సరిహద్దులో పాకిస్ధాన్ ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని పత్రికలు, ఛానెళ్లు కొద్ది రోజులుగా చెబుతున్నాయి. దేశంలో పరిస్ధితి తమకు అనుకూలంగా లేనప్పుడు, పార్లమెంటులో ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన బిల్లులు ప్రవేశపెట్టి, ప్రతిపక్షాలు నిరసనల రూపంలో ఇచ్చే పరోక్ష మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదించాలనుకున్నపుడు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తడం మామూలు విషయమే. ఈ ఎత్తుగడల్లో సైనికుల ప్రాణాలు ఉట్టిపుణ్యానికి హరీమన్నా పాలక పెద్దలకు లెక్కా, జమా ఉండవు. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు కూడా ఆదేకోవలోనివే అయినట్లు కనిపిస్తోంది.
పార్లమెంటులో పచ్చి ప్రజా వ్యతిరేక బిల్లులు ఆమోదం పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఇన్సూరెన్స్ బిల్లు, ఆహార భద్రతా బిల్లు ముఖ్యమైనవి. భీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 24 శాతం నుండి 49 శాతానికి పెంచుతూ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొంది రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నది. బుధవారం (ఆగస్టు 14) రాజ్యసభ ఎజెండాలో ఈ బిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది.
భీమారంగం జాతీయకరణ కార్మికవర్గం అనేక కష్టానష్టాలకు ఓర్చి పోరాడి సాధించుకున్నారు. భారత జీవిత భీమా సంస్ధకు ప్రపంచంలోనే అత్యున్నత సమర్ధవంతమైన సంస్ధగా ప్రఖ్యాతి ఉన్నది. క్లైముల పరిష్కారంలోగానీ, మారుమూలల పల్లెలకు సైతం భీమా సౌకర్యాన్ని తీసుకెళ్లడంలో గానీ ఎల్.ఐ.సి కి మించింది ప్రపంచంలోనే లేదు.
నష్టాలలో ఉన్న కంపెనీలను ఒడ్డున చేర్చడానికీ, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకోడానికీ ప్రభుత్వరంగాన్ని స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీలకు అప్పజెబుతున్నామని పాలకులు చెబుతున్నారు. కానీ ఎల్.ఐ.సి ఈ కోణాలన్నింటిలో ఇప్పటికీ అభివృద్ధి సాధించింది. అతున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎల్.ఐ.సి ఉపయోగిస్తోంది. పైగా అత్యధిక లాభాలతో నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి చిన్న చిన్న మునిసిపాలిటీల వరకూ ప్రభుత్వాలకు అవసరమైన నిధులను ఎల్.ఐ.సి అందిస్తోంది. ఇలాంటి బంగారు బాతును ఒకేసారి పీక నులిమి చంపేసి కమీషన్లు సంపాదించడానికి పాలకులు తెగిస్తున్నారు.
ఆహార భద్రతా బిల్లు వాస్తవానికి అశేష శ్రామిక జనానికి ఆహార అబధ్రత తీసుకోచ్చేందుకే దోహదపడనుంది. అవినీతిని అరికట్టే పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్ధను రద్దు చేసి ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలలో గణనీయంగా కోతపెట్టడానికి ఈ బిల్లు తెస్తున్నారు. అవినీతి నిర్మూలన చట్టాలను అమలు చేయడానికి పాలకులు ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. అత్యున్నత స్ధానాల్లో అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్ పాల్ బిల్లు తేవడంలో వారు వేస్తున్న కుప్పిగంతులే అందుకు ప్రబల సాక్ష్యం. అలాంటివారు ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్ధను బలహీనపరిచి, చివరికి రద్దు చేసి మెరుగైన వ్యవస్ధను తెస్తారని భావించడం అత్యాశే. ప్రజా పంపిణీ వ్యవస్ధను రద్దు చేసి మొత్తం కంపెనీల మార్కెటీకరణ పరిధిలోకి తేవాలని ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ లు విధించిన షరతుల్లో భాగంగానే ఆహార భద్రతా బిల్లు తెస్తున్నారు.
ఈ అంశాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి సరిహద్దు ఉద్రిక్తతలు చక్కగా దోహదపడుతున్నాయి. కాశ్మీరులో ఉన్నట్లుండి దాడులు పెరగడం, హఠాత్తుగా సరిహద్దుల అవతలివైపు నుండి దాడులు జరిగి భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఉభయ సభల్లో ఈ అంశంపై తలెత్తిన గందరగోళం ఇవన్నీ చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందేందుకు తగిన వాతావరణం కల్పిస్తున్నాయి.
పాకిస్ధాన్, భారత్ లు ఘర్షణలు మాని చర్చించుకోవాలని అమెరికా ఆదేశాలు జారీ చేస్తోంది. అందుకే భారత్ సరిగ్గా స్పందించడం లేదని బి.జె.పి ఆరోపిస్తోంది. పాకిస్ధానేమో చర్చలు అంటూనే కాల్పులకు దిగుతోందని, చర్చల బల్లనే పాక్ సైనికుల కాల్పులను కాచుకోవడానికి మన్మోహన్ వినియోగిస్తున్నారని ఈ కార్టూన్ సూచిస్తోంది. ఏది నిజమో ప్రజలకు ఎప్పుడూ అర్ధం కాదు. అర్ధం అయ్యేలోపు సైనికులు చనిపోవడం, ఉద్రిక్తతల్లో జనం చనిపోవడం, ఉద్రిక్తతలను సాకుగా చూపి కాశ్మీరు ప్రజలను మరింతగా సైనిక దిగ్బంధనంలోకి తేవడం ఎప్పుడూ జరిగేదే. భారత ప్రజలకు జాతీయాభిమానం కట్టలు తెంచుకుంటే, కాశ్మీరు ప్రజల జాతీయాకాంక్షలు మాత్రం మరింత అణచివేతలో నలిగిపోతాయి.
కాశ్మీర్ నుప్రత్యేకదేశంగా ఏర్పాటు చెయడమే సరిహద్దులలో ఉద్రిక్తతలశాశ్వత పరిష్కారమార్గం.
వి శేకర్ గారు చిన్న సవరణ fdi 26 శాతము నుండి 49 శాతము . *24 గా రాసారు
శివమురళి గారు, నిజమే. స్పీడ్ లో గమనించలేదు. ధన్యవాదాలు.
మీరు శ్రద్ధగా వార్తలు చూస్తారని అర్ధం అవుతోంది. ఐతే సవరణ చేయడం లేదు. పాఠకులకు మీ సవరణ చాలు. మీ పరిశీలన కూడా పాఠకులకు తెలియాలని నా కోరిక.
విశేఖర్ గారూ.
అలాగే “బీమా” కూడా. అది బీమా నే. భ కు వత్తు ఉండదు.
భీమునికి భీమా కు సంబంధం లేదు. మనలో చాలా మంది భీమా
అనుకుంటారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికి india ne pakistan ni kaalpulu jarapamantundi ani kondaru antunnaaru