తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!


Telangana agitation

తెలంగాణ ప్రజల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్ష నెరవేరే రోజు కొద్ది దూరంలోనే ఉందన్న సంగతి దాదాపు ఖాయం అయిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయం తీసేసుకున్నట్లు అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ ది హిందూ పత్రిక తెలియజేసింది. సదరు పత్రిక ప్రకారం ‘ఆహార భద్రతా బిల్లు’ కోసమే ప్రస్తుతం నిర్ణయం ప్రకటన వాయిదా పడింది. తెలంగాణ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన చేసిన వెంటనే సీమాంధ్ర కాంగ్రెస్ ఎం.పిలు రాజీనామా చేసే అవకాశం ఉందని, అలా జరిగితే ‘ఆహార భద్రతా బిల్లు’ ఆమోదం ప్రమాదంలో పడవచ్చని కాంగ్రెస్ పెద్దలు సంశయించడంతో ప్రకటన వాయిదా పడింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత అంతిమ నిర్ణయం వెలువడుతుందని ఆ పార్టీ ప్రతినిధి దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే చెప్పి ఉన్నారు. వారం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పి.సి.సి అధ్యక్షులతో చర్చించిన కోర్ కమిటీ వారి నుండి అభిప్రాయాలను స్వీకరించింది. నిర్ణయాన్ని సి.డబ్ల్యూ.సికి బదిలీ చేయడానికి ఆ సమావేశం లోనే నిర్ణయం జరిగింది. సి.డబ్ల్యూ.సి సమావేశం లోపు మరి కొన్ని సార్లు సమావేశం కావాలని కూడా కోర్ కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగానే శుక్రవారం మళ్ళీ సమావేశమైన కోర్ కమిటీ మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పి.సి.సి చీఫ్ లతో చర్చించింది.

ది హిందు పత్రిక ప్రకారం తెలంగాణకు అనుకూలంగా సోనియా గాంధీ నిర్ణయించారని ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లు ఈ సమావేశంలో ముగ్గురు రాష్ట్ర నాయకులకు వివరించి చెప్పారు. ఒక్కొక్కరినీ పిలిచి చర్చించిన కోర్ కమిటీ తెలంగాణ రాష్ట్ర విభజనకు పార్టీ అధిష్టానం నిర్ణయించినందున ఆ నిర్ణయానికి పార్టీ రాష్ట్ర నాయకులు కూడా కట్టుబడి ఉండాలని కోరారు. ముగ్గురులో సి.ఎం కిరణ్ కుమార్ మాత్రం మళ్ళీ సమైక్య మంత్రం పఠించగా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పి.సి.సి చీఫ్ చెప్పారు. ఉప ముఖ్యమంత్రి రాజనరసింహతో సుదీర్ఘంగా కోర్ కమిటీ చర్చించింది. కానీ ఆ వివరాలేవీ వెల్లడి కాలేదు.

ఈనాడు పత్రిక ప్రకారం ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణను కలవరిస్తున్నారు. రాయల తెలంగాణకు అంగీకరించాలని ఆయన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఫోన్లు చేసి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ది హిందూ పత్రిక ఈ ప్రస్తావనేదీ తేలేదు. హిందూస్ధాన్ టైమ్స్ ప్రకారం కోర్ కమిటీ సమావేశానికి ముందు కిరణ్ కుమార్, సోనియాను కలిసి విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. “తెలంగాణ ఏర్పాటు ఆత్మహత్యా సదృశం. రాష్ట్ర విభజనను పర్యవేక్షించడం చాలా కష్టం అవుతుంది.” అని ఆయన సోనియాకు చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది. అంటే విభజనకు వెళ్ళేటట్లయితే ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారని అర్ధమా?

