బొలీవియా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానానికి తమ గగనతలంలో అనుమతి నిరాకరించడం జరగనేలేదని వాదించిన స్పెయిన్ ఎట్టకేలకు బహిరంగ క్షమాపణ చెప్పింది. మాస్కో నుండి బొలీవియా ప్రయాణిస్తున్న బొలీవియా అధ్యక్షుడు ఇవా మొరేల్స్ విమానానికి ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ దేశాలు అనుమతి నిరాకరించడంతో అది అత్యవసరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో దిగవలసి వచ్చింది.
ప్రపంచ ప్రజలపై అమెరికా అక్రమ గూఢచర్యం వివరాలను వెల్లడించిన ఎన్.ఎస్.ఏ మాజీ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ విమానంలో ఉన్నాడన్న అనుమానంతో సి.ఐ.ఏ ఇచ్చిన సమాచారం, అమెరికా ఇచ్చిన ఆదేశాల మేరకు యూరోపియన్ దేశాలు కట్టగట్టుకుని అంతర్జాతీయ చట్టాలను, నిబంధనలను, మర్యాదలను అడ్డంగా ఉల్లంఘిస్తూ బొలీవియా దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం తమ గగనతలంలో ప్రవేశించడానికి అనుమతి నిరాకరించాయి.
“మేము ఈ నిజాన్ని అంగీకరిస్తూ చింతిస్తున్నాము… (మేము అనుసరించిన) ప్రవర్తన సరైంది కాదు. అధ్యక్షుడు మొరేల్స్ ను అది తీవ్రంగా బాధించడమే కాక ఆయనను కష్టమైన పరిస్ధితిలోకి నెట్టివేసింది” అని బొలీవియాలో స్పెయిన్ రాయబారి ఏంజెల్ వాజ్క్వెజ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పింది.
“వియన్నా ఎయిర్ పోర్ట్ లో మా ప్రతినిధి అనుసరించిన పద్ధతులు సక్రమంగా లేవని మేము బహిరంగంగా గుర్తిస్తున్నాము. మా ప్రతినిధి ప్రవర్తన ఉపయుక్తంగా లేదు” అని ఆమె విలేఖరులకు తెలిపారు. స్పెయిన్ విదేశీ మంత్రి జోస్ మాన్యుయెల్ గార్సియా-మార్గల్లో గత వారం మాట్లాడుతూ తమ ప్రభుత్వం మొరేల్స్ విమానానికి అనుమతి నిరాకరించిందనడం నిజం కాదని బొంకాడు. అనుమతి ఇవ్వడంలో ఆలస్యం అయి ఉండొచ్చు గానీ అనుమతి పూర్తిగా నిరాకరించడం జరగలేదని ఆయన వాకృచ్చారు.
కానీ వాస్తవం ఏమిటంటే మొరేల్స్ ప్రయాణిస్తున్న విమానంలో ఎడ్వర్డ్ స్నోడెన్ కూడా ఉన్నాడని ఆయనను రహస్యంగా లాటిన్ అమెరికా తీసుకెళ్తున్నారని సి.ఐ.ఏ యూరోపియన్ దేశాలకు సమాచారం ఇచ్చి వెంటనే ఆ విమానాన్ని కిందకి దింపి తనిఖీ చేయాలని ఒత్తిడి చేసింది. దానితో ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు మొరేల్స్ విమానానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేశాయి. గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆస్ట్రీయా రాజధాని వియన్నాలో విమానం దిగవలసి వచ్చింది.
విమానం వియన్నాలో దిగిన తర్వాత అక్కడి ఎయిర్ పోర్ట్ లో నియమితులైన స్పెయిన్ రాయబారి కాఫీ వంకతో మొరేల్స్ విమానంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆ వంకతో విమానంలో స్నోడెన్ ప్రయాణిస్తున్నాడో లేదో చూడడానికి ఆయన ప్రయత్నించాడు. అయితే మొరేల్స్, ఆయనను విమానంలోకి రానీయలేదు. ఆ తర్వాత ఆస్ట్రియా అధికారులు అసలు విషయం చెప్పడంతో వియన్నా పోలీసులు విమానాన్ని తనిఖీ చేయడానికి మొరేల్స్ అనుమతి ఇచ్చారు. కానీ వారి తనిఖీలో సి.ఐ.ఏ ఇచ్చిన సమాచారం అబద్ధమని తేలిపోయింది. ఫలితంగా యూరోపియన్ దేశాలు నాలిక్కరుచుకున్నాయి. ఐరోపా దేశాలకు చెందిన కొందరు అధికారులు సి.ఐ.ఏ వలన తాము అవమానానికి గురయ్యామని బహిరంగంగానే వాపోయారు.
