తెలంగాణ ప్రజకు అభినందన వందనం!


CWC meetయు.పి.ఎ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించాయి. ఎల్లుండి (ఆగస్టు 1) సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతున్నది. అందులో కూడా ఏకగ్రీవ తీర్మానమే ఆమోదం పొందుతుంది. కాబట్టి ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంఛనప్రాయమే. గత 56 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం అనేకానేక రక్త తర్పణలు కావించిన తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా అభినందన వందనం!

సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అయిన యు.పి.ఎ సమన్వయ కమిటీ సమావేశం గంట సేపటికే తన నిర్ణయాన్ని వెలువరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని సమావేశం అనంతరం రాష్ట్రీయ లోక్ దళ్ నాయకుడు, విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ పత్రికలకు తెలిపారు. ఇంకా అనేక ఇతర సమస్యలు ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం తెలంగాణపై యు.పి.ఎ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.

వందలాది శ్రీకాంతాచారిల త్యాగం కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల ముందు వెలతెలా పోయింది.

వందలాది శ్రీకాంతాచారిల త్యాగం కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల ముందు వెలతెలా పోయింది.

యు.పి.ఎ సమావేశం ముగిసిన వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా సమావేశం అయింది. మొత్తం 22 మంది సి.డబ్ల్యూ.సి సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారని ఛానెళ్లు తెలిపాయి. ఈ సమావేశంలో కూడా తెలంగాణకు అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినట్లు ఛానెళ్లు తెలిపాయి. అనంతరం కొద్ది సేపటికి ఎ.ఐ.ఐ.సి.సి కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన దిగ్విజయ్ సింగ్ సి.డబ్ల్యూ.సి నిర్ణయాలను వివరించారు.

పదేళ్ళు ఉమ్మడి రాజధాని

దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన వివరాల ప్రకారం: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పేర్లతో రెండు రాష్ట్రాలుగా మనుగడలో ఉంటుంది. రాష్ట్ర విభజన మరో నాలుగైదు నెలల సమయం పట్టవచ్చు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన బిల్లు తయారు చేసి ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి శాసన సభకు పంపుతుంది. ఈ తీర్మానంపై ఎ.పి అసెంబ్లీ తన నిర్ణయాన్ని రాష్ట్రపతికి తెలియజేయాలి. అసెంబ్లీ నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ ఏర్పాటుపై ముందుకు పోతుంది.

రాష్ట్ర విభజనను అసెంబ్లీ ఖచ్చితంగా ఆమోదించాలన్న రూల్ ఏమీ లేదు. ఆంద్ర ప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీ నుండి నిర్ణయం అందుకున్న తర్వాత రాష్ట్రపతి సదరు బిల్లును పార్లమెంటుకు పంపుతారు. పార్లమెంటు ఉభయ సభలు సాధారణ మెజారిటీతో సదరు బిల్లును ఆమోదించవచ్చు. పార్లమెంటు ఆమోదించిన బిల్లు మళ్ళీ రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి సంతకంతో ఆంధ్ర ప్రదేశ్ విభజన ఆచరణలోకి వస్తుంది.

సీమాంధ్ర రాజకీయ నాయకులు లేదా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బడా భూస్వాములు మరియు బడా పెట్టుబడిదారులు ఆందోళన చెందుతూ వచ్చింది ప్రధానంగా హైద్రాబాద్ భవిష్యత్తు, నదీజలాల పంపిణీ అంశాలమీదనే. హైద్రాబాద్ ను మరో పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానికి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకేన్ తెలిపారు. నదీజలాల పంపిణీ, కేడర్ విభజన, హైద్రాబాద్ లోని సీమాంధ్రుల రక్షణ తదితర అంశాలపై ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి దానికి కావలసిన నిధులను కేంద్రం అందిస్తుందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ చెప్పినట్లు ఛానెళ్లు చెబుతున్నాయి.

రెండు జోక్ లు

దిగ్విజయ్ సింగ్ విలేఖరుల సమావేశంలో రెండు జోక్ లు పేల్చారు. ఒకటి: తెలంగాణ ప్రజల ఆందోళనకు భయపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదు. రెండు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదా ఆంధ్ర ప్రదేశ్ విభజనలో రాజకీయాలు ఏమీ లేవు.

