అదే ఘోరం, అదే క్రూరత్వం, ఈసారి ముంబై


డిసెంబరు 16 నాటి ఢిల్లీ అత్యాచారం విషయంలో నిందితులపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేగంగా పని చేస్తున్నాయో లేదో గానీ అత్యాచారాల వేగం మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు ఢిల్లీ బస్సు అత్యాచారం తరహాలోనే ఒక ఫోటో జర్నలిస్టు యువతి పైన ఐదుగురు మృగాళ్ళు పైశాచిక రీతిలో అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటనలో కూడా యువతి బాయ్ ఫ్రెండ్ ని దుండగులు తీవ్రంగా కొట్టారు. బాధితురాలి శరీరంలో అంతర్గతంగా తీవ్ర గాయాలు అయినట్లు పత్రికలు తెలిపాయి. ముంబై పోలీసులు కాస్త వేగంగా స్పందించడంతో అయిదుగురులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

గురువారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఆంగ్ల మ్యాగజైన్ కోసం ఫోటో జర్నలిస్టుగా పని చేస్తున్న యువతి తన విధుల నిమిత్తం స్నేహితునితో కలిసి శక్తి మిల్స్ ఏరియాకు వెళ్లింది. నిర్భయ విషయంలో జరిగినట్లుగానే అక్కడ ఉన్న వ్యక్తులు యువతి పైన అసభ్య వ్యాఖ్యలు చేశారు. నిర్భయ స్నేహితుడిలాగానే ఇక్కడ కూడా బాధితురాలి స్నేహితుడు వారితో ఘర్షణకు దిగాడు. వారిలో ఇద్దరు అతన్ని కట్టేసి కొడుతుండగా మిగిలిన ముగ్గురు ఆమెను శక్తి మిల్స్ కాంపౌండ్ లోనికి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో బాధితుల కేకలు అరణ్య రోదనలే అయ్యాయి.

బాధితురాలి స్నేహితుడి సహాయంతో పోలీసులు ఐదుగురి ఊహా చిత్రాలను విడుదల చేశారు. నిందితుల్లో ఇద్దరు పరస్పరం రూపేష్, సాజిద్ అని పిలుచుకున్నారని బాధితురాలు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అత్యాచారంపైన రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో పోలీసులు వేగంగా కదలాల్సి వచ్చింది. ఊహా చిత్రాలు, ఇద్దరి పేర్ల ఆధారంగా నిందితులకోసం విస్తృతంగా వేట ప్రారంభించారు. శుక్రవారం ఉదయానికల్లా ఇద్దరిని అరెస్టు చేశామని ప్రకటించారు. అరెస్టు అయినవారి పేర్లను పత్రికలు ఇంకా చెప్పలేదు. మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు మురళి దేవర పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారని, వారు లాకప్ లో ఉన్నారని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు.

ఆంగ్ల మ్యాగజైన్ కోసం మరాఠీ భాషలో ‘చాల్స్’ గా పిలిచే పురాతన భవనాల గురించి పరిశోధ చేస్తూ యువతి శక్తి మిల్స్ ప్రాంతానికి వెళ్లారు. ఇటీవలి కాలంలో పాత భవనాలు కూలిపోయి పలువురు మరణిస్తున్న సంఘటనలు ముంబైలో వరుసగా జరుగుతున్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో ముంబై బట్టల మిల్లుల్లో పని చేయడం కోసం పల్లెల నుండి వచ్చిన కార్మికుల కోసం ఇలాంటి భవనాలను విస్తృతంగా నిర్మించారు. సాధారణంగా నాలుగైదు అంతస్ధూలతో ఉండే ఈ భవనాలు హాస్టల్ తరహాలో ప్రతి అంతస్ధులోనూ 10 నుండి 20 వరకూ గదులు ఉంటాయి. ఒక్క గదిలోనే కుటుంబం అంతా గానీ లేదా పలువురు ఒంటరి వ్యక్తులుగానీ నివసించేవారు. కొన్నిచోట్ల చిన్న వంటగదులు ఉండేవి (కొత్తగా పెళ్ళయిన జంట వస్తే ఆ వంటగదిలో నిద్రించే అవకాశం ఇస్తారట!).

ఇలాంటి పురాతన చాల్స్ పైన స్టోరీ తయారు చేసే నిమిత్తం వెళ్ళిన యువతికి ఘోరమైన అనుభవం ఎదుర్కోవాల్సి వచ్చింది. యువతి పరిస్ధితి స్ధిరంగా ఉన్నదని ఆమెను చేర్చిన జస్లోక్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. అయితే ఆమె శరీరంలో అంతర్గతంగా తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది.

