ముస్లిం జనాభా: దురభిప్రాయాలు -2


muslim_women

జనాభా పెరుగుదలను ప్రభావితం చేసే కారణాలు ఏమిటి? మతానికి జనాభా వృద్ధికి సంబంధం ఉందా? మతంతో సంబంధం లేకపోతే జనాభా పెరుగుదల దేనితో సంబంధం కలిగి ఉంది? ఇవి పరిశీలించవలసిన ప్రశ్నలు.

మతాన్ని ఫెర్టిలిటీతో ముడిపెడుతూ కొన్ని వాదనలు ఉన్నాయి. నిర్దిష్ట మత విశ్వాసాలు వారి జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అని వీరి వాదన. ముఖ్యంగా ముస్లింలకు ఈ కారణాన్ని ఆపాదిస్తారు. కానీ కాస్త నిదానించి పరిశోధిస్తే జనాభా పెరుగుదలలో మతం జోక్యం ప్రభావం చాలా తక్కువని తెలుస్తుంది. ప్రజల యొక్క సామాజికార్ధిక పరిస్ధితులు, అవిద్య, దరిద్రం జనాభా పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. అంటే, మతం కాకుండా ఆ మతాన్ని అనుసరించే ప్రజల సామాజికార్దిక పరిస్ధితులే వారి జనాభా వృద్ధిని నిర్ణయిస్తున్నాయి. దీనికి సంబంధించి వివిధ అంశాలను క్లుప్తంగా చూద్దాము.

సామాజికార్ధిక సమ్మిళితం (socio-economic acculturation)

వివిధ ప్రజా సమూహాల మధ్య నిత్యం సంబంధ బాంధవ్యాలు జరిగేటప్పుడు, వారి మధ్య ఉండే సామాజికార్ధిక అంతరాలు వారి మధ్య వైరుధ్యాలను సృష్టిస్తాయన్నది తెలిసిందే. కింది స్ధాయిలో ఉండే సామాజిక గ్రూపులు తనకంటే పై స్ధాయిలో ఉన్నవారిని చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలు పూర్తిగా సఫలం అయితే పూర్తి సమ్మిళితం జరుగుతుంది. పాక్షికంగా సఫలం అయితే పాక్షిక సమ్మిళతం జరుగుతుంది.

ఉదాహరణకి మధ్య తరగతి జీవనాన్ని అందుకోవడానికి కూలీ వర్గం, దిగువ మధ్య తరగతి వర్గం ప్రయత్నిస్తాయి. అందుకోసం తమ పిల్లలకి పై చదువులు చదివించే ప్రయత్నం చేస్తారు. తద్వారా మంచి ఉద్యోగం సంపాదించి ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరుచుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ పై చదువులు అందుబాటులో లేకపోయినా, చదువు పూర్తయ్యాక  ఉద్యోగం దొరక్కపోయినా వారి అప్ వర్డ్ మొబిలిటీ ఆగిపోతుంది. అంటే మధ్యతరగతితో పూర్తిగా సమ్మిళితం కాలేరు.

అసలు చదువే అందుబాటులో లేకపోతే అక్కడితోనే మొబిలిటీ ఆగిపోతుంది. చదువు ఎలాగో అందుకున్నవారు ఆ తర్వాత ఉద్యోగం దొరక్కపోతే మొబిలిటీ మధ్యలో ఆగిపోతుంది. చదువు వలన తనకంటే ఉన్నతవర్గాలతో స్నేహం ఏర్పడినా ఉద్యోగం లేనందున వారితో పూర్తి సాపత్యం ఏర్పడదు. సమ్మిళతం యొక్క పూర్తి సాఫల్యత, పాక్షిక సాఫల్యత లను ఇలా అర్ధం చేసుకోవాలి.

