టి.డి.పి, వైకాపాలే తెలంగాణకు కారణం -కాంగ్రెస్ మంత్రులు


ఒంగోలులో మానవహారం

ఒంగోలులో మానవహారం

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మేల్యేలు, నాయకులు ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం వారి దృష్టిలో తెలంగాణకు కారకులు కాదు. తెలుగుదేశం, వైకాపాలు తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం వల్లనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటించింది తప్ప వారికి ఇవ్వాలని ఏ కోశానా లేదు. టి.డి.పి, వైకాపాల లేఖలకు, రాష్ట్ర విభజనకు నిరసనగా తాము రాజీనామాలు చేయడానికి నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మేల్యేలు అసెంబ్లీ వద్ద ప్రకటించారు.

ది హిందు పత్రిక ప్రకారం గురువారం కాంగ్రెస్ కి చెందిన మంత్రులు, ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సిలు అత్యవసరంగా సమావేశం అయ్యారు. రాయల సీమ, కోస్తాంధ్ర జిల్లాలలో ప్రజలు తెలంగాణ విభజనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశం నిర్వహించారని పత్రిక తెలిపింది. సమైక్యాంధ్ర విద్యార్ధి జె.ఎ.సి పేరుతో 72 గంటల బందుకు పిలుపు ఇవ్వడమే కాక వివిధ జిల్లాల్లో దానిని అమలు చేస్తున్నారు. బుధవారం వివిధ కార్యాలయాలను మూసివేసి, ర్యాలీలు, రాస్తారోకులు నిర్వహించిన విద్యార్ధులు గురువారం మానవ హారాలు, ర్యాలీలకు పరిమితం అయినట్లు వార్తలు చెబుతున్నాయి.

మంత్రులు తమ రాజీనామాలను గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించడానికి నిర్ణయించారని ది హిందు తెలిపింది. కొంతమంది మంత్రులు రాజీనామా చేసేశారని కూడా ఛానెళ్లు చెబుతున్నాయి. 7 గురు మంత్రులు రాజీనామా చేశారని ఈ టీవి చెబుతుండగా 11 మంది మంత్రులు రాజీనామా చేశారని జెమిని టి.వి చెబుతోంది. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి, పి.సి.సి చీఫ్ బొత్సలు రాజీనామాలు వద్దని వారిస్తున్నారని టీవి9 చెబుతుంటే రాజీనామా సమర్పించినవారి జాబితాలో బొత్స పేరును కూడా జెమిని టి.వి చేర్చింది. 21 మంది ఎమ్మేల్యేలు సైతం రాజీనామా చేశారని టి.వి9 కధనం.

సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, నాయకుల ఆరోపణలను తిరస్కరిస్తున్నారు. డ్రామాలు కట్టిపెట్టాలని సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి,

మరోపక్క తెలంగాణలో మరో రకమైన వైరుధ్యాలు కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో తమదే ఆధిపత్యం అని నిరూపించుకోవడానికి వివిధ నేతల మధ్య పోటీలు నెలకొన్నాయని తెలుస్తోంది. ఢిల్లీ నుండి తిరిగొచ్చిన తెలంగాణ నేతలను ఆహ్వానించేందుకు హైద్రాబాద్ లో విమానాశ్రయం చేరుకున్న కార్యకర్తలు ఈ పోటీకి ప్రతినిధులుగా మారారు. ముఖ్యంగా జానా రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజనరసింహల మధ్య ఈ పోటీ తలెత్తినట్లు సమాచారం.

