అమెరికాకు తెలిసిన భాష ఒక్కటే. బెదిరించడం, భయపెట్టడం, మందీ మార్బలంతో దాడి చేయడం, ఆనక సంక్షోభంలో చిక్కుకోవడం. ఆ సంక్షోభ భారాన్ని మళ్ళీ ప్రపంచం నెత్తిన రుద్దడం. సి.ఐ.ఏ, ఎన్.ఎస్.ఏ ల మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ ను తిరిగి రప్పించడానికి ఇప్పటి వరకు జరిపిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడమే కాక, తనకే బెడిసి కొట్టడంతో అమెరికా బెదిరింపుల తీవ్రతను మరింత పెంచింది. ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇచ్చే దేశాలపై ఆంక్షలు విధిస్తానంటూ ఇప్పుడు బెదిరిస్తోంది.
మాస్కో లోని షెర్మెట్యెవో విమానాశ్రయంలో గత నెల రోజులుగా చిక్కుకున్న ఎడ్వర్డ్ స్నోడెన్ కు తాత్కాలిక రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి రష్యా సమ్మతించిన సంగతి తెలిసిందే. రష్యాతో పాటు బొలీవియా, వెనిజులా, నికరాగువా దేశాలు కూడా స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి ముందుకొచ్చాయి. హెచ్చరికలు, ఆగ్రహ ప్రకటనలు, నర్మగర్భ బెదిరింపుల ద్వారా ఈ దేశాలపై కన్నెర్ర చేసినప్పటికీ అమెరికా ఆచరణలో ఏమీ చేయలేక నిరుత్తరురాలుగా మిగిలిపోయింది. నిస్పృహకు లోనై ఇప్పుడు తుప్పు పట్టిన ఆంక్షల అస్త్రాన్ని దూస్తోంది.
అమెరికా దిగువ సభ ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’ లేదా ‘కాంగ్రెస్’ రష్యా లేదా స్నోడెన్ కు ఆశ్రయం ఇచ్చే మరే దేశం పైనైనా ఆంక్షలు విధించే బిల్లును రూపొందించేవైపుగా అడుగులు వేస్తోంది. రిపబ్లికన్ పార్టీ సెనేట్ సభ్యుడు లిండ్సే గ్రాహం దీనికి సంబంధించి ఒక బిల్లును రూపొందించి సెనేట్ అప్రాపృయేషన్స్ కమిటీలో ప్రవేశ పెట్టగా సదరు కమిటీ దానిని ఏకగ్రీవంగా ఆమోదించింది. స్నోడెన్ కు ఆశ్రయం ఇచ్చే దేశాలపై పెనాల్టీ విధించాలనీ, ఆ క్రమంలో సెనేట్ సభ్యులను విశ్వాసం లోకి తీసుకోవాలని బిల్లు కోరుతోంది.
తన మాట వినని, తన సామ్రాజ్యవాద ప్రయోజనాలకు లొంగని దేశాలపై వాణిజ్య ఆంక్షలు విధించడం అమెరికాకు ఇది కొత్త కాదు. ఇరాన్ పై ఐరాస చేత నాలుగు విడతలుగా ఆంక్షలు విధింపజేసి అక్కడి ప్రజలకు కనీసావసర ఔషధాలు అందకుండా చేస్తోంది. ఇరాక్ పై పదేళ్ళు ఆంక్షలు విధించి ప్రజల్ని, ముఖ్యంగా లక్షలాది పసి పిల్లల్ని ఉసురు తీసి చంపేసింది. ఉత్తర కొరియాపైన ఇప్పటికీ మూడు విడతలుగా ఆంక్షలు విధించింది.
అమెరికా ఆంక్షలను ఇరాన్ ఎంత అపహాస్యం చేస్తుందంటే ఆ దేశ మాజీ అధ్యక్షుడు అహ్మది నెజాద్ వాటిని ‘వాడి పారేసిన రుమాలు’గా తీసిపారేశాడు. ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని వైరస్ లు సృష్టించి ఇరాన్ కంప్యూటర్లలో ప్రవేశపెట్టి ఆ దేశ శాంతియుత అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలని చూసినా ఇరాన్ లొంగలేదు సరికదా, మరిన్ని శక్తులు కూడదీసుకుని యురేనియం శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంది.
స్నోడెన్ ను అమెరికాకు అప్పగించడం నిజానికి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఏ వ్యక్తి అయినా పరాయి దేశం నుండి తాత్కాలిక రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే అతనిని అతని దేశానికి అప్పగించరాదని ఐరాస చట్టాలు చెబుతున్నాయి. స్వదేశంలో అణచివేతను ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో సదరు వ్యక్తి ఇతర దేశంలో రాజకీయ ఆశ్రయం కోరుతున్నపుడు అదే దేశానికి అప్పగించడం అతని హక్కులను ఉల్లంఘించడమేనని ఐరాస చట్టాలు చెబుతున్నాయి.
స్నోడెన్ కు రష్యా రాజకీయ ఆశ్రయం ఇవ్వనున్నట్లు ఆ దేశ అధికారులు ప్రకటించడంతో అమెరికా హతాశురాలయింది. రష్యా నిర్ణయం పట్ల తాము అసంతృప్తి చెందుతున్నట్లు ప్రకటించింది. అమెరికా విదేశీ మంత్రి కేర్రీ, రష్యా విదేశీ మంత్రి సెర్గీ లావరోవ్ కు స్వయంగా ఫోన్ చేసి ఈ విషయం మాట్లాడినట్లు పత్రికలు తెలిపాయి. అయినప్పటికీ ఎడ్వర్డ్ స్నోడెన్ విషయంలో తమ నిర్ణయం మార్చుకునే పరిస్ధితిలో రష్యా లేదు. అమెరికా రహస్యాలను బైట పెట్టొద్దన్న షరతుతోనే తాము ఆశ్రయం ఇస్తున్నామని రష్యా గుర్తు చేస్తోంది.
ఐ.రా.స చట్టాలను రూపొందించింది ఎవరు? దానిని ఆచరిస్తున్నది ఎవరు? నీతులు ఎదుటివారికి చెప్పేటందుకే ఉన్నాయి.అయినా అమెరిక ప్రపంచపోలీస్ కదా!(ఎవరు ఇచ్చారో ఆ హోదా?) తన దృష్ఠిలో దొంగ అయినవాడిని ఎక్కడున్నా పట్టుకుతీరుతుంది.వాళ్ళకి అశ్రయం ఇచ్చిన వారికీ ఆ నెపం మోపుతుంది .సహాయం చేసినవారికి తాత్కాలికంగానయినా రాచమర్యాదలు చేస్తున్నట్లు నటిస్తుంది.