ఈజిప్టులో మళ్ళీ ఎమర్జెన్సీ, రక్తం పారిస్తున్న మిలట్రీ


ఈజిప్టు మళ్ళీ రక్తం ఓడుతోంది. వదిలిందనుకున్న మిలట్రీ పిశాచం మళ్ళీ ఆ దేశాన్ని పట్టి పీడిస్తోంది. రెండేళ్ల క్రితం 2011లో సంభవించిన ప్రజా తిరుగుబాటులో హోస్ని ముబారక్ పదవీచ్యుతుడయిన సంగతి తెలిసిందే. దరిమిలా అధికార పగ్గాలను తాత్కాలికంగా కోల్పోయిన ఈజిప్టు మిలట్రీ, ప్రజాస్వామిక ఎన్నికల్లో అధ్యక్ష పదవి చేపట్టిన ముస్లిం బ్రదర్ హుడ్ నేత మహమ్మద్ మోర్శి ని గత జులై మొదటివారంలో కుట్ర చేసి కూల్చివేసింది. మోర్శికి మళ్ళీ అధికారం అప్పజెప్పాలని దేశవ్యాపితంగా బైఠాయింపులు, ప్రదర్శనలతో నిరసన తెలియజేస్తున్న ముస్లిం బ్రదర్ హుడ్ కార్యకర్తలపై బుధవారం విరుచుకుపడింది. నెలరోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన మిలట్రీ, ప్రదర్శనకారులపై ట్యాంకులు నడిపించి అనేకమంది ప్రాణాలను బలిగొంది. 90 మంది మాత్రమే చనిపోయారని మిలట్రీ ప్రభుత్వం చెబుతుండగా 800 మందికి పైగా చనిపోయారని ముస్లిం బ్రదర్ హుడ్ నాయకులు చెబుతున్నారు.

ఈజిప్టులో దళారీ పాలకవర్గాలు ప్రధానంగా మూడు శిబిరాలుగా చీలి ఉన్నారు. ఒక శిబిరానికి మిలట్రీ నాయకత్వం వహిస్తుండగా, మరొక శిబిరానికి పశ్చిమ దేశాల భావజాలంతో ప్రభావితులయిన లిబరల్ వర్గాలు నాయకత్వం వహిస్తున్నాయి. ఈ శిబిరం నాయకుల్లో ఐ.ఎ.ఇ.ఎ మాజీ అధిపతి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ నేత మహమ్మద్ ఎల్ బరాదీ కూడా ఒకరు. మూడో శిబిరానికి మతఛాందస ముస్లిం సంస్ధ అయిన ముస్లిం బ్రదర్ హుడ్ నాయకత్వం వహిస్తోంది. ఈ మూడు శిబిరాల్లో ఎవ్వరూ ఈజిప్టు ప్రజల వాస్తవ ప్రయోజనాలకు కట్టుబడినవారు కాదని వారి ప్రకటనలు, ఆచరణ చెబుతాయి. మూడు శిబిరాలూ అమెరికా ప్రాపకం కోసం పోటీపడే దళారీ వర్గాలే. ఎల్ బరాదీ మాత్రం అమెరికాకు బదులుగా యూరోపియన్ సామ్రాజ్యవాదుల పక్షం వహిస్తాడని ఒక అంచనా. అవసరమైతే కొన్ని షరతులతో అమెరికా సామ్రాజ్యవాదంతో రాజీ పాడడానికీ ఆయన సిద్ధమేనని ఆయన చర్యలు చెబుతాయి.

2011 జనవరిలో సంభవించిన తిరుగుబాటులో మిలట్రీ నేతృత్వంలోని పాలకవర్గాలపై ముస్లిం బ్రదర్ హుడ్ శిబిరం పై చేయి సాధించింది. హోస్ని ముబారక్ నేతృత్వంలోని మిలట్రీ శిబిరానికి వ్యతిరేకంగా అప్పట్లో ముస్లిం బ్రదర్ హుడ్ తో పాటు వామపక్షాలుగా చెప్పబడుతున్న అనేక స్వచ్ఛంధ సంస్ధలు కలిసి పోరాడాయి. వీరితో నేషనల్ సాల్వేషన్ ఫ్రంట్ (ఎల్ బరాది) కూడా జట్టు కట్టింది. తిరుగుబాటు నడుస్తుండగానే ముబారక్ తనకు మరో అవకాశం ఇవ్వాలని అమెరికాకు మొర పెట్టుకున్నాడు. అవకాశం ఇవ్వడం అంటే ‘తిరుగుబాటును అణచివేయడానికి అవకాశం’ అని. కొద్ది రోజులు ఓపిక పట్టిన అమెరికా ముబారక్ విఫలం కావడంతో ముస్లిం బ్రదర్ హుడ్ ను చేరదీసింది. అప్పటిదాకా అమెరికాపై నిప్పులు చెరిగిన ముస్లిం బ్రదర్ హుడ్ ‘అధికారం చేజిక్కుతోంది’ అనగానే అమెరికాకు సలాము కొట్టింది. ఆ విధంగా ప్రజల ఆగ్రహం మూటగట్టుకున్న ముబారక్ ను తప్పించి సరికొత్త ముఖాన్ని (ముస్లిం బ్రదర్ హుడ్) ఈజిప్టులో ధరించింది.

