స్పెయిన్ లో భారీ రైలు ప్రమాదం చోటు జరిగింది. వంపులో పరిమితికి మించి వేగంతో ప్రయాణించడంతో హై స్పీడు రైలు పట్టాలు తప్పింది. దుర్ఘటనలో ఇప్పటికీ 78 మంది మరణించినట్లు లెక్క తేల్చారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. పట్టాలు తప్పినప్పుడు రైలు ఎంత వేగంగా వెళ్తోందంటే పట్టాలు తప్పిన ఒక కంపార్టుమెంటు ఆ వేగానికి తన ముందున్న కంపార్టుమెంటుని గుద్దుకుని ఎగిరి పైకి లేచి పక్కనే ఉన్న ఎత్తైన గోడని దాడి అవతల ఉన్న రోడ్డుపైకి విసురుగా వచ్చిపడింది.
స్పెయిన్ లో హై స్పీడు రైలు ప్రమాదానికి గురి కావడం ఇదే మొదటిసారట! గత 40 యేళ్లలో ఇంత భారీ రైలు ప్రమాదమే జరగలేదట. వంపు వద్ద గంటకు 90 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించవలసి ఉండగా ప్రమాదం 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తోందని ది హిందూ తెలిపింది. రష్యా టుడే పత్రిక ప్రకారం స్పెయిన్ హై స్పీడ్ రైళ్లు గంటకు 250 వేగంతో ప్రయాణించగలవు. డ్రైవర్లు సాధారణంగా 220 కి.మీ వేగంతో వెళ్తుంటారని ఆ పత్రిక తెలిపింది. రైలు వేగంగా వెళ్తున్నట్లు డ్రైవర్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ప్రమాదంలో 130 మంది తీవ్రంగా గాయపడ్డారని, ఐదుగురు కోమాలో ఉన్నారని పత్రికలు తెలిపాయి. జర్మనీ వార్తా సంస్ధ డి.పి.ఏ ప్రకారం ప్రమాద స్ధలిలో మృత దేహాలు చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. కొన్ని మృత దేహాల జేబుల్లోని సెల్ ఫోన్లు రింగవుతున్నాయని డి.పి.ఎ తెలిపింది. రెండు భారీ క్రేన్లు కంపార్టుమెంట్లను చక్కబరిచి మృత దేహాలను వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నాయి. భద్రతా సిబ్బంది ప్రమాద స్ధలానికి చేరుకుని గ్యాస్ కట్టర్ల ద్వారా లోపల ఇరుక్కున్నవారిని బైటికి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదానికి వేగం ఒక్కటే కారణం కాకపోవచ్చని రైల్వే ఇంజనీర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇంకేదో కారణం కూడా జతకలిసి ఉండవచ్చని వారి అభిప్రాయం. అయితే టెర్రరిస్టు దాడి కోణాన్ని స్పెయిన్ హోమ్ మంత్రి కొట్టిపారేశారు. ప్రమాదం జరిగినప్పుడు 240 మంది వరకు ప్రయాణిస్తున్నారని, ట్రైన్ మాడ్రిడ్ నుండి ఫెర్రోల్ కి వెళ్తుండగా శాంటియాగో డి కంపోస్లా నగరం వద్ద పట్టాలు తప్పింది. రైలు పట్టాలు తప్పాక రెండు కంపార్టుమెంట్లకు మంటలు అంటుకోవడంతో మరింత ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది.
గురువారం నాడు శాంటియాగో నగరవాసులు ‘శాంటియాగో డే’ పండగ జరపుకోవాల్సి ఉంది. ప్రమాదం జరగడంతో పండగ ఏర్పాట్లు రద్దు చేస్తున్నట్లు నగర మేయర్ ప్రకటించాడు. మరణించినవారిలో అత్యధికులు ఈ పండగలో పాల్గొనడానికి వస్తున్నవారేనని తెలుస్తోంది. స్పెయిన్ ప్రధాని, రాజు, మంత్రులు తదితరులు సంతాప సందేశాలు పంపారని పత్రికలు తెలిపాయి.
స్పెయిన్ లో హై స్పీడ్ ట్రైన్ నెట్ వర్క్ 1992 లో ప్రారంభం అయిందని ది హిందూ తెలిపింది. అప్పటి నుండి ఇప్పటివరకూ ఈ నెట్ వర్క్ లో ఒక్క రైలు ప్రమాదం కూడా జరగలేదట. పట్టాలు తప్పడం అసలే జరగలేదని తెలుస్తోంది. 20 సంవత్సరాల పాటు పట్టాలు తప్పకుండా హై స్పీడ్ రైళ్లు నడపడం ఒక ఘనతే కావచ్చు.
ఋణ సంక్షోభంతో సతమతం అవుతూ రెండు, మూడేళ్లుగా నిత్యం ఆందోళనలతో అట్టుడుకుతున్న స్పెయిన్ కి ఈ ప్రమాదం పులి మీద పుట్ర.
ఈ ఫోటోలను రష్యా టుడేతో పాటు వివిధ ట్విట్టర్ ఖాతాదారులు సంఘటనా స్ధలం నుండి అందించినవి. వీడియో కూడా ఆర్.టి అందించినదే.
–
–
కాబట్టి నాకేమి అర్ధం అయిందంటే చావు అనేది వస్తే ఎంత పెద్ద టెక్నాలజీ అయినా ఎంత గొప్ప దేశం అయినా ఆపలేదు
సాయి గారూ, చావు అనేది వచ్చినపుడు ఎవరూ ఆపలేరు గాని, టెచ్నాలజీ ఉండి, దాన్ని సరిగా (విధ్వంసాలకు కాకుండా) ఉపయోగించుకునే మనుషులు ఉన్నపుడు చావు తక్కువసార్లు మన వైపు వస్తుంది. టెక్నాలజీ లేనపుడు చావు నిత్యం మన ముందే కాచుక్కూర్చుంటుంది. ప్రాచీన కాలం నుంచి టెక్నాలజీ యొక్క అసలు లక్ష్యం చావును వెనక్కు నెట్టడమే!
అనుకోని పొరపాట్లు జరిగితే చెయ్యగలిగిందేమీ లేదు. కానీ రూల్స్ పాటించక పోవటం నేరం