బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వీల్ చైర్ లో విమానాశ్రయంలోకి వచ్చిన వ్యక్తి ఒకరు బాంబు పేలుడుకు పాల్పడ్డాడు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి తప్ప మరెవ్వరూ గాయపడలేదని తెలుస్తున్నది. పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తి చాలా కాలంగా న్యాయం కోసం పోరాడి విఫలమై ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైనాలో ధనిక వర్గాలకు అనుకూలంగా సామాన్యులపై పోలీసు నిర్బంధం తారాస్ధాయికి చేరిందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.
పేలుడుకు పాల్పడిన వ్యక్తి 34 సంవత్సరాల జి ఝాంగ్ గ్జింగ్ గా గుర్తించారు. మూడవ టెర్మినల్ వద్ద గల అరైవల్ హాల్ లోకి ప్రవేశించిన జి తన వెంట తెచ్చుకున్న (బాణసంచా తయారు చేసే) నల్లటి గన్ పౌడర్ ని పేల్చుకున్నాడని సి.సి.టి.వి న్యూస్ తెలిపిందని రష్యా టుడే ద్వారా తెలుస్తోంది. ట్విట్టర్ తో సమానమైన చైనా మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ‘సినో విబో’ ద్వారా సి.సి.టి.వి న్యూస్ పేలుడు వార్తను ప్రసారం చేసింది.
సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ ప్రకారం పేలుడులో జి తీవ్రంగా గాయపడ్డాడు. విమానాశ్రయ అధికారులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సంఘటన దృశ్యాన్ని తమ సెల్ ఫోన్ లలో బంధించిన అనేకమంది ప్రయాణికులు సదరు ఫోటోలను వెంటనే సినో విబో, ట్విట్టర్ తదితర సోషల్ వెబ్ సైట్లకు అప్ లోడ్ చేయడంతో అవి ఇంటర్నెట్ లో వేగంగా వ్యాప్తి చెందాయి. అనేక పోస్టులను చైనా ప్రభుత్వ వర్గాలు సెన్సార్ చేసినప్పటికీ ఈ లోపే అవి సెన్సార్ చేయలేని చోట్లకు వ్యాప్తి చెందాయి.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వీల్ చైర్ లో లోపలికి వ్యక్తిని వ్యక్తి చేతుల్ని పైకెత్తి గాలిలో ఊపుతూ పెద్ద పెద్దగా నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నవారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేశాడు. అందరూ చూస్తుండగానే ఆయన తనను తాను పేల్చుకున్నాడు. జిన్ హువా వార్తా సంస్ధ ప్రకారం ఆయన కరపత్రాలను కూడా పంచాడు. కరపత్రంలో ప్రభుత్వం, పోలీసులపై ఫిర్యాదులు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆ ఫిర్యాదులు ఏమిటన్నదీ పత్రికలు చెప్పలేదు.
చైనా మానవ హక్కుల కార్యకర్తల ద్వారా మరి కొన్ని విషయాలు తెలిసాయి. జి ఝాంగ్ గ్జింగ్ ఈశాన్య రాష్ట్రం షాన్ డాంగ్ కి చెందినవాడు. మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమకు కేంద్రం అయిన డాంగ్ గువాన్ లో 2005లో ఆయన పోలీసుల చేతుల్లో తీవ్ర చిత్ర హింసలకు గురయ్యాడు. పోలీసు హింస వలన ఆయన శాశ్వతంగా వికలాంగుడై వీల్ చైర్ కి పరిమితం కావలసి వచ్చింది. అప్పటి నుండి తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నప్పటికీ ఆయన గోడు పట్టించుకున్నవారే లేరు.