మోర్సి అధ్యక్షరికంలో గత రెండేళ్లుగా అధికారంలో ఉన్న ముస్లిం బ్రదర్ హుడ్ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏ మాత్రం పూనుకోలేదు. అమెరికా-ఇజ్రాయెల్ తో ముబారక్ పెట్టుకున్న అపవిత్ర కూటమిని మోర్సి కూడా కొనసాగించాడు. మధ్యప్రాచ్యంలో అత్యంత అభివృద్ధి నిరోధకమైన, అరబ్ ప్రజల ఉసురు తీస్తున్న జాత్యహంకార ఇజ్రాయెల్ తో రాజీపడిపోయాడు. పాలస్తీనా/గాజా ప్రజల దిగ్బంధనంలో పాలు పంచుకున్నాడు. దేశంలో మతఛాందస వర్గాలకు స్వేచ్ఛ కల్పించాడు. అమెరికా విదిల్చే డాలర్ల ఎంగిలి కోసం పరితపించాడు. అమెరికా చెప్పిన మాటల్లా విన్నాడు. సిరియాలో అమెరికా-ఐరోపా-ఇజ్రాయెల్-అరబ్ రాచరికాలు రెచ్చగొట్టిన కిరాయి తిరుగుబాటుకు అనుకూలంగా ప్రకటనలు జారీ చేశాడు. ఈజిప్టు ప్రజలు సిరియా వెళ్లి అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సాద్ ను కూల్చివేయడానికి జిహాద్ లో పాల్గొనాలని పిలుపుకూడా ఇచ్చాడు.  ఆ పిలుపుతో అరబ్ ప్రజల ప్రయోజనాలకు పచ్చి వ్యతిరేకిగానూ, అమెరికా మోచేతి నీళ్ళు తాగే దాసుడుగానూ మోర్సి/ముస్లిం బ్రదర్ హుడ్ రుజువు చేసుకున్నాడు.

మరీ ముఖ్యంగా అమెరికా అనుకూల ఆర్ధిక విధానాలను మరింత కఠినంగా అమలు చేయడానికి మోర్సి సిద్ధపడ్డాడు. ఐ.ఎం.ఎఫ్ ఇవ్వజూపిన అప్పు కోసం దేశ ఆర్ధిక వ్యవస్ధను తాకట్టు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తద్వారా అమెరికా ఇవ్వజూపిన 1.5 బిలియన్ డాలర్ల సహాయం కోసం ఆవురావురుమన్నాడు. అమెరికా ఆదేశాలతో ఇజ్రాయెల్ తో ముబారక్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని కొనసాగిస్తానని మాట ఇచ్చి అమలు చేశాడు. ఇజ్రాయెల్ చేతుల్లో అణచివేతకు గురవుతున్న తమ బ్రతుకుల్లో ఈజిప్టు తిరుగుబాటుతో మార్పు వస్తుందని ఆశించిన అరబ్ ప్రజలను మోర్సి ఆ విధంగా నిరాశపరిచాడు.

దీనితో ఈజిప్టు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. తాము అనేక త్యాగాలకు ఓర్చి సాగించిన తిరుగుబాటు ‘ఈనగాచి నక్కల పాల్జేసినట్లు’ అయిందని ఉడికిపోయారు. తమ అధ్యక్షుడు అమెరికా అడుగులకు మడుగులొత్తడం సహించలేకపోయారు. ఈ ఆగ్రహాన్ని ఈసారి సో కాల్డ్ లిబరల్/లెఫ్ట్ వర్గాలు సొమ్ము చేసుకున్నాయి. ముస్లిం బ్రదర్ హుడ్ కు వ్యతిరేకంగా, అది అనుసరిస్తున్న ఛాందస విధానాలకు వ్యతిరేకంగా మరుగుతున్న ఆగ్రహాన్ని వారు కూడగట్టారు. మరోవైపు అమెరికాకు పాతకాపు అయిన మిలట్రీతో వారు నిస్సిగ్గుగా జతకట్టారు. ఈజిప్టు ప్రజల ప్రయోజనాల వైపు బేషరతుగా నిలబడడం మాని మళ్ళీ అమెరికా అనుకూల వర్గాలతో పొత్తుకట్టారు.