యాదయ్యల ప్రాణత్యాగం కాదా తెలంగాణ కల సాకారానికి కారణం?

యాదయ్యల ప్రాణత్యాగం కాదా తెలంగాణ కల సాకారానికి కారణం?

ఇది వింటే సారా నిషేధం గుర్తుకు రాకమానదు. 1990ల ప్రారంభంలో రాష్ట్రంలో సారావ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహిళా సంఘాల నేతృత్వంలో కాంగ్రెస్ తప్ప ఇతర రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించిన ఈ ఉద్యమ ఫలితంగా అప్పటి విజయ భాస్కర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సారా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ‘మొత్తం మీద మహిళా ఉద్యమానికి తలొగ్గారా?’ అని విలేఖరులు ప్రశ్నిస్తే “అబ్బే, అలాంటిదేమీ లేదు. సారా నిషేధానికి, సారా వ్యతిరేక ఉద్యమానికి సంబంధమే లేదు” అని బొంకారు. విజయభాస్కర రెడ్డి వ్యాఖ్యలను పరిహసిస్తూ శ్రీధర్ వేసిన కార్టూన్ (పాఠకులకు గుర్తుంటే) ఫ్రంట్ పేజీలో ప్రచురించబడింది కూడాను.

కాంగ్రెస్ రక్తం

ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ చెబుతున్నది కూడా అలాగే ఉంది. ఈ కాంగ్రెస్ రక్తమే వేరు కాబోలు. మిత్రులు చందుతులసి గారు చెప్పినట్లు

చెప్పకనే చెప్పడం…
చెప్పింది చెప్పామని చెప్పకుండా,
చెప్పనిదీ…..చెప్పలేదని చెప్పకనే,
చెబుతామో లేదో కూడా చెప్పకపోవడం….
ఏం చెబుతుందో….ఎప్పుడు చెపుతుందో,
ఏం చెప్పిందో, ఏం చెప్పలేదో అర్ధం కాకుండా చెప్పడం…
అసలు చెబుతుందో, చెప్పదో కూడా తెలీకుండా చెప్పడమే కాంగ్రెస్ శైలి.

ఈ శైలిని మరోసారి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ప్రదర్శించారు. మరీ ఘోరం ఏమిటంటే ఇన్నాళ్లూ తెలంగాణకు ఏవి అడ్డం అని చెబుతూ వచ్చారో వాటినే కోడిఈక లెక్కన పక్కకు నెట్టేయడం. ‘తెలంగాణ ఇస్తే ఇంకా అనేకమంది అడుగుతారు’  అన్నారు. ఇప్పుడేమో ‘తెలంగాణ డిమాండు, ఇతర డిమాండ్లు ఒకటి కాదు’ అని తేల్చేశారు. ‘రెండో ఎస్సార్సీయే పరిష్కారం అన్నారు కదా’ అనడిగితే, ‘తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల డిమాండ్ల విషయంలో ఇప్పటికీ రెండో ఎస్సార్సీయే పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం’ అని చాలా సాధారణం అన్నట్లుగా నాలిక మడతేశారు.

‘సంప్రతింపులు జరిపారా?’ అంటే ‘విస్తృతంగా సంప్రతింపులు జరిపాకనే ఈ నిర్ణయం అయింది’ అని తడుముకోకుండా  (బైటే సీమాంధ్ర ఎం.పిలు, మంత్రులు పడిగాపులు పడుతూ ఉండగానే) చెప్పేశారు. ‘తెలంగాణ ఏర్పాటు అంత తేలిక కాదు. ఏకాభిప్రాయం కావాలి’ అన్నారు. ఇప్పుడసలు రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయంతో పనేలేదు పొమ్మంటున్నారు. అసెంబ్లీ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇచ్చేది ఇచ్చేదే అని తేల్చేస్తున్నారు.

