దుర్గా నాగపాల్: 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించా


యమన ఒడ్డున సీజ్ చేసిన అక్రమ ఇసుక

యమన ఒడ్డున సీజ్ చేసిన అక్రమ ఇసుక

ఉత్తర ప్రదేశ్ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ను తాను 41 నిమిషాల్లో సస్పెండ్ చేయించానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు వాగుతుండగా రికార్డు చేసిన వీడియో బైటకొచ్చింది. దీనితో శాంతిభద్రతలను నియంత్రించడంలో భాగంగానే ఆమెను సస్పెండ్ చేశామన్న యు.పి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఫలితంగా అఖిలేష్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందిలో పడినట్లయింది. మింగలేక, కక్కలేక సమాధానాలు వెతుక్కోవలసిన పనిలో రాష్ట్ర ప్రభూత్వం పడిపోయింది. నిజాయితీ అధికారుల కంటే ఇసుక మాఫియాయే తమకు ఎక్కువని ఎస్.పి తేటతెల్లం చేసుకున్నట్లయింది.

సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా పని చేస్తున్న యువ ఐ.ఎ.ఎస్ అధికారి దుర్గాశక్తి నాగపాల్ ను మత ఉద్రిక్తతలకు దారితీసే చర్యకు పాల్పడిందని ఆరోపిస్తూ యు.పి ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 28 యేళ్ళ దుర్గ సస్పెన్షన్ అక్రమమని, రూల్స్ కు విరుద్ధంగా జరిగిందని యు.పి ఐ.ఎ.ఎస్ అధికారుల సంఘం ఆందోళన నిర్వహిస్తూ, సమగ్ర విచారణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం విజ్ఞప్తి చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలేష్ తన చర్యను గట్టిగా సమర్ధించుకుంటున్నారు. సస్పెన్షన్ ను రద్దు చేసేది లేదని ఆయన గట్టిగా చెబుతున్నారు. ఈ పరిస్ధితుల్లో వెల్లడయిన వీడియో రాష్ట్ర ప్రభుత్వం పరువును గంగలో కలపడమే కాక అఖిలేష్ ను ఆత్మరక్షణలో పడవేసింది. (వీడియోను ఇక్కడ చూడండి)

రాష్ట్ర ప్రభుత్వంలో ఆగ్రో ఛైర్మన్ గా పని చేస్తున్న నరేంద్ర భాటి ఇసుక మాఫియాకు గట్టి వత్తాసు ఇస్తున్న రాజకీయ నాయకుడుగా పేరు ప్రతిష్టలు గడించాడు. ఆగ్రో ఛైర్మన్ గా మంత్రి స్ధాయి హోదాను ఆయన అనుభవిస్తున్నాడు. గ్రేటర్ నొయిడా ప్రాంతంలోని తన మద్దతుదారులతో మాట్లాడుతూ ఆయన తాను ముఖ్యమంత్రి అఖిలేష్, పార్టీ సుప్రీ ములాయంలతో ఫోన్ లో మాట్లాడి 41 నిమిషాల్లో దుర్గాశక్తి నాగపాల్ ను సస్పెండ్ చేయించానంటూ నిజం కక్కాడు. ఉదయం గం. 10:30 ని.కి తాను నాయకులకు ఫోన్ చేస్తే గం. 11:11 ని.లకల్లా దుర్గ నాగపాల్ కు సస్పెన్షన్ ఆదేశాలు అందాయని చెప్పాడు.

ఇంకా ఘోరం ఏమిటంటే దీనినే ఆయన “ప్రజాస్వామ్యం యొక్క శక్తి” గా చెప్పుకోవడం. 2014 సాధారణ ఎన్నికల్లో ఈయన నొయిడా నుండి ఎం.పి గా పోటీ చేయనున్నాడని ది హిందు పత్రిక తెలిపింది. దుర్గ నాగపాల్ సస్పెండ్ అయినదగ్గర్నుండి ఈయనే దానికి సూత్రధారి అన్న ఆరోపణలు ఇప్పటికే వ్యాపించి ఉన్నాయి. ఇసుక మాఫియా ఒత్తిడి మేరకు నరేంద్ర ఈ చర్యకు పాల్పడ్డాడని రాష్ట్రంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇసుక మాఫియాతో చెట్టాపట్టాలు వేసుకుంటూ నరేంద్ర అక్రమ దందాలు నిర్వహిస్తున్నాడని బి.జె.పి నాయకులు ఆరోపించారు. సి.బి.ఐ విచారణను కూడా బి.జె.పి డిమాండ్ చేసింది.

