ఏది చీకటి, ఏది వెలుతురు? పాట ఒకటే చిత్రీకరణలేన్నో!


ఈ పాట రాసింది శ్రీ శ్రీ అని తెలియనివారు ఉంటారనుకోను. రాసినప్పుడు ఆయన పాటగా రాశారో, కవిత్వంగా రాశారో నాకు ఖచ్చితంగా తెలియదు. కవిత్వంగానే రాశారని నేనిన్నాళ్లూ అనుకున్నాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడూ అదే అనుకుంటున్నాననుకోండి!

ఈ పాటను ఒక సినిమాలోనే వాడుకున్నారని అనుకున్నా ఇన్నాళ్ళు. కానీ ఇంకా ఇతర సినిమాల్లో కూడా వాడుకున్నారని ఈ రోజు తెలిసింది.

‘ఆకలి రాజ్యం’ సినిమాలో ఈ పాటను మొదటిసారి విన్నాను, చూశాను. చాలా చిన్నప్పుడు (ఎనిమిదో తరగతిలో) ఆ సినిమా చూశాను. అప్పుడే నాకు ఈ పాట చాలా గొప్పగా అనిపించింది. మనిషి సమాధానం చెప్పుకోలేని ఎన్ని ప్రశ్నలున్నాయో కదా అని అప్పుడనుకున్నాను.

ఆకలి రాజ్యం సినిమాలో ఈ పాట వినండి!

ఆకలి రాజ్యం లోని పాట ఒరిజినల్ పాట. దీనికి సంగీత వాయిద్యాల సహకారం లేదు.

ఎందుకో? ఏమో?‘ గారి బ్లాగ్ లో వాయిద్య సహకారంతో ఈ పాట చూశానీరోజు.

‘విరోధి’ సినిమాలో కూడా ఈ పాట వాడారని తెలిశాక ఎంత వెనకబడి ఉన్నానా అనుకున్నాను. ఈ సినిమాలో ఈ పాట దృశ్యీకరణ రోమాంచితం అనిపించింది. నీలకంఠం దర్శకత్వం లోని కధ కావడం వలన అలా ఉన్నదనుకుంటాను.

ఈ కవితలో అన్నీ ప్రశ్నలే.

శ్రీ శ్రీ తెలియకనే ఈ ప్రశ్నలు వేశారా? కాదని నా అభిప్రాయం. నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానాలను ఆయన ఇతర అనేక కవితల ద్వారా చెప్పారు.

ఇవి సమాధానాలు తెలియక వేసిన ప్రశ్నలు కాదు. సమాధానాలు అనేకానేకం కళ్ల ముందు కనపడుతున్నా వాటిని ఆవాహన చేసుకోలేని జనాన్ని చూసి వేసిన ప్రశ్నలని నాకు క్రమ క్రమంగా తోచింది. ఆయన తాత్విక దృక్పధం ఏమిటో తెలిసినవారికి కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.

ఈ పాట/కవిత కు ఒక ప్రత్యేకత ఉంది. తత్వ శాస్త్ర అభివృద్ధి మొదలయినప్పటి నుండి పరస్పరం హోరా హోరీగా తలపడుతూ, ఉత్తర, దక్షిణ ధృవాలుగా నిలుస్తూ వచ్చిన రెండు విరుద్ధ తత్వాలను నమ్మేవారికీ ఈ పాట తమదే అనిపించడం ఆ ప్రత్యేకత!

భావ వాదం, భౌతిక వాదం తాత్విక రంగంలో పరస్పర విరుద్ధ తత్వాలు.

భావవాదం భావం/దైవం/ఆలోచన/శక్తి ని ప్రధానంగా ఎంచుతుంది. పదార్ధాన్ని ఆ తర్వాత స్ధానంలో నిలుపుతుంది.

క్లుప్తంగా చెబితే భావం నుండి పదార్ధం పుట్టింది అని చెబుతుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ‘దైవం అనే ఒక శక్తి అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటుంది. అది ‘హామ్, ఫట్!’ లాగా తలచుకుని పదార్ధాన్ని సృష్టించింది’ అని భావవాదం చెబుతుంది.

భౌతికవాదం సరిగ్గా దానికి విరుద్ధంగా చెబుతుంది.

“పదార్ధం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉన్నదే. పదార్ధం నుండే భావం పుట్టింది” అని భౌతికవాదం చెబుతుంది.

పదార్ధం వివిధ రూపాలు సంతరించుకుంటూ ఒకానొక యాదృచ్ఛిక క్షణాల్లో జీవ పదార్ధంగా ఆవిర్భవించిందనీ, (జీవ పదార్ధం ప్రాధమిక రూపం అమీబా అని శాస్త్రజ్ఞులు చెప్పేదే) అమీబా తన పరిసరాలతో సంఘర్షిస్తూ, ఐక్యం అవుతూ బహుకణ జీవులుగా అభివృద్ధి చెందిందనీ, లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో అభివృద్ధి చెందుతూ అది నేటి మానవుడుగా ఆవిర్భవించిందనీ భౌతికవాదం చెబుతుంది.