ట్విట్టర్ యూజర్ యిఫాన్ ఝాంగ్ ప్రకారం జిన్ ఝాంగ్ గ్జింగ్ టక్ టక్ సర్వీసు (ఆటో రిక్షా తరహా) నడుపుతూ పొట్టపోసుకునేవాడు. ఆయన సర్వీసుకు లైసెన్స్ లేదని చెబుతూ 2005లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిర్బంధంలో ఉండగా అతన్ని తీవ్రంగా కొట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. ఫలితంగా అతని శరీరం పారలైజ్ అయి నడవలేని పరిస్ధితికి చేరుకున్నాడు. ట్విట్టర్ లో యిఫాన్ ఝాంగ్ పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూస్తే (హెచ్చరిక: చూపరులు సొంత రిస్క్ తోనే ఈ ఫోటో చూడాలి) పోలీసుల చిత్రహింసలు ఏ స్ధాయిలో ఉన్నాయో అర్ధం అవుతుంది.
ది హిందు ప్రకారం జి ఝాంగ్ గ్జింగ్ తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ అధికారులకు పిటిషన్ పెడుతూ వచ్చాడు. అయితే ఆయన గోడు ఎవరూ పట్టించుకోలేదు. స్ధానిక ప్రభుత్వం వల్ల బాధితులుగా మిగిలినవారు కేంద్ర అధికారులకు పిటిషన్ పెట్టుకునే అవకాశం చైనాలో ఉన్నది. కానీ ఈ మార్గం బాధితులకు తరచుగా నిరాశా, నిస్పృహలనే మిగులుస్తాయి. కేంద్రానికి పిటిషన్ పెట్టినవారిని రాష్ట్రాల పోలీసులు వెంటాడి వేధిస్తారు. అలాంటి పిటిషన్లు వారి ప్రమోషన్ అవకాశాలను రద్దు చేస్తాయి. దానితో తమపై ఫిర్యాదు చేసినందుకు కక్ష్య పెంచుకుని అక్రమ కేసుల్లో ఇరికిస్తారు. ఫలితంగా అటు కేంద్రమూ పట్టించుకోకా, ఇటు రాష్ట్ర అధికారుల వేధింపులు భరించలేక అనేకమంది ఆగ్రహంతో రగిలిపోతుండడం జరుగుతుంది.
ఈ పరిస్ధితి తెలిసినవారంతా జి కి మద్దతుగా వస్తున్నారు. “ఈ దేశంలో ఈ విధంగా అన్యాయానికి గురయిన ప్రతి ఒక్కరూ ఒక్కో టైమ్ బాంబులాంటివారు” అని వీబోలో ప్రసిద్ధి చెందిన రాజకీయ వ్యాఖ్యాత జువో యెబెన్ రాశారని ది హిందు తెలిపింది. యెబెన్ సందేశాన్ని పదుల వేలమంది ఫార్వర్డ్ చేశారనీ, జి ఝాంగ్ కు మద్దతు ఇచ్చారని తెలుస్తోంది. అనేకమంది సంస్కరణవాదులు ఈ సందర్భంగా రాజకీయ సంస్కరణల కోసం గొంతెత్తారు. స్ధానిక పార్టీ నాయకులు నియంత్రణలో ఉండే స్ధానిక కోర్టుల వల్ల కింది స్ధాయి ప్రజలకు న్యాయం జరగడం లేదనీ అందువలన కోర్టులకు మరింత స్వతంత్రత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చైనాలో కోర్టులకు సైతం స్వతంత్రత లేదని వీరి డిమాండ్ ద్వారా స్పష్టం అవుతోంది.
Best part of India is we have indipendent judicary in our country. This is the best part of our constitution.
కనీసం ఈ విషయాలలో ఇండియా చైనా పరస్పర సహకారం తో పనేచేస్తున్నట్లు వుంది
చైనా లొ ప్రజాస్వామ్యం అలా తగలబదింది
ఈ మధ్య కాలంలోనే ఒక మాజీ రైల్వే మంత్రికి ఉరి శిక్ష పడినది కేవలం (మన దేశ కుంభకోణాలతో పోల్చితే) 64కోట్ల కుంభకోణంలో… అప్పుడు భారతీయులందరూ ముక్కున వేలేసుకున్నారు.. అంత చిన్న కుంభకోణానికి అంత శిక్షా అని!!