ఫస్ట్ పోస్ట్ పత్రిక ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసేసుకుందని ఆజాద్, దిగ్విజయ్ లు రాష్ట్ర నాయకులు ముగ్గురుకి చెప్పేశారు. ఇక బహిరంగ ప్రకటనే తరువాయి అనీ వారికి చెప్పారు. అలాగయితే జులై 31 వరకూ ప్రకటన చేయకుండా ఆగాలని, అప్పటికి స్ధానిక సంస్ధల ఎన్నికలు ముగుస్తాయి కనుక ఎన్నికల్లో మోహరించిన బలగాలను విభజన ప్రకటన అనంతరం ఎదురయ్యే పరిస్ధితిని చక్కదిద్దటానికి ఉపయోగించే అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కోరారు. (ది హిందు).

ఆగస్టు 5 నుండి పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ లోపు సి.డబ్ల్యూ.సి సమావేశం జరిపి తెలంగాణ నిర్ణయం ప్రకటించవచ్చని దాదాపు పత్రికలన్నీ వూహిస్తున్నాయి. కానీ ఏ పత్రికా రాయల తెలంగాణ గురించి, ఆజాద్ మంతనాల గురించి రాయలేదు. పార్లమెంటు లోనే నేరుగా విభజన బిల్లు పెడతారనీ, దానికి రాష్ట్ర అసెంబ్లీ అనుమతి గానీ చర్చ గానీ అవసరం లేదనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వైకాపా ఎమ్మెల్యేల రాజీనామాలు, తెలంగాణ వైకాపా ఆందోళనలు రామాయణంలో పిడకల వేటలా కనిపిస్తోంది. రానున్న ఎన్నికల్లో సీమాంధ్రలో ప్రజల నుండి సానుకూలత పొందడానికే ఈ నాటకం ఆడుతున్నట్లు కనిపిస్తోంది. కానీ సీమాంధ్ర ప్రజలు తెలంగాణ విభజన పట్ల అంత ఆందోళనతో ఉన్నట్లయితే కనిపించడం లేదు. ‘ఎన్నాళ్లీ సొద, ఇస్తే పోతుంది కదా!’ అన్న వైఖరే అక్కడ ఉన్నట్లు కనిపిస్తోంది.

అనివార్యమైన విభజనను ఆహ్వానించినందు వలన సీమాంధ్ర ప్రజలకు లాభమే తప్ప నష్టం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణకు విభజన తప్పనిసరిగా మార్గం ఏర్పరుస్తుంది. నూతన రాజధాని సీమాంధ్ర ప్రజలకు హైద్రాబాద్ కంటే దగ్గరవుతుంది. దాని చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్వానిద్దాం!

11 thoughts on “తెలంగాణ వ(ఇ)చ్చేసినట్లే!

 1. ఎన్ని కలలు….ఎన్ని ఆకాంక్షలు
  ఎన్నాళ్ల ఎదురు చూపులు….
  ఎందరో అమరుల త్యాగాలు….
  ఎన్నో….ఎన్నో….ఎన్నో…ఎన్నెన్నో..

  అందరి ఆశ ఒక్కటే అదే తెలంగాణ రాష్ట్ర్రం.

  ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికైనా నేరవేరి తీరుతుంది.

  తెలంగాణ ప్రజల పోరాటం…భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుంది.
  భవిష్యత్ పోరాటాలకు….సూచికగా నిలుస్తుంది.

  చివరగా ఒక్క మాట….తెలంగాణ రాష్ట్ర్రం ఏర్పడడమంటే….

  తెలుగు వాళ్లు విడిపోవడం కాదు….తెలుగు ప్రజలకు మరో రాష్ట్ర్రం రావడం.

  ప్రతి తెలుగు వారు దీన్ని ఆహ్వానించాలి.

 2. వి ‘భజన ‘ లో ఏముంది విశేషం ?
  ఊళ్లు పంచుకోవడం,
  ఓట్లు ఎంచుకోవడం,
  కోట్లు కొట్టేయడం తో,
  ఒకటి రెండైనా ,
  మూడు ఆరైనా,
  నూరు ఆరైనా ,
  పురోగతి సశేషం,
  ‘ఒకటి’ కాదు,
  అందుకు అవరోధం,
  రెండు నాల్కలూ ,
  నాలుగు చేతులూ !