ఈసారి ఈజిప్టు మిలట్రీకి అమెరికా బదులు సౌదీ అరేబియా, కతార్, యు.ఎ.ఇ సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ముస్లిం బ్రదర్ హుడ్ ను లొంగదీసుకున్న అమెరికా ఇంతత్వరగా దానిపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని బహుశా ఊహించలేదు. ముస్లిం మతంలోని సున్నీ, షియా విభాగాలు ఇందులో సెక్టేరియన్ పాత్ర పోషించాయి. సౌదీ అరేబియా, కతార్, యు.ఎ.ఇ లు సున్నీ మత పోషకులు. ఇరాక్ దురాక్రమణ తర్వాత అక్కడ సౌదీ వ్యతిరేక, ఇరాన్ అనుకూల షియా ప్రభుత్వం ఏర్పడింది. ఇది సౌదీకి రుచించలేదు. ఈజిప్టు ముస్లిం బ్రదర్ హుడ్ మద్దతు ఇస్తున్న ఆల్-ఖైదా శక్తులు సిరియా తర్వాత తన మీదికి కూడా రావచ్చని సౌదీ రాజులు భయపడ్డారని కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకే వారు ముస్లిం బ్రదర్ హుడ్ కి వ్యతిరేకంగా ఈజిప్టు మిలట్రీకి మద్దతు ఇచ్చారని వారి వివరణ. ఇందులో ఎన్ని నిజాలు ఉన్నప్పటికీ సౌదీ, ఈజిప్టు మిలట్రీలు అంతిమంగా అమెరికాకు జో హుకుం అనేవారే. ఈ విధంగా చూసినపుడు ఈజిప్టులో సంభవించిన రెండో తిరుగుబాటు కూడా అమెరికాకు అనుకూలమైన వినాశకర ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక విధానాలు కొనసాగించే ప్రభుత్వాల కొనసాగింపే అమెరికా లక్ష్యంగా ఉంటుంది. వాళ్ళు ముబారక్ కావచ్చు, ముస్లిం బ్రదర్ హుడ్ కావచ్చు లేదా ఇప్పుడు మళ్ళీ పై చేయి సాధిస్తున్న మిలట్రీ కావచ్చు.

అయితే ఈజిప్టులో చెలరేగుతున్న ప్రతి ప్రజా తిరుగుబాటులోనూ అక్కడి ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. వారు తమ పరిస్ధితుల మెరుగుకోసం తపిస్తున్నారు. ముబారక్ హయాంలోనూ తమ దుంప తెంచుతున్న ఐ.ఎం.ఎఫ్ ఆర్ధిక విధానాల ప్రభావానికి వ్యతిరేకంగా వారు ఉద్యమించారు. ఇప్పుడు ముస్లిం బ్రదర్ హుడ్ కి వ్యతిరేకంగా కూడా వారు అదే కారణంతో ఉద్యమిస్తున్నారు. కాకపోతే వారు వివిధ ద్రోహుల కింద చీలి ఉన్నారు. అమాయకంగా తమ ప్రయోజనాలకు ద్రోహం తలపెడుతున్న శక్తులనే మళ్ళీ మళ్ళీ నమ్ముతున్నారు. భారత దేశంలో ఏ పార్టీ అధికారానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు-ఐ.ఎం.ఎఫ్-ప్రపంచ వాణిజ్య సంస్ధలు నిర్దేశించిన నూతన ఆర్ధిక విధానాల్నే అనుసరిస్తాయి. కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రం వ్యతిరేకత నటిస్తాయి. దానితో ప్రజలు మళ్ళీ మళ్ళీ ఒక పార్టీని దించి మరో పార్టీని ఎక్కించడం తప్ప సరైన ప్రత్యామ్నాయాన్ని వారు ఎంచుకోలేకపోతున్నారు. అదే తరహాలో ఈజిప్టులో కూడా ప్రజలు మోసపోతున్నారు. వారి ప్రయోజనాలకు నిఖార్సయిన రీతిలో ప్రాతినిధ్యం వచించే శక్తులకు బలం లేకపోవడం దానికి ఒక కారణం.

