మోడి, అమార్త్య సేన్, ఓ భారత రత్న


Amartya Sen

“Politics is the last refuge of scoundrels.” అని పెద్దాయన జార్జి బెర్నార్డ్ షా ఏ సందర్భంలో, ఎందుకు అన్నారో గానీ దాన్ని రుజువు చేయడానికి భారత రాజకీయ నాయకులు అనునిత్యం శ్రమిస్తూనే ఉంటారు. అమార్త్య సేన్ తన భావ ప్రకటనా హక్కును వినియోగించుకుంటూ ‘నరేంద్ర మోడి ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు’ అని చెప్పిన సందర్భం వారికి మరోసారి కలిసొచ్చింది.

తన అభిప్రాయం చెప్పినందుకు కొందరు బి.జె.పి నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. ఒక ఎం.పి అయితే వచ్చే ఎన్నికల్లో ఎన్.డి.ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆయనకు ఇచ్చిన ‘భారత రత్న’ బిరుదు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఆయనకి భారత రత్న ఇచ్చింది బి.జె.పి ప్రభుత్వం కాబట్టి బి.జె.పి ప్రభుత్వాలు, నాయకులు ఏం చేసినా మద్దతు ఇచ్చి తీరాలన్నమాట! అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చి ఆ గౌరవం ప్రదానం చేసి ఉంటే ‘కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి కృతజ్ఞతగా అలా మాట్లాడుతున్నారు” అని ఒక బండతో ‘ఫట్, దఢేల్’ మని మోది ఉండేవారన్నమాట!

ఇంతకీ ఆర్ధిక నోబెల్ బహుమతి కూడా వెనక్కి తీసుకోవాలని ఎన్.డి.ఏ ఎం.పిలు అంతా కలిసి నోబెల్ కమిటీకి పిటిషన్ పెడతారా ఏమిటి? మోడీకి వీసా ఇవ్వద్దని సి.పి.ఐ, సి.పి.ఎం ఎం.పిలతో సహా మన ఎం.పిలు అమెరికాకు మహజరు సమర్పించుకున్న నేపధ్యంలో ఈ అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తోంది. (సి.పి.ఐ ఎం.పిలు ఉన్న నిజం చెప్పారు. సి.పి.ఎం ఎం.పి మాత్రం తన సంతకం ఫోర్జరీ చేశారని చెబుతున్నారు. పిటిషన్ దారు మాత్రం తాను ఎట్టి విచారనాకైనా సిద్ధమే అని చెప్పేశారు. వీరు చెప్పే అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక నిబద్ధత ఇలా ఉంది మరి!)

ఏమన్నారాయన?

సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ నోబెల్ ఆర్ధిక బహుమతి గ్రహీత డాక్టర్. అమార్త్య సేన్ చానెల్ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. “అవును. నేను ఆయన్ని కోరుకోవడం లేదు. ఒక భారత పౌరుడుగా నాకు మోడి ప్రధాని కావడం ఇష్టం లేదు. మైనారిటీలు భద్రంగా ఉండడానికి తగినంతగా ఆయన ఏమీ చేయలేదు” అని ఆయన సమాధానం చెప్పారు.

మోదట అమార్త్య సేన్ మోడిని ప్రధానిగా ఎందుకు వద్దనుకుంటున్నారో వివరంగా చూడడం అవసరం. ఆయన కొన్ని కారణాలు చెప్పారు. అవి పరిశీలించకుండా గుడ్డిగా ఆయనను దుర్భాషలాడడం ఎవరికీ తగని పని. సేన్ తన ఇంటర్వ్యూలో వివిధ అంశాలను చర్చించారు. పత్రికల కధనాలు చూస్తే ఆయన పనిగట్టుకుని ‘మోడి నాకొద్దు’ అని చెప్పినట్లుగా ఉంది. వాస్తవానికి గుజరాత్ మోడల్, బీహార్ మోడల్ పోల్చుతూ తన అభిప్రాయాలు చెప్పారు. ఆయన ఏమన్నారో పూర్తిగా ఇక్కడ వీడియోలో చూడండి.

“లేదు. నేను ఆమోదించలేను… (ఆయన) రికార్డు చాలా బాగుందని నేను అనుకోను. నేను భద్రంగా లేనని భావించడానికి నేను మైనారిటీలో ఒక సభ్యుడిగా ఉండనవసరం లేదు. ఒక భారత పౌరుడిగా మెజారిటీలో సభ్యుడుగా ఉంటూనే ‘భారతీయుడిగా మైనారిటీలు అబధ్రతతో ఉండడానికి వీలు లేదు. 2002లో తమకు వ్యతిరేకంగా ఒక పద్ధతి ప్రకారం హింస జరిగిందని న్యాయబద్ధంగానే భావించడానికి వీలు లేదు’ అని చెప్పవచ్చు. అందుకు నేను వారిలో ఒకరిని కానవసరం లేదు. అది భయంకరమైన రికార్డు అని నా అభిప్రాయం. అలాంటి తరహా రికార్డు ఉన్న వ్యక్తి భారత ప్రధానిగా ఉండడం అంటే…  లేదు, ఒక భారత పౌరుడుగా నేను అంగీకరించలేను. ఖచ్చితంగా లేదు.”