Duga Shaktiవీడియో విడుదల అయిన అనంతరం ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలకోరుగా అవతరించాడని ఘాటుగా విమర్శిస్తున్నాయి. “ఐ.ఎ.ఎస్ అధికారి సస్పెన్షన్ పాలనాపరమైన నిర్ణయమని ముఖ్యమంత్రి గురువారం దాకా చెబుతూ వచ్చాడు. కానీ వాస్తవంగా అది ఒక నిజాయితీ కలిగిన అధికారిపై రాజకీయ ప్రతీకారంతో తీసుకున్న చర్య అని స్పష్టం అయిపోయింది” అని బి.జె.పి ప్రతినిధి విజయ్ పాఠక్ వ్యాఖ్యానించాడు. బి.ఎస్.పి రాష్ట్ర శాఖ నైతిక బాధ్యత వహించి అఖిలేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

వీడియో వెల్లడితో పరిస్ధితి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఇబ్బందికరంగా మారిందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు అంగీకరించినట్లుగా ది హిందూ తెలిపింది. ఏదో విధంగా దీని నుండి బయటపడకపోతే ఇది త్వరలోనే ప్రభుత్వం మెడకు చుట్టుకునే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

నిర్మాణంలో ఉన్న ఒక మసీదు గోడను సరైన ప్రభుత్వ ప్రక్రియను పాటించకుండా కూల్చివేయడానికి దుర్గ నాగపాల్ ఆదేశాలివ్వడంతో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తడానికి అవకాశం ఏర్పడిందని దానివల్లనే ఆమెను సస్పెండ్ చేశామని అఖిలేష్ ప్రకటించాడు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదిక ప్రకారం వాస్తవం అది కాదు. మసీదు కోసం నిర్మిస్తున్న గోడ అక్రమ కట్టడం అవుతుందని దుర్గ శక్తి నాగపాల్ గ్రామస్ధులకు చెప్పడంతో వారే తమంతటతాముగా గోడను కూల్చివేసుకున్నారు. తమ అబద్ధాలను ఈ నివేదిక తిరస్కరించడంతో ప్రభుత్వం ఏకంగా నివేదికనే తిరస్కరించింది.

అక్రమ మైనింగ్ పై కోర్టు తాఖీదులు

ఐ.ఎ.ఎస్ అధికారి సస్పెన్షన్ లో జోక్యం చేసుకోవడానికి అలహాబాద్ హై కోర్టు నిరాకరించింది. “ఇది యజమాని సేవకుల మధ్య ఉండే వ్యవహారం” అంటూ కోర్టు జోక్యానికి నిరాకరించింది. తద్వారా ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్లు ఇరువురు ప్రజా సేవకులేననీ, ఒక సేవకుడు మోసం చేస్తుంటే మరో సేవకులు అడ్డుకున్నారన్న అంశాన్ని కోర్టు పూర్తిగా విస్మరించింది. సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలంటూ ఒక స్వచ్ఛంద సంస్ధ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తూ ద్విసభ్య బెంచి ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే యమునా నది ఒడ్డున ఇసుకను అక్రమంగా తవ్వి తరలించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇసుక తరలింపు వలన యమునా నదీపరీవాహక ప్రాంతంలో పర్యవారణ సమతుల్యత దెబ్బతింటోందని కోర్టు అభిప్రాయం పడింది. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా ఎన్ని ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయో, ఎన్ని డంపర్లు స్వాధీనం చేసుకున్నారో, ఎంతమందిని అరెస్టు చేశారో వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని కోరింది. అలాగే ఈ విషయంలో కేంద్రం తీసుకున్న చర్యలు ఏమిటో తెలియజేయాలని కోరింది.

ఒక దెబ్బ, రెండు పిట్టలు

దుర్గాశక్తి నాగపాల్ సస్పెన్షన్ ద్వారా సమాజ్ వాదీ పార్టీ ఒకే చర్యతో రెండు ప్రయోజనాలు సాధించదలిచిందని పత్రికలు విశ్లేషిస్తున్నాయి. మసీదు గోడ కూల్చివేతను అడ్డుకోవడం ద్వారా మైనారిటీల ప్రయోజనాలను తాము మాత్రమే రక్షిస్తామని చాటుకోవడం ఒక ప్రయోజనం అయితే ఇసుక మాఫియాకు కంట్లో నలుసుగా మారిన ఒక నిజాయితీ అధికారిని అడ్డు తప్పించుకోవడం రెండో ప్రయోజనం. వీడియో బైటికి రానట్లయితే ఈ ప్రయోజనాలు నెరవేరేవే అనడంలో సందేహం లేదు. కానీ వీడియో వలన ఒకే చర్యపై రెండు వాదనలను ప్రభుత్వం వినిపించినట్లయింది. ఒకే దెబ్బకు కొట్టాలనుకున్న రెండు పిట్టలు ఒకదానితో ఒకటి పోటీపడి తమ అసలు రంగునే బైటపెట్టే పరిస్ధితి దాపురిస్తుందని పాలకులు ఊహించి ఉండరు.