(ఈ ఫొటోలు ప్రధానంగా రష్యా టుడే నుండి సేకరించినవి. కొన్ని ట్విట్టర్ నుండి కూడా. ఒక పరిణామం గురించి చర్చించుకునేటపుడు మాటలు ఒక స్ధాయి అవగాహనను ఇస్తాయి. దృశ్యాలు ఇంకొంత అవగాహన ఇస్తాయి. ఈ రెండూ కలిస్తే మరింత రియల్ ఇమేజినేషన్ కు దగ్గరగా వెళ్తాము. అందుకే ఫొటోలు ఇవ్వడం అంటే నాకు ఆసక్తి ఎక్కువ. విశేఖర్)

ఈ పరిస్ధితుల్లో ఈజిప్టులో ప్రజలపై అక్కడి మిలట్రీ సాగిస్తున్న మారణహోమాన్ని ప్రజాస్వామ్య ప్రియులు గట్టిగా వ్యతిరేకించాలి. స్ధానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటలకు మొదలయిన మిలట్రీ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వార్తలు చెబుతున్నాయి. మోర్శిని అధ్యక్షుడుగా పునః ప్రతిష్టించాలని బ్రదర్ హుడ్ కార్యకర్తలు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రాజధాని కైరో నగరంలో రెండు చోట్ల (రబ్బా ఆల్-అదావియా మసీదు వద్ద, మరియు నహ్దా స్క్వేర్ వద్ద)   వారు నిరంతరాయంగా బైఠాయింపు జరుపుతున్నారు. ఈ బైఠాయింపుల మీదికి బుధవారం మిలట్రీ తన ట్యాంకులు నడిపించింది. బ్రదర్ హుడ్ కార్యకర్తలు నిర్మించిన బ్యారీకేడ్లను కూల్చివేస్తూ శిబిరంలోపలికి దూసుకుపోయి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 60 మంది చనిపోయారని రష్యా టుడే పత్రిక చెప్పగా, బి.బి.సి 90 మంది చనిపోయారని తెలిపింది. ఏ.ఎఫ్.పి వార్తా సంస్ధ 124 మంది మృతులను తమ విలేఖరి లెక్కించాడని తెలిపింది. బ్రదర్ హుడ్ ప్రతినిధులు మాత్రం 800కి పైగా చనిపోయారని చెబుతున్నారు. ఆర్.టి ప్రకారం 2000కు పైగా మృతి చెందారని బ్రదర్ హుడ్ చెప్పింది. ఈ అంకెల్లో ఏది నిజమైనా అది దారుణమే. ప్రజల పేరు చెప్పి ఆ ప్రజలపైనే అమానుష నిర్బంధం ప్రయోగిస్తున్న దారుణం ఇది.

ఈజిప్టులో రెండేళ్ల క్రితం గానీ, ఇప్పుడు గానీ సాగిన, సాగుతున్న తిరుగుబాటులో ఒకవైపు ప్రజలు ఉంటే మరోవైపు అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే అమెరికా ప్రయోజనాలకు రెండేళ్ల క్రితం ముబారక్, మిలట్రీలు ప్రాతినిధ్యం వహిస్తే ఇప్పుడు లిబరల్స్, మిలట్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు సందర్భాల్లోనూ మిలట్రీ పాత్రధారిగా ఉండడం గమనార్హం. మిలట్రీ అధికారుల్లో (సర్వ సైన్యాధిపతి ఆల్-సిసి తో సహా) అనేకమంది అమెరికా యూనివర్సిటీల్లో చదువుకుని అమెరికా మిలట్రీ వద్ద శిక్షణ పొందినవారే అని ఈ సందర్భంగా గుర్తించాలి. ప్రజలు ఉద్యమించినప్పుడల్లా వారికి ముస్లిం బ్రదర్ హుడ్ గానీ, అమెరికా బ్యాంకులు పోషించే స్వచ్ఛంద సంస్ధలు గానీ, లేదా ఎల్-బరాది లాంటి లిబరల్స్ గానీ నాయకత్వం వహిస్తూ వారి ఆగ్రహాన్ని భద్రంగా తీసుకెళ్ళి మధ్యధరా సముద్రంలో కలిపేస్తున్నారు. అన్ని సందర్భాల్లోనూ అమెరికాకు వ్యతిరేకంగా ఎంత తీవ్రమైన నిరసనాగ్రహాలు వ్యక్తం అయినా ప్రజలకు నాయకత్వం వహిస్తున్న విద్రోహుల వల్ల వారి ఆకాంక్షలు నెరవేరని పరిస్ధితి దాపురిస్తోంది. ఈజిప్టు ప్రజలు ఈ నిజాన్ని గుర్తించి తమకు వాస్తవ ప్రతినిధులు ఎవరో గుర్తించేవరకూ ఈ విద్రోహం కొనసాగుతూ అమెరికా క్షేమంగా బైటపడుతుంది.

2 thoughts on “ఈజిప్టులో మళ్ళీ ఎమర్జెన్సీ, రక్తం పారిస్తున్న మిలట్రీ

  1. అవును విశేఖర్ గారూ.
    వంద మాటల్లో చెప్ప లేనిది ఒక్క ఫోటో చెపుతుంది. మీరు విషయం తో పాటు విలువైన ఫోటోలు ఇస్తుంటారు. ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s