సమ్మిళితంలో విఫలం అయినా, పాక్షికంగా సఫలం అయినా కింది వర్గాల్లో అనివార్యంగా అబద్రత వచ్చి చేరుతుంది. ఈ అబద్రత వారిని మరింత ముడుచుకునేట్లు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సమ్మిళితం సాధించడానికి తగిన ఇతర మార్గాలను వారు అన్వేషిస్తారు. తమ కుటుంబం పరిమాణం తమ మొబిలిటీ లక్ష్యానికి అనుగుణంగా లేదని గ్రహిస్తే దానిని తగ్గించుకుంటారు.

ఆర్ధిక జీవనమే కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలు కూడా వివిధ గ్రూపుల మానసిక మరియు సామాజిక భద్రత-అబధ్రతలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకి ప్రపంచం యావత్తూ ఇస్లామేతర దేశాల్లో ఇస్లామోఫోబియా వ్యాపించి ఉంది. అమెరికా, ఐరోపాలు తమ సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఈ ఇస్లామోఫోబియాను పనిగట్టుకుని వ్యాపింపజేశారు. ‘నాగరికతల యుద్ధం’ పేరుతో పుస్తకాలు ప్రచురించి విస్తృత ప్రచారం ఇవ్వడం దగ్గర్నుండి 9/11 టెర్రరిస్టు దాడులు, ముంబై పేలుళ్లు, 26/11 దాడులు తదితర అంశాలు ముస్లింలంటేనే టెర్రరిస్టులు అనే ఫోబియాను కల్పించాయి.

ఇటువంటి వాతావరణం వలన పశ్చిమ దేశాల్లో తలపాగాలు ధరించి విమాన ప్రయాణం చేయడం ఒక సాహసంగా మారిపోయింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం,  బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ లాంటివారు తమ ముస్లిం పేర్ల వలన అమెరికా విమానాల్లో, విమానాశ్రయాల్లో ఎదుర్కొన్న అవమానాలు ఈ వరుసలోనివే. ఇలాంటి వాతావరణం ఒక్క విమానాల్లోనే కాదు, ఇరుగిల్లు-పొరుగిల్లు, పక్క పక్క కాలనీలు, పక్క పక్క ఊళ్ళు ఇలా అన్నింటిలోకి జొరబడింది. బ్లాగుల్లో, ఫేస్ బుక్ లో కూడా దీనిని చూడొచ్చు.

ఇటువంటి వాతావరణం ఒత్తిడి ఎదుర్కొంటున్న సామాజిక గ్రూపులను తీవ్ర అబధ్రతలోకి నెట్టివేస్తాయి. ఇవి కూడా ఆయా సామాజిక గ్రూపుల ఫెర్టిలిటీ పైన ప్రతికూల ప్రభావం పడవేస్తాయి. ఇదే పరిస్ధితి ‘మైనారిటీ స్ధాయి’ లో ఉన్న గ్రూపులకు కూడా వర్తిస్తుంది. అది మతం వల్ల కాదు, మైనారిటీ అనే సామాజిక స్ధితి వల్ల.

ఈ అంశం నేను కనిపెట్టింది కాదు. అమెరికా, పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన జనాభా శాస్త్రవేత్త గోల్డ్ షీడర్ 1969లోనే ఈ సూత్రీకరణ చేశారని ఇ.పి.డబ్ల్యూ (ఎకనమిక్ అండ్ పోలిటికల్ వీక్లీ) జనవరి 29 సంచికలో ప్రచురించబడిన ఒక పరిశోధనాత్మక పత్రం తెలియజేసింది.

మతపర ధృవాభిముఖత (religious polarization)

మరోవైపు మతపరమైన అబధ్రత ఆ మతంలో ఛాందసత్వం పైచేయి సాధించడానికి దోహదపడుతుంది. ముస్లింలపై దాడులు ఈనాటివి కావు. బ్రిటిష్ వాడి ‘విభజించు-పాలించు’ ఎత్తుగడలో భాగంగా వలస కాలంలోనే వాటికి బీజాలు పడ్డాయి. అప్పటినుండి కొనసాగుతూ అధికార మార్పిడి సందర్భంగానూ, ఆ తర్వతా ఈ దాడులు పెరుగుతూ వచ్చాయి. మతతత్వ దాడులు మైనారిటీ మత ప్రజల ఫెర్టిలిటీ రేటు తగ్గకుండా అడ్డుకోవడంలో ఒక పాత్ర పోషిస్తున్నాయి.

