బీహార్ ఘోరం: మధ్యాహ్న భోజనం తిని 22 విద్యార్ధులు మృతి


మంగళవారం బీహార్ లో ఘోరం జరిగింది. మధ్యాహ్న భోజనం తిని 22 మంది ప్రాధమిక తరగతుల విద్యార్ధులు చనిపోయారు. 50 మందికి పైగా ఆసుపత్రిలో తీవ్ర అశ్వస్ధతలో ఉన్నారు. ఆహారంలో పురుగుల మందు కలవడం వలన విద్యార్ధులు చనిపోయారని ప్రాధమిక పరిశీలన మేరకు అర్ధం అవుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరిశీలన అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయని ఇద్దరు పిల్లలు కూడా తీవ్రంగా అశ్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వంట చేసినవారు కూడా ఆసుపత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందినవారికి ముఖ్యమంత్రి రు. 2 లక్షల పరిహారం ప్రకటించారు.

శరణ్ జిల్లాలోని చప్రా పట్టణానికి సమీపంలో మష్రఖ్ బ్లాక్ లోని జాజుపల్లి పంచాయితీలో దుర్ఘటన చోటు చేసుకుంది. మంగళ వారమే 11 మంది విద్యార్ధులు మృతి చెందగా బుధవారం నాటికి వారి సంఖ్య 22కి పెరిగింది. చనిపోయినవారంతా 3 సం. నుండి 12 సం. మధ్య వయసులవారు. “విషతుల్యమైన ఆహారం, భాస్వరం విషం వల్ల పిల్లలు చనిపోయారు” అని జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ శంబునాధ్ సింగ్ చెప్పారని ది హిందూ తెలిపింది. “విషాహారం తిన్న లక్షణాలయిన జ్వరం, వాంతులు, పొత్తికడుపులో నెప్పి, నోటి వెంట నురగ తదితర లక్షణాలతో పిల్లలు ఆసుపత్రిలో చేరారు” అని ఆయన తెలిపారు.

పత్రిక ప్రకారం గండమాన్ ప్రాధమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం కింద అన్నం, పప్పు, బంగాళాదుంప, సోయా బీన్స్ పెట్టారు. “ఇది కొత్తగా పెట్టిన పాఠశాల. అందువల్ల దానికి సొంత భవనం లేదు. పంచాయితీ భవనంలోనే పాఠశాల నడుస్తోంది. ఆహార పదార్ధాలను ప్రధానోపాధ్యాయిని ఇంట్లోనే నిలవ ఉంచారు. ఆమె ఇద్దరు పిల్లలు కూడా అశ్వస్ధతకు గురయ్యారు. ఇద్దరు వంటవాళ్లు కూడా.” అని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అమర్ జిత్ సిన్హా తెలిపారు.

సిన్హా చెప్పిన వివరాల ప్రకారం పిల్లలు అట్రోపిన్ ఔషధానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. దానిని బట్టి పురుగు మందు కలవడం వల్ల ఆహారం విషతుల్యం అయిందని భావిస్తున్నామని సిన్హా తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆహారం శాంపిల్స్ తీసుకున్నారని, వారి నివేదిక వచ్చాక పరిస్ధితికి కారణాలపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. కాగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు. చాప్రా డివిజనల్ కమిషనర్, డి.ఐ.జి స్ధాయి అధికారి సంయుక్తంగా విచారణ చేస్తారని ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రు. 2 లక్షలు పరిహారం చెలిస్తామని తెలిపారు.

2010లో స్ధాపించిన పాఠశాలలో 89 మంది చదువుతుండగా మంగళవారం 58 మంది హాజరులో ఉన్నారు. వీరిలో ఇప్పటికే 22 మంది చనిపోయారు. మిగిలినవారితో పాటు ఇద్దరు వంటవాళ్లు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో వంటవారితో సహా 27 మంది పరిస్ధితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని చప్రా ఆసుపత్రి నుండి పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని పి.టి.ఐ తెలిపింది.

చనిపోయినవారిలో 16 మంది చప్రా ఆసుపత్రిలోగానీ, ఆసుపత్రికి తీసుకురాక ముందు గానీ చనిపోగా మిగిలినవారిలో 4గురు పాట్నా ఆసుపత్రికి రాకముందు చనిపోయారు. మరో ఇద్దరు బుధవారం ఉదయం చనిపోయారు. చనిపోయిన పిల్లల్లో ఇద్దరు వంట మహిళకు చెందిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఎన్.బి.సి వార్తా సంస్ధ తెలిపింది. బాధితులకు  పిల్లల విభాగంలోని ఐ.సి.యు లో చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా దుర్ఘటనను రాజకీయం చెయ్యడానికి ప్రతిపక్ష పార్టీలు పూనుకున్నాయి. బుధవారం శరణ్ జిల్లా బంద్ కు బి.జె.పి పిలుపు ఇచ్చి అమలు చేస్తోంది. రాష్ట్రీయ జనతా దళ్ కూడా వేరుగా బంద్ పిలుపు ఇచ్చింది. నితీశ్ కుమార్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బంద్ జరుపుతున్నట్లు బి.జె.పి చెబుతోంది. బి.జె.పి, ఆర్.జె.డి తదితర పార్టీల నాయకులు దుర్ఘటనా సందర్శించడానికి పోటీలు పడుతున్నారు. బాధితుల కుటుంబాలను సందర్శించి ఓదార్చడానికి వారికి ఇప్పుడు బోలేడు తీరిక అందుబాటులోకి వచ్చింది. బీహార్ ప్రజలకు ‘గుడ్ గవర్నెన్స్’ అందిస్తున్నానని నితీష్ చెప్పుకుంటున్న గొప్పల వాస్తవికతను పాఠశాల దుర్ఘటన ఎండగడుతోంది.

పంచాయితీ భవనంలో పాఠశాల నడపడం వల్ల అక్కడ ఉంచిన పురుగు మందు డబ్బాలు ఆహారం కల్తీ కావడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీహార్ లో అనేక పాఠశాలకు భవనాలు లేవనీ, కొత్తగా పెడుతున్న పాఠశాలలకు అసలే లేవనీ, ఈ పరిస్ధితుల్లో కొత్త పాఠశాలలను ఏ ప్రభుత్వ భవనం అందుబాటులో ఉంటే అందులో ప్రారంభిస్తున్నారని పత్రికల ద్వారా తెలుస్తోంది. ఒక విధంగా చూస్తే ఈ పరిస్ధితి కూడా తాజా దుర్ఘటనకు ఒక కారణంగా చూడవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s