ఇపుడేమో మీకున్న సమాచారంతో ఏకంగా ఈ క్రింది విధంగా అన్నారు…
“చైనాలో ధనిక వర్గాలకు అనుకూలంగా సామాన్యులపై పోలీసు నిర్బంధం తారాస్ధాయికి చేరిందని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.”
అంటె మీ ఉద్దేశంలో ఉరి శిక్ష పడిన ఆ మాజీ మంత్రి కూడా సామాన్యుడేనా?
ఢిల్లీ రేప్ కేసు నిందితుడు రిమాండ్ లో వుండగా ఆత్మహత్య చేసుకున్నాడు..అంటే, ఈ ఒక్క ఉదాహరణతో, భారత్ లో జైల్లలో ఖైదీలను ఆత్మహత్యలు చేసుకొనేవిధంగా ప్రరేపిస్తున్నారు అని ఎనాలిసిస్ చేసేస్తే అది సభబేనా?
మీ టపాతో ఒకాయని ఎలా కితాబు యిచ్చేసారు మన వ్యవస్థపై… Best part of India is we have indipendent judicary in our country. This is the best part of our constitution… మన వ్యవస్థలో సామాన్యుడు కోర్టు మెట్లెక్కి కనీసం లాయర్ ఫీజు కట్టే స్థితిలో వున్నారా?
వాసవ్య గారు
చైనా ఇంకా సోషలిస్టు దేశమేనన్న అవగాహనలో మీరు ఉన్నట్లున్నారు. కానీ నాకా అవగాహన లేదు. ఆ సంగతి వివిధ సందర్భాల్లో చెప్పాను. చైనా నుండి అధికారికంగా బైటికి రాని అనేక వార్తలు ఉన్నాయి. కార్మికుల సమ్మెల దగ్గర్నుండి, ఆత్మహత్యలు, చౌక వేతనాలు, సెజ్ దోపిడి తదితరాల వరకూ అనేక దుర్మార్గాలకు చైనా నిలయం.
ఇండియాలో కూడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. జగన్ సం. నుండి జైల్లో ఉన్నాడు. గుజరాత్ లో మాయా కొడ్నాని, బాబు భజరంగిలకు శిక్ష పడింది. ఐదేళ్లకొకసారి బూర్జువా, భూస్వామ్య పార్టీలను ప్రజలు గద్దె దించుతున్నారు. ప్రభుత్వ రంగ కంపెనిలు ఉన్నాయి. ఇవన్నీ చూపి భారత దేశ వ్యవస్ధ బూర్జువా, భూస్వామ్య వ్యవస్ధ కాదు అనడం ఎంత తప్పో, చైనాలో ఉరిశిక్షలను చూపి అక్కడ అవినీతి లేదనడమూ అంతే తప్పని నా అభిప్రాయం.
చైనా గురించిన నిర్దిష్ట అవగాహనతోనే మీరు ఉటంకించిన వాక్యం రాశాను. మీరు అనుకున్నట్లు నా దగ్గరున్న సమాచారం ఈ ఒక్క వార్తే కాదు. డెంగ్ నుండి ఇప్పటివరకూ అక్కడ జరుగుతూ వస్తున్న వ్యవస్ధాగత పరిణామాలు నా దృష్టిలో ఉన్నాయి. సోషలిస్టు మూలాలను సర్వ నాశనం చేసి పార్టీ నేతలు సరికొత్త పెట్టుబడిదారీ వర్గంగా, అవినీతి విరాట్టులుగా ఎలా అవతరించిందీ, విదేశీ కంపెనీలకు దేశ శ్రమను ఎంత చౌకగా కట్టబెడుతున్నదీ నాకు అవగాహన ఉన్నది. ఆ అవగాహనతోనే చైనా గురించి రాస్తున్నాను.
@visekar garu
చాలా మంది వ్యక్తిగత స్వేఛ్చ , సాంకేతికంగా అత్యున్నతంగా, వ్యక్తిగతంగా ఎద గడానికి ఆస్కారం తక్కువ, వ్యక్తిగత పురోగతికి capitalism ఏ నయం అంటారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరు ?