“ఎందుకని” అని యాంకర్ సాగరికా ఘోష్ అడిగిన ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. “ఆయన పరిమితుల్లోనే మోడి ఇంకా చాలా చేసి ఉండవచ్చు. మొట్టమొదట ఆయన మరింత సెక్యులర్ గా ఉండాలి. తాము భద్రతతో ఉన్నామని మైనారిటీలు భావించేలా ఆయన చూడాలి. తాము మైనారిటీలను వివక్షతో చూడకూడదని, సుదీర్ఘ భారతీయ సంప్రదాయం అయిన సహనశీలతకు వ్యతిరేకంగా పోరాదనీ మెజారిటీలు భావించేలా ఆయన చేసి ఉండొచ్చు.”

మౌలిక నిర్మాణాలను చక్కగా నిర్మించినప్పటికీ మోడి మైనారిటీలతో పాటు మెజారిటీలకు కూడా ఏమీ చేయలేదని అమార్త్యసేన్ చెప్పడం విశేషం. (ఆ మాట కొస్తే మన్మోహన్ మాత్రం ఏం చేశారు గనక?). గుజరాత్ మోడల్ లో సమానతను తేవడానికి వీలుగా ఆరోగ్యం, విద్యా రంగాల్లో ఇంకా చాలా చేయాల్సి ఉందని ఆయన తన ఇంటర్వ్యూలో చెప్పారు.

“ఆయన ఇతర నిజాలను కూడా గుర్తించాలి. విద్య, ఆరోగ్యం రంగాల్లో గుజరాత్ రికార్డు చాలా ఘోరంగా ఉంది. భౌతిక మౌలిక నిర్మాణాలపైనా సరైన రీతిలోనే ఆయన కేంద్రీకరించినట్లుగా, ఆయన ఆ రంగాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి”

ఈ మాట చెప్పిన అమార్త్య సేన్ బీహార్ లో నితీశ్ కుమార్ విద్య, ఆరోగ్య రంగాలను కూడా పట్టించుకుంటున్నారని చెప్పారు. కానీ ఈ సంగతి ఏ పత్రికా చెప్పినట్లు లేదు. జపాన్, కొరియా, తైవాన్, సింగపూర్, చైనా లను ఉదాహరణలుగా తీసుకుని నితీశ్ కుమార్ పని చేస్తున్నారని సేన్ సూచించారు. ఆ దేశాలు విద్యావంతులయిన, ఆరోగ్యవంతమయిన కార్మిక శక్తిని తయారు చేసుకుంటున్నాయనీ అందుకే ఆదేశాలు ముందంజలో ఉన్నాయని ఆయన తెలిపారు. జి.డి.పి అంకెలు సూచించేది తక్కువేననీ, జి.డి.పి అంకెలు తక్కువగా ఉన్నంత మాత్రాన ఆర్ధిక వ్యవస్ధ సక్రమంగా లేనట్లు కాదని ఆయన చెప్పారు.

మరో విషయంగా ఆయన తాను అంబేద్కర్ నుండి చాలా నేర్చుకున్నానని చెప్పారు. “Educate, Agitate, Organize” అన్న ఆయన నినాదాన్ని ప్రస్తావిస్తూ వాటిని భారత దేశంలోని పేదలు అనుసరించాలని కోరారు. పేద ప్రజలు పరిమితికి మించి సహనం పాటిస్తున్నారనీ వారు తమ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయాలని కోరారు. అత్యంత దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ కూడా సహనంగా ఉండడం సరికాదని, అలాగని రష్యా తరహాలో విప్లవం కోసం ఉద్యమించమని చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. తమ పరిస్ధితుల పట్ల అవగాహన ఏర్పరచుకుని తదనుగుణంగా స్పందించాలని ఆయన కోరారు.

