అయితే మేమూ దూరమవుతాం లెండి! -కార్టూన్


Distancing

“అబ్బే, దాన్నేమీ సీరియాస్ గా తీసుకోనక్కర్లేదు. దాన్నుండి మేము దూరం జరుగుతున్నాంగా!”

“ఇహిహి, అది కేవలం జోక్, అంతే. దాన్నుండి మేము దూరంగా జరుగుతున్నాం. సరేనా!”

“మరేం పర్లేదు. మేమూ మీ నుండి దూరంగా జరుగుతున్నాం!”

దేశంలో పేదల బతుకుల్ని అపహాస్యం చేస్తున్న పేదల ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రుచి చూపుతోంది. దారిద్ర్య రేఖకు ప్రణాళికా శాఖ నిర్ణయించిన ప్రాతిపదిక అన్యాయంగా ఉన్నదని సుప్రీం కోర్టు సైతం మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తన కాకి లెక్కలనే మళ్ళీ ప్రకటించింది. యు.పి.ఏ ప్రభుత్వం పరిపాలించిన పదేళ్ళ కాలంలో దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 2004-05తో పోలిస్తే 2011-12 లో ఏకంగా 15.3 శాతం తగ్గిపోయిందని ప్రణాళికా కమిషన్ ప్రకటించడంతో ప్రతిపక్షాలు గగ్గోలు విమర్శలకు దిగాయి.

2011-12 లో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారి సంఖ్య పట్టణాల్లో 13.7 శాతం ఉన్నదనీ గ్రామాల్లో 25.7 ఉన్నదని ప్రభుత్వం తెలిపింది. మొత్తం మీద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య 21.9 శాతం మాత్రమేనని తెలిపింది. 2004-05లో దరిద్రం 37.2 శాతం ఉండగా అది 21.9 శాతానికి తగ్గడం తమ కృషి వల్లనేనని కాంగ్రెస్ చెప్పుకుంది.

ఈ లెక్కలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పట్టణాల్లో రోజుకు 34 రూపాయలు, గ్రామాల్లో రోజుకు 21 రూపాయలు సంపాదిస్తే వారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లేనని ప్రణాళికా శాఖ చెబుతోందని, ఈ డబ్బుతో కనీసం ఒక్క రోజాయినా ప్రణాళికా పెద్దలు, మంత్రులు గడిపి చూపించాలని వారు సవాళ్ళు విసిరారు. బి.జె.పి దగ్గర్నుండి సి.పి.ఐ, సి.పి.ఏం వరకూ ఈ లెక్కలను ఏకీ పారేశారు. సుప్రీం కోర్టు ముందు ఈ ప్రమాణాలు తప్పని ఒప్పుకున్న ప్రభుత్వం మళ్ళీ అవే ప్రమాణాల్ని ఉపయోగించి దరిద్రుల సంఖ్య తగ్గించ్చిందని చెప్పడం ఏమిటని అవి ప్రశ్నించాయి. ఎన్నికల కోసమే దారిద్రాన్ని తగ్గించి చెబుతున్నారని విమర్శించాయి.

దీనితో కాంగ్రెస్ పెద్దలు సవరణలకు పూనుకున్నారు. ఆ లెక్కలు తమావి కావని కొందరు చెబితే మరికొందరు లెక్కల్ని సమర్ధించడానికి కూడా పూనుకున్నారు. మరికొందరు మరీ బరి తెగించి అవాకులు చెవాకులు పేలారు. ముంబైలో 12 రూపాయలకే భోజనం వస్తుందని కాంగ్రెస్ ఎం.పి అంటే, అసలు అంతెందుకు ఢిల్లీలో 5 రూపాయలకే సుష్టుగా తినొచ్చని మరోకాయన ముక్తాయించాడు. కాశ్మీర్ పెద్దాయన అబ్దుల్లా అయితే రూపాయి క్కూడా భోజనం దొరుకుతుందని వాకృచ్చారు.

వీళ్ళంతా ఈ భోజనాలను తింటూ టి.వీల్లో ప్రత్యక్ష ప్రసారానికి పూనుకుంటే బాగుంటుంది. పేదవాళ్లు గనక కుళ్ళిపోయిన సద్దన్నం తిన్నా ఫర్వాలేదని వీరు ముక్తకంఠంతో సూచిస్తున్నారు. ఎ.సి మిషన్లు నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతుండగా, యూనిఫారం ధరించిన సిబ్బంది కొసరి కొసరి వడ్డీస్తుండగా, వడ్డించిన దాంట్లో సగం వదిలేసి లేచే ఈ పెద్ద మనుషులకు దేశ నిర్మాణానికి రెక్కల కష్టాన్ని ధారపోసే దరిద్రుల గురించి ఇంతకంటే గొప్ప వ్యాఖ్యానాలు చేస్తారని ఆశించడమే దండగ!

