అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం లేదు -మాజీ అధ్యక్షుడు


Jimmy Carter

అమెరికాలో ప్రజాస్వామ్యం పని చేయడం లేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ స్పష్టం చేసేశారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న గూఢచార విధానాలు పచ్చి అప్రజాస్వామికమని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్, అమెరికా అప్రజాస్వామిక గూఢచర్యం గురించి వెల్లడి చేయడం అమెరికాకు దీర్ఘకాలంలో లాభకరమని ఆయన వ్యాఖ్యానించారు. 

జిమ్మీ కార్టర్ అమెరికాకు 1977 నుండి 1981 వరకు అధ్యక్షుడుగా పని చేశారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్ధిగా అధ్యక్ష పదవిని నిర్వహించిన జిమ్మీ ఆ పదవీకాలం ముగిశాక ‘కార్టర్ సెంటర్’ అని ఒక ప్రభుత్వేతర సంస్ధను స్ధాపించారు. ప్రజాస్వామ్య ఎన్నికలు, మానవ హక్కులను ఈ సంస్ధ ప్రబోధిస్తుంది. ఆయన కృషికి గానూ 2002లో నోబెల్ శాంతి పురస్కారం ప్రదానం చేశారు. అయితే బారక్ ఒబామా అధ్యక్ష పదవి చేపట్టిన 11 రోజులకే ఆయన్ను కూడా నోబెల్ శాంతి బహుమతి వరించింది. కాబట్టి ఈ పురస్కారం నేపధ్యంలో జిమ్మీ కార్టర్ ను అంచనా వేయడం వ్యర్ధ ప్రయత్నమే కావచ్చు.

జార్జియా రాష్ట్రంలో అట్లాంటా నగరంలో ‘అట్లాంటిక్ బ్రిడ్జ్’ శీర్షికన జరిగిన సమావేశంలో జిమ్మీ కార్టర్  రెండు రోజుల క్రితం ప్రసంగించారు. “ఇప్పటికిప్పుడు చూస్తే అమెరికాలో పని చేస్తున్న ప్రజాస్వామ్యం ఏదీ లేదు” అని కార్టర్ అన్నారని జర్మన్ పత్రిక డర్ స్పీజెల్ తెలిపింది. అమెరికా ప్రపంచ వ్యాపితంగా పాల్పడుతున్న ఇంటర్నెట్ గూఢచర్యం అన్నీ దేశాల్లోనూ ప్రజాస్వామ్య వ్యవస్ధలను దెబ్బ తీస్తోందని కార్టర్ తెలిపారు. ఎన్.ఎస్.ఏ గూఢచర్యం పుణ్యాన అమెరికన్ ఇంటర్నెట్ కంపెనీలయిన గూగుల్, ఫేస్ బుక్ తదితర కంపెనీల కార్యకలాపాలపై జనం అనుమానంతో ఉన్నారని తెలిపారు.

ఇంటర్నెట్ కంపెనీల కార్యకలాపాలు సాధారణంగా భావ ప్రకటనా స్వేచ్ఛ లాంటి ప్రజాస్వామిక హక్కులతో ముడిపడి ఉంటాయని ఇటీవల కాలంలో వివిధ దేశాల్లో ఉద్భవిస్తున్న ప్రజాస్వామిక వ్యవస్ధలకు ఇవి ‘డ్రైవింగ్ ఫోర్స్’ గా కూడా ఉన్నాయని, కానీ ఎన్.ఎస్.ఏ గూఢచర్యం వలన ఆ కంపెనీల విశ్వనీయత తీవ్రంగా దెబ్బ తిన్నదని తెలిపారాయన.

అమెరికా గూఢచర్య విధానాలను విమర్శించడం కార్టర్ కి ఇదే మొదటిసారి కాదని రష్యా టుడే తెలిపింది. ఎన్.ఎస్.ఏ గూఢచర్య పత్రాల లీకేజి గురించి సి.ఎన్.ఎన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన “అమెరికా ప్రజల మానవ హక్కులపై దాడి, అమెరికన్ల ఏకాంత హక్కుల దురాక్రమణ చాలా దూరం వెళ్లింది” అని వ్యాఖ్యానించారు. అమెరికా చట్టాలను స్నోడెన్ ఉల్లంఘిచినప్పటికీ దేశానికి అంతిమంగా ఆయన మంచే చేశారని తెలిపారు.

“ఏకాంతాన్ని దురాక్రమిస్తున్న ఈ దురాగతం చుట్టూ అల్లుకుని ఉన్న గోప్యత చాలా ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి దానిని ప్రజల దృష్టికి తీసుకురావడం వలన దీర్ఘకాలంలో దేశానికి మంచి జరుగుతుంది” అని జిమ్మీ కార్టర్ సి.ఎన్.ఎన్ తో మాట్లాడుతూ అన్నారు.

ఒబామా ప్రభుత్వం విచక్షణారహితంగా మానవ రహిత డ్రోన్ విమానాలతో వివిధ దేశాలపై దాడులు చేసి ప్రజలను చంపేయడాన్ని జిమ్మీ అనేకసార్లు విమర్శించారు. అమెరికా డ్రోన్ హత్యలు “అత్యంత క్రూరమైనవి, అసాధారణమైనవి” అని న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన ఆర్టికల్ లో ఆయన దుయ్యబట్టారు. టెర్రరిజంపై యుద్ధం పేరుతో వివిధ దేశాల నుండి అక్రమంగా అరెస్టు చేసి గ్వాంటనామో బే లాంటి జైళ్ళలో పెట్టి విమర్శలు ఎదుర్కోవడం కంటే ఎటువంటి విచారణ లేకుండా డ్రోన్ దాడుల్లో హత్య చేయడమే మేలనే విధానాన్ని ఒబామా ప్రభుత్వం అనుసరిస్తోందని ప్రపంచవ్యాపితంగా పలు సంస్ధలు విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలను యధావిధిగా అమెరికా ఖాతరు చేయడం లేదు.

నియంతగా అమెరికా దూషించే వెనిజులా దివంగత నేత హ్యూగో చావేజ్ ఏలుబడిలో ఆ దేశం అత్యంత ఉన్నతమైన ఎన్నికల వ్యవస్ధ పని చేసిందని జిమ్మీ కార్టర్ పలుమార్లు ప్రశంసలు కురిపించారు. చావేజ్ అనంతరం కూడా కార్టర్ వెనిజులా ఎన్నికల పరిశీలకుడుగా వెళ్ళి అక్కడ ఎన్నికలను కీర్తించారు. ప్రపంచంలోనే అత్యంత మెరుగైన ఎన్నికల వ్యవస్ధ వెనిజులాలో ఉన్నదని ఆయన ప్రపంచానికి తెలిపారు.

6 thoughts on “అమెరికాలో అసలు ప్రజాస్వామ్యం లేదు -మాజీ అధ్యక్షుడు

  1. ఇలాంటి వాళ్ళు అధ్యక్షులు ఐతే ప్రజాస్వామ్యం అలాగే ఉంటుంది ఆయన అధ్యక్షుడిగా ఉన్నపుడు ఆయనకీ ఈ విషయం తెలీదా

  2. అక్కడ ప్రజాస్వామ్యం వుంటే, ఆ ప్రభుత్వాలు ఇతర దేశాల పాలనలో ఎందుకు జోక్యం చేసుకుంటాయ్?.ఇప్పటికైనా మాజీ అద్యక్షుడి మాటకు ఇక్కడి అమెరికా వాదులు విలువిస్తారని ఆశిద్దాం .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s