ఛటోపాధ్యాయ (2004) తదితరుల పరిశోధన ప్రకారం ఇవి మైనారిటీ ప్రజల్లో భయోత్పాతాన్ని, అబధ్రతను రేకెత్తిస్తున్నాయి. తద్వారా మత సూత్రాలను మరింత కఠినంగా అన్వయించి అమలు చేసే శక్తులు పైచేయి సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటున్నది. తద్వారా మైనారిటీ ప్రజలను మరింత కూడగట్టడానికి ప్రయత్నాలు జరుగుతాయి. దానితో ఆధునిక పునరుత్పత్తి ప్రమాణాలు, విలువలు వెనుకపట్టు పడతాయి. స్త్రీల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు మరింత పరిమితులు విధించబడతాయి.

అంతే కాకుండా మతపరమైన అల్లర్లు, ఉద్రిక్తతలు కొనసాగుతున్నపుడు మైనారిటీలకు ఆరోగ్య సేవలు, కుటుంబ సంక్షేమ సేవలు తక్కువగా అందుబాటులోకి వస్తాయని పరిశోధనలు తెలిపాయి. ఆరోగ్య, వైద్య సిబ్బందిలో ఎక్కువగా హిందువులు ఉండడం వలన, పరస్పర నమ్మకం తక్కువ స్ధాయిలో ఉండి మైనారిటీలు ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళడం తగ్గించుకుంటారు. దానితో వారికి ఆ సేవల అందుబాటు తగ్గిపోతుంది. ఇది రెండువైపులా జరగొచ్చు. భయం వలన మైనారిటీలే ఆరోగ్య కేంద్రాలకు రావడం తగ్గించవచ్చు. లేదా మెజారిటీ మత ఉద్యోగులు వివక్షతో సేవలు అందజేయడానికి నిరాకరించవచ్చు. అలాంటప్పుడు మైనారిటీల్లోని ధనికులు ప్రైవేటు సేవలు పొందినా కానీ పేదలు అనివార్యంగా మతఛాందస శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతారు.

హిందువులు, ముస్లింల మధ్య ఉన్న జనాభా పెరుగుదల అంతరాలను పరిశీలించేవారిలో కొందరు అత్యంత ముఖ్యమైన సామాజికార్ధిక పరిస్ధితులను, భద్రత-అబద్రతలను, రాజకీయ ప్రభావాలను, చారిత్రక అవగాహనలను విస్మరిస్తారు. ఇవన్నీ ముస్లింల ఫెర్టిలిటీ పైన తీవ్ర ప్రభావం పడేస్తున్నాయన్న సంగతిని విస్మరిస్తారు. ఇరుకు ఆలోచనలతో జనాభా సమస్యను మతవిద్వేషాలను రెచ్చగొట్టడానికి వినియోగించే సెక్షన్లు ఇక ఎలాగూ ఉంటాయి.

సజాతీయత (homogeneity)

ఇండియాలో ఒక ప్రత్యేక పరిస్ధితి కనిపిస్తుంది. ఒకే సమూహం అనుకున్నవారిలో కూడా సజాతీయత కనిపించకపోవడం ఇక్కడి ప్రత్యేకత. ఉదాహరణకి ఒకే మతం వారు దేశం అంతా సజాతీయంగా (homogeneous) ఉండరు. ఒకే మతం అయినప్పటికీ ప్రాంతాల వారీగా వివిధ రకాల సామాజికార్ధిక పరిస్ధితులను, జానాభా ప్రవర్తనలను కలిగి ఉంటారు.