స్పెయిన్ క్షమాపణలతో బొలీవియా అధ్యక్షుడి విమానాన్ని యూరోపియన్ దేశాలు ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకున్నాయని తేటతెల్లం అయింది. స్పెయిన్ విదేశీ మంత్రి అబద్ధం చెప్పారని కూడా రుజువయింది. అంతే కాకుండా తాము తలచుకుంటే సాధారణ అంతర్జాతీయ చట్టాలను కూడా అమెరికా, ఐరోపాలు తుంగలో తొక్కుతాయని మరోసారి స్పష్టం అయింది.
ప్రస్తుతానికి రష్యాలో ఆశ్రయం
ఇదిలా ఉండగా ఎడ్వర్డ్ స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి మూడు లాటిన్ అమెరికా దేశాలు …బొలీవియా, నికరాగువా, వెనిజులా… ముందుకొచ్చాయి. అయితే రష్యాలో ఉన్న స్నోడెన్ పాస్ పోర్ట్ ను అమెరికా రద్దు చేయడంతో ఆయన ఈ దేశాలకు ప్రయాణించడం వీలు కాదు. దానితో స్నోడెన్ రాజకీయ ఆశ్రయం ఇవ్వాలంటూ మళ్ళీ రష్యాను కోరాడు. రష్యాలో స్నోడెన్ రాజకీయ ఆశ్రయం తాత్కాలికమే అనీ వీలు చిక్కిన తర్వాత ఆయన లాటిన్ అమెరికాకు వస్తారని తెలుస్తోంది.
స్నోడెన్ కు రాజకీయ ఆశ్రయం ఇవ్వడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ షరతు విధించిన సంగతి తెలిసిందే. రష్యాలో ఉండదలుచుకుంటే అమెరికాకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలని ఆయన షరతు విధించాడు. ఈ షరతు వలన స్నోడెన్ తన దరఖాస్తును రద్దు చేసుకున్నాడు. కానీ లాటిన్ అమెరికాకు ప్రయాణించడానికి మార్గం దొరక్కపోవడంతో పుతిన్ షరతులను తాత్కాలికంగా అంగీకరిస్తున్నట్లు స్నోడెన్ ప్రకటించాడు.
కానీ స్నోడెన్ తన వద్ద ఉన్న పత్రాలను ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేకమంది విజిల్ బ్లోయర్లకు అందజేశాడని ‘ది గార్డియన్’ విలేఖరి గ్లెన్ గ్రీన్ వాల్డ్ తెలిపారు. స్నోడెన్ పత్రాలను మొట్టమొదట ప్రచురించింది ఈయనే. స్నోడెన్ వద్ద ఉన్న పత్రాలు పూర్తిగా బహిరంగం అయితే అమెరికా పరువు గంగంలో కలుస్తుందనీ, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అమెరికా నష్టపోవడం ఖాయమనీ గ్లెన్ తెలిపారు. అయితే ఆ పత్రాలను అప్పుడే లీక్ చేయొద్దని స్నోడెన్ తమ నుండి మాట తీసుకున్నారని కూడా గ్లెన్ తెలిపారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా స్నోడెన్ కు అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తున్నప్పటికీ అధ్యక్షుడుగా స్నోడెన్ కు బేషరతు ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అమెరికా తమ వ్యాపార భాగస్వామి కనుక అమెరికాకు నష్టం కలిగించే చర్యలను తమ భూభాగం నుండి అనుమతించేది లేదన్న అవగాహనలో ఆయన ఉన్నారు.
నోబెల్ శాంతి బహుమతికి, స్నోడెన్ పేరును నామినేట్ చేశారట కదా… స్నోడెన్ కు నోబెల్ రాకపోయినా…
బయటి ప్రపంచం ఆయన్ను ఎలా గుర్తిస్తుందో….అమెరికా గ్రహిస్తే చాలు.