ఎట్టకేలకు ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం (temporary asylum) మంజూరు చేసింది. దానితో స్నోడెన్ బంధ విముక్తుడయ్యాడు. గత ఐదు వారాలుగా మాస్కోలోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన స్నోడెన్ గురువారం తట్టా బుట్టా సర్దుకుని విమానాశ్రయం నుండి బైటకి వచ్చేశాడు. తద్వారా రష్యా భూభాగం పైకి అడుగు పెట్టాడు. స్నోడెన్ వీసా రద్దు చేయడం ద్వారా అతన్ని ఎలాగైనా రప్పించుకోవాలని పధకం వేసిన అమెరికాకు ఇది చావుదెబ్బ! అంతర్జాతీయ వేదికపై అమెరికా రాజకీయ పతన దిశలో మరో అడుగు. అమెరికా మానవ హక్కుల ఛాంపియన్ కాకపోగా అతి పెద్ద హక్కుల అణచివేతదారు అని దీని ద్వారా రష్యా చాటిచెప్పినట్లయింది.
స్నోడెన్ కు రష్యా మంజూరు చేసిన రాజకీయ ఆశ్రయం సంవత్సరం వరకు అమలులో ఉంటుంది. గడువు ముగిశాక స్నోడెన్ సదరు గడువును పొడిగించమని కోరవచ్చు. రష్యా మంజూరు చేసిన ఆశ్రయం ప్రకారం ఆయన ఇప్పుడు రష్యా అంతటా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. అయితే ఆయన రష్యా దాటి వెళ్లడానికి వీలు లేదు. విమానాశ్రయం నుండి బైటికి వచ్చాక స్నోడెన్ ఎక్కడికి వెళ్లిందీ, ఎక్కడ ఉండబోతున్నదీ వివరాలు చెప్పడానికి అతని సహాయకులు, లాయర్ నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా ఆ వివరాలు చెప్పలేమని తెలిపారు. రష్యాలో స్నోడెన్ కు అమెరికన్ మిత్రులు ఉన్నారని, వారి వద్ద స్నోడెన్ ఉండవచ్చని రష్యా అధికారులు సూచన ప్రాయంగా తెలిపారు. అంతకుమించి వివరాలు ఇవ్వడానికి వారు నిరాకరించారు.
జూన్ 23 తేదీన హాంగ్ కాంగ్ నుండి మాస్కో వచ్చిన స్నోడెన్ అక్కడి నుండి ఈక్వడార్ గానీ వెనిజులా గానీ వెళ్లవలసి ఉంది. అయితే అమెరికా స్నోడెన్ వీసా రద్దు చేయడంతో ఆయన అక్కడి నుండి కదలడానికి వీలు లేకుండా పోయింది. అమెరికా రహస్యాలు మరిన్ని వెల్లడి చేయకుండా ఉన్నట్లయితే తాము రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్, స్నోడెన్ కు ఆఫర్ ఇచ్చాడు. మరో గత్యంతరం లేని పరిస్ధితుల్లో పుతిన్ షరతుకు ఒప్పుకోక తప్పలేదు. ఫలితంగా తాత్కాలిక రాజకీయ ఆశ్రయం మంజూరు కావడంతో స్నోడెన్ గురువారం విమానాశ్రయం నుండి బైటికి వచ్చి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడు.
- Snowden leaves Shermetyevo Airport
- Kucherena shows Snowden’s asylum docs
స్నోడెన్ వెంట వికీ లీక్స్ ప్రతినిధి సారా హేరిసన్ ఉన్నారని వికీలీక్స్ ప్రతినిధి చెప్పగా ఆయనతో ఎవరూ లేరని స్నోడెన్ లాయర్ అనటోలి కుచెరెనా పత్రికలకు తెలిపారు. “ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా కావలసిన వ్యక్తి. ఆయన రక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం” అని కుచెరెనా విలేఖరులకు తెలిపారు.
స్నోడెన్ ను తమకు అప్పగించాలని అమెరికా తీవ్రంగా ఒత్తిడి తెచ్చినప్పటికీ రష్యా నిరాకరించింది. అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ స్వయంగా రష్యా విదేశీ మంత్రి లావరోవ్ తో మాట్లాడినప్పటికీ స్నోడెన్ అప్పగింతకు రష్యా ఒప్పుకోలేదు. అమెరికా-రష్యా ల మధ్య నేరస్ధుల ఒప్పందం ఏమీ లేదని పుతిన్ పదే పదే ప్రకటించాడు. స్నోడెన్ ను అప్పగించమని తాము కోరడం లేదనీ, కేవలం అతన్ని తిప్పి పంపపని మాత్రమే తాము కోరుతున్నామని అమెరికా అధికారులు తెలిపారు.
ఈ వాదనను కూడా రష్యా తిరస్కరించింది. అంతర్జాతీయ సంబంధాలలో ‘తిప్పి పంపడం’ అనే టర్మినాలజీ ఏమీ లేదనీ కాబట్టి స్నోడెన్ ను అప్పగించడం కుదరదని రష్యా మొహమాటం లేకుండా చెప్పేసింది. వెనిజులా, బొలీవియా, నికరాగువా దేశాలు సైతం స్నోడెన్ కు శాశ్వత రాజకీయ ఆశ్రయం ఇస్తామని ప్రకటించాయి. అయితే స్నోడెన్ వీసా రద్దు చేయడంతో ఆయన లాటిన్ అమెరికా దేశాలకు ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది.
ఇదిలా ఉండగా స్నోడెన్ వృత్తాంతం రష్యా-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం పడవేయనున్నదీ ఆసక్తికరంగా మారింది. త్వరలో అమెరికా అధ్యక్షుడు ఒబామా రష్యా సందర్శించ వలసి ఉంది. ఇప్పుడు ఈ సందర్శనపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. ఒబామా సందర్శనకు ఎటువంటి అవాంతరమూ ఉండబోదని తాము నమ్ముతున్నట్లు రష్యా అధికారులు విశ్వాసం వ్యక్తపరిచారు. అయితే అమెరికా నుండి ఎటువంటి సమాచారం ఇంకా అందలేదని ఆర్.టి తెలిపింది.
అమెరికాకు వ్యతిరేకంగా రష్యా స్నోడెన్ కు ఆశ్రయం ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం..