తెలంగాణ ఖాయమేనట!


telangana

శుక్రవారం ది హిందూ పత్రిక ఓ ఎక్స్ ప్లోజీవ్ కధనం ప్రచురించింది. ఈ కధనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం రావడం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలింది సి.డబ్ల్యూ.సి నిర్ణయమే. బహుశా కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయి దానిని ఫార్మలైజ్ చేయడానికి సి.డబ్ల్యూ.సి కి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలోని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక ఈ కధనం ప్రచురించింది. హైద్రాబాద్ పరిస్ధితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చల్లో ఉన్న అంశం తప్ప తెలంగాణా ఇవ్వాలా, వద్దా అన్నది కాదు. రాయలసీమ నుండి రెండు జిల్లాల్ని -కర్నూలు, అనంతపూర్- తెలంగాణలో కలపడమా లేదా అన్నది కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

“తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినంతవరకూ పాచిక పడిపోయింది” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని పత్రిక తెలిపింది. కర్నూలు, అనంతపూర్ లను తెలంగాణలో కలపడానికి నిర్ణయిస్తే లోక్ సభ నియోజకవర్గాల పరంగా విభజనానంతర రాష్ట్రాలు సమాన భాగాలను (21) కలిగి ఉంటాయి హైద్రాబాద్, కర్నూలు, అనంతపూర్ ల విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నప్పటికీ మరో కీలక అంశంపై సీమాంధ్ర వర్గాలు హామీ లాంటిది కోరుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా సీమాంధ్ర ధనిక వర్గాలు పెద్ద మొత్తంలో హైద్రాబాద్ లోనూ, ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ పెట్టుబడులు పెట్టి ఉన్నారు. “వారి పెట్టుబడులు బద్రంగా ఉండాలంటే కొన్ని రక్షణలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంటుంది” అని ప్రభుత్వంలోని వ్యక్తులు తెలిపారు.

హైద్రాబాద్ కి సంబంధించి ఒక 10 సంవత్సరాల పాటు దానిని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలని ఒక అభిప్రాయం నడుస్తోంది. భూములు, శాంతి భద్రతలు, బహుశా పురపాలక సంస్ధలు కూడా ఆ కాలంలో లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉంచాలన్నది ఈ అభిప్రాయంలో భాగం. లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ తరహాలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా పని చేస్తారు.

మొత్తం మీద  మూడు కారణాలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ వైపుకి మొగ్గుచూపేలా ప్రేరేపించాయని పత్రిక తెలిపింది.

ఒకటి: ఒకవేళ బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వక తప్పని పరిస్ధితి వస్తుంది. ఆ క్రెడిట్ బి.జె.పికి అప్పగించే బదులు అదేదో తామే చేసేసి 2009లో ప్రకటించిన నిర్ణయాన్ని అమలు చేశామన్న క్రెడిట్ ఎందుకు కొట్టేయకూడదు?

రెండు: ఒకసారి బహిరంగంగా ప్రకటించిన వాగ్దానం నుండి వెనక్కిపోయామన్న అపకీర్తిని మూటగట్టుకోవడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదు.

liberate all statesమూడు: ఎన్నికల ప్రయోజనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే టి.ఆర్.ఎస్ ను తమ శిబిరంలోకి తెచ్చుకోవడమే కాకుండా బి.జె.పి ఆశాలను వమ్ము చేయవచ్చు. తెలంగాణ ఇస్తామని బి.జె.పి ఇప్పటికే వాగ్దానం చేసింది. తద్వారా 2014 ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు గెలవోచ్చని ఆ పార్టీ ఆశిస్తోంది. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇస్తే టి.ఆర్.ఎస్ సాయంతో తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చి చేరతాయి. ఇది ఎప్పటి నుండో అనుకుంటున్న కారణమే. కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అనివార్య ఎన్నికల పరిస్ధితే తెలంగాణ ఇచ్చేలా ఆ పార్టీని పురికొల్పుతుందని దాదాపు అందరూ వూహిస్తున్నదే.

ఇక సీమాంధ్ర విషయానికి వస్తే తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పరిస్ధితి తెదేపా, వైకాపాల తర్వాత మూడో స్ధానమే అవుతుందని భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఇవ్వడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఎదురయ్యే నష్టాలను కనీస స్ధాయికి తగ్గించుకోగలుగుతుంది. తెలంగాణ ఇస్తే ఎ.పి నుండి కనీసం 20 సీట్లన్నా (2009లో 33) గెలుచుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముస్లిం ఓట్లను పోగొట్టుకుంటామన్న భయంతో ఇతర పార్టీలు ఎలాగూ బి.జె.పితో జట్టు కట్టవు. కాబట్టి సాధ్యమైనన్ని తక్కువ సీట్లు బి.జె.పి ఖాతాలోకి వెళ్ళేటట్లు చూస్తే ఆ మేరకు కాంగ్రెస్ లాభపడుతుంది.

ఎలా జరుగుతుంది?