పదార్ధాలలో కెల్లా అత్యంత అభివృద్ధి చెందిన పదార్ధం మానవుడి మెదడు.

పరిసరాల జ్ఞానం ఇంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిఫలించినపుడు పుట్టేదే భావం. ఈ భావానికి, ఎదుట కనిపించే వాస్తవానికి మధ్య అంగీకారయోగ్యమైన పొంతన కుదరని పరిస్ధితుల్లో దైవ భావన పుట్టింది. కానీ శాస్త్రం అభివృద్ధి చెందే కొద్దీ దైవ భావన అంతరించాల్సి ఉండగా మరింత బలం సంతరించుకుంది. దానికి కారణం మానవ సమాజంలో ఏర్పడిన వర్గాలు.

మానవ సమాజంతో పాటు అభివృద్ధి అవుతూ వచ్చిన ఉత్పత్తి సాధనాలను కొద్దిమంది స్వాయత్తం చేసుకోవడంతో అలా చేసుకున్నవారు దోపిడి వర్గంగానూ, ఉత్పత్తి సాధనాలపై పని చేస్తూ కూడా ఆ పని ఫలితాన్ని అనుభవించలేనివారు దోపిడీకి గురయ్యే వర్గంగానూ అవతరించారు.

ఈ వర్గ దోపిడీని వివిధ దైవ సిద్ధాంతాలు న్యాయబద్ధం (legitimize) చేశాయి. ఏదయితే అసహజమో దాన్ని సహజం అన్నాయి. ఏదయితే కూలిపోవాలో అది నిలవాలన్నాయి. ఏదయితే అశాశ్వతమో అదే శాశ్వతం అన్నాయి. దోపిడీ వర్గాలకు ఏది నీతో అదే అందరికీ నీతి అన్నాయి. ఏది నిజమో దాన్ని భ్రమ అన్నాయి. ఏది భ్రమో అదే నిజం అన్నాయి.

మనిషి చుట్టూ కమ్మిన ఈ మాయా ప్రపంచం మనిషిని ఇంకా తన బానిసగానే ఉంచుకుంది. మనిషిని అయోమయంలో ఉంచడంలొ అదింకా సఫలం అవుతూనే ఉంది. దానిని మాయ అని గుర్తించినవానికి అనేక పేర్లు పెట్టింది.

స్పార్టకస్, బ్రూనో, కోపర్నికస్, చార్వాకుడు, కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, వి.ఐ.లెనిన్, జె.స్టాలిన్, మావో జెడాంగ్, నక్సలైట్…. పేరేదైతేనేం? వారిలో కొందరిని నడి బజారులో తగలబెట్టి చంపారు. కొందరిని ఉరి తీశారు. ఇంకొందరిని దేశ దేశాలు తరిమి తరిమి వేటాడారు. ఇంకా వేటాడుతూనే ఉన్నారు.

శ్రీ శ్రీ కి సమాధానాలు తెలుసు. తనకు తెలిస్తే చాలదు కదా. అది అందరికీ తెలియాలి. అలా తెలుసుకొమ్మని చెప్పడానికి ఆయన ప్రశ్నల కొడవళ్ళను మన ముందు నిలిపి పోయారు. ఆ ప్రశ్నలకు సరిగమలు అద్ది తన్మయత్వంతో మనం ఇప్పుడు పాడుకుంటున్నాం.

ఏది చీకటి? ఏది వెలుతురు?

ఏది జీవితమేది మృత్యువు?

ఏది పుణ్యం? ఏది పాపం?

ఏది నరకం? ఏది నాకం?

ఏది సత్యం? ఏదసత్యం?

ఏదనిత్యం? ఏది నిత్యం?

ఏది ఏకం? ఏదనేకం?

ఏది కారణమేది కార్యం?

ఓ మహాత్మా…! ఓ మహర్షీ……!

ఏది తెలుపు? ఏది నలుపు?

ఏది గానం? ఏది మౌనం?

ఏది నాది? ఏది నీది?

ఏది నీతి? ఏది నేతి?

నిన్న స్వప్నం, నేటి సత్యం!

నేటి ఖేదం, రేపు రాగం!

ఒకే కాంతి, ఒకే శాంతి!

ఓ మహాత్మా……! ఓ మహర్షీ……!!

పాడుకోవలసిందే. పాడుకోవడంతో పాటు, పాడుకుని తన్మయం చెందడంతో పాటు పాటలోని ఆ ప్రశ్నల కొడవళ్ళు కోసి నూర్వడానికి సమాధానాల కంకులు కావాలిప్పుడు. త్యాగాల చాళ్ళల్లోనే ఆ కంకులు విరగ కాస్తాయి. అటువంటి త్యాగాల చాళ్లలో విత్తులయ్యే పుడమి పుత్రుల కోసమే శ్రీ శ్రీ పాట!

బహుశా వారిని ఉద్దేశించే శ్రీ శ్రీ అని ఉంటారు.

ఓ మహాత్మా! ఓ మహర్షీ!! అని.

10 thoughts on “ఏది చీకటి, ఏది వెలుతురు? పాట ఒకటే చిత్రీకరణలేన్నో!