ప్రసిద్ధి చెందిన సామాజికవేత్తలు డైసన్ మరియు మోర్ ల (భారత జనాభా వృద్ధిపై వీరు విస్తృత పరిశోధనలు నిర్వహించారు) ప్రకారం ఇండియాలో వివిధ అంశాలపైన మతపరమైన కారణాల కంటే ప్రాంతీయ కారణాలే ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తాయి. ఒక ప్రాంతంలోని హిందువులు, ముస్లింల మధ్య ఏకరూపతలను (similarities) మనం గమనించవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రాంతంలోని ముస్లింలు వేరే ప్రాంతంలోని ముస్లింల కంటే తమ ప్రాంతంలోని హిందువులతోనే ఎక్కువగా పోలికలను కలిగి ఉంటారు.

ఈ నేపధ్యంలో అహ్మద్ (1999), జెఫ్రీ అండ్ జెఫ్రీ (2000, 2002) తదితర పరిశోధకులు ఏమని నిర్ధారించారంటే, ముస్లింలు సామాజికార్ధిక విషయాల్లోనూ జనాభా ప్రవర్తనలోనూ (demographic behaviour) ఇతర ప్రాంతాల్లోని ముస్లింల కంటే తమ తమ ప్రాంతాల్లోని హిందువులతోనే ఎక్కువ సామీప్యతను కలిగి ఉన్నారని.

కాబట్టి ముస్లింలు అంటే ఎవరో పరాయివారు అన్న దృక్పధం సరయింది కాదు. భారతీయులే కొన్ని సామాజిక, చారిత్రక కారణాల వలన ముస్లింలుగా పరివర్తన చెందిన సంగతిని గుర్తించాలి. అలా గుర్తించినపుడు హిందూ జాతీయత పేరుతో తోటి భారతీయులపైన అనవసరమైన విద్వేషం పెంచుకోడానికి సబబు కాదని అర్ధం అవుతుంది.

(తదుపరి భాగంలో గణాంకాల ఆధారంగా ముస్లింల దరిద్రం, అవిద్య వారి ఫెర్టిలిటీ రేటును ఎలా ప్రభావితం చేస్తున్నదో పరిశీలిద్దాం.)

7 thoughts on “ముస్లిం జనాభా: దురభిప్రాయాలు -2

 1. . భారతీయులే కొన్ని సామాజిక, చారిత్రక రాజకీయ కారణాల వలన ముస్లింలుగా క్రైస్తవులుగా భుదిస్ట్ లు గా జైనులు గా పరివర్తన చెందిన సంగతిని గుర్తించాలి. వీల్లందిరనిన తయ్యారు చేసింది హిందూ లే అని కూడా గుర్తించాలి

 2. భారతీయ ముస్లింలు తమని తాము తమగడ్డమీద పరాయి వాళ్ళుగా భావించుకోకపోతే కొన్ని రాజకీయ శక్తులకూ, మరికొన్ని మేదావిగణానికి చాలా ఇబ్బంది. అందుకే వారిలో అభద్రతవ్యాపించటానికిగాను ఓ‌భారతీయ ముస్లిములారా మీరు గొప్ప అభద్రతాస్థితిలో ఉన్నారూ‌ అంటూ అసంబధ్దమైన వ్యాసాలు రాయటం, ఓట్లవేటకోసం మొసలికన్నీళ్ళ ఉపన్యాసాలు దంచటం చేస్తున్నారు. భారతీయముస్లిములను వేరే తరగతిమనుష్యులుగా చూస్తున్నది సాటి సగటు భారతీయుడు కాదు – పైన చెప్పిన అవకాశవాదులు.

 3. తాడిగడప గారూ

  దళితులపై దాడులు, వివక్ష కొనసాగుతున్నప్పటికీ మీరు హిందూమతంలోనే భద్రంగా ఉంటారని చెప్పడం కంటే మించిన అసంబంద్ధత ఉందంటారా? ముస్లింలపై హత్యాకాండలు సాగిస్తూనే వాస్తవాలు ఎదుర్కోవలసి వచ్చినపుడు మీరు భద్రమే అని నమ్మబలకడం కంటే మించిన అవకాశవాదం ఏముంటుంది?

  వ్యాసాలతో భావజాలాన్ని వ్యాపింపజేయగలిగితే భారత దేశంలో కులాన్ని నిర్మూలించడం బహుశా రోజుల్లో పని కావచ్చు.