ప్రస్తుతం బంతి సి.డబ్ల్యూ.సి కోర్టులో ఉంది. సి.డబ్ల్యూ.సి కి ముందు మరి కొన్ని సమావేశాలు జరపాలని గత కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారట. సి.డబ్ల్యూ.సి ఆమోదం తీసుకున్నాక సదరు నిర్ణయం కేంద్ర కేబినెట్ లోకి వెళ్తుంది. అక్కడినుండి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళాలి. తదనంతరం రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీకి నిర్ణయాన్ని పంపుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి ఏమీ కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఎమ్మెల్యేల అభిప్రాయాలూ తెలుసుకోవడానికి మాత్రమే రాష్ట్రపతి అసెంబ్లీని సంప్రతిస్తారు. నిర్దిష్ట కాలం లోపల అసెంబ్లీ నుండి బదులు రాకపోతే ఆ తర్వాత నిర్ణయం పార్లమెంటు చేతుల్లోకి వెళ్తుంది. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై ప్రభుత్వం యొక్క వాస్తవ చర్యలు -కేడర్ కేటాయింపు లాంటివి- మొదలవుతాయి.

మావోయిస్టు చర్యలు తీవ్రం అవుతాయన్న వాదనను సీమాంధ్ర వర్గాలు బలంగానే వినిపించారని తెలుస్తోంది. అయితే ఈ భయాలను తెలంగాణ వాదులు వివిధ అంశాలను ఎత్తిచూపి తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోమ్ శాఖ పరిగణిస్తున్న ఎనిమిది జిల్లాల్లో నాలుగు -ఆదిలాబాద్, కరీం నగర్, ఖమ్మం, వరంగల్- తెలంగాణలో ఉంటే మరో నాలుగేమో -తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం- సీమాంధ్రలో ఉన్నాయని కాబట్టి తెలంగాణ ఏర్పాటు వల్ల అదనంగా వచ్చే భయం లేదని తెలంగాణ వాదులు వాదించినట్లు తెలుస్తోంది. ఆ విధంగా చివరి దారం కూడా తెగిపోయింది.

11 thoughts on “తెలంగాణ ఖాయమేనట!

 1. ఎన్ని శక్తులు అడ్డుకున్నా…..మెజారిటీ ప్రజల ఆకాంక్ష సిద్ధించి తీరుతుంది.
  రాజకీయ నాయకులు…పార్టీలు, ప్రభుత్వాలు…ప్రజలకు కావాల్సింది ఇవ్వనపుడు
  ప్రజలే…తమ లక్ష్యాలు సాధించుకుని తీరుతారు.

  దాన్ని ఆపటం ఎవరితరం కాదు. కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చు.
  అది ఇవాళ తెలంగాణ రాష్ట్ర్రం రూపంలో నిరూపితమైంది.
  రేపు సమసమాజం విషయంలోనూ ఇదే జరిగి తీరుతుంది.

 2. అధికారవికేంద్రీకరణ ప్రస్తుత పరిస్థితులలో ఎలాగూ జరగదు.కనీసం మన అంధ్రప్రదేశ్ ను 3 లేదా 4 రాష్త్రాలుగా విభజించడం వలన అయినా వనరుల పంపకం జరిగివాతి ఫలితాలు సామానులకుదక్కే అవకాశం కలుగుతుంది.

 3. ఇప్పటివరకు ఒకప్రాంత నాయకులు మరొక ప్రాంత నాయకులూ ఒకరినొకరు తిట్టుకొన్నారు. ఇక ఏ ప్రాంత నాయకులను ఆప్రాంత ప్రజలు తిడతారు

 4. విడిపోయినా.. కలిసి ఉన్నా.. ప్రజలకు మేలు జరుగుతుందన్న నమ్మకం మాత్రం నాకు లేదు. ఇప్పటివరకూ ప్రాంతాలతో భేదం లేకుండా అందరూ తిన్నారు.. విడిపోతే.. ఏ ప్రాంతం వాళ్లు వాళ్ల ప్రాంతాల్ని దోచుకుతింటారు.. అయినా మన ప్రజలకు ఇది మామూలే కదా.. తెల్లవాళ్లు పోతే మన దేశాన్ని మనమే పరిపాలించుకోవచ్చు.. హాయిగా ఉండొచ్చు అని భావించారు.. జరిగిందా.. లేదు.. పరాయివాళ్లు పోతే మనవాళ్లు పీడిస్తున్నారు. ఎవరెన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని రాష్ట్రాలు చేసినా మారనిది ప్రజల తలరాతే.. కాదంటారా?

 5. Chandu Tulasi gaaru,

  ఎన్ని శక్తులు అడ్డుకున్నా
  రేపు సమసమాజం విషయంలోనూ ఇదే జరిగి తీరుతుంది. very nice!

 6. @visekar గారు
  “తెలంగాణను మించిన లిబరేషన్ ఉందని, అది అవసరమని చెప్పడానికి!”

  అంటే భారతదేశం ని 28 ముక్కలుగా చెయ్యడమేనా !!!!!

 7. భారతదేశం ని 28 ముక్కలుగా చెయ్యడమేనా ! కాదు ఉన్న వాళ్ళని దించి కొత్త వాళ్ళని ఎక్కించటం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s