‘తెలంగాణ ఏర్పాటు వెనుక రాజకీయాలు లేవు, ఎన్నికలకూ దీనికీ సంబంధం లేదు’ అనడం కూడా ఈ కోవలోనిదే. రాజకీయ లబ్ది పొందే ఆలోచనే లేకపోతే 2009లోనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలై పూర్తయ్యేది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో లబ్ది పొందే ఆలోచనతోనే శ్రీకృష్ణ కమిటీ నివేదిక అనంతరం కూడా ఇన్నాళ్లూ సమస్యను నాన్చారు. తెలంగాణ పేరుతో అటు తెలంగాణలోనూ, అదే పేరుతో వైకాపా ఎమ్మెల్యేల రాజీనామా చేయించిన కాంగ్రెస్ ఆ విధంగా సీమాంధ్ర లోనూ మెజారిటీ సీట్లు గెలిచేందుకు పధక రచన చేసిందనేది బహిరంగ రహస్యమే.

కాంగ్రెస్ రక్తం అంటే మాటలు కాదు మరి!

ది హిందూ పత్రిక వెల్లడి చేసిన మరో సంగతి తెలుసుకుంటే మ్రాన్పడక మానం. ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదన టి.ఆర్.ఎస్ నాయకుదు కె.సి.ఆర్ ముందుకు తెచ్చినా అదెప్పుడూ కాంగ్రెస్ ఎజెండాలోనే లేదట! ‘రాయల తెలంగాణ’ కు ఒప్పుకోండంటూ ఆజాద్ సీమాంధ్ర నాయకులకు ఫోన్లు చేసి కోరడం వెనుక కాంగ్రెస్ పెద్దలు పన్నిన బృహత్పన్నాగమే ఉందట.

ఈ పన్నాగం ప్రకారం తెలంగాణ ఏర్పాటు కోసం జరుగుతున్న నిర్ణయ ప్రక్రియలోకి సీమాంధ్ర రాజకీయ నాయకుల జోక్యాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చగించలేదు. తెలంగాణపై నిర్ణయానికి కోర్ కమిటీ అనీ, యు.పి.ఎ సమన్వయ కమిటీ అనీ, సి.డబ్ల్యు.సి సమావేశం అనీ వివిధ సమావేశాలు వరుసగా జరపాల్సి ఉంది. కాని ఈ సమావేశాలు జరుపుతుంటే సీమాంధ్ర నాయకులు చూస్తూ ఊరుకోరు కదా. వారిని తమ జోలికి రాకుండా బిజీగా ఉంచాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వచ్చింది. అలా తలెత్తిన ఆలోచనె ‘రాయల తెలంగాణ’ అంటూ ఆజాద్ ఫోన్లు చేయడం.

ఈ ఆలోచన వదిలితే ఇక దానిపైన సీమాంధ్ర నాయకులు మల్లగుల్లాలు పడాలి. ఒప్పుకోం అని కొందరంటే, ఒట్టి తెలంగాణ మీద ఇది బెటరే కదా అని తెలంగాణలో కలుపుతామన్న రెండు జిల్లాలవారు లోలోపల సంతోషించారు. కాని పైకి మాత్రం బింకంగా సమైక్యాంధ్ర తప్ప దేనికీ ఒప్పుకునేది లేదు అని వారు చెబుతూ వచ్చారు. సీమాంధ్రులు ఇలా విడిపోయి చర్చోప చర్చల్లో మునిగి ఉండగానే మరోపక్క ‘విభజన తప్పదు’ అన్న సందేశం కూడా వదిలారు. దానితో రాయల తెలంగాణ, సమైక్యాంధ్ర శిబిరాలుగా సీమాంధ్ర శిబిరం చీలిపోయింది. ఇది పైకి కనపడలేదు గానీ వారినలా బిజీగా ఉంచడంలో ఆజాద్ బిజీగా గడిపారు. ఈలోపు కావాల్సిన సమావేశాలని కానిచ్చేశారు. తేరుకుని చూసేసరికి పది జిల్లాల తెలంగాణ నిర్ణయం జరిపోయింది.

కాంగ్రెస్సా, మజాకా!