ఆరు నెలల్లో –షిండే

ఈ వారంలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడానికి అవకాశం లేదని కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. అయితే ఆరు నెలల్లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని కూడా చెప్పారు. “లేదు. ఈ సెషన్ లో కాదు. అంత త్వరగా సాధ్యమని నేను అనుకోవడం లేదు. బహుశా తదుపరి సెషన్ లో వీలు పడొచ్చు” అని షిండే ఢిల్లీలో విలేఖరులకు తెలిపారు. వర్షాకాలం సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని బి.జె.పి అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ డిమాండ్ చేసిన నేపధ్యంలో షిండే ఈ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సాధారణంగా 8 నుండో 10 నెలలు పడుతుందని కానీ తెలంగాణ మాత్రం సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని షిండే తెలిపారు. “సాధారణంగా 8 నుండి 10 నెలల సమయం పడుతుంది. కానీ ఇంకా ముందే -బహుశా ఐదున్నర నెలల నుండి ఆరు నెలల లోపే (తెలంగాణ) ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాము. వీలయితే అంతకంటే తక్కువ సమయం కూడా పట్టోచ్చు” అని షిండే తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీని పక్కకు తప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన ఒకింత అనుమానాస్పదమైన సమాధానం ఇచ్చారు. “అదేం లేదు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ అంశాన్ని చర్చించింది. ఆ ప్రతిపాదన అసెంబ్లీ నుండే వస్తే మంచిదే. కానీ అలా రాకపోతే మిగిలిన మార్గాలు ఎలాగూ ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం చర్చించి ముందుకు పోతాము” అని షిండే వ్యాఖ్యానించారు. ఎ.పి అసెంబ్లీ ఇప్పటికే చర్చించినందున ఇక అసెంబ్లీ అభిప్రాయం తీసుకోరా? అనే ప్రశ్న షిండే సమాధానం రేకెత్తిస్తోంది. అయితే ది హిందు పత్రిక ప్రకారం కేంద్ర కేబినెట్ మొదట అసెంబ్లీ నుండి అభిప్రాయాల కోసం ఎదురు చూడనుందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. తినబోతూ రుచి అడగడం ఎందుకని అడుగుతున్నవారూ లేకపోలేదు.

10 thoughts on “టి.డి.పి, వైకాపాలే తెలంగాణకు కారణం -కాంగ్రెస్ మంత్రులు

 1. తెలంగాణాకు కారణం 1999 లో తెలుగు దేశం ప్రభుత్వం లో కేసీఆర్ కు మంత్రి పదవి దక్కక పోవటమే

 2. తెలుగు ప్రజలకు ఒక విన్నపం !
  అనేక ఉద్యమాలూ త్యాగాల ఫలితం గా ఆంధ్ర ప్రదేశం అవతరించింది.అట్లాగే అనేక ఉద్యమాలు జరిగి , అనేక వందల మంది ప్రాణాలు కోల్పోయిన తరువాత, తెలంగాణా ఏర్పాటు కు పచ్చ జండా ఊపడం జరిగింది. ప్రాణాలు త్యాగాలు చేసిన వారి ఆదర్శం , ప్రాంతాలు విడిపోయి, మోడు వారిన బ్రతుకులు వెళ్ళ బుచ్చే ప్రజలు కాదు ! అట్లాంటి వారి బ్రతుకులు చిగురించాలని !
  ఇటీవలి తెలంగాణా ఉద్యమం జరుగుతూ ఉన్న సమయం లో, కేవలం కోపోద్రేకాలతో, ఇరు ప్రాంతాల ప్రజలనూ రెచ్చ గొట్టి ,ప్రజలకు కావలసినది కాక , రాజకీయ నాయకులు,కేవలం తమ తమ స్వంత ప్రయోజనాలనూ , తమ పార్టీ ప్రయోజనాలనూ పణం గా పెట్టి , కేంద్రం తో లావాదేవీలు జరిపారే కానీ , ఆంధ్ర ప్రదేశం లో నివసిస్తున్నప్రజలందరి మనోభావాలనూ , ప్రయోజనాలనూ కాంక్షించి, నిర్ణయాలు తీసుకోలేదనే విషయం నిర్వివాదాంశం ! తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం, తర తరాల తెలుగు భవితను చిన్నా భిన్నం చేయడం ఎంత వరకూ సమంజసం ?
  ఈ ప్రాంతీయ ద్వేషాలూ , వైషమ్యాలూ,ఒక ప్రాంతం వారు ఇంకో ప్రాంతం వారి మీద చూపించు కోవడమూ , రెచ్చ గొట్టు కోవడమూ కాకుండా , కొన్ని దశాబ్దాలూ , శతాబ్దాలూ , తర తరాలుగా తెలుగు వెలుగు , తెలుగు ప్రాభవం వ్యాపించే విధం గా మూడు ప్రాంతాల ప్రజలూ ఐక్య వేదికలు ఏర్పాటు చేసికొని , పార్టీలతోనూ , రాజకీయ నాయకులతోనూ ప్రమేయం లేకుండా , కేవలం వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను సంఘాలు గా ఏర్పరుచుకుని , కలిసి ఉండడానికీ , సర్వదా, అభివృద్ధి వేగం గా జరగ డానికీ, ఏ ఏ ప్రాతిపదికలూ , పదకాలూ అవసరమో కూలంక షం గా చర్చించి, తదనుగుణం గా చర్యలు తీసుకోవాలని మనవి !
  ముఖ్యం గా గమనించ వలసిన విషయం: కారణాలు ఏమైనప్పటికీ , కనీసావసరాలు లేక ,అభివృద్ధి కి నోచుకోని ప్రాంతాలూ , ప్రజలూ , మన రాష్ట్రం లో అన్ని ప్రాంతాల లోనూ ఉన్నారు ! ఈ పరిస్థితులలో కొత్త రాజధానికి కనీసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎంత వరకూ సమంజసం ? ఈ ఖర్చు, మొత్తం ఖర్చు లో, కేవలం ఒక కోణం మాత్రమే ! ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ పాలన గుర్తుకు తెస్తుంది ! అభివృద్ధి పధం లో ముందుకు పోతున్న ఆంధ్ర ప్రదేశం అనేక దశాబ్దాలు రివర్స్ గేరు లో ప్రయాణం చేస్తుంది , ఇంత ఆర్ధిక భారం తో ! ఈ విషయం తెలుసుకో డానికి పెద్ద చదువులు కూడా అవసరం లేదు కదా !
  పొరపాట్లు చేయడం తప్పుకాదు! పొరపాట్లను సరి దిద్దుకోవడమే విజ్ఞత ! ఆవేశాలకూ , ఉద్రేకాలకూ సమయం కాదిది !
  మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పటికైనా సమయం మించి పోలేదు ! రాజకీయాలు ప్రక్కన పెట్టి , అన్ని ప్రాంతాల యువతా నడుం కట్టి, రాష్రం లో ఒక కొత్త ఉరవడి సృ ష్టించ వచ్చు ! అహింసా, శాంతి యుత మార్గాలలోనే ! ప్రపంచానికి ఆదర్శం కావచ్చు ! కేవలం బంద్ లూ రాస్తా రోకో లూ కాకుండా ! సకల ప్రజల శ్రేయస్సు ను ఆకాంక్షించే ( రాజకీయాలతో ఏ రకం గానూ ప్రమేయం లేని ) ఒక తెలుగు వాడు !

