‘తీవ్ర’ ప్రమాద స్ధాయిలో ఫుకుషిమా రేడియేషన్ లీకేజి


జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద రేడియేషన్ కలుషిత నీటి లీకేజి ‘తీవ్ర’ (serious) స్ధాయికి చేరిందని జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక లీటర్ నీటిలో రేడియేషన్ కు సాధారణ అనుమతి స్ధాయి 150 బెక్యూరల్స్ కాగా ఫుకుషిమా వద్ద లీటర్ నీటిలో 30 మిలియన్ బెక్యూరల్స్ రేడియేషన్ తో కలుషితం అయిన నీరు నిరంతరం లీక్ అవుతూ సముద్రంలో కలుస్తోంది. అంతర్జాతీయ రేడియేషన్ ప్రమాద స్కేలు పైన దీని తీవ్రతను 3 కు జపాన్ ప్రభుత్వం పెంచింది. రెండు రోజుల క్రితమే ప్రమాద స్ధాయి 1 అని చెప్పిన ప్రభుత్వం ఇంతలోనే దానిని 3 కు పెంచాల్సి వచ్చిందంటే ప్రమాద తీవ్రత ఎమర్జెన్సీ స్ధాయికి వేగంగా చేరుకుంటోందని స్పష్టం అవుతోంది.

అంతర్జాతీయ రేడియేషన్ ప్రమాద స్కేలును 1 నుండి 7 వరకు లెక్కిస్తారు. 1 అంటేనే ప్రమాదం సాధారణ స్ధాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నదని. ప్రమాద స్ధాయి 10 రెట్లు పెరిగే కొద్దీ స్కేలు పైన ఒక్కొక్క అంకె పెరుగుతూ పోతుందని రష్యా టుడే పత్రిక తెలిపింది. అనగా 1 స్ధాయి వద్ద ఉన్న ప్రమాదం కంటే రేడియేషన్ 10 రెట్లు పెరిగితే ప్రమాదాన్ని 2 స్ధాయికి చేరుకుందని గుర్తిస్తారు. 2 స్ధాయి కంటే మరో 10 రెట్లు ప్రమాదం పెరిగితే ప్రమాద స్ధాయిని 3 గా ప్రకటిస్తారు. అత్యంత ప్రమాద స్ధాయి 7. దీనిని ఇప్పటివరకూ రెండు సార్లు మాత్రమే ప్రకటించారు. 1986లో ఉక్రెయిన్ లోని అణు కర్మాగారం పేలిపోయినప్పుడు మొదటిసారి  ప్రమాద స్ధాయి 7 గా ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ ఫుకుషిమా ప్రమాదం జరిగినప్పుడే 7 స్ధాయిగా ప్రకటించారు.

ప్రమాద స్ధాయి 3 అంటే “తీవ్రస్ధాయి రేడియేషన్ ఘటన” అర్ధం అని ఆర్.టి తెలిపింది. జపాన్ అణు నియంత్రణ కమిషనర్ల సమావేశం ఈరోజు (ఆగస్టు 21) జరుగుతోంది. ఈ సమావేశం కోసం తయారు చేసిన పత్రంలో ఫుకుషిమా వద్ద లీకవుతున్న రేడియేషన్ ప్రమాద స్ధాయి 3 గా నిర్ధారించారని ఆర్.టి తెలిపింది. “లీక్ అయిన కలుషిత నీటిలోని రేడియేషన్ సాంద్రత, పరిమాణాలను బట్టి… ప్రమాద స్ధాయి 3 గా నిర్ధారించడం సరైనది” అని సదరు పత్రం పేర్కొంది.

తీవ్రస్ధాయి రేడియేషన్ తో కలుషితమైన నీటిని నిలవ ఉంచిన ట్యాంకర్లలో ఒకదాని నుండి నీరు (తద్వారా రేడియేషన్) లీక్ అవుతోందని  సోమవారం మొదటిసారి అంగీకరించిన టెప్కో (టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ) ప్రమాద స్ధాయి 1 గా ప్రకటించింది. రెండు రోజుల్లోనే దీనిని జపాన్ ప్రభుత్వం 3 కి పెంచడం గమనార్హం. సోమవారం ప్రకటించిన ట్యాంకు కాకుండా మరో ట్యాంకు నుండి కూడా తీవ్రస్ధాయి కలుషిత నీరు లీక్ అవుతోందని టెప్కో మంగళవారం ప్రకటించింది. ప్రమాద స్ధాయి 3 కి చేరుకోవడంతో ఫుకుషిమా ఏరియాను రేడియేషన్ రహితంగా చేయడంలో తీవ్రమైన ప్రతిబంధకం ఎదురయినట్లే. చెర్నోబిల్ క్లీనప్ తో పోల్చినా కూడా ఇప్పుడు ఎదురయిన ప్రతిబంధకం అత్యంత తీవ్రస్ధాయిదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

మార్చి 11, 2011 తేదీన ఫుకుషిమా వద్ద సముద్ర గర్భంలో భారీ భూకంపం (రిక్టర్ స్కేలు పై 9) సంభవించడంతో ఫుకుషిమా అణు కర్మాగారంలోని 5 రియాక్టార్లలో మూడు బాగా దెబ్బతిన్నాయి. రియాక్టర్లలోని అణు ఇంధన కడ్డీలను చల్లబరిచేందుకు వినియోగించే కూలింగ్ వ్యవస్ధలోని పైపులు చెల్లా చెదురయ్యాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయి కూలింగ్ పైపుల్లో నీటిని మోసుకెళ్ళే ప్రక్రియ ఆగిపోయింది. దీనితో కూలింగ్ వ్యవస్ధ పని చేయక అణు ఇంధన కడ్డీలు కరిగిపోవడం ప్రారంభం అయింది. భూకంపం దరిమిలా సంభవించిన భారీ సునామీ అణు రియాక్టర్లను మరింతగా దెబ్బ తీసింది.

విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు అత్యవసరం నిమిత్తం కర్మాగారం వద్ద ఉంచిన జనరేటర్లు సునామీ నీటిలో మునిగిపోవడంతో ఎమర్జెన్సీ విద్యుత్ కూడా అందకుండా పోయింది. ఫలితంగా మూడు రియాక్టర్లలో అణు ఇంధక కడ్డీలు పూర్తిగా కరిగిపోయి అణు ఇంధనం నీటిలో కలిసిపోయింది. ఆ విధంగా కలుషితమైన నీరు రియాక్టర్ల అడుగు భాగానికి చేరుకుంది. సదరు నీటిని వివిధ మార్గాల ద్వారా సేకరించి భారీ స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకర్లలో కంపెనీ భద్రపరించింది. ఇలా భద్రపరిచే లోపలే కలుషిత నీరు భూగర్భ పైపు మార్గాల్లోకి చేరుకుని, ఆ పైపులు అప్పటికే పగిలిపోవడం వలన భూమిలోకి ఇంకిపోయింది. దానితో భూగర్భ జలాలు కూడా కలుషితం అయ్యాయి. కలుషితమైన భూగర్భ జలాలు క్రమంగా సముద్రంలో కలవడం ప్రారంభించింది.

ఈ విధంగా కలుషిత భూగర్భ జలాలు సముద్రంలో కలవడం లేదని నిన్నమొన్నటివరకూ టెప్కో బుకాయిస్తూ వచ్చింది. ఆ బుకాయింపును ఇటీవలే రద్దు చేసుకుని భూగర్భ జలాల ద్వారా రేడియేషన్ సముద్రం కాలుస్తున్న మాట వాస్తవమేనని గత జులై ఆఖరున అంగీకరించింది. ఇది కాకుండా ట్యాంకర్ల నుండి లీక్ అవుతున్న కలుషిత నీరు అదనం. కాబట్టి మొత్తం మూడు ప్రమాదాలు ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద కొలువు తీరి ఉన్నాయి.

ఒకటి: నాలుగో నెంబర్ రియాక్టర్ పైన, వాడిన అణు ఇంధన కడ్డీలను నిలవ ఉంచిన భారీ నీటి సరస్సునుండి కడ్డీలను తొలగించి మరో భద్రమైన చోటికి తరలించాల్సి ఉంది. ఎందుకంటే మూడో రియాక్టర్ భవనం భూకంపం వలన బలహీనపడి కూలిపోయే దశలో ఉంది. మళ్ళీ కాస్త గట్టి భూకంపం వస్తే ఈ భవంతి కూలిపోయి మానవ సమాజమే ఇంతవరకూ కనీవినీ ఎరుగని ప్రమాదం ప్రపంచాన్ని చుట్టేస్తుంది.

రెండు: భూగర్భంలోని డ్రైనేజి వ్యవస్ధలో నిలవ ఉన్న కలుషిత నీరు పగిలిన పైపుల గుండా లీక్ అవుతూ భూగర్భ జలాల్లో కలిసిపోయి, ఆ జలాలు కాస్తా సముద్రంలో కలుస్తున్నాయి. దానివలన సముద్ర జీవజాలం నాశనం అయిపోతుంది. రేడియేషన్ తో ప్రభావితమైన సముద్ర జీవులు (చేపలు మొ.వి) నెలల రోజుల్లోనే ఫసిఫిక్ తీరం ఆవల ఉన్న అమెరికాకు ప్రయాణిస్తున్నాయని తద్వారా సముద్ర ఆహారం కలుషితం అవుతోందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది.

మూడు: మూడు రియాక్టార్లలో అణు ఇంధన కడ్డీలు కరిగిపోగా కలుషితమైన నీరు ట్యాంకర్లలో భద్రపరిస్తే ఆ ట్యాంకర్లు కూడా ఇప్పుడు అభద్రంగా మారిపోయాయి. మొత్తం 350,000 టన్నుల తీవ్రస్ధాయి కలుషిత నీరు ట్యాంకర్ల నుండి లీక్ అవుతోంది. ట్యాంకర్లలోని నీరు రోజు రోజుకీ తగ్గిపోతున్నదని కంపెనీ చెబుతోంది. అంటే కలుషిత నీరు రోజు రోజుకీ లీక్ అవుతోందని.

రేడియేషన్ కలుషిత నీరు లీక్ కావడం అనేది జపాన్ ప్రజలకు మొదటి నుండి ప్రమాదకరంగా ఉంటూనే వచ్చింది. అనేక స్వచ్ఛంద సంస్ధలు, నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ విషయమై హెచ్చరించినప్పటికీ టెప్కో కంపెనీ అడ్డంగా నిరాకరిస్తూ వచ్చింది. చివరికి కలుషిత నీరు అటు సముద్రంలోనూ, ఇటు భూగర్భంలోనూ కలుస్తోందని అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడీ ప్రమాదాన్ని ఎలా నివారించనున్నదీ ఎవరి దగ్గరా ఎటువంటి పధకమూ లేదు. మిగిలింది ఒకే ఒక్క పరిష్కారం అణు విద్యుత్ ను శాశ్వతంగా రద్దు చేసుకుని ఎటువంటి ప్రమాదమూ లేని సూర్య, వాయు విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడడం. అయినా కూడా ఫుకుషిమా కర్మాగారం శుద్ధి ఇప్పటికీ పరిష్కారం కానీ సమస్యే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s