గత ఏప్రిల్ నెలలో బోస్టన్ నగరంలో మారధాన్ పరుగు పందెం జరుగుతుండగా బాంబు పేలుళ్లు జరిగిన సంగతి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. చెచెన్యా నుండి వలస వచ్చి అమెరికాలో స్ధిరపడిన ఇద్దరు అన్నదమ్ములు ఈ పేలుళ్లకు బాధ్యులని అమెరికా ఆ తర్వాత తేల్చింది. పేలుళ్లు జరిగిన రోజే పెద్ద సోదరుడు తామర్లేన్ జర్నాయెవ్ ను ఎఫ్.బి.ఐ పోలీసులు కాల్చి చంపేశారు. రెండు రోజుల పాటు బోస్టన్ శివార్లలోని ఎం.ఐ.టి యూనివర్సిటీ సమీపంలో ఇల్లిల్లూ గాలించిన తర్వాత ఒక ఇంట్లో వాడకంలో లేని పడవలో దాగి ఉండగా అతని తమ్ముడు ఝోఖర్ జర్నాయెవ్ ను పోలీసులు పట్టుకున్నారు.
ఝోఖర్ జర్నాయెవ్ అందగాడు. అతని వయసు 19 యేళ్ళు మాత్రమే. ‘రోలింగ్ స్టోన్’ అనే సంగీత పత్రిక అతని ఫోటోను ముఖచిత్రంపై ముద్రించి తాజా సంచికను విడుదల చేసింది. పత్రిక చర్య వివాదాస్పదం అయింది. కొన్ని పత్రికలు రోలింగ్ స్టోన్ కు మద్దతు ఇవ్వగా మరికొన్ని విమర్శించాయి. ఒక టెర్రరిస్టును గ్లామరైజ్ చేయడం ఏమిటని ప్రశ్నించాయి. రోలింగ్ స్టోన్ చర్య పట్ల బాధపడ్డానని చెబుతూ పోలీసులు నియమించుకున్న ఫోటో గ్రాఫర్ సీన్ మర్ఫీ, అసలు ఝోకర్ ఇతనే అంటూ రక్తసిక్తమైన ముఖంతో ఉన్న ఝోకర్ ఫోటోలను విడుదల చేశాడు.
అప్పటికి ముప్ఫై ఆరు గంటలుగా అతను పడవలో దాగి ఉన్నాడు. కూడు నీళ్లు లేక, పోలీసుల నుండి పరుగెత్తి పారిపోయి, అలసిపోయి ఉన్న ఝోకర్ ను ఫొటోల్లో చూడవచ్చు.
ఈ ఫోటోలను బోస్టన్ గ్లోబ్ పత్రిక ప్రచురించింది. రోలింగ్ స్టోన్ పత్రిక చర్య వలన బోస్టన్ బాంబు పేలుళ్లలో విగతులైన వారి కుటుంబాలను తీవ్రంగా గాయపరిచిందని సీన్ మర్ఫీ విమర్శిస్తూ అందుకే తాను ఫోటోలను పత్రికలకు విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. అయితే పోలీసుల నియమావళి ప్రకారం నిందితులకు సంబంధించిన ఇలాంటి ఫోటోలను పోలీసులు నియమించుకున్న ఫోటోగ్రాఫర్ విడుదల చేయడం చట్ట విరుద్ధం. ఆ మేరకు సీన్ మర్ఫిని సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఫోటోలను విడుదల చేయడానికి కారణం ఫోటోగ్రాఫర్ చెబుతున్నట్లు బాధ కాదనీ, ఫోటోలను సొమ్ము చేసుకోడానికే ఆ చర్యకు పాల్పడ్డాడని కొందరు ఆరోపిస్తున్నారు. రోలింగ్ స్టోన్ ప్రచురించిన కవర్ ఫోటోను మే నెలలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక అప్పటికే ప్రచురించిందని, అప్పుడు రాని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. సర్క్యులేషన్ పెంచుకోడానికి పత్రికలు లేని వివాదాన్ని సృష్టిస్తున్నాయని ఇంకొందరు విమర్శిస్తున్నారు. ఇన్ని వివాదాల మధ్య తానసలు టెర్రరిస్టునే కాదనీ, తనను ఇరికించారని ఝోకర్ జర్నాయెవ్ కోర్టులో చేస్తున్న వాదనను పట్టించుకున్నవారే లేరు.
- పడవ నుండి బైటికి వస్తూ… (నుదుటిపై పోలీసు తుపాకి లేజర్ కాంతి)
- పడవ
- అంచుపై తల వాల్చి…
- ప్రధమ చికిత్స
- వైద్య చికిత్స
- పడవ చెంతనే…
- న్యూయార్క్ టైమ్స్ పేజీల్లో
- రోలింగ్ స్టోన్
- పట్టుబడడానికి ముందు పోలీసులు…