  ఓట్ల వేట కోసం హిందువుల సంఖ్య తగ్గిపోతోందంటూ అబద్ధపు వాదనలు చేసే రాజకీయ ఉపన్యాసాల దంచుడుగాళ్లనూ, హిందూమతం ప్రమాదంలో పడిందంటూ అసంబద్ధ రాతలు రాసే మేధావులనూ మీరెందుకో వదిలిపెట్టారు. మరీ ఇంత పక్షపాతం పనికిరాదు సుమండీ!

 4. ముస్లిమ్స్ మెజారిటీ గా ఉన్న ఏ దేశం non islamic state గ ఉందొ చెప్పండి. మరియు ఏ ఇస్లామిక్ దేశం లో రిలీజియస్ టాలరెన్స్ ఉందో వివరించండి. సౌది అరేబియా లోని మక్కా లో రామాలయం కట్టడానికి ఒక 10 గజాల స్థలం ఇవ్వగలరా , ముస్లిమ్స్ మెజారిటీ గా ఉన్న ఏ దేశం లొనూ సేసులరిసం పాటించారు , అలాంటప్పుడు వాళ్లకి ఇక్కడ secularism ని డిమాండ్ చేసే హక్కు లేదు. మాటికి వస్తే బాబ్రీ మస్జిద్ అంటారు , 1000 సంవత్సరాలుగా ముస్లిం రాజులు ఎన్ని వేల టెంపుల్స్ ని నాశనం చేసారు.

  సాయి గారు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్ధం కాట్లేదు , ” వీల్లందిరనిన తయ్యారు చేసింది హిందూలే ” మమ్మల్ని మేము చంపుకొని ఇస్లాం లోకి మారామ!!!. ఏదైనా చెప్పేటప్పుడు రిఫరెన్స్ ఇవ్వంది , నోటికి వచ్చింది చెప్పడం కాదు !!!

 5. తెల్లార్లు రామాయణం విని సీతకు రాముడేమౌతాడు అనే ఈ సమాజం ఈలాంటి వ్యాసాలు చూసి రాత్రికి రాత్రే సమస్కారం వంతమై పోతుందని బాధెందుకండి శ్యమలరావుగారు.