గర్హనీయం

ఈ అంశాలన్నింటిలో మోడీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యను మాత్రమే పత్రికలు హై లైట్ చేశాయి. ఇంటర్వ్యూలో ఏదో ఒక అంశాన్ని హై లైట్ చేయక తప్పదు గనుక ఒక దానిని హైలైట్ చేశారనుకున్నా ఆయన చెప్పిన ఇతర అంశాలను పత్రికలు కవర్ చేయకపోవడం గర్హనీయం. ముఖ్యంగా కార్మిక వర్గం యొక్క విద్య, ఆరోగ్యంల పైన ప్రభుత్వాలేవీ కేంద్రీకరించి పని చేయడం లేదనీ, జి.డి.పి లెక్కలే అంతా కాదనీ, ‘Educated and healthy workforce’ అని అభివృద్ధి చేయాలనీ ఆయన చేసిన నిర్మాణాత్మక సూచనలను ప్రస్తావించకపోవడం శోచనీయం.

జాతర

మీడియా హడావుడితో మొదలయింది జాతర. అమార్త్య సేన్ వ్యాఖ్యలకు సంతోషించేది కొందరయితే, నిప్పులు కక్కేది మరి కొందరు. నిప్పులు కక్కిన వారిపై నిప్పులు కక్కేవారు ఇంకొందరు. ఆనక నిప్పులు కక్కినందుకు అధినాయకత్వం మందలింపులకు దిగడంతో నాలిక్కరుచుకోవడం ఇప్పుడు నిప్పులు కక్కినవారి వంతయింది.

అమార్త్య సేన్ వ్యాఖ్యలు సహజంగానే కాంగ్రెస్ కు మోదం కలిగిస్తే బి.జె.పి కి ఖేదం కలిగించాయి. బి.జె.పి రాజ్య సభ సభ్యుడు, ‘ది పొయినీర్’ పత్రికకు ఎడిటర్-ఇన్-చీఫ్ కూడా అయిన చందన్ మిత్రా నిప్పులు కక్కే కర్తవ్యాన్ని చేతబట్టారు. “సేన్ అసలు ఇండియాలో కనీసం ఓటర్ గా అయినా ఉన్నారా? తదుపరి ప్రభుత్వాన్ని చేపట్టే ఎన్.డి.ఏ ఆయన నుండి ‘భారత్ రత్న’ ను వెనక్కి తీసుకోవాలి” అని ఆయన ట్విట్టర్ లో మంటలు రగిలించారు. “డాక్టర్ సేన్! ఇండియా పైన అవాంఛనీయ వ్యాఖ్యలు చేయొద్దు. మిమ్మల్ని ఆర్ధికవేత్తగా, బతకడానికి కాంగ్రెస్ అవగాహనను చెలామణీ చేసే వ్యక్తిగా మేము ఎరుగుదుము.” అని వ్యాఖ్యానించారు.

మిత్రా వ్యాఖ్యలను పలువురు ఖండించారు. బి.జె.పి పార్టీ భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇప్పుడు వ్యతిరేకమా? అంటూ ఆయన టైమ్ లైన్ లోనే ప్రశ్నలు సంధించారు. అయినా ఆయన తల ఒగ్గ లేదు. “భారత్ రత్నను వెనక్కి తీసుకోవాలన్న నా సూచన పట్ల బాధపడ్డావారిని అడుగుతున్నాను. భారత్ రత్న పొందిన తర్వాత రాజకీయాలు చేసినవారిని ఎవరినైనా చూపగలరా?” అని వ్యాఖ్యానిస్తూ ఆయన భారత్ రత్న దేశానికి మణిపూస లాంటిదని ‘సేన్ కాంగ్రెస్ ఎన్నికల బృందంలో చేరి ఉండకూదని’ స్పష్టం చేసేశారు.

అయితే మిత్రా వండిన పప్పులు ఉడకలేదు. బి.జె.పి తన ఫాసిస్టు స్వభావం బయట పెట్టుకుందని కాంగ్రెస్ తదితర పార్టీలు విమర్శించాయి. తనకు భారత రత్న ఇచ్చింది అటల్ బిహారీ వాజ్ పేయి గనుక ఆయన కోరితే వెనక్కి ఇవ్వడానికి అభ్యంతరం లేదని సేన్ కూడా స్పందించారు. తనకు భారత రత్న ఇచ్చినంత మాత్రాన తన అభిప్రాయాలూ చెప్పకూడదనడం అసంబద్ధం అని తెలిపారాయన.

ఎదురు దాడితో బి.జె.పి అప్రమత్తం అయింది. భావ ప్రకటనా స్వేచ్ఛ లోకి చర్చ వెళ్ళడం, అది బి.జె.పి కి ప్రమాదకరంగా పరిణమించడంతో ఆ పార్టీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. అమార్త్య సేన్ కి ఎన్.డి.ఏ ప్రభుత్వం ప్రదానం చేసిన ‘భారత రత్న’ పైన చర్చ జరగడం దురదృష్టకరమని బి.జె.పి ప్రతినిధి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అటు శివసేన అధిపతి ఉద్ధవ్ ఢాకరే కూడా మిత్రా వ్యాఖ్యలను ఖండించారు.