భారత దేశంలోని బడా భూస్వాములు, బడా పెట్టుబడిదారులను ఎలా లైన్లో తెచ్చుకోవాలో, ఎలా మలుచుకోవాలో బహుశా కాంగ్రెస్ కి తెలిసినంతగా మరే పార్టీకి తెలియదేమో. ఆ మాటకొస్తే జనాన్ని మాయపుచ్చి మోసం చేయడంలోనూ ఆ పార్టీది అందె వేసిన ‘చేయే’.

(మరింత స్పష్టత కోసం ఆర్టికల్ ను ఒకసారి ఎడిట్ చేసాను -విశేఖర్)

22 thoughts on “తెలంగాణ ప్రజకు అభినందన వందనం!

 1. మీ ఉద్దేష్యం ఏమిటి? ఇప్పుడు కాంగ్రేస్ ప్రకటించించిన తెలంగాణా మోసపూరితమనా? మీరు ప్రచురించిన ఆ ఫోటోల ఉద్దేష్యం ఏమిటి? తెలంగాణాప్రకటన న్యాయసంబందమనా?(బలిదానాలు చేసుకున్నారు గనుకనా?)దయచేసి ఆ ఫొటోలు తొలగించండి.మీరు తప్పుగా అనుకొన్నా?ఒప్పుగా అనుకొన్న? ఆ ఫొటొలుచూస్తే నాకేమీనిపిస్తుందంటే సీమాంద్రులారా మీరు ఆత్మబలిదానాలు చేసుకోండి సమైక్యాంద్రకోసం అప్పుడు మీదికూడా న్యాయ పరమైనకోరిక అవుతుందీని! దయచేసి ఆ ఫొటోలను తొలగించండి!

 2. కాంగ్రెస్ కుటిల రాజకీయాల వల్లే అంత మంది ఆత్మార్పణం చేసుకున్నారన్న నిజం తెలిసి కూడా తెలంగాణా ప్రజలు కాంగ్రెస్ ను మరో సారి నమ్మి మోసపోబోతున్నారు. తెలంగాణా వచ్చేది లేదు కానీ ఇంకా ఆత్మార్పణం చేసుకోవడానికి మరింతమందిని బలిపశువులను చేస్తారు.

 3. @మూల

  తెలంగాణ డిమాండు ఎలా న్యాయబద్ధమో గత టపాల్లో వివరించాను.

  ఇలాంటివారు ఆత్మబలిదానం చేసుకోవడం ఒక వాస్తవం. ఇక్కడ ఫొటోలు తీసేస్తే మాత్రం ఆ వాస్తవం చెరిగిపోతుందా చెప్పండి?

  తెలంగాణ ప్రజల పోరాటం వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్, యు.పి.ఎ ఒప్పుకున్నాయి. దానికి కాంగ్రెస్ రాజకీయ అవసరం తోడయింది. ఆ సంగతే ఆర్టికల్ లో చెప్పాను. అది సరిగ్గా కేరీ అయినట్లు లేదేమోనని మీ అనుమానం ద్వారా అనిపిస్తోంది. పరిశీలిస్తాను.

  @ప్రణీత్ మహర్షి

  కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించింది. యు.పి.ఎ కూడా ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఇంకా మోసం చేస్తుందని నాకయితే అనిపించడం లేదు. ఆ దశ దాటిపోయింది.

 4. రానున్న నోటిఫికేషన్ లు ఆగిపొతాయి.

  నిరుద్యోగులారా జీవితం చాలా విలువైంది.

  దయ చేసి మీ మీద ఆధారపడ వాల్లని మీ పేరెంట్స్ ని గుర్తుంచుకొండి.

  కష్ట పడటం తెలుసు నీకు

  క్రమసిక్షణ తెలుసు నీకు.

  నీ అవసరం ఎంతో మందికి ఉంది.
  తమిలనాడు వద్దు. మరాథి కి వద్దు, గుజరాతి కి వద్దు, సాటి తెలుగునాడు అసలే వద్దు.(బయటి నుంచి ఆంధ్రా గో బేక్ వినిపిస్తుంది,.)

