ఎడ్వర్డ్ స్నోడెన్: రష్యాపై అమెరికా తీవ్ర అసంతృప్తి


వికీలీక్స్ ప్రతినిధి సారా తో స్నోడెన్

వికీలీక్స్ ప్రతినిధి సారా తో స్నోడెన్

ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా ప్రభుత్వం రాజకీయ ఆశ్రయం ఇవ్వడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తి ప్రకటించింది. సెప్టెంబర్ లో రష్యా వెళ్లనున్న ఒబామా సందర్శనను తాము పునఃసమీక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ విలేఖరులకు తెలిపాడని హఫింగ్టన్ పోస్ట్ పత్రిక తెలిపింది. రష్యాతో అమెరికాకు గల సంబంధాలు బహుముఖమైనవని, అయినప్పటికీ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన నేపధ్యంలో పుతిన్ తో ఒబామా జరపనున్న శిఖరాగ్ర సమావేశం సంభావ్యతను తాము పునర్మూల్యాంకనం చేస్తున్నామని కార్నీ తెలిపాడు.

స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వద్దనీ, అతన్ని తమ దేశానికి తిప్పి పంపాలని అమెరికా రష్యాను కోరింది. అనేక విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. బహిరంగంగా విన్నపాలు చేయడంతో పాటు ప్రైవేటుగా చర్చలు జరిపింది. స్నోడెన్ పైన మరణ శిక్ష అమలు చేసే ఉద్దేశ్యం లేదని చెప్పింది. ఒక అమెరికన్ ఖైదీగా ఎన్ని హక్కులు ఉంటాయో అన్నీ హక్కులూ స్నోడెన్ కు దఖలు పరుస్తామని వాగ్దానం చేసింది. సంబంధాలు మునుపటిలా ఉండవని బెదిరించింది.

ఎన్ని చేసినా రష్యా లొంగి రాలేదు. అమెరికా విజ్ఞాపనను పుతిన్ పెడచెవిన పెట్టాడు. అమెరికా-రష్యాల మధ్య ‘నేరస్ధుల అప్పగింత ఒప్పందం’ లేదని పుతిన్ అమెరికాకు గుర్తు చేశాడు. దానికి బదులిస్తూ స్నోడెన్ ను అప్పగించమని తాము కోరడం లేదనీ, అతన్ని స్వదేశానికి తిప్పి పంపాలని లేదా స్వదేశానికి బహిష్కరించాలని మాత్రమే తాము కోరుతున్నామని అమెరికా తెలిపింది. అంతర్జాతీయ చట్టాలలో తిప్పి పంపడం, స్వదేశానికి బహిష్కరించడం లాంటి టర్మినాలజీ ఏమీ లేదని పుతిన్ అమెరికా వాదనను తిప్పి కొట్టాడు. స్నోడెన్ ను అమెరికాకు తిప్పి పంపించే ఉద్దేశ్యమే తమకు లేదని పుతిన్ పదే పదే స్పష్టం చేశాడు.

“మేము స్పష్టంగా చట్టబద్ధంగా రష్యాకు విన్నవించాము. బహిరంగంగానూ, ప్రైవేటుగానూ స్నోడెన్ ను బహిష్కరించాలని కోరాము. అయినప్పటికీ రష్యా ఈ చర్యకు పాల్పడింది. రష్యా ఇలా చేస్తుందని మేము అనుకోలేదు. మేము తీవ్రంగా అసంతృప్తి చెందాము” అని కార్నీ తెలిపాడు.

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా వచ్చే సెప్టెంబరు నెలలో రష్యా వెళ్లవలసి ఉంది. జి 20 సమావేశాలకు హాజరు కావడానికి మాస్కో వెళ్లనున్న ఒబామా, పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపడానికి కూడా ముందుగా నిర్ణయించారు. ఈ ద్వైపాక్షిక సమావేశమే జరుగుతుందా లేదా అన్నది తాము సమీక్షిస్తున్నామని కార్నీ చెబుతున్నాడు. అయితే ఒబామా రష్యా వెళ్ళడం లేదని మాత్రం అమెరికా చెప్పడం లేదు. అమెరికా పార్లమెంటులోని ఇతర హౌస్, సెనేట్ సభ్యులు మాత్రం రష్యాపై నోరు పారేసుకునే అవకాశాన్ని వదులుకోలేదు.

“ఈరోజు రష్యా తీసుకున్న చర్య తీవ్ర అగౌరవకరం. అమెరికాని హీనపరచడానికి ఉద్దేశ్యపూర్వకంగా తీసుకున్న చర్య. అమెరికన్లందరి మొఖాలపైన చాచికొట్టిన చెంప దెబ్బ.” అని రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ మెక్ కెయిన్ వ్యాఖ్యానించాడు. ఈయన ఒబామా మొదటి టర్మ్ లో ఆయన చేతిలో ఓడిపోయిన అధ్యక్ష అభ్యర్ధి. అమెరికా మిలట్రీ దాడులకు ఎల్లవేళలా మద్దతు తెలిపే యుద్ధ పిపాసి. “పుతిన్ నేతృత్వంలోని రష్యాతో సంబంధాలపై అమెరికా పునారోలచన చేయాల్సిన సమయం ఆసన్నమయింది” అని మెక్ కెయిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.

లిండ్సే గ్రాహం, మెక్ కెయిన్ లిద్దరూ విడుదల చేసిన ప్రకటనలో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే రష్యాలో మానవ హక్కులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై అమెరికా విధించిన ఆంక్షలను ఇంకా విస్తృతం చేయాలని వారు డిమాండ్ చేశారు. స్నోడెన్ పై అమెరికా సాగిస్తున్న వేటే అమానుషమైన మానవ హక్కుల ఉల్లంఘనగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధలు అభివర్ణిస్తున్నాయి. అలాంటి స్నోడెన్ కు రక్షణ కల్పించినందుకు మానవహక్కుల ఆంక్షలు విస్తృతం చేయాలనడం అమెరికాకు మాత్రమే సొంతమైన పచ్చి హిపోక్రసీ.

డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ (న్యూయార్క్) అయిన చక్ షూమర్ అయితే జి20 సమావేశాలను మాస్కో నుండి వేరే చోటికి తరలించాలని డిమాండ్ చేశాడు. రష్యా లోని సోచి నగరంలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించాలని కూడా ఆయన కోరాడు. “రష్యా మనల్ని వెన్నుపోటు పొడిచింది. స్నోడెన్ రష్యాలో స్వేచ్ఛగా తిరిగే ప్రతి రోజూ మన వెన్నులో దింపిన కత్తిని ఒక రౌండ్ తిప్పడంతో సమానం” అని షూమర్ వాపోయాడు. అది మాత్రం నిజమే. స్నోడెన్ స్వేచ్ఛగా రష్యా వీధుల్లో సంచరించడం అంటే అమెరికాకి ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన చరిత్రపై చెరిగిపోని మచ్చ!

ఎన్ని కారుకూతలు కూసినప్పటికీ అంతకు మించి ఏమీ చేయలేని పరిస్ధితిలో అమెరికా ఉందనేది నిర్వివాదాంశం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s