విమర్శలు రావడంతో దారిద్ర్యం లెక్కలు తమవి కావని కాంగ్రెస్ ప్రకటించింది. రాజ్ బబ్బర్ తదితరుల ప్రకటనలతో పార్టీకి సంబంధం లేదని కూడా ప్రకటించారు. మరయితే సరైన లెక్కలు ఏమిటి? బి.జె.పి కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది గనుక అక్కడ కూడా దరిద్రం తగ్గలేదని వారు ఒప్పుకుంటున్నట్లేనా? గుజరాత్ మోడల్ అని బి.జె.పి అధ్యక్షుడు పొగుడుతుంటే, మధ్య ప్రదేశ్ మోడల్ అని అద్వానీ గారు ఆకాశానికి ఎత్తారు. నిన్న గాక మొన్న అమార్త్య సేన్ గారేమో బీహార్ మోడల్ అని చెప్పారు. ఈ రాష్ట్రాల్లో కూడా దరిద్రం కొనసాగుతున్నట్లేనా?

ఎన్నికల కోసం దరిద్రం లెక్కల్ని కూడా ఎలా నిస్సిగ్గుగా మేనిపులేట్ చేయొచ్చో కాంగ్రెస్ చెబుతుంటే, ప్రభుత్వ అసలు దరిద్రం తగ్గలేదని చెబుతూనే తన బాధ్యతని తీసి గట్టుమీద పెట్టేయడం, ఆనక తాము కూడా దరిద్రాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకోవడం బి.జె.పి చేస్తున్న ఘనకార్యం.

సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్-ది హిందూ జరిపిన సర్వేలో వివిధ రాజకీయ పార్టీల పరిస్ధితి అంచనా వేయగా సదరు అంచనాలను ది హిందూ పత్రిక ప్రచురిస్తోంది. ఈ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పరిస్ధితి దిగనాసిల్లుతుండగా, బి.జె.పి పరిస్ధితి కూడా అంత బాగా ఏమీ లేదు. ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిపి 200 పైగా సీట్లు వస్తాయని ఈ అంచనాలు చెబుతున్నాయి. దాదాపు ఏడెనిమిది నెలల క్రితం అద్వానీ వేసిన అంచనాతో ఇది సరిపోలుతోంది.

3 thoughts on “అయితే మేమూ దూరమవుతాం లెండి! -కార్టూన్

 1. ‘ ఆకలితో అలమటిస్తున్నామని ‘ ప్రజలంటే,
  ‘గడ్డి మేయమంది ‘, అప్పటి ఫ్రెంచి రాజరికం !
  ‘దరిద్రం తో చస్తున్నామని’ ప్రజలు అంటుంటే ,
  ‘ బీదరికం తగ్గింది’ అంటున్నారు ఇప్పటి భారత పాలకులు !
  గడ్డి తినమన్న వారి నోళ్ళలో గడ్డిని కుక్కారు, ఫ్రెంచి ప్రజలు, అది గత చరిత్ర !
  బీదరికం తగ్గిందన్న వారినీ , కోట్లు వెనకేసుకునే వారినీ,
  మళ్ళీ, మళ్ళీ , గెలిపిస్తారు, భారత ప్రజలు ! ఇది నడుస్తున్న చరిత్ర !

 2. సుధాకర్ గారు. మీ ఆవేదనలో అర్థం ఉంది….

  కానీ ప్రజలు కొద్ది కాలం మోసపోవచ్చు కానీ….ఎప్పటికీ మోసపోరు.

  ఏదో ఒక రోజు భారత ప్రజలూ చరిత్రను మార్చేస్తారు.
  తమదైన రాజ్యం ఏర్పరచుకుంటారు.
  తమ చరిత్రను స్వర్ణాక్షరాలతో లిఖించుకుంటారు.

  ఇది ఖాయం.

 3. ఆ స్వర్ణయుగం ఎప్పటికి వచ్చేనో.. బీదవారికి కనీస తిండి ఎప్పటికి దొరికేనో.. విశేఖర్ గారన్నట్లు.. తక్కువ ధరకే భోజనం దొరుకుతోంది అని చెప్పిన నాయకులందరినీ.. అదెక్కడ దొరుకుతోంది.. ఒకసారి మీరు కూడా సుష్టుగా తినడం చూపండని ఎవరైనా అడుగుంటే ఏమి చేసుండేవారో.. అయినా ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారలెండి.. వాళ్లు చెప్పేది ఎలాగూ అబద్ధాలే అని వాళ్లకి గట్టి నమ్మకం. ఈ నమ్మకాన్ని ఏర్పరచడంలో మాత్రం మనవాళ్లు విజయం సాధించారు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s