కేశవ్ కుంచె నుండి రూపు దిద్దుకున్న మరో ఆణిముత్యం ఈ కార్టూన్. తొమ్మిదేళ్ల ప్రధాన మంత్రి ఈ కార్టూన్ చూస్తే సిగ్గుతో చితికిపోవాలి!
“The buck stops here” అనేది ఆంగ్లంలో ఓ సామెత లాంటిది. బాధ్యత మోయాల్సి వచ్చినప్పుడు పక్కవాడి మీదికి నెట్టివేయడం మామూలుగా జరుగుతుంటుంది. ‘అలా పక్కవాడి మీదకు నేను తోసివేయను. నేనే స్వీకరిస్తాను’ అని ఈ వాక్యం చెబుతున్నవారు చెబుతున్నట్లు దీని అర్ధం. అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్.ట్రూమన్ బల్ల మీద ఈ వాక్యం రాసిన నేమ్ ప్లేట్ లాంటి బోర్డు ఉండేదని ‘ఫ్రేసెస్’ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.
ఈ సామెతను కార్టూనిస్టు ప్రస్తుత పరిస్ధుతులకి అన్వయించారు. 1,86,000 కోట్ల కుంభకోణంలో నిండా కూరుకుపోయిన మన ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా ఫైళ్లను మాయం చేయడంలో కూడా నిపుణులుగా తేలింది. 1999 నుండి 2009 వరకూ జరిపిన బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్ళు కావాలని సి.బి.ఐ కోరితే అవి కనపడడం లేదని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా చెప్పుకుంటోంది. ప్రధాని మన్మోహన్ ను కుంభకోణం బారినుండి కాపాడడానికే ఫైళ్ళు మాయం చేశారని పత్రికలు ఘోషిస్తున్నాయి. బి.జె.పి కూడా ఘోషిస్తోంది కానీ, కుంభకోణంలో ఆ పార్టీ నాయకులు కూడా పాత్రధారులే కనుక ఆ ఘోషకు ఎలాంటి విలువా లేదు.
2జి కుంభకోణంలో దోషం అంతా ఎ.రాజా పైకి నెట్టి తప్పించుకున్న ప్రధాని తనదాకా నడిచి వచ్చిన కుంభకోణం చూసేసరికి చెమటలు పట్టాయి. నిపుణులు ఎంతకాలం కూర్చుని మంతనాలు జరిపి మల్లగుల్లాలు పడ్డారో గానీ చివరికి ఫైళ్ళు మాయం చేసేశారు. బోఫోర్స్ ఆయుధ కంపెనీ నుండి కేవలం 64 కోట్ల లంచం మేశారని ఆరోపణలు వచ్చినందుకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం పడిపోయిన రోజులు ప్రజల మది నుండి ఇంకా చెరిగిపోలేదు. ఇప్పుడేమో లక్షల కోట్ల కుంభకోణాల్ని నిర్వహిస్తూ కూడా ‘నవ్విపొదురు గాక’ అన్నట్లుగా నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్న పాలకులు మన నెత్తిపైన మఠం వేసుకుని స్ధిరపడిపోయారు.
సామాన్యుడు మేలుకోవాలే గానీ…!
హ.. హా.. సామాన్యులు లేవడమా.. వాళ్లనెపుడో ఎప్పటికీ లేవలేని మత్తులో పడేశారు కదండీ మన నాయకులు.. ఆ అవకాశం ఇక లేనట్లే.. వాళ్లు లేవరు.. వీళ్లు మారరు..