 3. త్వరలోనే తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలవారిగా విడిపోయి ఘర్షణ పడేరోజులు రానున్నాయన్నమాట!

 4. స్వార్ధం, అవినీతి, అశ్రిత పక్షపాతం కలగలసిపోయిన రాజకీయం మనది. పాలకులు మారినా పాపాలు మారవు. కిలో బియ్యం రూ. 40 దాటినా తగ్గించాలన్న నాయకుడు లేడు.
  విభజనతో నాయకులకు పండగే.
  మరి సగటు మనిషి మాట…

 5. పాలకుల రాజకీయ ఆర్ధిక పెత్తనం కోసం జరిగే దుర్మార్గంలో పనికిమాలిన వాదనలతో ప్రజలమధ్య చిచ్చు పెట్టి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకొంటున్నారు. గోచీలతో బతేకే జానాలకు కొత్తగా ఊడేది లేదు. వచ్చేదిలేదు

 6. జగ్గరెడ్డి లాంటి కొత్త ఉద్యమ కారులు కూద వస్తున్నరు వాల్ల జిల్లాకి అన్యాయం జరిగిందని వాల్ల సంగతి చూdandi

 7. జైఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు,తెలంగాణాప్రాంత నాయకుల,ప్రజల మనొభావాలు ఎలాఉండేవో తెలుస్తే చెపుతారా?అప్పుడు తెలంగాణరాయలసీమ ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారా? జైఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చిన తరువాత తెలంగాణా ఉద్యమం మరలాక్రియాశీలం దాల్చడానికి 30 ఏళ్ళు ఎందుకు పట్టింది? 2004 & 2009 ఎన్నికలద్వారా తెలంగాణా ప్రజల తీర్పు ఎందుకు స్పస్టత కాలేదు? వై.ఎస్.ఆర్ ఉన్నప్పుడు తెలంగాణాఉద్యమతీవ్రత అంతబలీయంగా ఎందుకులేదు? సీమాంద్ర ప్రజలు 2004 & 2009 లలో పార్టీలను ఎందుకు నిలదీయలేదు? అసలు ప్రత్యేక రాష్త్రం అంతగొప్పదా?

 8. కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే రాష్ట్రాన్ని విడిపోయిన లేదా కొత్త రాష్ట్రం అంటారు. ఇక్కడ మాత్రం తెలంగాణాను విడిపోయిన కొత్త రాష్ట్రం అంటున్నారు. ఎవరి మతి చెడిపోయి ఇలా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మార్కు రాజకీయాల పైన ప్రజలకు అసహ్యం వేయక పోవడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం. ఖచ్చితంగా పట్టి పీడిస్తుంది.

 9. @Praveen Mandangi…నిజమేనండోయ్…ఇప్పుదు డౌట్ వస్తుంది…కంత్రీ కాంగ్రెస్సే…ఈ దేశాన్ని ఇంత నాశనం చేసిన కాంగ్రెస్ ఏ ట్విస్ట్ అయినా ఇవ్వొచ్చు!!పుట్టిన రోజు బహుమతిగా ప్రకటించుకున్నారుగా…చరిత్రలో ఆ ప్రెస్టేజ్ దెబ్బ తినకూడదని..మేడమ్…తెలంగాణా ఎప్పటికైనా ఇస్తారని…సైక్యాట్రిస్ట్లూ..సైకాలజిస్ట్లూ అంటున్నారు మరీ!!
  అప్పటి ప్రకటన.. వాళ్ళు విభజనకు సిద్దపడే…చేసారుగా…తర్వాత, ఇక్కడ రివర్స్ అవగానే వెనక్కి తగ్గారంతే!!మళ్ళీ ముందుకు పోతున్నరు..ఎమ్పీ సీట్ల ఆలోచనతో…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s