–
“దానికంటే ముందు ఉల్లి భద్రతా బిల్లు తెస్తే ఎలా ఉంటుందంటారు?”
–
ఆహార భద్రతా బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని పత్రికలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలకు గాను ఈ బిల్లును ‘ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్’గా కాంగ్రెస్ పరిగణిస్తోందనీ అందుకే ఈ బిల్లుపై అత్యంత పట్టుదలతో ఆ పార్టీ ఉన్నదనీ పత్రికల కధనం. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పట్టుబట్టి ఈ బిల్లుకు రూపకల్పన చేశారని కాబట్టి ఎలాగైనా ఆమోదం పొందేలా చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందనీ పత్రికలు, ఛానెళ్లు అనేక నెలలుగా చెబుతున్నాయి.
కానీ సామాన్యుడి పరిస్ధితి వేరే విధంగా ఉంది. ఆహార భద్రత అటుంచి కనీసం ఉల్లి భద్రత కూడా వారికి లేకుండా పోయింది. ఎకనామిక్ టైమ్స్ (ఇ.టి) పత్రిక ప్రకారం గత వారంలో ఢిల్లీలో ఉల్లి చిల్లర ధర కిలో 80 రూపాయలకు పైగా పలికింది. ఈ వారం అది 60 రూపాయలకు తగ్గిందట. అది కూడా చాలా ఎక్కువే. మహారాష్ట్రలో ఉల్లి మార్కెట్ కు కేంద్రంగా చెప్పే నాసిక్ లో ఉల్లి టోకు ధర కిలో 55 రూపాయలు పలుకుతోంది. ఇది రు. 40 కి తగ్గిందని చెబుతున్నారు గానీ జనానికి మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఉల్లి ధర గురించి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ని అడిగితే నాకు తెలియదు పొమ్మన్నారట! ధరల గురించి తెలియదు గానీ పంటల పరిస్ధితి చెప్పమంటే చెబుతానని ఆయన విలేఖరులతో అన్నారని ఇ.టి తెలియజేసింది. ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయి అని ఆయన్ని అడిగితే “నాకు ధరల గురించి తెలియదు గానీ పంట పరిస్ధితి గురించి మాత్రం తెలుసు. కరువు మూలాన నాసిక్ లో పంట దెబ్బతింది. ఈ రోజువరకూ చూసుకుంటే మొత్తం మీద పంట పరిస్ధితి బాగానే ఉంది” అని సెలవిచ్చారు.
కరువు వలన పంట దెబ్బతిందని ఒక పక్క చెబుతూ అదే నోటితో మొత్తం మీద బాగానే ఉందని ఎలా చెబుతున్నారో అర్ధం కాని విషయం. మొత్తం మీద బాగానే ఉంటే ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నట్లు. ఉల్లిపాయలు ఒక్క నాసిక్ లోనే కాదు తమిళనాడు, మధ్య ప్రదేశ్, రాజస్ధాన్ లలో కూడా పండిస్తారు. అలాంటిది నాసిక్ లో కరువోస్తే ఇంత ప్రభావం ఎలా చూపుతుంది? పైగా ‘మొత్తం మీద పంట పరిస్ధితి బాగానే ఉంది’ అని ఒక పక్క చెబుతుంటిరి!
ఇంకో విచిత్రం ఏమిటంటే వర్షం వలన ఉల్లి రవాణా ఆగిపోయిందట. తమిళనాడు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ లలో వర్షాలు పడుతుండడం వలన రవాణా ఆగిపోయి ఉల్లి ధరలు తాత్కాలికంగా పెరిగాయని శరద్ పవార్ చెప్పారని ఇ.టి తెలిపింది. ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేతకోసం’ అన్నట్లు లేదా ఇది? దేశం నిండా ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మించాక కూడా వర్షం వల్ల రవాణాలు ఆగిపోవడం ఏమిటి? ఐనా వర్షం వల్ల ఇంకేమన్నా ఆగుతుందేమో గానీ సరుకుల రవాణా ఆగిపోవడం కూడా జరుగుతుందా?
ఇ.టి ప్రకారం ఉల్లి ధరలు అక్టోబరు వరకూ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. అక్టోబర్ లో కొత్త పంట చేతికి వస్తుంది. కాబట్టి అప్పటివరకూ ఈ తంటా తప్పదు. వ్యవసాయ మంత్రి గారేమో ఇది ఉల్లి ధరల పెరుగుదల తాత్కాలికమే అంటున్నారు. ఏది నిజం? ఉల్లి ధరలు నసాలానికి అంటుతున్నదే ప్రస్తుతం అనుభవంలోకి వస్తున్న నిజం! ఆ మాటంటే తాత్కాలికమేగా అని మంత్రిగారు అంటారు కాబోలు! ఇంతకీ మంత్రిగారి దృష్టిలో తాత్కాలికం అంటే రెండు, మూడు నెలలు అనేనేమో!
ఇ.టి ప్రకారం ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇప్పటివరకూ 5,11,616 టన్నుల ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేశారట. ఈ ఎగుమతుల విలువ కేవలం 776.47 కోట్ల రూపాయలు మాత్రమే. ఎగుమతులు పెంచుకోడానికి దేశంలో కొరత సృష్టించడానికి కూడా మన ప్రభుత్వం వెనకాడలేదన్నమాట! ఇంతా చేసి ఇప్పుడు మళ్ళీ ఉల్లిని దిగుమతుల కోసం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జూన్ దాకా ఎగుమతి చేసిన సరుకునే ఆగస్టు నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఒక ప్రణాళిక అంటూ లేనితనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎగుమతిదారులకు ఎలాగూ తమ వ్యాపారం తప్ప దేశం గురించి పట్టదు. ఆ బాధ్యత కలిగిన ప్రభుత్వం అయినా తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాలి కదా. (నాసిక్ లో కరువు వల్ల కొరత వచ్చిందని వ్యవసాయ మంత్రి చెబుతున్నారు కాబట్టి).
మొత్తం మీద భారత దేశ ప్రజలకు ఆహార భద్రత అటుంచి ఉల్లి భద్రత లేకుండా పోయిందన్నది వాస్తవం. ఇక వీరు తెచ్చే బిల్లు ఇంకేం ఆహార భద్రత తెస్తుంది? పటాటోపానికి కాకపోతే!