దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్


Durga Shakti Nagpal

ఈమె పేరు దుర్గ శక్తి నాగపాల్. వయసు కేవలం 28 సంవత్సరాలు. పంజాబ్ కేడర్ ఐ.ఎ.ఎస్ గా ఉత్తర ప్రదేశ్ లో గౌతమ్ బుద్ధ నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా నియమితురాలయింది. పదవి చేపట్టింది లగాయితు గ్రేటర్ నొయిడా ప్రాంతంలో యమున, హిందోన్ నదుల వెంట ఇసుకను అక్రమంగా తవ్విపోస్తున్న మాఫియాల గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచింది. రాజకీయంగా అత్యున్నత స్ధాయి సంబంధాలు కలిగి ఉన్న ఇసుక మాఫియా తన సర్వశక్తులు ఒడ్డిన ఫలితంగా మతపరమైన ఉద్రిక్తతలకు కారణం అయిందంటూ యు.పి ప్రభుత్వం ఈమెను శనివారం సస్పెండ్ చేసింది.

దుర్గ సస్పెన్షన్ కి వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇంటర్నెట్ లో కూడా పెద్ద దుమారమే రేగుతోందని తెలుస్తోంది. అనేకమంది నెటిజన్లు దుర్గ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారని పత్రికలు రాస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వంపై ఆగ్రహం ప్రకటించాయి. ఇసుక మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గి ఒక నిజాయితీ కలిగిన యువ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ ను అక్రమంగా సస్పెండ్ చేశారని వివిధ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ల సంఘం కూడా దుర్గ సస్పెన్షన్ చట్ట విరుద్ధం అని పేర్కొంటూ సమగ్ర విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీని కోరింది.

ప్రభుత్వ వాదన ప్రకారం ‘మతపర శాంతికి భంగం కలిగిస్తున్నందుకు’ దుర్గ శక్తి నాగ్ పాల్ ను శనివారం సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్ధారించాయని ది హిందు తెలిపింది. “గౌతమ బుద్ధ నగర్ ఎస్.డి.ఎం, దుర్గ శక్తి నాగపాల్ ను శనివారం సస్పెండ్ చేశాము. గౌతమ బుద్ధ నగర్ జిల్లాలో రబుపుర పోలీసు స్టేషన్ పరిధిలోని కాదల్ పురా గ్రామంలో చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా, నిర్మాణంలో ఉన్న మసీదు గోడను కూల్చివేయమని జులై 27, 2013 తేదీన ఆదేశాలిచ్చినందుకు ఈ చర్య తీసుకున్నాము. మతపరమైన శాంతి భగ్నం కావడానికి ఈ ఆదేశాలు తోడ్పడ్డాయి” అని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ప్రకటించారని పత్రిక తెలిపింది.

Durga Shakti Nagpal0పత్రిక ప్రకారం దుర్గ శక్తి నాగపాల్ సస్పెన్షన్ ను రహస్యంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ రహస్యం దాగలేదు. ఇసుక మాఫియాను ఒంటి చేత్తో ఎదుర్కొంటున్నందుకే ఆమెను తప్పుడు కారణాలతో సస్పెండ్ చేశారని ఐ.ఎ.ఎస్ అధికారులు గట్టిగా భావించడంతో వారు సస్పెన్షన్ కు వ్యతిరేకంగా గొంతెత్తారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బెంగుళూరు పర్యటనలో ఉండడం, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఏ సంగతి నిర్ధారించడానికి వెనకడుగు వేయడం… కారణాల వలన ఆదివారం రాత్రి వరకూ ఆమె సస్పెండ్ అయిందీ లేనిదీ ప్రభుత్వం తేల్చిచెప్పలేకపోయింది.

బెంగుళూరులో ఉన్న అఖిలేష్ యాదవ్ అతితెలివి ప్రదర్శిస్తూ దుర్గ సస్పెన్షన్ ను దాటవేయడానికి ప్రయత్నించారు. “మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వాటిని నివారించడానికి పాలనా పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము. మేము ఏ చర్య తీసుకోకపోతే నిష్క్రియాపరత్వంతో ఉన్నామని మీరే ఆరోపిస్తారు. తీసుకుంటేనేమో కఠిన నిర్ణయం అంటున్నారు” అని యాదవ్ బెంగుళూరులో వ్యాఖ్యానించారు. అయితే పత్రికలు అడుగుతున్నది ఇసుక మాఫియాకు ఎందుకు సహకరిస్తున్నారు అని. నేరాలు. అవినీతి అరికడతానని పదవిలోకి వచ్చిన అఖిలేష్ హామీ నెరవేర్చకపోగా నేరస్ధులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదును ఇప్పటికే మూటకట్టుకున్నారు. దుర్గ శక్తి సస్పెన్షన్ అందులో భాగమే.