  రేపు మన్యసీమ అంటారేమొ అటు వెళ్ళొద్దు. ఢిల్లీ లొ తెలుగు వారంటే మహా చులకన. అటసలే వెల్లొద్దు.
  ప్రపంచ వ్యాప్తంగా నీకు పేరుంది
  . ఏ దేసమైనా పొ. ఆసలే ఇండియన్ టాలెంట్ ,పెట్టుబడులూ కోసం అగ్రరాజ్యాలు ఎదురుచూస్తున్నాయి. ఎక్కడికెళ్ళీనా నావాడు నాది అనుకోవద్దు. కష్టపడింది తెచ్చి నీ ఇంటి కి రంగులు వెయుంచుకొ. లేకపోతే అది నువ్వు దోచింది ఆవుతుంది. ఏదొ ఒకనాడు నువ్వు దొంగ దోపిడీదారువైపొతావు.

  నీతో నువ్వే పొరాడే సమయం. ఇన్నాళ్ళూ అభివ్రుధ్ధి ఫలాలు చూసావు. ఇక నుంచి నీ కష్ట ఫలాలె పొందు.ముందు కొన్నాళ్ళు సమ్యమనంతో ఉండు. దయ చేసి ఎవరూ తీవ్ర నిర్నయాలు తీసుకోవద్దు ప్లీజ్.

 5. “దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుంది.”

  నిష్టూరంగా ఉన్నా నిజానికి ఇది నిజం!

  కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మిన్ను విరిగి ఏమీ మీదపడదు అన్నదీ అంతే నిజం.

  కాకపోతే అధికార వికేంద్రీకరణలో కాసిన్ని పిందెలు రాలి జనం ఒళ్లో పడొచ్చు. కాయలు, పళ్ల కోసం జనానికి -అక్కడైనా, ఇక్కడైనా- మళ్ళీ పోరాటాలు తప్పవు.

 6. ముందుగా అభినందలు తెలియచేసినందుకు విశేఖర్ గారికి ధన్యవాదాలు. గత కొన్ని రోజూలుగా మీ బ్లాగ్ ఫాలో అవుతున్నాను. మీ విశ్లెషన బాగుంటుంది. చాలా రోజులుగా అనేక విషయాలపై స్పందించాలనుకున్నా కానీ వీలు కాలేదు. ఇక ఇప్పుడు చేస్తున్నది కూడా మీ వార్తావ్యాఖ్యపై కామెంట్ కాదు. జస్ట్ నా మనసులో ఉన్నది చెప్పాలనిపించి చెప్తున్న…

  తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర కల….
  ఎన్ని దశాబ్దాల పోరాటం..
  ఇంకెన్ని బలిదానాల ఆరాటం….

  తెలంగాణా ఉద్యమ సమయంలో ఓయూ విద్యార్థిగా సొంతం చేసుకున్న అనుభవాల గురించి చెపితే ఒక చిన్న సైజ్ పుస్తకం అవుతుందేమో అనిపిస్తుంది. బయట దీపావళి చప్పుల్ల మోతలు వినిపిస్తున్న వేళ ఓయూలో పొలీసు తుపాకుల మోతలు చూశాం. వందలాది మంది విద్యార్థులపై వేలాది కేసులు పెడితే…..సమధానంగా లక్షలాదిమందితో విద్యార్థి ఘర్జనలు జరిపాం. మాలో మాకు భావజాలాల మధ్య ఎంత భేదాభిప్రాయం ఉన్నా తెలంగాణా విషయం వచ్చేసరికి ఒకే తాటిమీదకొచ్చి కలిసి పోరాడాం. రాష్ట్రం ఏర్పడటం గగనం అవుతుందెమో అని తెలిసి మా మా శరీరాల్ని కాల్చుకున్నం తప్పితే ఏ ఒక్క సీమంధ్ర పెట్టుబడిదారి వ్యక్తికి గాని సామన్య ప్రజలకు కానీ నష్టం, కష్టం కలిగించలేదు….. చెప్పాలంటే ఇలాంటి ఉదాహరణలు వేలకు వేలున్నాయి.