దీనితో చందన్ మిత్ర విచారం ప్రకటనతో ముందుకొచ్చారు. తాను అతిగా వాగానని చెప్పుకున్నారు. సేన్ గారి భారత రత్న గురించి చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. “నేను మరీ ఎక్కువ చేశాను. డా. సేన్ నుండి భారత రత్న వెనక్కి తీసుకోవాలన్న భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాను. నేను అతిగా వాగాను (I oversaid it)” అని ఢిల్లీలో విలేఖరులకు చెప్పారు. అయితే సేన్ ఆర్ధిక విధానాలపై విమర్శలను పునరుద్ఘాటించారు. అవి పాతబడిపోయాయని వ్యాఖ్యానించారు.

నిజానికి అమార్త్య సేన్ కి నోబెల్ బహుమతి ఇచ్చింది 1998లో. ఎన్.డి.ఏ ప్రభుత్వం ఆయనను ‘భారత రత్న’ బిరుదుతో సత్కరించింది 2000లో. బి.జె.పి ఆయన ఆర్ధిక విధానాలను మెచ్చి సత్కరించి 12 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇంత తక్కువ కాలంలో ఆర్ధిక విధానాలు పాతబడిపోతే ఇక అర్ధ శాస్త్ర పితామమహుడు ఆడమ్ స్మిత్ ను తలచుకోవడం మానేయాలా? 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభంలో పశ్చిమ దేశాలు అమలు చేసింది 1930ల నాటి కీన్స్ ఆర్ధిక విధానాలే అని మన ఎం.పి గారికి తెలియదనుకోవాలా?

ఆర్ధిక విధానాలు కొత్త, పాత అంటూ ఏమీ ఉండవు. అవి ప్రజల బాగోగులను ఎంతవరకు పట్టించుకుంటాయి అన్నదానిపైనే ఒక ఆర్ధిక విధానం యొక్క సంబద్ధత (legitimacy) ఆధారపడి ఉంటుంది తప్ప, అవి ఎంత కొత్తగా తయారయినాయి అన్నదానిపై కాదు. రాజకీయ-ఆర్ధిక సిద్ధాంతాలపైన కూడా ఇలాగే ‘కాలం చెల్లిపోయాయి’ అనే వాదన తరచుగా వినిపిస్తుంది. ప్రజలకు వాస్తవ ప్రజాస్వామ్యం దక్కనంతవరకూ వారికి అధికారం వాస్తవంగా ఎలా దక్కుతుందో చెప్పే సిద్ధాంతం ఎన్ని వందల యేళ్ళు గడిచినా నిత్య నూతనంగా ఉంటుంది.

3 thoughts on “మోడి, అమార్త్య సేన్, ఓ భారత రత్న

  1. మనది ఇచ్చి పుచ్చుకొనే సంస్కృతి. ఆ సంస్కృతి లో భాగంగానే అమర్త్యా సేన్‌ కు భారత్‌ రత్న ఇచ్చి ఉంటారు. మరి ఆయన పుచ్చుకున్నాడు కానీ తిరిగి ఇవ్వలేదు గా! ఆ సంస్కృతి కి అమర్త్యా సేన్‌ చేటు తెచ్చాడు గా!(?) మన వాల్లు ఊరకుంటారా? ( ఇక్కడే అన్నా హజరే తప్పులో కాలేసాడు?) మరి ఇచ్చి పుచ్చు కోవడమే ఒక అవి నీతయితే దాన్ని ఆయన ఎక్కడకు పారదోలగలడు?
    ‘గుజరాత్ మారణకాండ మోడీకి ఆభరణం’ అవునేమో, ఈ లాంటి సస్కృతి లో అమర్త్యా సేన్‌ కూ భారత రత్న ఒక ఆభరణమా?’

  2. ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించలేని పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అమలుచేస్తున్నాయో వారే సమాదానం చెప్పాలి?

  3. ఊరుకుంటే పులిని కూడా పిల్లిని చేసి ఆడుకునే రకాలు మన నాయకులు.. ఎదురుతిరిగితే పిల్లిని చూసైనా భయపడతారు. ఆనక నాలుక కరుచుకుని అయ్యో తప్పు చేశానే.. కోపంలో వివేకం కోల్పోయాను అని నాటకాలాడతారు.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు ఇదేగా మన నాయకుల తీరు.. అమర్త్యసేన్ గొప్పగా సమాధానం చెప్పి ఖంగు తినిపించారు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s