ఆఫ్ఘనిస్ధాన్ ని ‘రక్తం ఓడుతున్న గాయం’ గా అభివర్ణించాడు చివరి సోవియట్ రష్యా నేత మిఖాయిల్ గోర్బచెవ్. ఈ భూమండలం పైన రక్తం ఓడుతున్న గాయాలు ఇంకా చాలానే ఉన్నాయి. కాశ్మీరు, పాలస్తీనా, సిరియా, సోమాలియా…. ఇప్పుడు ఈజిప్టు. రెండేళ్ల క్రితం ముబారక్ ను పదవీచ్యుతుడ్ని చేసినప్పటి నుండి ఈజిప్టు వీధులు రక్తంతో తడవని రోజంటూ లేదు. ముబారక్ ఏలిన 30 సంవత్సరాలు ఈజిప్టులో నిరవధిక ఎమర్జెన్సీ అమలు చేశారు. కమ్యూనిస్టులను, ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలను… మిలట్రీ నియంతృత్వాన్ని తప్పు పట్టిన, ఎదిరించిన ప్రతి ఒక్కరినీ వేట కుక్కలవలే వేటాడారు. ఈ వేటకు సంపూర్ణ మద్దతు ఇచ్చి కాపాడాయి అమెరికా, ఐరోపాలు.
ముబారక్ పాలనతో విసుగు చెందిన ప్రజలు బాయిలింగ్ పాయింటుకు చేరిన సంగతి గమనించిన పశ్చిమ రాజ్యాలు వారి అసంతృప్తిని మూటగట్టి తమ చెప్పు చేతల్లో ఉంచుకోడానికి స్వచ్ఛంద సంస్ధలని రంగంలోకి దించాయి. అమెరికా తదితర బహుళజాతి కంపెనీల నిధులతో పని చేసిన ఈ స్వచ్ఛంద సంస్ధలు లెఫ్టిస్టు ముసుగులో ఈజిప్టు ప్రజల అసంతృప్తిని, అలజడిని, నియంతృత్వ పాలన వ్యతిరేకతను ఆర్గనైజ్ చేశాయి. అది వ్యవస్ధ మార్పు వైపుకి దారి తీయకుండా జాగ్రత్త వహిస్తూ ‘ప్రజాస్వామిక డిమాండ్ల’ వరకే పరిమితం చేశాయి. ఈ డిమాండ్ల స్వభావం వ్యవస్ధ సమూల మార్పును కోరడం కాదు. కొన్ని పై పై రాజకీయ మార్పులు చేసి ప్రజాస్వామ్యం ఉన్నదని భ్రమింపజేయడం మాత్రమే వారి లక్ష్యం.
2011 నాటి ఈజిప్టు విప్లవం ప్రధానంగా ముస్లీం బ్రదర్ హుడ్, స్వచ్ఛంద సంస్ధలు, కొందరు లిబరల్స్ నేతృత్వంలోనే నడిచింది. విచిత్రంగా మూడు దశాబ్దాల పాటు నియంతృత్వాన్ని అమలు చేసిన మిలట్రీ విచిత్రంగా విప్లవానికి మద్దతుదారుగా తేలింది. ముబారక్ ను తప్పించి ప్రజాస్వామ్య ఎన్నికల నాటకం ఆడింది. ఎన్నికల్లో అధికారానికి వచ్చిన ముస్లిం బ్రదర్ హుడ్ కు అధికార పగ్గాలు అప్పగించకుండా తాత్సారం చేసింది. కానీ అమెరికా-ముస్లిం బ్రదర్ హుడ్ ల మధ్య ఒప్పందం కుదరడంతో ముస్లిం బ్రదర్ హుడ్ ప్రతినిధి, ఎన్నికల్లో నెగ్గిన మహమ్మద్ మోర్శికి అధికారం అప్పగించక తప్పలేదు మిలట్రీకి.