రష్యా , చైనా లాంటి దేశాల్లో పుట్టుంటే billgates అంత గొప్పవాడు అయ్యుండేవాడ , సాంకేతిక రంగం పరుగులు తోక్కేద.
విశేఖర్ గారు,
మీరు అనుకుంటున్నట్లు..నాకు చైనా పైన ఎటువంటి “ప్రత్యేక” మైన అభిప్రాయమూలేదు… ఛైనా లో సోషలిజం / కమ్యునిజం / ప్రజాస్వామ్యం / సైనిక పాలన / ఒక రాజకీయ పార్టీ పాలన ఏది వుందో నాకైతే క్లారిటీ లేదు.. ఏక దృవ ప్రపంచ గమనంలో ఆమెరికాకు సవాల్ విసిరే దేశమేదైనా వుందంటే.. నాకు తెలిసినంత వరకు.. చైనా మాత్రమే.. ఏదో గుడ్డి కన్నా మెల్ల నయం…
నాకు తెలిసిన ప్రసుత ఛైనా…
1. ప్రపంచీకరణలో భాగంగా విదేశీ పరిశ్రమలను ఆకర్శించి వారి వారి టెక్నాలజీలను అవగాహన/దొంగిలించి చైనా పారిశ్రామికంగా బాగా అబివృద్ది చెందింది…
2. ఏకదృవ ప్రపంచం (ఆమెరికా) పట్టు బిగుస్తున్న సమయంలో, రెండో దృవం ఏర్పాటు కు అవకశం కల్పించింది ఛైనా…
పాకిస్తాన్ కు చైనా ఆయుధ సహాయం లేక పోతే.. ఈ పాటికి ఆమెరికా పాకిస్తాన్ ని కంప్లీట్ గా ఆక్రమించి… పశ్చిమ ఆసియా దేశాలకు పక్కలో బల్లెంలా తయారయ్యెది ఆమెరికా ఈపాటికి…
వాసవ్య గారు
చైనాలో ఉన్నది మార్కెట్ ఎకానమీయే. ఈ సంగతి చైనా మాజీ ప్రధాని (ఇపుడున్నాయనకి ముందటాయన) ఓ సారి యూరప్ పర్యటనలో ఉండగా (బహుశా 2010 కావచ్చు) అంగీకరించారు. సంస్కరణల కోసం ఒత్తిడి చేసినపుడు ఆయన ఆ మాట చెప్పారు.
చైనా పారిశ్రామికాభివృద్ధి ప్రధానంగా అక్కడి కార్మికుల శ్రమపైన ఆధారపడిందే. అత్యంత చౌక వేతనాలు చెల్లించి పార్టీ నాయకులు భారీ పెట్టుబడుల్ని మూటకట్టుకున్నారు. మావో కాలంలో రివిజనిస్టులుగా పేరు పడిన నాయకులు, వారి వంశాలు (princelings) ఈ అక్రమ, అవినీతి పెట్టుబడిదారీ వర్గానికి నాయకులు. రాజకీయంగా పెట్టుబడిదారుల్ని కలిపి ఉంచడానికి కమ్యూనిస్టు పార్టీని వాడుతున్నారు.
కాని వారి మధ్య వైరుధ్యాలు తీవ్రం అయినపుడు: 1989 తియాన్మాన్ స్క్వేర్ ఆందోళనలు, వివిధ పేర్లతో ఉండే హక్కుల కార్యకర్తలు, ఇటీవల చాంగ్ కింగ్ మేయర్ బో గ్జిలాయ్ పార్టీ నుండి తొలగింపు… మొదలయిన రూపాల్లో బైటపడుతున్నాయి. రాజకీయ సంస్కరణల కోసం అక్కడ వినపడుతున్న డిమాండ్లు కూడా ఈ వైరుధ్యాల్లో భాగమే. అమెరికా, ఐరోపా, ఇండియా లాంటి దేశాల తరహాలో పెట్టుబడిదారీ వర్గాలకు సొంత పార్టీలు పెట్టుకునే స్వేచ్ఛ కావాలన్నదే ఈ రాజకీయ సంస్కరణల డిమాండ్ అంతరార్ధం.
