృద్ధి చేసుకుంటూ పరస్పరం సమ్మిళితం చేసుకోవడానికి తన పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని, వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని తదుపరి ఉన్నత స్ధాయికి తీసుకెళ్లడానికి తాను కృషి చేస్తానని మాలికి హామీ ఇచ్చారు. చమురు అన్వేషణ, చమురు శుద్ధి పరిశ్రమల స్ధాపన, పెట్రో కెమికల్స్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో తమ దేశ వ్యాపారులతో సంబంధాలు నెలకొల్పుకోవాలని మాలికి భారత వ్యాపారులను ఈ సందర్భంగా ఆహ్వానించారు.

“యుద్ధం మూలంగా నాశనమైన ఇరాక్ లో పునర్నిర్మాణం మరియు అభివృద్ధి సాధించేందుకు మేము భారత్ పై హెచ్చుగా ఆధారపడ్డాం. నియంతృత్వ ప్రభుత్వాలు కూల్చివేసిన ప్రజాస్వామిక సంస్ధలను పునఃస్ధాపిస్తున్నాము. పెట్టుబడుల ప్రోత్సాహానికి, వాణిజ్య రంగం నిర్వహణకు ఇరాక్ ప్రభుత్వం అనేక చట్టాలను ఆమోదించింది” అని మాలికి భారత కార్పొరేట్ అధిపతులకు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడినా వాణిజ్య మంత్రి సొంత కరెన్సీలలో వాణిజ్యం జరుపుకునే విషయాన్ని ప్రస్తావించారు. ఇరాక్ ప్రధాని మరియు భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల మంత్రులు చర్చలు జరిపేటప్పుడు తమ తమ దేశీయ కరెన్సీలలో వాణిజ్యం జరిపే అంశాలు పరిశీలిస్తారని ఆనంద్ శర్మ తెలిపారు. ఇది అమలులోకి వచ్చినట్లయితే ఇరాక్ నుండి కొనుగోలు చేసే సరుకులకు ఇండియా రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఇండియా నుండి కొనుగోలు చేసే సరుకులకు ఇరాక్ దీనార్ లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇక నుండి ఇరాక్, ఇండియాలు రూపాయి మరియు దీనార్ ల నిల్వలను ఉంచుకోవాల్సి ఉంటుంది. రూపాయికి దాదాపు ఇరాక్ 18 దీనార్లుగా ప్రస్తుతం మారకపు విలువ ఉన్నది. అంటే డాలర్లలో చెల్లింపులు చేయడం కంటే రూపాయిల్లో చెల్లింపులు చేయడం ఇండియాకు అత్యంత లాభకరం అన్నమాట! ఇరాక్ తో వాణిజ్యానికి అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య నిల్వలను కరిగించుకోవాల్సిన అవసరం ఇండియా, ఇరాక్ ఇరు దేశాలకు తప్పుతుంది.

ఇతర బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) దేశాలతో కూడా ఇటువంటి ఏర్పాటు చేసుకోవాలని గత సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఒక అంగీకారానికి వచ్చినట్లు ఆ దేశాలు అప్పట్లో ప్రకటించాయి. నిజానికి చైనా ఇండియా కాకుండా ఇతర బ్రిక్స్ దేశాలతో ఇప్పటికే ఇలాంటి ఏర్పాటు చేసుకుంది. తద్వారా తన కరెన్సీ యువాన్ కు అంతర్జాతీయ చలామణి విలువను పెంచుకునే కృషి చేస్తోంది. అయితే ఇండియా, చైనాల మధ్య ఆ ఏర్పాటు ఇంకా లేదు. చైనాతో భారీ స్ధాయిలో వాణిజ్యం చేస్తున్న దృష్ట్యా ఇండియాకు సొంత కరెన్సీలలో వాణిజ్యం బహుధా లాభిస్తుంది. అయితే అమెరికా బహుళజాతి కంపెనీలకు, అమెరికా పాలక వర్గాలకు కోపం తెప్పించడం భారత పాలకులకు ఇష్టం ఉండదు. కాబట్టి చైనా-ఇండియా ల వాణిజ్యం ఇరు దేశాల దేశీయ కరెన్సీలలో జరగడం అనుమానమే.

4 thoughts on “సొంత కరెన్సీల్లో ఇండియా-ఇరాక్ వ్యాపారం

  1. ఇటువంటి సువర్ణావకాశాన్ని ఒడిసిపట్టుకొని(ఫలవంతమైతే),బ్రిక్ దేశాలమధ్య కూడా ఈవిదానాన్ని అమలుచేసినట్లయితే మన రూపాయి విలువపెంచి దానికో అస్థిత్వాన్ని ఇవ్వాలని పాలకులకోవిజ్ఞప్తి.!

  2. ఇలా దేశాల మద్య ఒప్పందం చేసుకుంటు వుంటే , తన ఆధిక్యతకు భంగం వాటిల్లదా? అమెరిక పెద్దన్నకు కంట గింపు కాదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s