"అబ్బో!"
"అబ్బే, అక్కడ సంతోషించడానికేమీ లేదులెండి. మన సరిహద్దులో పెరుగుతున్న దాడులు, చొరబాట్లను చూపించే గ్రాఫ్ అది!"
–
ఇటీవలి కాలంలో కాశ్మీరులో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. చొరబాట్లు కూడా పెరిగాయని పత్రికలు చెబుతున్నాయి. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైనికుల ఉపసంహరణ గడువు (డిసెంబర్ 2014) దగ్గర పడేకొద్దీ కాశ్మీరు లోనూ, సరిహద్దు లోనూ దాడులు పెరగడం గమనార్హం. గడువు సమీపిస్తున్న దృష్ట్యా తాలిబాన్ తో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా నానా తంటాలు పడుతోంది.
తాలిబాన్ కి సహకరించిన సో కాల్డ్ పాక్ ఉగ్రవాదులు ఇప్పుడు మళ్ళీ కాశ్మీరు సరిహద్దుపైకి దృష్టి మరల్చారని భావించాలా? తాలిబాన్ తో అమెరికా చర్చలు జరపనున్న నేపధ్యంలో భారత పాలకులు ఆందోళన చెందుతున్నారు. ఈ చర్చల సందర్భంగా భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని ఇటీవల ఇండియా పర్యటించిన అమెరికా విదేశీ మంత్రి జాన్ కేర్రీ హామీ ఇవ్వడం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవడం సముచితం. తాలిబాన్ వ్యతిరేక నార్త్రన్ అలయన్స్ తో భారత్ కు స్నేహ సంబంధాలు ఉన్నాయి. అమెరికా సైన్యం వెళ్లిపోతే తాలిబాన్ మద్దతుతో సీమాంతర ఉగ్రవాదం పెరిగిపోతుందని భారత పాలకుల భయం.
దాడులు, చొరబాట్లు పెరగడం ఒక విషయం అయితే వీటి కేంద్రంగా నాయకులు చేస్తున్న రాజకీయాలు మాత్రం వెగటు పుట్టిస్తున్నాయి.
భారత సైనికులపై జరిగిన ఆకస్మిక దాడిలో ఐదుగురు సైనికులు చనిపోయిన తర్వాత రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని చేసిన ప్రకటన వివాదాస్పదం అయింది. పాకిస్ధాన్ సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు ఈ దాడి జరిపారనీ దాడి పూర్తిగా నియంత్రణ రేఖకు ఇవతలే జరిగిందనీ రక్షణ మంత్రి ఎవరూ కోరకుండానే ఉభయ సభల్లో ప్రకటన చేశారు. దీనిని పాకిస్ధాన్ కు సర్టిఫికేట్ ఇవ్వడంగా బి.జె.పి ఆరోపించడంతో ఈ ప్రకటన కాస్తా తారుమారయింది. సరిహద్దుకు అవతలివైపు నుండి దాడి జరిగిందనీ, పాక్ సైనికులే ఈ దాడి చేశారనీ ఇప్పుడు మంత్రి చెబుతున్నారు.
పాలక, ప్రతిపక్షాలు ఇరువురి వైఖరీ ఇందులో అనుమానాస్పదంగా కనిపిస్తోంది. దాడి జరిపింది ఉగ్రవాదులే అయితే, వారు సరిహద్దుకు ఇవతలి నుండే ఆ దాడి చేస్తే, ఆ సమాచారం నిజమే అయితే ప్రతిపక్షాలకు అందులో ఎందుకు అభ్యంతరం ఉండాలి? దాడి సమాచారం మొదట ప్రభుత్వానికి వస్తుంది గానీ ప్రతిపక్షాలకు కాదు గదా? అలాంటప్పుడు మంత్రి మొదట ఇచ్చిన సమాచారాన్ని బి.జె.పి తదితర ప్రతిపక్షాలు ఏ ఆధారంతో విమర్శించి తిరస్కరించారు? పాకిస్ధాన్ ఎల్లప్పుడూ విలన్ పాత్రలోనే ఉండాలని ప్రతిపక్షాల ఉద్దేశ్యమా?
మొదటి సమాచారంతో విమర్శలు వచ్చాక ఆర్మీ చీఫ్ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారనీ, ఆయన ఇచ్చిన సమాచారం తర్వాత ప్రభుత్వ ప్రకటన తారుమారయిందని పత్రికల ద్వారా తెలుస్తోంది. మరి మొదట సమాచారం ఇచ్చినవారెవ్వరు? వారు ఆర్మీ చీఫ్ వచ్చాక తమ సమాచారాన్ని ఎందుకు మార్చారు? లేకపోతే మొదటే అబద్ధం చెప్పి తర్వాత నిజం చెప్పారా? అలా అయితే వాళ్ళు మొదట ఎందుకు అబద్ధం చెప్పారు? ప్రతిపక్షాల నిరసనలను బట్టి సరిహద్దులో జరిగిన ఒక దుర్ఘటనకు సంబంధించిన నిజానిజాలు ఎలా మారుతాయి?
పాలకులు, ప్రతి పక్షాలు రెండు కూడ బలుక్కున్నట్లు భారత ప్రజల్ని మభ్య పెట్టాడనికి ఆడుతున్న నాటకం! పాకిస్తాను భూచి చూపి, ప్రజల్ని గొర్రెలను చేసి అధి కారాన్ని హస్తగతం చేసు కోవాలని ఒక పార్టీ చూస్తుంటే, ఇంకోటేమో దానికా అవకాశం ఇవ్వకూడదని దానికంటే ముందుండాలని చాలా అడ్వాన్సు గా అడుగులు వేస్తుంది.. ప్రజలు అమాయకులు కాదని నిరూపించు కోవడానికి ఈ సారి రెండింటికి బుద్ది చెప్పాల్సివుంది.
Really this information is creating public in dailama. which first information is correct? Actually who has to pass this kind of info to whom? opposition or ruling party? Of course media will publish both versions, what they gather. How to get authenticated news in this regard or in any news like this.