ది హిందూ పత్రిక ప్రకారం నరేంద్ర భాటి 2009 ఎన్నికల్లో నొయిడా నియోజకవర్గంలో 16.05 శాతం ఓట్లతో మూడో స్ధానంలో నిలిచాడు. బి.ఎస్.పికి 33.24 శాతం ఓట్లు రాగా బి.జె.పి కి 31.08 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి 15.73 శాతం ఓట్లతో నాలుగో స్ధానంలో నిలిచాడు. ఈ నియోజకవర్గంలో మతప్రాతిపదికన జనాన్ని చీల్చినట్లయితే బి.ఎస్.పి, కాంగ్రెస్ లు దండుకున్న ముస్లిం ఓట్లను తాను గెలుచుకోవచ్చని నరేంద్ర పధకం పన్నాడని పత్రిక తెలిపింది. ఈ మేరకు ముస్లిం నేత అజామ్ ఖాన్ లాంటివారు సైతం ఇసుక మాఫియాకు బహిరంగంగానే మద్దతుగా పలికారు. “సహజ వనరులను వినియోగించుకోవడానికి ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది” అంటూ ఆయన ఇసుక మాఫియాకు మద్దతు ఇచ్చాడు. “రాముడి పేరుతో మీరు దోపిడీ చేసుకోవచ్చు గదా?” అని ఆయన రాంపూర్ లో మాట్లాడుతూ ప్రశ్నించాడని తెలుస్తోంది. రాముడి పేరుతో కొందరు లూటీ చేస్తే ‘సహజ వనరులపై హక్కు’ పేరుతో మరి కొందరు లూటీ చేయవచ్చన్నమాట!

రబుపురా ప్రాంతం లోని కదల్పూర్ గ్రామస్ధుల ప్రకారం ప్రభుత్వ భూమిలో మసీదు నిర్మాణానికి గ్రామ పంచాయితీ కొద్ది నెలల క్రితం అనుమతి ఇచ్చింది. శంకుస్ధాపనకు నరేంద్ర భాటి కూడా హాజరయ్యాడు. తాను కూడా కొంత డబ్బు విరాళం ప్రకటించాడు. అయితే జిల్లా మేజిస్ట్రేట్ నుండి అనుమతి తీసుకోవాలి. వాస్తవానికి సుప్రీం కోర్టు ఏర్పరిచిన నిబంధనల ప్రకారం మేజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి.  కాబట్టి గోడ కూల్చివేతకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు గా దుర్గ శక్తి నాగపాల్ కు అన్నీ అధికారాలూ ఉన్నాయి.

జిల్లా మేజిస్ట్రేట్ నివేదిక ప్రకారం: అక్రమ కట్టడం జరుగుతున్నందున కదల్పూర్ గ్రామాన్ని సందర్శించాల్సిండిగా దుర్గ నాగపాల్ కు ఫిర్యాదు అందింది. ఎస్.డి.ఎం గ్రామానికి వచ్చి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. నిర్మాణం అప్పుడే ప్రారంభం అయినందున అది ఎ తరహా నిర్మాణమో కూడా స్పష్టత లేదు. గ్రామాన్ని సందర్శించిన నాగపాల్, తదితర అధికారులు నిర్మాణం అక్రమమైందిగా గుర్తించారు. ఇప్పటికైనా నిర్మాణానికి తగిన అనుమతి తీసుకోవాలని లేదా దానిని కూల్చనైనా కూల్చాలని వారు గ్రామస్ధూలకు తెలిపారు. గ్రామస్ధులు అనుమతి తీసుకోవడానికి బదులు స్వయంగా కూల్చివేయడానికి నిర్ణయించుకున్నారు.

ఇందులో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా దుర్గ నాగపాల్ చేసిన తప్పేమీ లేదన్నది స్పష్టమే. ఎన్నికల్లో గెలుపుకోసం అవకాశాలకై చూస్తున్న నరేంద్ర వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. దానిలో భాగంగానే తన మద్దతుదారుల వద్ద తానే అధికారిని సస్పెండ్ చేయించానని చెప్పుకున్నాడు. కానీ అక్కడే కధ అడ్డం తిరిగింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s