చైనా పారిశ్రామిక అభివృద్ధి అక్కడి పెట్టుబడిదారీ వర్గాలది తప్ప ప్రజలది కాదు.
ఏక ధృవ ప్రపంచ ఏర్పాటులో చైనా కంటే ఎక్కువగా రష్యాను చెప్పుకోవాలి. రష్యాతో పాటు సౌత్ అమెరికా దేశాల కూటమి (వెనిజులా, ఈక్వడార్, అర్జెంటీనా, బొలీవియా మొ.వి) కూడా గట్టి ప్రతిఘటన ఇస్తోంది. కాని చైనా నుండి ఆ ప్రతిఘటన లేదు. కనీసం బహిరంగంగా రష్యా, లాటిన్ దేశాల తరహాలో అమెరికాను ఒక మాట అనలేని పరిస్ధితి చైనాది. ఛావెజ్, అసాంజె, స్నోడెన్, మొరేల్స్ ల విషయంలో అమెరికాకు కోపం తెప్పించకుండా ఉండడానికి చైనా శతవిధాలా ప్రయత్నించింది. సిరియా విషయంలో ఒక్క వీటో ఉపయోగించడం తప్ప ఏమీ చెయలేదు చైనా. కానీ రష్యా చూడండి. సిరియా ప్రభుత్వం తరపున రోజూవారీ మాట్లాడేది రష్యా ఒక్కటే. అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్ ల ఒత్తిడిని తిరస్కరించి సిరియాకు ఆధునిక ఆయుధాలు సరఫరా చేస్తోంది రష్యా. కానీ చైనా ఆచరణలో చేస్తున్నదేమీ లేదు.
స్నోడెన్ విషయమూ అంతే. అమెరికాకు ఎక్కడ కోపం వస్తుందో అన్నట్లుగా హాంగ్ కాంగ్ నుండి తరిమేసింది. స్నోడెన్ ను అరెస్టు చేయకుండా రష్యా వెళ్లడానికి అనుమతించినందుకు సంతోషించాలంతే. కాని రష్యా తాత్కాలికంగా ఆశ్రయం ఇవ్వడానికయినా ఒప్పుకుంది. పైగా స్నోడెన్ ను అప్పగించేది లేదు పొమ్మంది. వెనిజులా, ఈక్వడార్, బొలీవియాలైతే శాశ్వత ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. అమెరికా తీవ్రంగా చేస్తున్న బెదిరింపులను లెక్కచేయకుండా చిన్న లాటిన్ అమెరికా దేశాలు స్నోడెన్ కు ఆశ్రయం ఇస్తే చైనాకేం దుబ్బడాయి?
చైనా దృష్టంతా వ్యాపారం మీదనే. ఐరోపా దేశాలు వలస దురాక్రమణకు ఉపక్రమించడానికి ముందు కూడా చైనా ఆర్ధికంగా అగ్ర రాజ్యంగా ఉండేది. (ఇండియా కూడా దానికి చేరువలో ఉండేది). కాని అప్పట్లో మిలట్రీ పరంగా దృష్టి పెట్టలేదు. వ్యాపార సంబంధాలు పెంచుకొని లబ్ది పొందడమే తప్ప దానిని నిలుపుకొవడానికి మిలట్రీ అవసరాన్ని చైనా గుర్తించలేదు. ఇప్పటికీ చైనా అదే పరిస్ధితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆర్ధికంగా పైచేయి సాధిస్తున్నంత వేగంగా మిలట్రీపై దృష్టి పెట్టలేదు. పెట్టినా అది దూకుడుతో కూడిన సామ్రాజ్యవాద దృక్పధం ప్రస్తుతానికి కనిపించడం లేదు.
ఈ కారణాల వలన బహుళ ధృవ ప్రపంచం ఏర్పాటుకు చైనా కృషి ఆర్ధికంగా తప్ప సైనికంగా లేదు. సైనికంగా లేకపోతే అమెరికా, ఐరోపాల ముందు నిలవడం కష్టం. ఆర్ధికంగా కూడా ఇప్పటివరకూ నచ్చజెప్పుకునే ధోరణినే చైనా అనుసరిస్తోంది. లిబియాలో అలాగే జరిగింది. మాలె లోనూ అదే పరిస్ధితి. ఇంకా అనేక ఆఫ్రికా దేశాల్లో చైనా పెట్టుబడుల్ని అణచివేయడానికి అమెరికా, ఐరోపాలు ఆల్ ఖైదా బూచి చూపిస్తూ సైనికంగా దురాక్రమిస్తున్నాయి. అలా జరిగినపుడు చైనా మౌనంగా పక్కకు తప్పుకోవడమో లేక రాజీపడి వచ్చింది దక్కించుకోవడమో చేస్తోంది.
పాక్ కి చైనా సాయం ఉన్నా ఆఫ్ఘన్ యుద్ధంలో పాకిస్ధాన్ అమెరికాకు నమ్మినబంటుగానే ఉంది కదా. ఐ.ఎస్.ఐ, సి.ఐ.ఎ కి జవాబు చెబుతుంది తప్ప చైనాకి కాదు. పాక్ మిలట్రీలో బలమైన సెక్షన్ అమెరికా కిందనే ఉంది. ఆ మాటకొస్తే శ్రీలంకలో కూడా చైనా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో కూడా. కాని ఆగ్నేయాసియాలు ఇంకా జపాన్ ప్రభావంలోనే ఉన్నాయి. దానికి ఒక కారణం జపాన్ లో ఉన్న అమెరికా సైన్యం.
భవిష్యత్తులో చైనా సైనికంగా దృష్టి పెడుతుందా లేదా అన్నది మనం చెప్పలేము. పెడితే గనక అమెరికాను నేరుగా సవాలు చేసినట్లే. ఈ లోపు రష్యా, ఇండియాలతో జట్టుకట్టి బ్రిక్స్ బ్యాంక్ తో వరల్డ్ బ్యాంక్ కి చెక్ పెట్టడానికి చైనా ఒక ప్రయత్నం చేస్తోంది. కానీ రష్యాని నమ్మినా ఇండియా పాలకులని నమ్మడానికి వీల్లేదు.
ఇవన్నీ గమనించినపుడు అమెరికాను నిలువరించే విషయంలో చైనా పట్ల నాకు నిరుత్సాహమే కలుగుతుంది.
సాయి భార్గవ గారు
‘నాకు విండోస్ సాఫ్ట్ వేర్ పెద్దగా తెలియదు’ అని బిల్ గేట్స్ చాలా సార్లు చెప్పారని చదివాను. ఆయన అభ్యున్నతికి కారణం ఆ సంస్ధలో పని చేసిన కార్మికులు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగుల శ్రమ. అందులో ఆయన గొప్పతనం ఏమీ లేదు. మానవీయ విలువలు వదిలేసి తోటి మనిషిని దోచుకోవడానికి సిద్ధపడితే బిల్ గేట్స్, వారన్ బఫెట్, కార్లోస్ స్లిమ్ లాంటి ఘరానా పెట్టుబడిదారులు కావచ్చు.
వలస దేశాల దోపిడీ ఐరోపాను సంపన్నవంతం కావించింది. అమెరికా అగ్రరాజ్య పెత్తనం, ఫైనాన్స్ పెట్టుబడి ఎగుమతి ద్వారా చేసిన దోపిడి అక్కడి పెట్టుబడిదారుల్ని సంపన్నుల్ని చేసింది. ఈ దోపిడీ జరగాలంటే ముందు సంపదల సృష్టి జరగాలి. ఆ సంపదల సృష్టి శ్రమ ద్వారానే సాధ్యం. కాబట్టి సంపదలను సృష్టించే సాధనాలయిన భూములు, పరిశ్రమలను గుప్పిట్లో పెట్టుకుంటే చాలు. వ్యక్తిగతంగా ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. కానీ ఆ క్రమంలో వేలాది శ్రామికుల జీవితాలు, కుటుంబాలు దరిద్రంలో నెట్టబడతాయన్న సంగతి మరువరాదు.