 3. తెలంగాణా ప్రకటన వెలువడిన తరువాత రోజు తెలుగు దేశం అనుకూల పత్రిక అయిన ఈనాడు మా వీధి నక్కవానిపాలెంలో ఎక్కడా పేపర్‌లు వెయ్యలేదు. ఆ ప్రకటన ఎవరూ చదవకూడదని అనుకున్నారు కానీ ఆన్లైన్‌లో మాత్రం చదివేవాళ్ళ కోసం పెట్టాల్సి వచ్చింది ఆ పత్రికకు. తెలంగాణా వస్తే పొట్టి శ్రీరాములు ఆత్మ క్షోభిస్తుందనే ప్రచారం మొదలుపెట్టినదే చంద్రబాబు. ఆ ప్రచారం తరువాత కాంగ్రెస్ చేతుల్లో జరిగింది. తెలుగు దేశం తెలంగాణాకి ఒప్పుకుందంటే నేను నమ్మను.

 4. ప్రజల శ్రేయస్సు ఎవరికీ అక్కర్లేదు తెలంగాణా సీమంద్ర ఇద్దరికీ హైదరాబాద్ కావాలి కాంగ్రెస్ కి ప్రధాని పదవి కావాలి ఆంధ్రప్రదేశ్ ని రాజకీయ క్రీడ కి ఆట స్తలం గా చేసారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి ఇప్పుడఉ కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంది 1956 లో communistulu కాంగ్రెస్ ని హత్యా చేయటానికి విశాలాంద్ర ఉద్యమం చేసారు వాళ్ళు కనుమరుగయ్యారు ఇప్పుడు వీళ్ళు అవుతారు tdp ycp ni edo cheddamani తెలంగాణా, సమైఖ్య రాష్ట్రం అంటన్నారు హైదరాబాద్ లేకుండా ఎవరికన్నా తెలంగాణా, సమైఖ్య రాష్ట్రాలు కావాలా ఎటుఉరు నాగారం ఉట్నూర్ సత్తుపల్లి సిరిసిల్ల nalgonda పాడేరు పల్నాడు అనంతపురం ఎవడికి అక్కర్లేదు హైదరాబాద్ చాలు

 5. అంటే పరోక్షంగా తెలంగాణ తప్పదు అని చెప్పడమే. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ అధిష్టానం ఆజ్ఞలను తు.చ తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమం అంటూనే వారి ఉపన్యాసాల్లో కొత్త రాజధానికి నిధులు ఇవ్వాలి, నీళ్ల సమస్య పరిష్కరించాలి లాంటి డిమాండ్లు చేస్తున్నారు. స్లో పాయిజనింగ్ లాగా తెలంగాణ నిజాన్ని ఒప్పించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు! ఇలాంటి కళ కాంగ్రెస్ కి వెన్నతో పెట్టిన విద్య.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s