2009 బ్యాచ్ కి చెందిన దుర్గ శక్తి నాగపాల్ పంజాబ్ ఐ.ఏ.ఎస్ కేడర్ కి చెందిన వ్యక్తి. 2012లో ఆమెను ఉత్తర ప్రదేశ్ కు మార్చారు. సెప్టెంబర్ 2012లో గౌరమ బుద్ధ నగర్ జిల్లాలో ఎస్.డి.ఎం (సదర్) గా పోస్టింగ్ ఇచ్చారు. యు.పిలో ఇదే ఆమె మొదటి పోస్టింగ్. అనతికాలంలోనే ఆమె గ్రేటర్ నొయిడాలోని యమున, హిందోన్ నదుల వెంబడి విస్తరించిన ఇసుక మాఫియాను ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఇసుక మాఫియా రాజకీయంగా, ఆర్ధికంగా అత్యంత శక్తివంతమైనదని అందరికి తెలిసిందే. ఒంటి చేత్తో ఇసుక మాఫియాను ఎదుర్కొన్న దుర్గ 30 ఇసుక డంపర్లను స్వాధీనం చేసుకుని అక్రమ ఇసుక మైనింగు నిర్వహిస్తున్నవారిపై రెండు డజన్లకు పైగా ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేశారు. దానితో నొయిడా, గ్రేటర్ నొయిడాలలో ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన ఇసుక మాఫియాలు పరారీలో ఉండవలసిన పరిస్ధితి ఏర్పడింది.

గౌతమ్ బుద్ధ నగర్ కి చెందిన పాలక ఎస్.పి పార్టీ నాయకుడు  ఒకరికి ఇసుక మాఫియాతో గట్టి సంబంధాలు ఉన్నాయని, ఐ.ఏ.ఎస్ అధికారిణి స్పస్పెన్షన్ లో ఆయనదే ప్రధాన పాత్ర అని పత్రికలు చెబుతున్నాయి. ఆమె సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బి.జె.పి, ఆం ఆద్మీ పార్టీ, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించాయి. ఐ.ఏ.ఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిని కలిసి సస్పెన్షన్ రూల్స్ కు విరుద్ధం అనీ, దానిని రద్దు చేయాలనీ కోరారు. అధికారికి వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై ఉన్నతస్ధాయి విచారణ నిర్వహించాలని కోరారు.

20 యేళ్ళ సర్వీసులో 44 సార్లు బదిలీలు ఎదుర్కొన్న హర్యానా ఐ.ఏ.ఎస్ అధికారి అశోక్ ఖేమ్కా వ్యవహారం భారత దేశంలో నిజాయితికి చెల్లించాల్సిన ఖరీదు ఏమిటో తేటతెల్లం చేసింది. దుర్గ శక్తి నాగపాల్ తన నిజాయితి కొనసాగిస్తే అశోక్ ఖేమ్కా పరిస్ధితినే ఎదుర్కోక తప్పదు.

3 thoughts on “దుర్గ, ఐ.ఎ.ఎస్: ఇసుక మాఫియాకు చెక్ పెట్టినందుకు సస్పెన్షన్

  1. Political leaders are unnecessarily interfering with IAS & IPS officers. They IAS&IPS are surpassingly implementing the rules and laws framed by those leaders only. Because of greedy nature they try to loot the public and public property. Politicians should not interfere like that.

  2. I A S అధికారిణి, దుర్గా నాగ్ పాల్ సస్పెన్షన్ తరువాత , ఒక UP మినిస్టర్ అజాం ఖాన్, ఆ సంఘటన పై వ్యాఖ్యానిస్తూ ” రాముడి పేరుమీద , దోచుకో గలిగితే , వీలైనంత దోచుకో ” అని అన్నాడు ! అవినీతి కి ఇంతకన్నా పరాకాష్ట ఏముంటుంది ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s