  కానీ ప్రస్తుత తరుణంలో గతాన్ని గుర్తు చేసుకోవడం కంటే భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. రాష్ట్రం ఏర్పడటం తో నీళ్లు, నిధుల విషయంలొ కొంత అవకాశాలు మెరుగుపడవచ్చునేమో గాని అదొక్కటే సర్వరోగనివారిణిలా మొత్తం సమస్యలు తీరిపోవన్నది ప్రస్తుతం తెలంగాణా వారందరూ గుర్తించాల్సిన కఠిన వాస్తవం. ఏర్పడ్డరాష్ట్రాన్ని ఏ విధంగా మలుచుకోవాలో దాని గురించి చూడటం ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. మొత్తమొదటగ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు, మేదావులు, చేయాల్సిన పని తెలంగాణ ఏర్పడ్డం వల్ల సీమంధ్ర వారికి ఎలాంటి నష్టం కలగదని నచ్చ చెప్పటం. వారిలో ఉన్న భయాందోళనలు తగ్గించడం. అంతేతప్ప విషయాన్ని రాజకీయం చేయడం కాదు. విభజన ఎలాగూ ఖాయం అయింది కనుక సీమంధ్ర వారు తమకు కావల్సిన, రావల్సిన హక్కూల కొసం పోరాటం జరపడం మంచిది. వారికి తెలంగాణ వారు మద్దతిచ్చి అక్కది ప్రజల హ్రుదయాలు గెలుచుకొవాలి. అదే సమయంలొ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సీమంధ్రులకి పూర్తి స్థాయి భధ్రత ఉంటుందనె నమ్మకం కలిగించాలి. అప్పుదె రెండు ప్రాంతాల ప్రజల వైషమ్యాలు లేకుండా సోదర భావంతో ఉండగలుగుతారు. ఇక చివరగా తెలంగాణ ప్రాంతం లోని విద్యార్థులు గాని, ప్రజలు గాని తమ పోరాటాల్ని నిరంతరం కొనసాగించినప్పుడే ఎలాంటి దోపిడీ లేని నవ తెలంగాణా రాష్ట్రాన్ని చూడగలం.

 7. విశేఖర్ గారు, అధికారవికేంద్రీకరనం జరిగితే మేలుజరిగే అవకాశం ఉందనీంటున్నారు.అటువంటప్పుడు మరన్నిరాష్రాలుగా ఈ దేశాన్ని విడదేయెచ్చుకదా!ఆ సాకు చెపుటూ!లోపం అక్కడ ఉందంటారు?పాలనా వ్యవస్థలోనా?రాజకేయాల లోనా?తెలంగాణాకు అన్యాయం ఎలా జరిగిందంటారు?పెద్దరాష్త్రంలోనా?లేక రాజకేయాలవలనా?మరీలాంటప్పుడు రాజకేయాలను మార్చమని అదగరేం?ఎందుకంటే ఈ వాదాలన్నే పుట్టుకొచ్చింది రాజకేయాలవలన!

 8. పెద్దరాష్త్రంలోనో ?లేక రాజకేయాలవలనో అన్యాయం జరగదు ప్రజలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అన్యాయం అయినా న్యాయం అయినా యదా ప్రజా తదా రాజా
  అధికార వికేంద్రీకరణలో కాసిన్ని పిందెలు రాలి ఫార్మ్ హౌస్ లో పడొచ్చు దొర పంట బాగా పండోచ్చు

 9. కాంగ్రెస్ మోసం చేయదు అన్నారు కాని బిల్లు పాస్ చేయాల్సింది పార్లమెంట్ కదా అక్కడ బి జే పి మోసం చేయొచ్చుకదా బిల్లు పాస్ అవాలంటే బిజెపి అవసరం ఉన్నట్లుంది నాకు తెలిసి యుపిఏ కి అంత సొంత బలం లేదు

 10. ఇన్నాళ్ళు వాడు దోచాడు వీడు దోచాడు అని దొరలూ తప్పిన్చుకుఉన్నారు ఇప్పుడు అసలు ఏ వడు దోచుకున్నది దోచుకోబోయేది తెలుస్తుంది

 11. కాకతీయులు రాష్ట్రకూటులు కల్యాణి చాళుక్యులు గురించి మేమిక చదవక్కర్లేదనుకు౦ టా శాతవాహనులు ని కూడా తీసేస్తే మాకు బెనిఫిట్ సగానికి సగం సిలబుస్ తగ్గిపోతుంది మనుషులే విడిపోయాక చరిత్ర ఎందుకు

 12. @ ఇక చివరగా తెలంగాణ ప్రాంతం లోని విద్యార్థులు గాని, ప్రజలు గాని తమ పోరాటాల్ని నిరంతరం కొనసాగించినప్పుడే ఎలాంటి దోపిడీ లేని నవ తెలంగాణా రాష్ట్రాన్ని చూడగలం….