  1. శ్రీ శ్రీ మహప్రస్తానం రాసి ఇప్పటికి 60, 70 ఏళ్లు అవుతున్నాయి. ఆయన సమకాలికులను అది ఏ విధంగా ప్రభావితం చేసిందో ఇప్పటికి సాహిత్యంలో ఒక అంశంగా ఆయన అభి మానులు చర్చిస్తూనే ఉన్నారు.

    సాహిత్యం లో ఈ శతాబ్ది నాది అనిన శ్రీ శ్రీ కూడా వెల్లిపోయి ముప్పై ఏళ్లు దాటాయి. ఆయన తరం లో ఉన్న ఆధునిక భావాలు ఈ తరానికి సరిగ్గా అందకపోవడానికి కారణం గ్లోబలైజేషన్‌ కారణంగా విస్తరించిన ఇంగ్లీష్ చదువులు అమెరిక వాడి మో చేతి కింద నీల్లు తాగితే గాని కడుపు నిండని బ్రతుకులు తెలుగుకి ఆధరణ లేకుండ చేశాయి.

    తరమెల్లీ పోయింది రో అని ఈ మద్య ఆంధ్ర జ్యోతి సంపాదకులు రాసిన ఎడిటోరియల్‌ చూసి మనసు ఆర్ద్రం అయింది. ఎప్పుడో 20 శతాబ్దపు ప్రధమార్దం లో ఉన్న ఆదునికత ఈరోజూ యువతలో కనిపించడం లేదు.

    వీల్లు ఆధునికత అని అనుకొంటున్నది పురోగమనం కాక పోగ తిరోగమనంగా 21 శతాబ్దం నుండి 19 శతాబ్దానికి తీసుకెలుతున్నది. ఈ రోజు ఈ శ్రీ శ్రీ కవిత మీద తాత్విక తను జోడించిన వ్యాఖ్యానం తో మనసుకు ఊరట కల్పించిన మీకు దన్య వాదాలు.

  2. మీ వ్యాఖ్యానం బాగుంది.

    ఇది ఖడ్గ సృష్టిలో ఉన్న కవిత అనుకుంటాను. ఆకలి రాజ్యం సినిమాకు 15 ఏళ్ళకు ముందే శ్రీశ్రీ రాసింది. అయితే ఈ కవిత ను చాలామంది ప్రేక్షకుల్లాగా తొలిసారిగా ‘ఆకలిరాజ్యం’లోనే నేనూ విన్నాను.

    ‘విరోధి’ సినిమాలో దీన్ని వాడారని నాకు ఈ పోస్టు చూశాకే తెలిసింది!

  3. శ్రీశ్రీ కవిత…..దానికి మీ వ్యాఖ్యానం చదివాక ఎన్నో వేల భావాలు తలెత్తుతున్నాయి.

    దాన్ని వ్యాఖ్య రూపంలో పెట్టాలంటే మాటలు రావడం లేదు. నాకున్న భాష సరిపోవడం లేదు.

    ఈ ఒక్క కవిత చాలు. ప్రపంచంలోని ఏ భాషా సాహిత్యానికి మన సాహిత్యం తీసిపోదని చెప్పడానికి.

    రవీంద్రుని ” WHERE THE MIND IS ” …..కంటే ఓ అడుగే ముందే వేశారు శ్రీశ్రీ.

    శ్రీశ్రీకి నోబుల్ ప్రైజ్ రాలేదనే బాధ కన్నా…ఈ కవిత ఓ సారి చదివితే అంతకు మించిన అనుభూతి కలుగుతోంది.

    ఒక గొప్ప కవితను మాకు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు.

  4. స్పార్టకస్, బ్రూనో, కోపర్నికస్, చార్వాకుడు, కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, వి.ఐ.లెనిన్, జె.స్టాలిన్, మావో జెడాంగ్, నక్సలైట్…. ఇందులో చివరి పదానికి స్థానం ఉండే అవకాషం లేదు.

  5. ఇండియాకు సంబంధించినంతవరకూ, ప్రస్తుతానికి, వారికే ఆ అవకాశం ఉంది. ఇంకెవరికీ లేదు. ఎందుకంటే పోరాటం ద్వారా భూపంపకం చేపట్టింది వారే. వాళ్లు అడుక్కోలేదు. లాక్కోక తప్పదన్న మార్క్సిస్టు మౌలిక సూత్రాన్ని నక్సల్బరి యోధులు త్రికరణశుద్ధిగా ఆచరించే ప్రయత్నం చేశారు. అందుకే భారత దేశానికి సంబంధించినంతవరకూ వారికే ఆ స్ధానం దక్కుతుంది.

  6. అద్భుతమైన పాట-గుర్తొచ్చినప్పుడల్లా అంతర్లోకాలన్నిటా నిశ్శబం గా ప్రతిధ్వనించే పాట…!

  7. ఆ పాట ఎంతో స్ఫూర్తినిస్తుంది నిజంగా మనిషి తనను తాను ప్రశ్నించుకోవడం గొప్ప అనుభూతి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s