డి.ఎన్.ఏ పత్రిక ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సంఘటన జరగ్గా 8 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఛానెళ్లలో వార్త ప్రసారం కావడంతో వివిధ సంఘాలు, సంస్ధలు,  రాజకీయ నాయకులు ఆందోళనలు ప్రారంభించారు. ఫలితంగా పోలీసులు 20 బృందాలను ఏర్పరిచి వేట ప్రారంభించారు. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఐదుగురు నిండుతులు 24 నుండి 30 సం.ల మధ్య వయసువారని, శక్తి మిల్స్ ప్రాంతంలో వారు నివసిస్తారని పోలీసులు తెలిపారు.

నిందితులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు. మొదట అక్కడ ఇద్దరే ఉన్నారని అది రైల్వే స్ధలం కాబట్టి ఫోటోలు తీయడానికి వీలు లేదని చెబుతూ అసభ్య చేష్టలకు దిగారని, యువతి స్నేహితుడు ప్రతిఘటించడంతో అతని చేతులను బెల్టుతో కట్టేసి తీవ్రంగా చావబాదారని యువతిని లోపలికి తీసుకెళ్ళి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారని తెలిపారు. ఆ తర్వాత మరొక వ్యక్తిని పిలుచుకు వచ్చారని, అనంతరం మరో ఇద్దరినీ పిలిచారని పోలీసులు చెప్పినట్లుగా డి.ఎన్.ఏ తెలిపింది. మొదటి ఇద్దరు వ్యక్తులు మళ్ళీ మళ్ళీ అత్యాచారానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. దానితో ఆమెకు అంతర్గతంగా పలు గాయాలు అయ్యాయని తెలిపారు. డాక్టర్లు వివరాలు ఇంకా బైటపెట్టలేదు.

డి.ఎన్.ఏ పత్రిక ప్రకారం శక్తి మిల్స్ కాంపౌండు మాదక ద్రవ్యాల సేవనకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. దానితో పోలీసులు మాదక ద్రవ్యాల కేసుల్లో ఉన్న యువకులను 20 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉపాధి అవకాశాలు గానీ, సృజనాత్మక శక్తిని ప్రదర్శించుకోవడానికి గల అవకాశాలు గానీ మహిళలకు ఎంత తక్కువగా అందుబాటులో ఉన్నాయో ముంబై అత్యాచార ఘటన తెలియజేస్తోంది. పని నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం, విధుల నిమిత్తం స్వేచ్ఛగా సంచరించలేని పరిస్ధితులు దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. పాలకులు విస్తృతమైన ప్రచార పటాటోపంతో చేస్తున్న చట్టాలు వారికి ఏ మాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాయి. మద్యం, మాదక ద్రవ్యాలు అమ్మి సొమ్ము చేసుకునేవారు, దొంగ డబ్బు చెలామణి చేసే నేరస్ధ ముఠాలకు ప్రభుత్వాలు నడిపే నాయకులతో దగ్గరి సంబంధాలు ఉండడం అందరికి తెలిసిన విషయమే. ఇలాంటి ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే వ్యవస్ధలో చట్టాల అమలు ఎలా సాధ్యం?

6 thoughts on “అదే ఘోరం, అదే క్రూరత్వం, ఈసారి ముంబై

  1. ఎన్ని చట్టలుచేసినా,ఎందరిని ఉరికంబానికి ఎక్కించినా అత్యాచారాలు ఆగవు!మన పితృస్వామిక వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి!

  2. చట్టాలు దిట్టంగా వుంటే ఈలాంటి ఆకృత్యాలు జరగవు అనే వారు ఇప్పుడేమంటారు?
    చట్టాలు ఇప్పుడు కొత్తగావస్తున్నాయా? పౌర సమాజం ఏర్పడినప్పటి నుండి చట్టాలున్నాయి- ఇంకా కౄరంగ, ఘోరంగా వుండేవి కావా?, మరి అప్పుడు నేరాలు జరగలేదా? అవి మనిషి మారటానికి కొంత వరకే తోద్పడతాయి. మనిషి జంతు ప్రపంచం నుండి ఇంకా పూర్తిగా బయటపడలేదు. సంస్కరించబడాలి అంటే సంస్కారం నేర్పే సమాజం కావాలి. నేరాలకు సమాజం కూడా బాధ్యత వహించాలి. అందుకని చట్టాల అవసరం లేదని కాదు. మనిషిది పరిసరాలకనుంగా మారే తత్వం. తన చుట్టూ ఏలాంటి పరిసరాలుంటాయో-సమాజం- అందులో భాగంగానే ఉంటాడు. ఈ విషయం చాలా మందికి తెలియాల్సి వుంది. కౄరమైన చట్టాలు ఉంటే నేరాలు జరగవు అనే వాల్ల దృక్పదం మారాలి.

  3. ” సంస్కరించబడాలి అంటే సంస్కారం నేర్పే సమాజం కావాలి. నేరాలకు సమాజం కూడా బాధ్యత వహించాలి.”

    తిరుపాలు గారు సరిగ్గా చెప్పారు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s