 6. *మీరు హిందూమతంలోనే భద్రంగా ఉంటారని చెప్పడం*

  మీరు రాసిన వాదన ఎన్నో దశాబ్దాలుగా వింట్టున్నదే. కొంతమంది హిందూ మతం వీడి ఇతర మతాలకు మారిన సంగతి తెలిసిందే. ఏ కుల వివక్షత కు వ్యతిరేకం గా పక్క మతాల లోకి వేళ్లారో, ఆ మతాలలో కూడా వివక్షత ఉంది అని తెలుసుకొన్నారు. తమిళనాడు,సికందరాబాద్ చర్చ్ ల లో దళితూలను పాస్టర్ లు చేయకుండా అగ్రవర్ణాల వారిని చేస్తే వాళ్లు తిరగబడిన వార్తలు పేపర్లలో చాలా వచ్చాయి. మీకు తెలిసే ఉంట్టుంది.
  పాత తరం క్రైస్తవులు గా మారిన వారు ఎంతో లిబరల్ వ్యుస్ తో ఉంట్టున్నారు. ఈ మధ్య కాలంలో క్రైస్తవులుగా మరిన వారు ఆ ప్రకారం గా లేరు. మా వీధి లో కూరలు అమ్మే వాళ్లు, చిన్న పనులు చేసే వారు పల్లెల నుంచి వస్తారు, మిట్ట మధ్యానం వచ్చరు గదా ఎదైనా తినటానికి ఇస్తే, అలసి సొలసి ఉన్నా, తినే ముందు మీదేవుడి ప్రసాదం కాదు గదా! అని పది సార్లు అడిగి తింటారు. కొబ్బరి తో చేసిన పధార్దమైతే అయితే తాకను కూడా తాకరు. కొబ్బరి హిందూ దేఉళ్లకు కొట్టిన దని వారి అనుమానం. ఈ రోజుల్లో ఇటువంటి సంఘటనలు కంటి ముందు జరుగుతూంటే, వీళ్లు ఎమిటి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అని అనిపిస్తుంది. అటువంటి వారికి ఎంత విశదీకరించి చెప్పినా, వారికి కొత్తమతగురువులు పెట్టిన భయం వలన మీమాటలు వినరు. ఒక చదువుకొన్న వ్యక్తిగా, సమాజం పరిశీలించిన వ్యక్తిగా మీరు ఇటువంటి వాటిని సమర్ధిస్తారనుకోరు.
  ప్రతి మనిషి జీవితంలో ఎంత కష్టపడా దాని వెనుక స్వేచ్చగా, ఇతరులపై ఆధారపడకుండ, భయం లేకుండా బతకాలనే కోరిక తెలియకుండానే ఉంట్టుంది. ఆ అప్షన్ ని వినియోగించుకోవలసిన తరుణంలో, ఇన్ని రోజులు కష్టాలు పడ్డామనుకొన్న వీరుఇంకొక మతం మారి, భయంతో, బందీలుగా కావలసిన అవసరమేమి ఉంది? సంపాదించిన డబ్బుతో మంచి వస్తువులను కొనుకొని, సుఖంగా ఉంటూ ఆనందిస్తే చాలుకదా! ఏ మతగ్రంథమైనా చెప్పే బోధనల సారం మోరల్ వాల్యుస్ గా పాటించవలసి ఉంట్టుంది. ఇవే మోరల్ వాల్యుస్ మన రాజ్యంగం లో చట్టల రూపంలో అమలు జరిగేలా రాసుకొని ఉన్నాము కదా!
  ఇతరమతాలు మారి భయాలు,అనుమానాలతో జీవించటం కన్నా, ఫ్రీ థింకింగ్ ను అభివృద్ది చేసుకోవటమనేది దళితులకు భవిషత్ కు ఎంతో ఉపయోగ పడుతుందనుకొంటాను.

 7. @ మనోహర్ గారు

  బాగా చెప్పారు , లిబర్టీ లేనప్పుడు ఇంకేండుక్కండి జీవితం , ye organised religions లోనూ లిబర్టీ ఉండదు, ప్రపంచంలో ఉన్న అతి పెద్ద non organised రిలీజియన్ హిందుఇస్ం ఒక్కటే. అందుకే ఈ మిషనరీస్ ఆటలు సాగుతున్నాయి. హిందూ దేవతలని భూతులు తిట్టిన పామ్ ప్లేట్స్ ను distribute చేస్తారు , akbaruddin owaisi లాంతోల్లు పబ్లిక్ గానే తిడతారు. అదేమంటే సెకులరిసం అంటారు. అదేమీ సేసులరిసం రా బాబు అంటే “మీరు communal అంటారు “, సరే మేము communal అయ్యుంటే మన ancestors మహా communals అయ్యుండాలి , అలా అయ్యుంటే ఈ దేశం లో ఇస్లాం ,క్రైస్తవం ఏ అడుగు పెట్టనిచి వుండేవారు కాదు . సో వీరు చెప్పేది పచ్చి అబద్దం అని తెలుస్తుంది. ఈ ప్రపంచంలో అన్ని మత తత్వాలు చివరికి చేరేది ఒకే దిస అని చెప్పి అన్నిటిని సమ భావం తో గౌరవించే విశాల దృక్పధం , మనస్సు ఒక్క హిందువు కి మాత్రమె వుంటుంది , సో natural గానే హిందువే ప్రపంచంలో అందరికి సెకులరిసం అనే తత్వానికి గురువు. సో హిందుత్వ వల్లే అది సాధ్యo. ఈ socialism, capitalism అన్ని ఫెయిల్ అయినటివే , ఒక దాంట్లో ప్రజలు బికారులు అవుతారు ,ఇంకో దాంట్లో ప్రజలు బానిసలు అవుతారు. అంతకు మించి ఏముంది

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s