స్వేచ్ఛ ఆబ్సల్యూట్ కాదు. అది సాపేక్షికం. పెట్టుబడిదారీ రాజ్యాల్లో పెట్టుబడిదారులకి స్వేచ్ఛ ఉంటుంది. దోపిడీకి స్వేచ్ఛ ఉంటుంది. కానీ సంపదలు సృష్టించే శ్రమకు, శ్రామికులకు స్వేచ్ఛ ఉండదు. సోషలిస్టు రాజ్యాల్లో దోపిడికి స్వేచ్ఛ ఉండదు గానీ శ్రమకు, శ్రామికులకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల అధికారం అన్నదే నిజం అయితే, ఆ ప్రజలు శ్రమ చేస్తారు అని అంగీకరిస్తే నిజమైన ప్రజాస్వామిక స్వేచ్ఛ సోషలిస్టు రాజ్యాల్లోనే ఉంటుంది.
పశ్చిమ పత్రికలు ఫోర్త్ ఎస్టేట్ ముసుగులో ఉన్న పెట్టుబడిదారీ కంపెనీలు. పెట్టుబడిదారీ వర్గం ప్రయోజనాలు కాపాడడం వాటి పని. పెట్టుబడి దోపిడీకి స్వేచ్ఛ లేకపోతే వాటి దృష్టిలో జనానికి స్వేచ్ఛ లేనట్లే. జనానికి స్వేచ్ఛ లేకపోయినా, పెట్టుబడిదారీ దోపిడికి స్వేచ్ఛ ఉంటే అక్కడ స్వేచ్ఛ ఉన్నట్లే వాటి దృష్టిలో. అందుకే అవి సోషలిస్టు రాజ్యాల్ని నియంతృత్వ రాజ్యాలనీ, ఐరన్ కర్టన్ అనీ ప్రచారం చేస్తాయి. పాకిస్ధాన్ జియా ఉల్ హక్ దగ్గర్నుండి ఇండొనేషియా సుకర్నో, ఈజిప్టు ముబారక్, చిలీ పినోచెట్, కాంగో మొబుటు సెసె సెకో ల వరకూ పచ్చి నియంతలను పెంచి పోషించి భద్రంగా కాపాడుకున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ప్రబలగానే చొక్కా విప్పి పారేసినట్లు తీసి అవతల పడేసాయి.
మీ ప్రకారం రేపు మోడీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా మన బ్రతుకులు మారవు, వాళ్ళు కూడా అమెరికా కొంగు పట్టుకొనే తిరుగుతారు అనే దాంట్లో సందేహం లేదు. లేకపోతె మోడీ వస్తే ఎగ్ బిరియాని కన్నా మటన్ బిరియాని బెస్ట్ అన్నట్టు కాస్తో కూస్తో మేలు జరగచ్చు.
ఇండియా క్రమాన్ని గమనిస్తే దానికి ఒక దిశ అంటూ ఏమి లేనట్టు కనిపిస్తుంది, non aligned అన్నారు, రష్యాతో అలైన్ అయ్యారు, సోషలిజం అన్నారు, capitalism పాటిస్తున్నారు, లైసెన్స్ రాజ్ అన్నారు ఇప్పుడేమో fdi కి గేటులన్ని ఎత్తేస్తున్నారు. మనది confusion-ism అనిపిస్తుంది.
శేఖర్ గారు,
పినోచెట్ రకరకాల కధనాలు చెపుతారు. నేను మర్చి పోయాను. వీలు చూసు కొని అతన్ని గురించి ఒక ఆర్టికల్ రాస్తారని అశీస్తా. మీరు ఇంతకు మునుపే రాసుంటే లింక్ ఇవ్వగలరు.
Visekhar, could you translate articles from the official website of Kurdistan Workers’ Party: http://www.pkkonline.com/en/