  ఇక్కడ తెలంగాణా అనే కాదు…ఎక్కడైనా ..రాజకీయుల చేతిలో సామాన్యుడు మోసపోక తప్పదు..అధికారమ్ లో ఉన్న పార్టీలు బడా కంపెనీలకీ..మ.నేషనల్ కమ్పెనీలకీ…వాళ్ళ బాసులకీ…అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటాయి కానీ… మన నాయకులు …..ప్రజ గురించి….ఆలోచిస్తారా?ఆలోచిస్తే ఒకే ఇంట్లో నాలుగు పదవులు ఎందుకుంటాయ్?

 13. ఆర్.కె గారు పెద్దరాష్త్రాల వలన గానీ,రాజకీయాల వలనగానీ అన్యాయం జరగదు అంటున్నారుకదా! ఎలాగో వివరిస్తారా?

 14. కాకపోతే అధికార వికేంద్రీకరణలో కాసిన్ని పిందెలు రాలి జనం ఒళ్లో పడొచ్చు.

  may be. deenivalana telangaana ki elaanti nashtam unDadantaaraa?

  nakayite rendu vaipulaa chaala nastam kanipistundi.

 15. పెద్ద రాష్ట్రాల వల్లనే అన్యాయం జరగదు చిన్న రాష్ట్రాల్లో కూడా అన్యాయం జరుగుతుంది అన్యాయానికి చిన్న పెద్ద తేడ లేదు (ఈశాన్య రాష్ట్రాలు చిన్నవే కదా ) రాజకీయాల వాళ్ళ జరగదు నాకు తెలిసి కేరళ లో రాజకీయాల వాళ్ళ ఏ అన్యాయం జరగాలా చిన్న పెద్ద రాజకీయాలు ఇవి కాదు ప్రజల క్వాలిటీ ముఖ్యం పనికి మా లినోల్లకి కాంట్రాక్టర్లకి సారా కాసే వాళ్లకి వోట్ లు వేస్తె జరిగేది అన్యాయమే developed countries annitlo raajakeeyalu kaaka raajarikaalu ఉన్నాయా panchaayati elctns choodandi asalu janam em chestunnaro elaa anyaayam chesukuntunnaro ardam avutundi

 16. విశేఖర్ గారు, సమైక్యవాదులు ఇప్పుడిప్పుడే తమ నోళ్ళ నుంచి నిజాలు బయటకి కక్కుతున్నారు. మీరు కూడా ఫేస్‌బుక్‌లోకి రండి, అంతా అర్థమవుతుంది. గ్లోబలైజేషన్ కాలంలో రాష్ట్రంలో హైదరాబాద్ తప్ప ఏ ఇతర పట్టణమూ అభివృద్ధి చెందే అవకాశం లేదు. విజయవాడనో, కర్నూల్‌నో రాజధాని చేసినా ఆ పట్టణాలలో ఐటి కంపెనీలు ఆఫీసులు పెట్టవు. అందుకే సమైక్యవాదులు తమకి హైదరాబాద్ తప్ప ఏదీ వద్దని ఫేస్‌బుక్‌లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. గ్లోబలైజేషన్ వల్ల అన్ని ప్రాంతాలలోనూ అభివృద్ధి జరగలేదు, అలా ప్రాంతీయ అభివృద్ధి జరిగే అవకాశం లేదు. గ్లోబలైజేషన్ కాలంలో మావోయిజం లాంటివి కాలం చెల్లాయని ప్రచారం చేసిన వర్గం వాళ్ళు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో, తమ హైదరాబాద్‌ని వేరే ప్రాంతం వాళ్ళ కోసం వదులుకోవడం ఇష్టం లేక, తమ నోళ్ళతోనే నిజాలు బయటకి కక్కుతున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s