కానీ మోర్శి ఈజిప్టు ప్రజలను నిలువునా మోసం చేశాడు. అమెరికా-ఇజ్రాయెల్ అనుకూల విధానాలు కొనసాగించాడు. యావత్ అరబ్ లోకం తీవ్రంగా నిరసించే ఇజ్రాయెల్-ఈజిప్టు శాంతి ఒప్పందానికి కాపలాదారుగా వ్యవహరిస్తానని హామీ ఇచ్చాడు. పాలస్తీనా(గాజా)-ఈజిప్టు సరిహద్దును తెరవడానికి నిరాకరించాడు. తద్వారా ఇజ్రాయెల్ ముట్టడిలో ఉంటూ అతిపెద్ద బహిరంగ జైలుగా పేరు పొందిన గాజా ప్రజలను విముక్తం చేసే దిశలో సహాయం చేయడానికి నిరాకరించాడు. మీదు మిక్కిలి ఈజిప్టు ప్రజల మూలగులను మరింత పీల్చి పిప్పి చేసే విధంగా ఐ.ఏం.ఎఫ్ తో పరమ వినాశకరమైన ఆర్ధిక విధానాల అమలుకు అంగీకారం తెలిపాడు. మరోవైపు ఈజిప్టులో ముస్లిం మాట ఛాందస శక్తులు ప్రజల్ని వివిధ పద్ధతుల్లో పీడించడం ప్రారంభించాయి.
దానితో ప్రజలు జులై 3న మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఈసారి లిబరల్ శక్తులు నాయకత్వం వహించే ప్రయత్నం చేశారు. కానీ మిలట్రీ వారికా అవకాశం ఇవ్వలేదు. తానే ప్రజలకు పిలుపులు ఇచ్చింది. మొర్శికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించింది. మిలట్రీని అమాయకంగా నమ్మిన ప్రజలు, మోర్శి పదవీచ్యుతికి సహకరించారు. మిలట్రీ సహకారంతో ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలతో వీధి పోరాటాలకు దిగారు. ఈ అవకాశం చూసుకుని మిలట్రీ అధ్యక్షుడు మోర్శిని అరెస్టు చేసింది. ఇంకా అనేకమంది ముస్లిం బ్రదర్ హుడ్ నేతలపై కేసులు బనాయించి జైళ్లకు పంపింది. మరింతమంది కోసం వేటాడుతోంది.
కానీ ముస్లిం బ్రదర్ హుడ్ అంత తేలిగ్గా ఊరుకోవడం లేదు. మోర్శిని మళ్ళీ అధికారంలోకి తెచ్చేవరకూ విశ్రమించేది లేదని ప్రకటించింది. పెద్ద ఎత్తున ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తోంది. జులై 3 మొర్శి పదవీచ్యుతి జరిగినప్పటి నుండీ ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. మూడు వారాల పాటు ధర్నాలను చుట్టుముట్టి ఎదురు చూసిన మిలట్రీ ఆగస్టు మొదటివారం నుండి ముస్లిం బ్రదర్ హుడ్ పై విరుచుకుపడుతోంది. ఈజిప్టు నగర వీధుల్లో రక్తం పారిస్తోంది. ధర్నాలపై నేరుగా బుల్ డోజర్లు, ట్యాంకులు నడిపించి కాల్పులు జరిపి వందలాది మందిని పొట్టన పెట్టుకుంటోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే మృతుల సంఖ్య వెయ్యి దాటి పోయింది.
ఈజిప్టు మిలట్రీ తమ ప్రజలపై సాగిస్తున్న హింసాత్మక అణచివేతను ఈ ఫొటోల్లో చూడవచ్చు. (కొన్ని ఫోటోలు మరీ హింసాత్మకంగా ఉన్నాయి. సున్నిత హృదయులు ఫోటోలు చూడకుండా ఉంటేనే ఉత్తమం. ది అట్లాంటిక్ పత్రిక ఈ ఫోటోలను అందజేసింది.)
–
కొన్ని రోజుల తరువాత మన దేశంలొ కూడా ఇలాంటి ఫొటొలె తీసుకోవచ్చు.